Krishna River Board
-
ఏపీపై కృష్ణా బోర్డు ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాల్వ ద్వారా ఏపీ తీసుకుంటున్న జలాలను తక్షణమే 7 వేల క్యూసెక్కులకు తగ్గించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. అలాగే శ్రీశైలం జలాశయం నుంచి తీసుకుంటున్న జలాలను కూడా ఆ రాష్ట్రం తక్షణమే తగ్గించాలని, కేవలం తాగునీటికి అవసరమైన కనీస జలాలను మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుత సంవత్సరంలో ఏపీ తన వాటాకు మించి కృష్ణా జలాలు వాడుకుందని, ఇకపై శ్రీశైలం, సాగర్ నుంచి ఆ రాష్ట్రం నీళ్లు తీసుకోకుండా నిలువరించాలని తెలంగాణ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. బోర్డు ఈ మేరకు ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, సాగర్ నీటి వినియోగానికి సంబంధించి ఓ రాష్ట్రంపై కృష్ణా బోర్డు ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి అని అధికారవర్గాలు తెలిపాయి. గతంలో కేవలం జల విద్యుత్‌ను నియంత్రించాలని కోరుతూ మాత్రమే కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసిందని వెల్లడించాయి. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను రెండు రాష్ట్రాలకు కేటాయించే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు. ఈ నెల 24న జలసౌధలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో పై ఆదేశాలకు సంబంధించి కేఆర్ఎంబీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, ఏపీ తరఫున ఈఎన్సీ ఎం.వెంకటేశ్వర రావు పాల్గొన్నారు. తాగునీటి అవసరాలు తీరిన తర్వాతే.. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం (ఎండీడీఎల్) 834 అడుగులకు ఎగువన కేవలం 24 టీఎంసీల నీటి లభ్యత ఉండగా, సాగర్ ఎండీడీఎల్ 510 అడుగులకు ఎగువన 42.3 టీఎంసీలే లభ్యతగా ఉన్నాయని కృష్ణా బోర్డు తెలిపింది. ప్రస్తుతం తీవ్ర నీటి కొరత ఉన్న నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం రెండు జలాశయాల్లో నిల్వలను వచ్చే వేసవి ముగిసే వరకు లేదా జూలై 31 వరకు సంరక్షించాలని నిర్ణయించింది. తాగునీటి అవసరాలు తీరిన తర్వాతే మిగిలే జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సాగునీటి అవసరాలకు కేటాయిస్తామని స్పష్టం చేసింది. నేడు కేటాయింపులపై కీలక సమావేశం తెలంగాణ నీటిపారుదల శాఖ నల్లగొండ సీఈ, ఏపీ జలవనరుల శాఖ ఒంగోలు సీఈలు.. శ్రీశైలం, సాగర్ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసి ఈ నెల 25లోగా సమర్పించాలని కృష్ణా బోర్డు ఆదేశించింది. ప్రస్తుత ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉండనున్న సాగునీటి, జూలై 31 వరకు ఉండనున్న తాగునీటి అవసరాల వివరాలు ఈ ప్రణాళికలో ఉండాలని కోరింది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జలసౌధలో సమావేశమై, సదరు ప్రణాళిక ఆధారంగా శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. -
అసంపూర్తిగా ముగిసిన కృష్ణా రివర్ బోర్డు సమావేశం
హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB) ప్రత్యేక, అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి వాటాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని హైదరాబాద్ లోని జలసౌథలో ఏర్పాటు చేశారు.ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శితో బోర్డు ఛైర్మన్ సమావేశానికి హాజరయ్యారు.అయితే బోర్డు సమావేశంలో ఎలాంటి వాదనలు వినిపించకుండా ఏపీ అధికారులు వెళ్లిపోగా, తెలంగాణ మాత్రమే తమ వాదనను వినిపించింది. దాంతో నీటి ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు రేపు(మంగళవారం) సమావేశం కానున్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల కింద ఉన్న పంటలు, త్రాగునీటి అవసరాలపై వివరాలతో రావాలని ఇరు రాష్ట్రాలను కృష్ణ నదీ యాజమాన్య బోర్డు కోరింది. చీఫ్ ఇంజనీర్ల సమావేశం అనంతరం ఎల్లుండి మరోసారి బోర్డు ముందు ఇరు రాష్ట్రాల అధికారులు.మరోసారి భేటీ కానున్నారు. -
కృష్ణా బోర్డు నియంత్రణలోకి నాగార్జునసాగర్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ డ్యామ్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తాత్కా లికంగా తన అధీనంలోకి తీసుకుంది. సోమవారం బోర్డు సభ్యుడు అజయ్‌కుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్లు రఘునాథ్, శివశంకరయ్య కలిసి సాగర్‌లోని గేట్లు 5,7వ నంబర్ గేట్లను ఎత్తి.. ఏపీకి నీటిని విడుదల చేశారు. సోమవారం రాత్రంతా 1000 క్యూసెక్కులు, మంగళవారం ఉదయం నుంచి రోజుకు 4–5 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 3.03 టీఎంసీలను సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ తాగు నీటి అవసరాల కోసం విడుదల చేయనున్నారు. 3.03 టీఎంసీల నీళ్లు విడుదల పూర్తి కాగానే మళ్లీ గేట్లను కృష్ణా బోర్డు యంత్రాంగమే మూసి వేయనుంది. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో.. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైలం డ్యాం నిర్వ హణ ఏపీ, సాగర్ డ్యామ్ నిర్వహణను తెలంగాణ చూసింది. గత నవంబర్ 29వ తేదీన భారీ బలగా లతో సాగర్ డ్యామ్‌లో ఏపీ వైపు ఉన్న గేట్లను, డ్యామ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసు కున్న విషయం విదితమే. ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లాతో పాటు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పలు దఫాలుగా సమావేశమయ్యారు. నవంబర్ 29వ తేదీకి ముందున్న పరిస్థితిని నెలకొల్పాలని తెలంగాణ కోరుతూ వస్తోంది. అయితే ఏపీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు సాగర్ డ్యామ్ పర్యవేక్షణ బాధ్యతలను సీఆర్పీఎఫ్కు అప్పగించారు. సాగర్ కుడి కాలువ నుంచి 5 టీఎంసీల నీటిని ఏపీకి విడుదల చేయడానికి అనుమతిస్తూ ఈనెల 5న కృష్ణాబోర్డు వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే ఏపీ 1.07 టీఎంసీలను సొంతంగా తరలించుకుంది. మిగిలిన నీళ్లను సైతం ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ విడుదల చేసుకునేందుకు ప్రయత్నించగా, సాగర్ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకున్నట్టు సమాచారం. కృష్ణాబోర్డు చైర్మన్‌కు తెలంగాణ ఫిర్యాదు మరోవైపు ఏపీ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సోమవారం తెలంగాణ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్‌లిద్దరూ కృష్ణాబోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ కలిసి ఫిర్యాదు చేశారు. పునర్విభజన చట్ట ప్రకారం నీటిని విడుదల చేసే అధికారం తమకే ఉందని, ఒకవేళ కుదరకపోతే కృష్ణాబోర్డు మాత్రమే నీటిని విడుదల చేయాలని మురళీధర్ స్పష్టం చేశారు. ఏపీ నీటిని విడుదల చేస్తే... ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. దాంతో హుటాహుటిన కృష్ణాబోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్..బోర్డు సభ్యుడు అజయ్‌కుమార్ గుప్తా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రఘునాథ్, శివశంకరయ్యలను సాగర్‌కు పంపించారు. ఇండెంట్ ప్రకారం ఏపీకి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. నేడు ప్రత్యేక సమావేశం నాగార్జునసాగర్ డ్యామ్ పరిస్థితిపై చర్చించడానికి వీలుగా ఈనెల 9వ (మంగళవారం) తేదీన కృష్ణాబోర్డు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది. వివాదాల్లేకుండా బోర్డు చేతుల్లోకి సాగర్, శ్రీశైలం డ్యామ్‌లు అందించాలని బోర్డు కోరే అవకాశం ఉంది. నీటి వాటాలు తేలకుండా ఏ విధంగా ప్రాజెక్టులు అప్పగిస్తామని తెలంగాణ వాదించే వీలుంది. -
