హిమాయత్, ఉస్మాన్‌సాగర్‌ల లెక్కలూ చెప్పాలి
- వాటర్‌గ్రిడ్, భక్తరామదాస నీటి వినియోగం తెలపాలి
- రాష్ట్రానికి కృష్ణా బోర్డు ఆదేశం
- అదనపు నీటి వినియోగం ఆపాలంటూ రాష్ట్రానికి మరో లేఖ
- హైదరాబాద్ తాగునీటికి మాత్రమే నీరు వాడాలని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగించుకుంటున్న కొత్త, పాత ప్రాజెక్టుల వివరాలన్నీ తమకు సమర్పించాల్సిందేనని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాత చేపట్టి.. నీటి వినియోగం చేస్తున్న ప్రాజెక్టుల నీటి వాడకం వివరాలు చెబితేనే నీటి ప్రణాళిక ఖరారు సులువవుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖలు రాసింది. ‘కృష్ణాజలాలను వినియోగిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి 2014–15, 15–16 ఏడాదుల్లో నీటి వినియోగ వివరాలన్నీ ఇవ్వాలని ఎప్పటినుంచో కోరుతున్నా ఇరు రాష్ట్రాలు ఇంతవరకు స్పందించలేదు. కేవలం అదనపు, వరద జలాలను వినియోగిస్తూ చేపట్టిన ఏఎంఆర్‌పీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు–నగరి, ముచ్చుమర్రి వినియోగాలు మాత్రం సమర్పిస్తున్నారు.
అయితే హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం చేపట్టిన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లతో పాటు వాటర్‌గ్రిడ్, భక్త రామదాల, ఇతర ఎత్తిపోతల పథకాల కింది వినియోపు వివరాలను తెలంగాణ చెప్పడం లేదు. ఇక గురు రాఘవేంద్ర, శివభాష్యం సాగర్‌ల వివరాలను ఆంధ్రప్రదేశ్ తెలపలేదు. ఇప్పటికైనా తెలంగాణ హిమాయత్, ఉస్మాన్‌సాగర్‌ల కింద చేస్తున్న వినియోగంతో పాటు మిగతా ప్రాజెక్టుల కింద గత మూడేళ్లుగా జరుగుతున్న వినియోగాన్ని తెలపాలి’అని లేఖలో స్పష్టం చేసింది. నీటి వాటాల వినియోగంలో పారదర్శకత పెంచేందుకు, వాటాల ఆధారంగా తగిన నీటి కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఈ ప్రాజెక్టుల వివరాలు అత్యావశ్యకమని పేర్కొంది.
అదనపు వినియోగం ఆపండి...
కాగా కృష్ణా జలాల్లో తెలంగాణ తన వాటాకు మించి వినియోగం చేసిందని ఏపీ, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ అదనంగా 3.26 టీఎంసీలు వాడిందని బోర్డు దృష్టికి తెచ్చింది. ఇందులో సాగర్ ఎడమ కాల్వ కిందే 2.28 టీఎంసీలు వాడగా, ఏఎంఆర్‌పీ కింద 0.477 టీఎంసీలు వినియోగించిందని తెలిపింది. ప్రస్తుతం సాగర్‌లో 503 అడుగులు, శ్రీశైలంలో 775 అడుగుల మట్టానికి ఎగువన 17.64 టీఎంసీల నీటి లభ్యత ఉందని ఆ నీరంతా తమకే దక్కుతుందని స్పష్టం చేసింది. ఈ నీటినుంచి కృష్ణాడెల్టా అవసరాలకు 9 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ అవసరాలకు 7.5 టీఎంసీలు తక్షణమే విడుదలయ్యేలా చూడాలని, తెలంగాణ అదనపు వినియోగం చేయకుండా చూడాలని ఏపీ, బోర్డుకు విన్నవించింది.
ఈ లేఖపై స్పందించిన బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, ఇప్పటికే అదనపు వినియోగం చేసినందున, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తప్ప, మరెలాంటి వినియోగం చేయరాదని తెలంగాణను ఆదేశిస్తూ లేఖ రాశారు. ఇదే సమయంలో రెండో విడతలో చేపట్టాల్సిన టెలీమెట్రీ పరికరాల అమరిక ప్రతిపాదనలు ఓకే చేసి, వాటికి సంబంధించిన ప్రక్రియ చేపట్టాలంటూ ఏపీకి బోర్డు మరో లేఖ రాసింది.