జల ‘సిరి’ ఆవిరి
సాక్షి, హైదరాబాద్/ మొయినాబాద్: మండుటెండల్లోనూ నిండు కుండల్లా పరవళ్లు తొక్కిన జంట జలాశయాలు ఆవిరైపోతున్నాయి. దశాబ్దాలుగా భాగ్యనగరి గొంతు తడుపుతున్న ఈ ‘సాగర్’లు నైబారి బీడు భూములుగా మారాయి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం... అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు తల్లడిల్లి నీటి జాడలు అడుగంటుతున్నాయి. 1790 అడుగుల గరిష్ట మట్టం ఉన్న ఉస్మాన్‌సాగర్ ప్రస్తుతం 1753.880 అడుగుల డెడ్ స్టోరేజీకి చేరుకుంది.
ఇక్కడి నుంచి రోజుకు 15 మిలియన్ గ్యాలన్లను నగర తాగునీటి అవసరాలకు తరలించే జలమండలి... జలాశయం వట్టిపోవడంతో నీరు తోడటం నిలిపివేసింది. ఇక హిమాయత్‌సాగర్ 1763.5 అడుగుల గరిష్ట మట్టం నుంచి 1,734.41 అడుగుల అట్టడుగు స్థాయికి పడిపోయింది. దీని నుంచి గతంలో 20 ఎంజీడీల నీటిని తోడే జలమండలి ప్రస్తుతం 4.400 ఎంజీడీలకే పరిమితం చేసుకోవాల్సి వచ్చింది. ఇవి కూడా మరో నెలకు మాత్రమే సరిపోతాయి. వీటి చుట్టూ వెలసిన ఫామ్‌హౌస్‌లు, రియల్‌ఎస్టేట్ వెంచర్లు, కళాశాలలు, ఇసుక తవ్వకాలతో ఈ జలాశయాలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీటి దారులు క్రమంగా మూసుకుపోయి ఈ దుస్థితి తలెత్తింది.