గడువు ముగిసినా గొడవలే..!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలకు చరమగీతం పాడటానికి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గతేడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టుల అప్పగింత, పరిధిపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో నోటిఫికేషన్ అమలును కేంద్రం పొడిగించిన ఆరు నెలల గడువు కూడా జూలై 15కే పూర్తయింది. అయినా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో బోర్డులు విఫలమయ్యాయి. దీనిపై బోర్డులు, కేంద్ర జల్ శక్తి శాఖ స్పందించడం లేదు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు సద్దుమణగడం లేదు. రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ కోరారు. గతేడాది శ్రీశైలంలోకి వరద ప్రవాహం లేకున్నా, నీటి నిల్వ కనిష్ట స్థాయిలో ఉన్నా.. దిగువన సాగు, తాగునీటి అవసరాలు లేకున్నప్పటికీ, బోర్డు అనుమతి తీసుకోకుండానే తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేసింది. దీనివల్ల కృష్ణా జలాలు వృథాగా కడలిపాలయ్యాయి. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కారు హరిస్తుండటంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దాంతో కేంద్రంలో కదలిక వచ్చింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ గతేడాది జూలై 15న నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను ఆర్నెల్లలో కృష్ణా, గోదావరి బోర్డులకు రెండు రాష్ట్రాలు అప్పగించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆర్నెల్లలో అనుమతి తెచ్చుకోవాలి. లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగానికి అనుమతించరు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. ఏపీ భూభాగంలోని శ్రీశైలం, సాగర్ విభాగాలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా, తెలంగాణ సర్కారు దాని పరిధిలోని విభాగాలను అప్పగించబోమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ అమలు గడువు జనవరి 15తో పూర్తయినా, ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. దీంతో కేంద్ర జల్‌శక్తి శాఖ ఈ గడువును జూలై 15 వరకు పొడిగించింది. ఈ క్రమంలోనే విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీ–నీవా, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కల్వకుర్తి (పాతది), నెట్టెంపాడు (పాతది) ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోవాలని ఆదేశించింది. కేంద్రం పొడిగించిన గడువు కూడా పూర్తయి మూడు నెలలు దాటింది. అయినా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి, భక్త రామదాస, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోలేదు. గోదావరి బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని రెండు రాష్ట్రాలు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు డీపీఆర్‌లు సమర్పించాయి. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు రిజర్వాయర్ల మేనేజ్మెంట్ కమిటీ రూపొందించిన విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఆమోదించగా, తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఇదే అదనుగా తెలంగాణ ఇటీవల వరద తగ్గాక కూడా శ్రీశైలంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. దీనివల్ల పది రోజుల్లోనే సుమారు 32 టీఎంసీల జలాలు ప్రకాశం బ్యారేజి మీదుగా సముద్రంలో కలిసిపోయాయి. అయినా కేంద్ర జల్‌శక్తి శాఖ గానీ, బోర్డులు గానీ పట్టించుకోవడంలేదు. -
సాగు, తాగునీటి అవసరాలకే శ్రీశైలం
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులో లభ్యతగా ఉన్న జలాల వినియోగంలో సాగు, తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా బోర్డు రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ)కి ఆంధ్రప్రదేశ్ తేల్చి చెప్పింది. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండాలని స్పష్టంచేసింది. శ్రీశైలం జల విద్యుత్ కోసం నిర్మించిన ప్రాజెక్టు అని, కనీస నీటిమట్టం 834 అడుగులేనని తెలంగాణ చెప్పింది. తెలంగాణ వాదనను ఆర్ఎంసీ కన్వీనర్, కృష్ణా బోర్డు సభ్యుడు ఆర్కే పిళ్లై తోసిపుచ్చారు. శ్రీశైలం కనీస నీటి మట్టాన్ని 854 అడుగులుగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిర్ధారించిందని గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఆర్కే పిళ్లై అధ్యక్షతన ఆర్ఎంసీ సమావేశమైంది. బోర్డు సభ్యులు ముయన్తంగ్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నిర్వహణ నియమావళి (రూల్ కర్వ్), జలవిద్యుత్ ఉత్పత్తి, వరద జలాల మళ్లింపుపై సుదీర్ఘంగా చర్చించారు. శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు ఉంటేనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లందించగలమని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి చెప్పారు. జూలై 1 నుంచి అక్టోబర్ 31 వరకూ కాకుండా.. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకూ 854 అడుగుల్లో నీరు ఉండేలా చూడాలని ప్రతిపాదించారు. నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఏపీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న నీటిలో 66 శాతం ఏపీ, 34 శాతం తెలంగాణకు వాటా ఉందని.. ఈ లెక్కన శ్రీశైలంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 66 శాతం, సాగర్ విద్యుత్‌లో 50 శాతం ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఉత్పత్తయ్యే విద్యుత్ చెరి సగం పంచుకునేలా ఆదిలోనే అంగీకారం కుదిరిందన్నారు. దీనికి అంగీకరించే ప్రశ్నే లేదని, తాము కోరిన వాటా ఇవ్వాల్సిందేనని ఏపీ ఈఎన్సీ పట్టుబట్టారు. శ్రీశైలానికి దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడు ఎవరి వాటా జలాలను వారు విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రతిపాదించారు. వరద జలాలపై ఏకాభిప్రాయం జూరాల నుంచి ప్రకాశం బ్యారేజి వరకు అన్ని ప్రాజెక్టులు నిండి, సముద్రంలోకి జలాలను విడుదల చేస్తున్న సమయంలో మళ్లించే వరద జలాలను వాటా (నికర జలాలు)లో కలపకూడదని ఏపీ ఈఎన్సీ కోరారు. దీనిపై తెలంగాణ ఈఎన్సీ మాట్లాడుతూ.. మళ్లించిన వరద జలాలను నిల్వ చేసుకునే సామర్థ్యం ఏపీకి ఎక్కువగా ఉన్నందున, వాటిలో వాటా ఇవ్వాలని కోరారు. ముంపు ముప్పును నివారించడానికే వరద జలాలను మళ్లిస్తున్నామని, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం వరద జలాలను వాడుకునే స్వేచ్ఛ దిగువ రాష్ట్రమైన ఏపీకి ఉందని ఏపీ ఈఎన్సీ స్పష్టం చేశారు. ఆర్కే పిళ్లై జోక్యం చేసుకుంటూ.. మళ్లించే వరద జలాలను లెక్కిస్తామని, కానీ వాటిని వాటాలో కలపబోమని స్పష్టం చేశారు. ఇందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈనెల మూడో వారంలో మళ్లీ ఆర్ఎంసీ సమావేశం నిర్వహిస్తామని పిళ్లై చెప్పారు. రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన అంశాలపై బోర్డుకు నివేదిక ఇస్తామన్నారు. -
మళ్లిస్తున్న వరద నీటిని లెక్కలోకి తీసుకోవద్దు
సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల్లో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడం వల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి వరద జలాలు సముద్రంలో కలుస్తుండటాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. సముద్రంలో కలవడం వల్ల జలాలు వృథా అవుతాయని.. సద్వినియోగం చేసుకోవడానికి వరద నీటిని మళ్లిస్తున్నామని పేర్కొంది. మళ్లిస్తున్న వరద నీటిని రాష్ట్ర వాటా కింద లెక్కించకూడదని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకి రాష్ట్ర జలవనరులశాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి శుక్రవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు.. ► కృష్ణా వరద ప్రవాహం వల్ల జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆ నీరు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలో కలుస్తోంది. ► విభజన చట్టం 11వ షెడ్యూలులో సెక్షన్–85(7)(ఈ) ప్రకారం ప్రకృతి విపత్తులను నియంత్రించాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాలపై ఉంటుంది. వరదలను నియంత్రించడంలోను, కరవు నివారణ చర్యలు చేపట్టడంలోను రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సలహాలు ఇవ్వాలి. ఈ నిబంధన ప్రకారం వరద ముప్పును తప్పించాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉంది. ఈ నేపథ్యంలోనే వరద నీటిని మళ్లిస్తున్నాం. వృథాగా సముద్రంలో కలిసే వరద నీటిని మళ్లించడం వల్ల ఎవరి ప్రయోజనాలకు విఘాతం కలగదు. ఈ నేపథ్యంలో మళ్లిస్తున్న వరద నీటిని రాష్ట్ర వాటా కింద పరిగణించకూడదు. ► విలువైన జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో విద్యుదుత్పత్తి చేయకపోతే జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే కోరాం. ఆ మేరకు విద్యుదుత్పత్తి చేస్తున్నాం. -
Andhra Pradesh: గెజిట్ అమలుపై ముందుకే!
