వాటర్ ‘ఎమర్జెన్సీ’!
► సిటీకి పొంచి ఉన్న మంచినీటి గండం
► తప్పని ఎమర్జెన్సీ పంపింగ్
► రూ.7 కోట్లతో పుట్టంగండి వద్ద 10 అత్యవసర మోటార్ల ఏర్పాటు
► 270 ఎంజీడీల మేర పంపింగ్
సాక్షి, సిటీబ్యూరో: భానుడి భగభగలతో నగరానికి మంచినీటి గండం పొంచి ఉంది. ఎండలు ఇలాగే ఉండి, వరుణుడు కరుణించకపోతే మే చివరి నాటికి భాగ్య నగరానికి మంచినీటి సరఫరా కష్టమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నీటి సంక్షోభాన్ని అధిగమించేందుకు జలమండలి అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ దాహార్తిని తీర్చేందుకు వరదాయినిలుగా మారిన కృష్ణా, గోదావరి జలాల అత్యవసర పంపింగ్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. కృష్ణా మూడుదశల ద్వారా 270 మిలియన్ గ్యాలన్లు, గోదావరి మొదటి దశ ద్వారా 86 ఎంజీడీలు మొత్తంగా 356 ఎంజీడీల తాగునీటిని తరలించేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రూ.7 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
అత్యవసర పంపింగ్ ఇలా...
మహానగరానికి కృష్ణా మూడుదశల ద్వారా 270 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని తరలించేందుకు అవసరమైన 10 భారీ మోటార్లను నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున ఉన్న పుట్టంగండి వద్ద ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుకు రూ.7 కోట్లు వ్యయం చేయనున్నారు. నాగార్జున సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 507.30 అడుగుల మేర నిల్వలున్నాయి. నీటిమట్టాలు 506 అడుగులకు పడిపోయిన పక్షంలో అత్యవసర పంపింగ్ మొదలు పెట్టనున్నారు. ఇందుకోసం మే నెల 20వ తేదీ నాటికే మోటార్ల ఏర్పాటు, ట్రయల్ రన్ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. కాగా కృష్ణా, గోదావరి జలాల అత్యవసర పంపింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం విపత్తు సహాయనిధి కింద రూ.40 కోట్లు మంజూరు చేసిన విషయం విదితమే.
గోదావరి నీళ్లకూ తప్పదు...
కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి నగరానికి తరలిస్తున్న 86 మిలియన్ గ్యాలన్ల గోదావరి జలాలకూ మే చివరి నుంచి అత్యవసర పంపింగ్ తప్పదని జలమండలి సంకేతాలిచ్చింది. ఇందుకోసం ఎల్లంపల్లి జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని సేకరించేందుకు అవసరమైన అప్రోచ్ చానల్(కాల్వ)ను తవ్వుతున్నామని జలమండలి వర్గాలు తెలిపాయి. మే చివరి నాటికి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటే గోదావరి జలాలకూ అత్యవసర పంపింగ్ తప్పకపోవచ్చని స్పష్టంచేశాయి.
కృష్ణా, గోదావరిలే వరదాయినిలు..
మహానగర దాహార్తిని తీర్చినసింగూరు, మంజీరా జలాశయాలు వట్టిపోవడం, జంటజలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లు డెడ్‌స్టోరేజికి చేరుకున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి జలాలే సిటీజన్ల దాహార్తిని తీర్చే వరదాయినులుగా మారాయి. నిత్యం కృష్ణా మూడు దశల ద్వారా 270 ఎంజీడీలు, గోదావరి మొదటిదశ ద్వారా ఎల్లంపల్లి నుంచి 86 ఎంజీడీలు మొత్తంగా 356 ఎంజీడీల నీటిని సిటీకి తరలించి 8.74 లక్షల నల్లాలకు సరఫరా చేస్తున్నారు. మే చివరినాటికి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటే నగర తాగునీటి సరఫరా విషయంలో సంక్షోభం తప్పదన్న సంకేతాలు వెలువడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
యుద్ధప్రాతిపదికన పంపింగ్‌కు ఏర్పాట్లు
కృష్ణా జలాల అత్యవసర పంపింగ్‌కు 10 మోటార్లను ఏర్పాటు చేయనున్నాం. ఈ మోటార్ల సామర్థ్యం 300 హెచ్‌పీ సామర్థ్యం ఉంటుంది. మోటార్ల ఏర్పాటు ప్రక్రియను ఇతర అధికారులతో కలిసి బుధవారం పరిశీలించాము. మే 20 వతేదీకల్లా మోటార్ల ఏర్పాటు,ట్రయల్న్ ్రపూర్తవుతుంది. నగర తాగునీటికి ఢోకా ఉండదని భావిస్తున్నాం. - విజయ్‌కుమార్‌రెడ్డి, జలమండలి ట్రాన్స్‌మిషన్ చీఫ్ జనరల్ మేనేజర్