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ), గోదావరీ నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ)ల పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా కేంద్ర జల్‌శక్తి శాఖ మరో అడుగు ముందుకేసింది. నోటిఫికేషన్ అమలును అక్టోబరు 14 నుంచి కాకుండా కొంతకాలం వాయిదా వేయాలని ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరిన సంగతి తెలిసిందే. అయితే గెజిట్ అమలు సాఫీగా సాగేలా జల్‌శక్తి శాఖ ఆయా బోర్డులకు చీఫ్ ఇంజనీర్ల స్థాయి ఉన్నతాధికారులను నియమించింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధి విస్తృతమైన నేపథ్యంలో మానవ వనరులు బలోపేతంతో పాటు బోర్డులు మెరుగైన రీతిలో పనిచేసేలా సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ గ్రూప్ ‘ఏ’ సర్వీసుకు చెందిన సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ అధికారులు నలుగురిని నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. సీడబ్ల్యూసీ ప్రధాన కార్యాలయం చీఫ్ ఇంజనీర్ డాక్టర్ ఎం.కె.సిన్హా, సీడబ్ల్యూసీ యమునా బేసిన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ జి.కె.అగర్వాల్‌ను గోదావరి నదీ యాజమాన్య బోర్డులో నియమించింది. సీడబ్ల్యూసీ కావేరీ అండ్ సదరన్ రీజియన్ ఆర్గనైజేషన్ (కోయంబత్తూరు) చీఫ్ ఇంజనీర్ టి.కె.శివరాజన్, సీడబ్ల్యూసీ అప్పర్ గంగా బేసిన్ ఆర్గనైజేషన్ (లక్నో) చీఫ్ ఇంజనీర్ అనుపమ్ ప్రసాద్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో నియమించింది. ఈ నలుగురు అధికారులు ఆయా బోర్డుల చైర్మన్‌కు తక్షణం రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరిచిన ప్రాజెక్టుల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలని సూచించింది. రెండు బోర్డులకు అత్యంత ప్రాధాన్యం గల అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ నియామకాలు మూడు నెలల కాలానికి లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు వర్తిస్తాయని పేర్కొంది. ఈ అధికారులు చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో పూర్తి అధికారాలతో ఫుల్ టైమ్ పనిచేస్తారని తెలిపింది. గెజిట్ అమలుపై బోర్డుల చైర్మన్లతో చర్చ కేఆర్ఎంబీ చైర్మన్ ఎం.పి.సింగ్, జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌లతో కేంద్ర జల్‌శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేవాశ్రీ ముఖర్జీ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. గత శుక్రవారం జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కొనసాగింపుగా అదనపు కార్యదర్శి ఈ సమావేశాన్ని నిర్వహించారు. బోర్డుల పరిపాలనా సంబంధిత అంశాలు, నోటిఫికేషన్‌పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తెలిపిన అభ్యంతరాలు, గెజిట్ అమలులో ఇబ్బందులు, మానవ వనరులు తదితర అంశాలపై చర్చించారు. సీడబ్ల్యూసీ ౖచైర్మన్ ఎస్.కె.హల్దర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తెలుగుగంగ, వెలిగొండ విస్తరణను అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం అక్రమంగా తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టుల విస్తరణ చేపట్టిందని, వాటిని అడ్డుకోవాలని కృష్ణా బోర్డుకు రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ప్రాజెక్టులను చేపట్టారని, ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ గురువారం కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. తెలుగుగంగ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా కుందూ నది నుంచి 8 టీఎంసీలు ఎత్తిపోసేలా కడప జిల్లా దువ్వూరు మండలం జొన్నవరంలో ఎత్తిపోతల పథకం చేపట్టారని, దానికి రూ.564.6 కోట్లు కేటాయిస్తూ అనుమతులు ఇచ్చారని లేఖలో వివరించారు. వాస్తవానికి చెన్నై నగరానికి తాగునీటి కోసం తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టారని, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చారని తెలిపారు. అంతేగాకుండా శ్రీశైలం కుడి ప్రధాన కాల్వ, గాలేరు– నగరి ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తీసుకొని పెన్నా బేసిన్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 88వేల క్యూసెక్కులు తరలించేలా గ్రావిటీ కాల్వల పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు గంగ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు ఇవ్వాల్సి ఉందని.. ఏటా పోతిరెడ్డిపాడు ద్వారా 179 టీఎంసీలు తరలిస్తూ చెన్నైకి 10 టీఎంసీలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక శ్రీశైలం నుంచి వరద జలాలు తీసుకునే పేరిట వెలిగొండ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టారని, రిజర్వాయర్‌లో 875 అడుగులపైన నీటిమట్టం ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకునేలా ఏపీని కట్టడి చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఏపీ చేపట్టిన ఈ ప్రాజెక్టులతో శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టు అవసరాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
విద్యుదుత్పత్తి ఆపని తెలంగాణ
సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పత్తిని తక్షణమే నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా తెలంగాణ సర్కార్ వైఖరిలో మార్పు కనిపించడం లేదు. ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి, ఒప్పందాలు, జాతీయ జలవిధానాన్ని బుట్టదాఖలు చేస్తూ భారీ పోలీసు బందోబస్తు మధ్య యథేచ్ఛగా విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. ఈ మేరకు ప్రాజెక్టులను ఖాళీ చేస్తూ.. వృథాగా దిగువకు నీటిని వదిలేస్తోంది. ఏపీకి నష్టం జరుగుతోందని ఉన్నతాధికారులు తెలంగాణ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో భారీగా మోహరించిన ఏపీ పోలీసు బలగాలు వెనుదిరిగాయి. తెలంగాణ అనాలోచిత ఏకపక్ష వైఖరి వల్ల రానున్న రోజుల్లో ఆ రాష్ట్ర ప్రజలు తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని నీటిపారుదల రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం శ్రీశైలంలోకి ఎగువ నుంచి 13,542 క్యూసెక్కులు చేరుతుండగా.. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులను దిగువకు తెలంగాణ సర్కార్ వదిలేస్తోంది. దీని వల్ల శ్రీశైలం నీటిమట్టం 820.64 అడుగులకు తగ్గిపోయింది. అలాగే నాగార్జునసాగర్‌లోకి వస్తున్న నీటిని వచ్చినట్టుగా వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది. పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత పెంచింది. 9,100 క్యూసెక్కులను వాడుకుంటూ 35 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది. శ్రీశైలం, సాగర్లను విద్యుదుత్పత్తి కోసం ఖాళీ చేయడం వల్ల తెలంగాణలో ఆ ప్రాజెక్టులపై ఆధారపడిన ఆయకట్టు రైతులకు నీళ్లందే అవకాశం ఉండదు. హైదరాబాద్ తాగునీటికీ ఇబ్బందులు తప్పవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ తెలంగాణ సర్కార్‌కు తెలియనివి కాదని.. ఏపీ హక్కులకు విఘాతం కల్పించాలనే లక్ష్యంతోనే ఇలా చేస్తోందని అంటున్నారు. కాగా, శుక్రవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఇరు రాష్ట్రాల సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రకాశం బ్యారేజీలో గరిష్ట స్థాయికి నీటి నిల్వ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 8,424 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఖరీఫ్ పంటల సాగుకు కృష్ణా డెల్టా రైతులు సంసిద్ధంగా లేకపోవడం.. బ్యారేజీలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో.. చేసేది లేక ఆరు గేట్లు ఎత్తి 8,424 క్యూసెక్కులను అధికారులు వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. చదవండి: (జల జగడంపై కదిలిన కృష్ణా బోర్డు) -
శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిని ఎవరూ ఆపలేరు: జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట: శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదని, నీళ్లు ఉన్నంత కాలం జల విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తీర్మానంపై జగదీశ్‌రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటుచేసిన పట్టణ ప్రగతి అవగాహన కార్యక్రమంలో తీవ్రంగా స్పందించారు. ‘తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలన్నది ఏపీ ప్రభుత్వం తీర్మానిస్తే అమలుపరిచేంత అమాయకులు ఇక్కడ ఎవరూ లేరు. విద్యుత్ ఉత్పత్తి మా హక్కు. దీన్ని ఆపమనే హక్కు ఏ కమిటీకి, కమిషన్లకు లేదు. తెలంగాణ రాష్ట్ర హక్కులు ఏమిటో.. కృష్ణా నదిలో మా వాటాలో ప్రతి నీటి చుక్కను ఎలా వాడుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాగా తెలుసు’ అని అన్నారు. రైతులు ఎక్కడైనా రైతులేనని, సముద్రం పాలయ్యే నీళ్లను ఈ పద్ధతిలో వాడుకోండి అంటూ కేసీఆర్ విజ్ఞతతో చెబితే ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా పోతోందని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ముమ్మాటికీ అక్రమమేనని, దుర్మార్గంగా పోతిరెడ్డిపాడును వెడల్పు చేసే ప్రయ త్నంలో నిజం లేదా అని ఏపీ సర్కార్‌ను ప్రశ్నించారు. రాజకీయ చతురత తోటే కేసీఆర్ మహా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా కాని పరిష్కారాన్ని కేసీఆర్ స్వల్ప వ్యవధిలో తేల్చిపడేశారని, తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సులభతరమైందని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిని అతిథులుగా చూసుకోవాలని చెప్పారన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై .వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కమిషనర్ రామానుజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఎస్ కుడి కాల్వ పనులు ఆపించండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొనసాగి స్తున్న ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను తక్షణమే ఆపించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. ఇప్పటికే ఆర్డీఎస్ కింద తెలంగాణకున్న వాటాలో యాభై శాతం దక్కడం లేదని, ఈ పరిస్థితుల్లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులపై చర్యలు తీసుకొని కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును కాపాడాలని విన్నవించింది. ఈ మేరకు బుధవారం బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. లేఖతో పాటు ఆర్డీఎస్ కుడికాల్వ పనులకు సంబంధించిన ఫొటోలను జత చేశారు. బోర్డు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను ఏపీ కొనసాగిస్తోందని లేఖలో ఫిర్యాదు చేశారు. ఏపీ చేపడుతున్న ఆ పనులను జూన్ 19న జరిగిన కేబినెట్ సమావేశం తీవ్రంగా తప్పుపట్టిందని, రాష్ట్ర పునర్ విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏపీ చేపడుతున్న నిర్మాణ పనులను ఆక్షేపించిందని తెలిపారు. కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్-2 అవార్డు అమల్లోకి రాకుండానే చేపడుతున్న ఈ పనులను ఆపేలా బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టిందని గుర్తు చేశారు. -
శ్రీశైలం విద్యుత్‌ను 50:50 శాతం వాడుకోవాలని నిర్ణయం
-
మా ‘మిగులు’ మాకే..
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. గతేడాది వాటర్ ఇయర్లో వినియోగించే హక్కు కలిగి ఉండి కూడా వాడుకోని నీటిని ఈ వాటర్ ఇయర్లో తమకే ఇవ్వాలని కృష్ణాబోర్డును కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యంగా నాగార్జునసాగర్ పరిధిలో గడిచిన వాటర్ ఇయర్లో తెలంగాణ 50 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉండగా, ఆ కోటా అలాగే ఉండిపోయింది. ఈ నీటిని జూన్ 1 నుంచి మొదలైన వాటర్ ఇయర్లో తెలంగాణ కోటా కిందే పరిగణించాలని కోరనుంది. ఏటా వాటర్ ఇయర్ జూన్ నుంచి మే చివరి వరకు ఉంటుంది. జూన్ నుంచి కొత్త వాటర్ ఇయర్ ఆరంభమవుతుంది. జూన్ నుంచి ప్రాజెక్టుల్లో ఉండే నీటి లభ్యత, వచ్చిన ప్రవాహాలు, రాష్ట్రాల అవసరాల మేరకు కృష్ణాబోర్డు తెలుగు రాష్ట్రాలకు నీటిని కేటాయిస్తుంది. గతేడాది 34:66 నిష్పత్తిన రెండు రాష్ట్రాలకు నీటిని పంచింది. ఇందులో ఏపీ తన కోటాకు మించి వినియోగించగా, తెలంగాణకు మాత్రం బోర్డు కేటాయించిన లెక్కల మేరకు మరో 50 టీఎంసీల మేర నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నీరంతా సాగర్‌లోనే ఉంది. సాగర్‌లో ప్రస్తుతం 531 అడుగుల పరిధిలో 170 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇందులో కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన లభ్యత మరో 50 టీఎంసీల మేర ఉంది. ఈ వాటా అంతా తెలంగాణదేనని ఇటీవలే బోర్డు స్పష్టంచేసింది. అయితే మే 31తో వాటర్ ఇయర్ ముగియడం, జూన్ నుంచి కొత్త వాటర్ ఇయర్ ఆరంభం కావడంతో కొత్త వాటాలు తెరపైకి వస్తాయి. దానికి అనుగుణంగానే బోర్డు పంపకాలు చేస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది గరిష్ట నీటిని వినియోగించుకోలేకపోవడంతో తన వాటాను ఈ ఏడాది కింద దక్కే వాటాలో కలపాలని తెలంగాణ కోరనుంది. ఈ నెల 4న జరిగే బోర్డు భేటీలో ఈ అంశం కీలకం కానుంది. గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల జీవోలన్నీ బయటికి తీయండి : కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో నిర్మించిన అన్ని ప్రాజెక్టుల ప్రభుత్వ ఉత్తర్వులను బయటకు తీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. గోదావరి, కృష్ణాలపై చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు లేవనెత్తడంతో సోమవారం ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లతో సీఎం ప్రగతి భవన్లో సమీక్షించారు. భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి ఇచ్చిన జీవోలను, పనులు పూర్తయిన సంవత్సరాలను సమగ్రంగా ఓ నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. -
‘వర్కింగ్ మాన్యువల్’ మళ్లీ మొదటికి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్ అంశం మళ్లీ మొదటికొచ్చింది. గోదావరి బోర్డు మాన్యువల్ మాదిరే కృష్ణా మాన్యువల్ సిద్ధం చేయాలని భావించినా.. ప్రస్తుతం గోదావరి మాన్యువల్‌లోనే తెలంగాణ మార్పులు కోరడంతో ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి చేపట్టాల్సి వచ్చేలా ఉంది. దీంతో మాన్యువల్ ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన బోర్డు సమావేశం ఎటూ తేల్చకుండానే ముగిసింది. బోర్డు వర్కింగ్ మాన్యువల్, టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు అంశంపై చర్చించేందుకు కృష్ణాబోర్డు బుధవారం ఇక్కడి జలసౌధలో భేటీ అయింది. దీనికి తెలంగాణ ఈఎన్సీ నాగేంద్రరావు, అంతర్రాష్ట్ర జల వనరుల అధికారులు కోటేశ్వర్‌రావుతో పాటే ఏపీ తరఫున సీఈ నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాన్యువల్ ఆమోదంపై చర్చ జరగ్గా, గోదావరి మాన్యువల్‌లో పేర్కొన్న చైర్మన్ విస్తృతాధికారాల అంశం, ఓటింగ్ పవర్ అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయని తెలంగాణ స్పష్టం చేసింది. ప్రాజెక్టులపై బోర్డు నిర్వహణ పరిధిపైనా అభ్యంతరాలు తెలిపింది. వీటిని పరిగణనలోకి తీసుకొని కొత్త మాన్యువల్‌ను సిద్ధం చేయాలని, అది ఆమోదం పొందాకే కృష్ణా మాన్యువల్‌పై చర్చించాలని కోరింది. దీనిపై కృష్ణా బోర్డు స్పందిస్తూ.. రెండు వారాల్లో తెలంగాణ తన అభ్యంతరాలను తమకు తెలియజేయాలని, అలా తెలియజేయని పక్షంలో ఇప్పటికే ఉన్న మాన్యువల్‌ను ఆమోదిస్తామని స్పష్టం చేసింది. వీటీపీఎస్ పరిధిలో టెలిమెట్రీకి ఓకే.. ఇక టెలిమెట్రీకి సంబంధించి మొత్తంగా 21 చోట్ల ఏర్పాటుపై చర్చ జరిగింది. అయితే ఇందులో వీటీపీఎస్ (విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్) పరిధిలో మాత్రమే టెలిమెట్రీకి ఓకే చేయగా.. పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న వెలిగొండ, కండలేరు తదితర 8 ప్రాంతాల్లో ప్రస్తుతం ఏర్పాటు వద్దని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ, పులిచింతల్లో 8 ఎత్తిపోతల పథకాలున్నాయని అయితే ఇందులో 150 క్యూసెక్కుల కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాను ఇవ్వాలని కోరగా ఏపీ అందుకు అంగీకరించింది. మరో రెండు ఇప్పటికే సీడబ్ల్యూసీ గేజ్ స్టేషన్లు ఉండటంతో అక్కడ కొత్తగా టెలిమెట్రీ అవసరం లేదనే నిర్ధారణకు వచ్చారు. 15 రోజుల అనంతరం మళ్లీ సమావేశమై అన్ని అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. -
హరీశ్‌రావు ఫిర్యాదు.. సమీర్ చటర్జీ ఔట్!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పక్షపాత ధోరణిని నిరసిస్తూ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన ఫిర్యాదుపై కేంద్ర జల వనరుల శాఖ స్పందించింది. బోర్డు సభ్య కార్యదర్శి పదవి నుంచి సమీర్ చటర్జీని తొలగించింది. ఆయన స్థానంలో పోలవరం ప్రాజెక్టు ప్లానింగ్ అండ్ డిజైనింగ్ చీఫ్ ఇంజనీర్ ఎ.పరమేశంను బోర్డు సభ్య కార్య దర్శిగా నియమించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర జల వనరుల శాఖ అండర్ సెక్రెటరీ నరేంద్రసింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బోర్డులో కొత్తగా హరికేశ్ మీనాను సభ్యుడిగా నియమించారు. ఇది రెండోసారి.. వాస్తవానికి తొలుత సభ్య కార్యదర్శిగా ఉన్న ఆర్కే గుప్తా వ్యవహారశైలి సరిగా లేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆయన తీరు కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని పేర్కొనడంతో కేం ద్రం ఆయనను తొలగించి.. ఆ స్థానంలో గతేడాది అక్టోబర్‌లో సమీర్ చటర్జీని నియమించింది. కృష్ణా జలాల నీటి వినియోగం, విడుదలకు సంబంధించిన అంశాల్లో సమీర్ చటర్జీ ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తొలి నుంచీ ఆయనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. అయినా ఇంతకాలం నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. కానీ ఇటీవల కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చుకునే అంశంలో సమీర్ చటర్జీ మొండిగా వ్యవహరించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేనందున ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణ అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసినా వినలేదు. పైగా ఫైన ల్నోటిఫికేషన్ను తయారు చేసి, దాన్ని ఆమోదించాలంటూ నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. దీంతోపాటు ఇటీవల వివాదాస్పద టెలీమెట్రీ లెక్కలు, నీటి పంపకాల విషయంలో ఏపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. మంత్రి హరీశ్‌రావు ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ.. ఈ నెల 9న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి లేఖ రాశారు. బోర్డు సమర్థవంతంగా పనిచేయడంలో విఫలమైందని ఫిర్యాదు చేశారు. దీ నిపై ఉన్నతస్థాయిలో చర్చించిన కేంద్రం.. సమీర్ చటర్జీని తప్పించింది. -
సాగర్‌లో జలజగడం
కుడికాల్వకు నీటి నిలిపివేతపై ఆంధ్రా అధికారుల వాగ్వాదం నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాల్వకు నీటి నిలిపివేతపై ఘర్షణ వాతావరణం నెలకొంది. డ్యాం ఉద్యోగులు, సిబ్బందితో ఆంధ్రా అధికారులు వాగ్వాదానికి దిగారు. కృష్ణానది బోర్డు నిర్ణయించిన మేరకు సోమవారం ఉదయానికి కుడికాల్వకు నీటి విడుదల పూర్తి కావడంతో నిలిపివేయాలని తెలంగాణ ఉన్నతాధి కారుల ఆదేశాల మేరకు డీఈ విజయకుమార్ ఆధ్వర్యంలో ఉదయం నీటి విడుద లను 7 వేల క్యూసెక్కుల నుంచి 2 వేల క్యూసెక్కులకు తగ్గిస్తూ వచ్చారు. సమాచారం అందుకున్న ఆంధ్రా కుడికాల్వ డీఈ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఏఈలు డ్యాం కంట్రోల్ గదికి చేరుకున్నారు. ఇటీవల 5.6 టీఎంసీల నీటిని కుడి కాల్వకు విడుదల చేయాలని బోర్డు నుంచి ఉత్తర్వులున్నాయని, ఇప్పటి వరకు 3.9 టీఎంసీలు మాత్రమే విడుదల చేశారని.. ఆవిరి రూపంలో కొంత పోయినా మరో టీఎంసీ నీటిని కుడి కాల్వకు విడుదల చేయాలంటే డ్యాం అధికారులతో వాదనకు దిగారు. దీంతో తెలంగాణ అ«ధికారులు డ్యాం సెక్యూరిటీ సహకారంతో కుడి కాల్వకు నీటిని పూర్తిగా నిలిపివేశారు. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునీల్ మాట్లాడుతూ ఫిబ్రవరి మూడు నుంచి ఇప్పటి వరకు కుడికాల్వకు నిర్ణీత 22.5 టీఎంసీల నీటిని విడుదల చేశామని తెలిపారు. నీటి నిలిపివేత విషయంలో ప్రతిసారీ పేచీలు పెట్టడం.. ఘర్షణకు దిగడం ఆంధ్రా అధికారులకు ఆనవాయితీగా మారిందన్నారు. డ్యాం, సెక్యూరిటీ అధికారు లు, సిబ్బందిపై ఆంధ్రా అధికారులు ఏపీపరిధిలోని రైట్‌బ్యాంకు (దక్షిణ విజయపురి) పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చేయిచేసుకుని నెట్టి వేశారని పేర్కొన్నారు. -
వర్షాలకు ముందే టెలిమెట్రీ
ఇరు రాష్ట్రాల ప్రాజెక్టుల పరిధిలో సమానంగా ఏర్పాటు లేఖలు రాసిన కృష్ణా బోర్డు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేయనున్న టెలిమెట్రీ పరికరాలను వర్షాల సమయానికి ముందే సిద్ధం చేయనున్నట్లు కృష్ణాబోర్డు తెలిపింది. రెండు రాష్ట్రాల్లోనూ సమాన సంఖ్యలో వీటిని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు అంగీకరించిన 18 చోట్ల టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు స్థితిగతులు, మరో 29 చోట్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనల అంశాన్ని తెలుపుతూ బోర్డు బుధవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. జూరాల పరిధిలో 7 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉండగా 6 చోట్ల అమర్చడం పూర్తయిందని, మరోచోట పనులు జరుగుతున్నాయని... సాగర్ పరిధిలో 3 చోట్ల త్వరలో పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోందని తెలిపింది. శ్రీశైలంలో మాత్రం 4 చోట్ల ఏర్పాటుకు పరిశీలన జరుగుతోందని పేర్కొంది. వీటికి అదనంగా తెలంగాణలో మరో 12 చోట్ల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని.. అందులో 2 చోట్ల ఓకే చేయగా, మరో 10 చోట్ల ఏర్పాటుపై రాష్ట్రాల సమ్మతి మేరకు నిర్ణయం చేస్తామని తెలిపింది. ఇక కొత్తగా 29 చోట్ల పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉందని, రాష్ట్రాలు అంగీకరించగానే పనులు మొదలు పెడతామని పేర్కొంది. 505 అడుగుల మట్టం ఉంచాలి.. నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని ఇచ్చేందుకు వీలుగా ప్రాజెక్టులో 505 అడుగుల కనీస మట్టంలో నీటి నిల్వలు ఉంచాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం శాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డుకు లేఖ రాశారు. శ్రీశైలం నుంచి 8.2 టీఎంసీల మేర నీరు సాగర్‌కు రావాల్సి ఉందని.. అది విడుదల చేస్తేనే సాగర్ నుంచి ఏపీ అవసరాలకు నీటి విడుదల సాధ్యమవుతుందని అందులో పేర్కొన్నారు. ఈ దృష్ట్యా సాగర్‌కు నీటి విడుదల జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై బోర్డు ఏపీ అభిప్రాయాన్ని కోరింది. -
హిమాయత్, ఉస్మాన్‌సాగర్‌ల లెక్కలూ చెప్పాలి
వాటర్‌గ్రిడ్, భక్తరామదాస నీటి వినియోగం తెలపాలి రాష్ట్రానికి కృష్ణా బోర్డు ఆదేశం అదనపు నీటి వినియోగం ఆపాలంటూ రాష్ట్రానికి మరో లేఖ హైదరాబాద్ తాగునీటికి మాత్రమే నీరు వాడాలని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగించుకుంటున్న కొత్త, పాత ప్రాజెక్టుల వివరాలన్నీ తమకు సమర్పించాల్సిందేనని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాత చేపట్టి.. నీటి వినియోగం చేస్తున్న ప్రాజెక్టుల నీటి వాడకం వివరాలు చెబితేనే నీటి ప్రణాళిక ఖరారు సులువవుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖలు రాసింది. ‘కృష్ణాజలాలను వినియోగిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి 2014–15, 15–16 ఏడాదుల్లో నీటి వినియోగ వివరాలన్నీ ఇవ్వాలని ఎప్పటినుంచో కోరుతున్నా ఇరు రాష్ట్రాలు ఇంతవరకు స్పందించలేదు. కేవలం అదనపు, వరద జలాలను వినియోగిస్తూ చేపట్టిన ఏఎంఆర్పీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు–నగరి, ముచ్చుమర్రి వినియోగాలు మాత్రం సమర్పిస్తున్నారు. అయితే హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం చేపట్టిన హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లతో పాటు వాటర్‌గ్రిడ్, భక్త రామదాల, ఇతర ఎత్తిపోతల పథకాల కింది వినియోపు వివరాలను తెలంగాణ చెప్పడం లేదు. ఇక గురు రాఘవేంద్ర, శివభాష్యం సాగర్ల వివరాలను ఆంధ్రప్రదేశ్ తెలపలేదు. ఇప్పటికైనా తెలంగాణ హిమాయత్, ఉస్మాన్‌సాగర్‌ల కింద చేస్తున్న వినియోగంతో పాటు మిగతా ప్రాజెక్టుల కింద గత మూడేళ్లుగా జరుగుతున్న వినియోగాన్ని తెలపాలి’అని లేఖలో స్పష్టం చేసింది. నీటి వాటాల వినియోగంలో పారదర్శకత పెంచేందుకు, వాటాల ఆధారంగా తగిన నీటి కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఈ ప్రాజెక్టుల వివరాలు అత్యావశ్యకమని పేర్కొంది. అదనపు వినియోగం ఆపండి... కాగా కృష్ణా జలాల్లో తెలంగాణ తన వాటాకు మించి వినియోగం చేసిందని ఏపీ, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ అదనంగా 3.26 టీఎంసీలు వాడిందని బోర్డు దృష్టికి తెచ్చింది. ఇందులో సాగర్ ఎడమ కాల్వ కిందే 2.28 టీఎంసీలు వాడగా, ఏఎంఆర్పీ కింద 0.477 టీఎంసీలు వినియోగించిందని తెలిపింది. ప్రస్తుతం సాగర్‌లో 503 అడుగులు, శ్రీశైలంలో 775 అడుగుల మట్టానికి ఎగువన 17.64 టీఎంసీల నీటి లభ్యత ఉందని ఆ నీరంతా తమకే దక్కుతుందని స్పష్టం చేసింది. ఈ నీటినుంచి కృష్ణాడెల్టా అవసరాలకు 9 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ అవసరాలకు 7.5 టీఎంసీలు తక్షణమే విడుదలయ్యేలా చూడాలని, తెలంగాణ అదనపు వినియోగం చేయకుండా చూడాలని ఏపీ, బోర్డుకు విన్నవించింది. ఈ లేఖపై స్పందించిన బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, ఇప్పటికే అదనపు వినియోగం చేసినందున, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తప్ప, మరెలాంటి వినియోగం చేయరాదని తెలంగాణను ఆదేశిస్తూ లేఖ రాశారు. ఇదే సమయంలో రెండో విడతలో చేపట్టాల్సిన టెలీమెట్రీ పరికరాల అమరిక ప్రతిపాదనలు ఓకే చేసి, వాటికి సంబంధించిన ప్రక్రియ చేపట్టాలంటూ ఏపీకి బోర్డు మరో లేఖ రాసింది. -
కోర్టుల చుట్టూ తిరగడం కన్నా అదే మేలు! : కేసీఆర్
హైదరాబాద్ : నీటి పంపకాల కోసం కోర్టుల చుట్టూ తిరగడం కన్నా కలసి కూర్చొని మాట్లాడుకోవడానికే ప్రాధాన్యతనిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కృష్ణానది జలాల పంపకాలపై కేంద్రం ఏర్పాటుచేసిన బజాజ్ కమిటీ బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిసింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ జల వివాదాలు వాంఛనీయం కాదన్నారు. ఇరు రాష్ట్రాలు కలసి మాట్లాడుకోవడం ద్వారా సమస్య పరిష్కారమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వాటా ప్రకారమే నీటిని వాడుకుంటామని చెప్పారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటిని వినియోగానికి సంబంధించి ఆపరేషన్ రూల్స్ రూపొందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలను సముద్రంలో వృథాగా కలిసిపోకుండా చేయగలిగితే కోస్తా, రాయలసీమ రైతుల అవసరాలు తీర్చవచ్చని చెప్పారు. ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు దిగువ రాష్ట్రాల అవసరాలను పట్టించుకోకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు హైదరాబాద్ జలసౌధలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులతో బజాజ్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఇరు రాష్ట్రాల అధికారులు తమ వాదనాలను బజాజ్ కమిటీకి విన్నమించారు. తెలంగాణలోని జురాలను ఉమ్మడి ప్రాజెక్టుల పరిధిలోకి తీసుకురావాలని ఏపీ అధికారులు కోరారు. దీనికి తెలంగాణ అధికారులు అంగీకరించలేదు. పులిచింతల, సుంకేశులను ఉమ్మడి ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ అధికారులు కోరారు. దీనికి ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఇరు రాష్ట్రాల వాదనలపై కేంద్రానికి బజాజ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. -
అదంతా కృష్ణా నీరే!
- కృష్ణలోకి చేరేదంతా ఆ నది నీటికిందే లెక్క - పట్టిసీమ నీటి వినియోగం లెక్కలోకి రావాల్సిందే - బోర్డుకు స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం లేఖ.. - పట్టిసీమ వినియోగాన్ని మినహాయించినా తమకు 56 టీఎంసీలు దక్కుతాయని వివరణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోకి పట్టిసీమ నుంచి వచ్చిన నీటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదనను తెలంగాణ తిప్పికొట్టింది. ఎక్కడి నుంచి వచ్చినా కృష్ణాలో కలిశాక అదంతా కృష్ణా నీరే అవుతుందని స్పష్టం చేసింది. ఒక నది నుంచి మళ్లిస్తూ కృష్ణాలో కలిపిన నీటిని కృష్ణా నీటిగా కాకుండా వేరుగా పరిగణించలేమని పేర్కొంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం లేఖ రాసింది.పట్టిసీమ, మైనర్ ఇరిగేషన్ వాడకం, తెలంగాణకు దక్కాల్సిన వాటాలపై ఈ లేఖలో స్పష్టత ఇస్తూనే... రబీ అవసరాలకు నీటి విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. నాగార్జునసాగర్ కన్నా దిగువన ఉన్న పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో, సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల ప్రకాశం బ్యారేజీలోకి నీరువస్తుందని... అయితే ఈ ఏడాది ఏపీలో ఈశాన్య రుతు పవనాలతో కురిసిన వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి చెప్పుకోదగ్గ ప్రవాహాలు వచ్చాయని తెలిపింది. ఈ దృష్ట్యా సాగర్, శ్రీశైలం నుంచి దిగువకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక కృష్ణా బేసిన్‌లోకి ఈ ఏడాది మొత్తంగా 342.22 టీఎంసీల నీరు వచ్చిందని... అందులో ఏపీ 216.04 టీఎంసీలు వాడాల్సి ఉన్నా 242.48 టీఎంసీల మేర వాడిందని తెలిపింది. అదే తెలంగాణకు 126.18 టీఎంసీలు వాడుకునే అవకాశమున్నా 99.74 టీఎంసీలను మాత్రమే వినియోగిం చుకున్నామని వివరించింది. ఏపీ పట్టిసీమ ద్వారా వినియోగించిన నీటి లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణకు 74 టీఎంసీలు దక్కుతాయని... ఒకవేళ పట్టిసీమను పక్కనపెట్టినా 56 టీఎంసీలు దక్కుతాయని స్పష్టం చేసింది. మైనర్ వినియోగం 20 టీఎంసీలే.. మైనర్ ఇరిగేషన్ కింద 89.15 టీఎం సీలను తెలంగాణ వినియోగిస్తుందన్న ఏపీ వాదనలపైనా వివరణ ఇచ్చింది. ఈ ఏడా ది మొత్తంగా మైనర్ ఇరిగేషన్ కింద 32.3 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్నప్పటికీ.. అందులో భారీ ప్రాజెక్టులైన భీమా, కల్వ కుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీల ద్వారా చెరువుల్లోకి వచ్చిన నీరు 7.355 టీఎంసీ లని తెలంగాణ స్పష్టం చేసింది. మొత్తం నీటిలో డెడ్ స్టోరేజీ కింద 4.85 టీఎంసీ లను తీసివేస్తే తెలంగాణ వినియోగం 20.09 టీఎంసీలేనని తెలిపింది. -
నీటి వినియోగ లెక్కలేవీ..?
కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి వినియోగ లెక్కలు కోరిన కృష్ణా బోర్డు సంయుక్తంగా కాకున్నా ఒకరైనా పంపించాలని సూచన సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల నుంచి విడుదల చేస్తున్న నీటి వినియోగ లెక్కలు సమర్పించకపోవడంపై రాష్ట్రాన్ని కృష్ణా బోర్డు ప్రశ్నించింది. ప్రాజెక్టుల వద్ద సంయుక్త పర్యవేక్షణ జరిపి నీటి వినియోగ లెక్కలను ఎప్పటికప్పుడు పంపాలని కోరినా ఎందుకు చేయడం లేదని నిలదీసింది. ఈ మేరకు రాష్ట్రానికి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ మంగళవారం లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల్లో గుర్తించిన ప్రాంతాల్లో నీటి వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో ఇదివరకే సంయుక్త పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేశారని లేఖలో గుర్తుచేశారు. శ్రీశైలం నుంచి కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమాల ద్వారా వాడుతున్న నీటి లెక్కలపై సంయుక్త కమిటీలు లెక్కలు సమర్పించాలని కోరినా అది కూడా జరగడం లేదని తెలిపారు. దీనికి తోడు జూరాల నుంచి కల్వకుర్తికి తీసుకుంటున్న నీటితో పాటు, జూరాల కుడి, ఎడమ కాల్వల కింద జరుగుతున్న వినియో గంపైనా ఇప్పటివరకు లెక్కలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా నీటి వినియోగ లెక్కలు సంయుక్తంగా బోర్డుకు మెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా పంపాలని సూచిం చారు. ఒకవేళ ఇరురాష్ట్రాలు సంయుక్తంగా పంపించలేని పరిస్థితుల్లో ఏ ఒక్కరైనా వినియోగ లెక్కలు పంపాలని లేఖలో పేర్కొన్నారు. -
సాగర్ ఎడమ కాల్వకు తక్షణమే 15 టీఎంసీలు
- సీఎం ఆదేశాలతో కృష్ణా బోర్డుకు అధికారుల లేఖ - సాగునీటి అవసరాల కోసం విడుదలకు విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద సాగునీటి అవసరాల కోసం తక్షణమే 15 టీఎంసీలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని జోన్-2 పరిధిలో ఉన్న 2.51 లక్షల ఎకరాల ఆయకట్టు అవసరాలకు నీటిని విడుదల చేయాలని విన్నవించింది. ఈ అంశంపై బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీతో ఉన్నతాధికారులు ఫోన్లో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆగస్టు తొలి వారంలోనే రాష్ట్ర నీటి అవసరాలను బోర్డు ముందుంచిన ప్రభుత్వం... వచ్చే మూడు నెలల వరకు సాగర్ ఎడమ కాల్వ కింద ఖరీఫ్ కోసం 31 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 6 టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.1 టీఎంసీలు అవసరమని తెలిపింది. ఇందులో ఖరీఫ్ అవసరాలకు 12 టీఎంసీలు తక్షణమే అవసరమని, అక్టోబర్‌లో 15 టీఎంసీల మేర నీటి అవసరం ఉంటుందని పేర్కొంది. దీనిపై స్పందించిన బోర్డు సెప్టెంబర్ కోటా కింద 12 టీఎంసీలకు అనుమతిచ్చింది. అక్టోబర్ కోటాపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఖరీఫ్ అవసరాల నిమిత్తం నీటి విడుదలపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరగడంతో నీటి విడుదలపై బోర్డుకు లేఖ రాయాలని శనివారం నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ సూచించారు. దీంతో అధికారులు ఆది వారం లేఖ రాశారు. ప్రస్తుతం సాగర్‌లో 513 అడుగుల వద్ద 138 టీఎంసీల మేర నీటి లభ్యత ఉండగా శ్రీశైలంలో 873.2 అడుగుల వద్ద 155 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని, కనీస నీటిమట్టమైన 834 అడుగుల పైన లభ్యత నీరు సుమారు 53 టీఎంసీలుగా ఉంటుందని ప్రభుత్వం లేఖలో పేర్కొంది. -
తెలంగాణకు 15..ఏపీకి 36 టీఎంసీలు
► ఇరు రాష్ట్రాలకు సెప్టెంబర్‌లో నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డు నిర్ణయం ► 12 టీఎంసీలను ఎడమ కాల్వ కింద ఖరీఫ్ అవసరాలకు వాడనున్న రాష్ట్రం ► మరో 3 టీఎంసీలు నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు... ► అక్టోబర్‌లో ఖరీఫ్‌కు 15, నవంబర్‌కు మరో 7 టీఎంసీలు కోరిన తెలంగాణ ► తర్వాతి సమావేశంలో ఈ కేటాయింపులపై నిర్ణయం హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో లభ్యతగా ఉన్న జలాలను ఇరు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేటాయించింది. సెప్టెంబర్ అవసరాలకుగాను తెలంగాణకు 15 టీఎంసీలు, ఏపీకి 36 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్రిసభ్య కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేస్తూ శనివారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. శుక్రవారం జరిగిన కృష్ణా బోర్డు పూర్తిస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు శనివారం బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావులతో కూడిన త్రిసభ్య కమిటీ ఇక్కడి జలసౌధ కార్యాలయంలో సమావేశమైంది. ఈ భేటీలో మారోమారు ఇరు రాష్ట్రాలు తమ అవసరాలను బోర్డు ముందుంచాయి. వచ్చే మూడు నెలల వరకు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఖరీఫ్ కోసం 31 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 6 టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.1 టీఎంసీలు అవసరమవుతాయని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఇందులో తక్షణమే ఖరీఫ్ అవసరాలకు 12 టీఎంసీలు అవసరం కానుండగా అక్టోబర్‌లో 15 టీఎంసీల మేర అవసరం ఉంటుందని తెలిపింది. అలాగే నల్లగొండ, హైదరాబాద్ తాగునీటికి సెప్టెంబర్‌లో 3 టీఎంసీలు అవసరమవుతాయని విన్నవించింది. తెలంగాణ వినతులపై సానుకూలంగా స్పందించిన బోర్డు సెప్టెంబర్ అవసరాలకు 15 టీఎంసీలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అక్టోబర్‌లో అవసరమయ్యే 15 టీఎంసీలు, నవంబర్‌కు అవసరమయ్యే 7 టీఎంసీలపై తర్వాతి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొనగా ఇందుకు తెలంగాణ అంగీకరించింది. మరోవైపు సెప్టెంబర్ వరకే మొత్తంగా 47 టీఎంసీలు కేటాయించాలని ఏపీ కోరింది. ఇందులోసాగర్ కుడి కాల్వకు 10 టీఎంసీలు, ఎడమ కాల్వకు 4, కృష్ణా డెల్టాకు 12, గాలేరి-నగరికి 6, హంద్రీనీవాకు 5, తెలుగుగంగకు 5, చెన్నై తాగునీటి సరఫరాకు 5 టీఎంసీలు అవసరమవుతాయని బోర్డు దృష్టికి తెచ్చింది. అయితే ఒకే నెలలో ఆ స్థాయిలో నీటి కేటాయింపు చేయాలేమన్న బోర్డు... మొత్తంగా 36 టీఎంసీలు కేటాయించేందుకు అంగీకరించింది. ఈ నీటిలో కృష్ణా డెల్టాకు 10 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వకు 10, ఎడమ కాల్వకు 2, హంద్రీనీవాకు 4, శ్రీశైలం కుడి కాల్వ, తెలుగుగంగ, చెన్నై తాగునీటికి కలిపి 10 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. -
నీటి పంపకాలపై నేడు నిర్ణయం
-
నీటి పంపకాలపై నేడు నిర్ణయం
► ఈ ఖరీఫ్‌కు కృష్ణా జలాల పంపకాన్ని తేల్చనున్న త్రిసభ్య కమిటీ ► ఏపీ, తెలంగాణ అవసరాలపై చర్చించి తుది నిర్ణయం ► మూడు నెలల కోసం 41 టీఎంసీలు అవసరమన్న తెలంగాణ ► కేవలం సెప్టెంబర్ వరకే 47 టీఎంసీలు కావాలన్న ఏపీ హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకంపై శనివారం నిర్ణయం వెలువడనుంది. ఇరు రాష్ట్రాల తాగు, సాగు నీటి అవసరాలపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ చర్చించి నీటి విడుదల, షెడ్యూల్‌లను ఖరారు చేయనుంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో నీటి విడుదల అంశాన్ని త్రిసభ్య కమిటీకి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు శ్రీశైలంలో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న నీటిని... కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడంతోపాటు విడుదలకు అనుమతిస్తూ ఉత్తర్వులిస్తుంది. తెలంగాణ, ఏపీల తాగు, సాగునీటి అవసరాలు, కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, ఇప్పటివరకు జరిగిన వినియోగం తదితర అంశాలపై చర్చించేందుకు శుక్రవారం కృష్ణా బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జలసౌధ కార్యాలయంలో సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ రామ్‌శరణ్, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు ఎస్కే జోషి, శశిభూషణ్ కుమార్, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఖరీఫ్ నీటి విడుదల, అవసరాలపైనే ప్రధానంగా చర్చించారు. నీటి అవసరాల కోసం విజ్ఞప్తులు భేటీ సందర్భంగా ఇరు రాష్ట్రాలు తమ అవసరాలను బోర్డు ముందు పెట్టాయి. సాగర్ ఎడమ కాలువ కింద ఖరీఫ్‌కు 31 టీఎంసీలు, వచ్చే మూడు నెలల పాటు హైదరాబాద్ తాగునీటికి 6 టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.1 టీఎంసీలు అవసరమని తెలంగాణ పేర్కొంది. మరోవైపు ఏపీ మాత్రం కేవలం సెప్టెంబర్ వరకే 47 టీఎంసీలు కావాలని కోరింది. సాగర్ కుడి కాల్వకు 10 టీఎంసీలు, ఎడమ కాల్వకు 4, కృష్ణా డెల్టాకు 12, గాలేరు నగరికి 6, హంద్రీనీవాకు 5, తెలుగు గంగకు 5, చెన్నై తాగునీటి సరఫరాకు 5 టీఎంసీలు కావాలని విజ్ఞప్తి చేసింది. ఈ నీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ శనివారం సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని బోర్డు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ అంశాన్ని ప్రస్తావించిన తెలంగాణ... ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కు కేటాయిస్తున్న నీటిలో ఏపీ కూడా వాటా భరించాలని కోరింది. అయితే నీటి వినియోగంపై వాటర్సెస్, ఇతర ట్యాక్సులు వసూలు చేస్తున్నందున ఏపీ నుంచి వాటా నీరు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్రం వాదించింది. ఇక 2014-15 ఏడాదిలో ఏపీ తన వాటాకు మించి 30 టీఎంసీలు అదనంగా వాడుకుందని, వాటిని సర్దుబాటు చేయాలని తెలంగాణ కోరగా... నీరు సమృద్ధిగా ఉన్న సమయంలో సర్దుబాటు చేస్తామని ఏపీ పేర్కొంది. ఇక శ్రీశైలం విద్యుత్‌ను చెరి సగం చొప్పున పంచాలని తెలంగాణ కోరగా.. ఏపీ అంగీకరించలేదు. ఈ అంశాన్ని కేంద్ర విద్యుత్ శాఖ తేల్చుతుందని స్పష్టం చేసింది. చిన్న వనరుల నీటి వినియోగంపై కమిటీ చిన్న నీటి వనరుల్లో నీటి వినియోగంపై లెక్కలు సమర్పించాలని పదేపదే కోరుతున్నా ఇరు రాష్ట్రాలు స్పందించడం లేదని సమావేశంలో బోర్డు ప్రస్తావించింది. దీనిపై ఇరు రాష్ట్రాలు భిన్న వాదనలు చేయడంతో.. ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర వ్యవహారాల చీఫ్ ఇంజనీర్లు, బోర్డు సీఈలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. చిన్న వనరుల నీటి వినియోగాన్ని పరిశీలించి.. సెప్టెంబర్ 15లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. అపెక్స్ కౌన్సిల్‌కు పాలమూరు, డిండి బోర్డు సమావేశంలో పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల అంశాన్ని ఏపీ ప్రస్తావించింది. ఆ ప్రాజెక్టులు కొత్తవి కావని ఇప్పటికే చెప్పామని.. అంతేగాకుండా ఈ వ్యవహారాన్ని అపెక్స్ కౌన్సిల్‌కు కట్టబెడుతూ కేంద్రం నిర్ణయించినందున అక్కడే దీనిపై చర్చిద్దామని తెలంగాణ సూచించింది. అందుకు ఏపీ అంగీకరించింది. ఇక పట్టిసీమ అంశాన్ని లేవనెత్తిన తెలంగాణ... బచావత్ అవార్డు మేరకు పోలవరం కాకుండా మరే ప్రాజెక్టు ద్వారానైనా గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తే, అంతే పరిమాణంలో నీటిపై రాష్ట్రాలకు వాటా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ లెక్కన 45 టీఎంసీలతో పట్టిసీమ చేపడితే అదే స్థాయిలో నీరు తెలంగాణకు దక్కాలని కోరింది. కానీ దీనిపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ వాదించింది. ఈ అంశంపై మరోమారు చర్చిద్దామని బోర్డు సూచించడంతో.. చర్చ ముగిసింది. ఇక ప్రాజెక్టుల పరిధిలో బోర్డు సూచించిన చోట టెలీమెట్రీ విధానం అమల్లోకి తెచ్చేందుకు అంగీకారం కుదిరింది. -
తెలుగు రాష్ట్రాలకు ఘాటు లేఖ
కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అనుసరిస్తున్న తీరుపై కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు ఆగ్రహంతో ఉంది. కృష్ణా జలాల వాడకం విషయంలో ఎవరికి వారే.. చందంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై గట్టిగా ప్రశ్నించాలని నిశ్చయించింది. ఈ మేరకు సమావేశ వివరాలను తెలియజేస్తూ బోర్డు ఇరు రాష్ట్రాలకు గురువారం లేఖలు రాసింది. నీటి వినియోగం విషయంలో తమకు మాటమాత్రమైన చెప్పకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టుల ద్వారా నీటిని తోడుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఇది వరకే బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో చేసుకున్న ఒప్పందాలు విస్మరించి నీటిని వాడుకోవడాన్ని తీవ్రంగా పరగణిస్తామని ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా, తె లంగాణ జూరాల నుంచి కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడులకు తమకు తెలపకుండానే, నీటి అవసరాల ఇండెంట్ ఇవ్వకుండానే వాడుకోవడాన్ని తప్పుపట్టింది. అయితే, ప్రస్తుతం సైతం ఇరు రాష్ట్రాలు తమ అవసరాలు చెప్పకుండా, నీటిని వాడుకుంటుండటంతో త్రిసభ్య కమిటీ భేటీ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రాజెక్టుల వారీ నీటి పరిస్థితులు, ఇరు రాష్ట్రాల అవసరాలు, మైనర్ ఇరిగేషన్ కింద వినియోగిస్తున్న నీటిపై వివరాలు ఏ రాష్ట్రం ఇవ్వలేదని, ఇప్పటికై వీటి వివరాలు సమర్పించాలని లేఖలో కోరింది. ఆ మేరకు అందిన సమాచారంతో ఈ నెల 24న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. -
హే కృష్ణా.. ఇది తగునా?
-
హే కృష్ణా.. ఇది తగునా?
► తెలంగాణ నీటి అవసరాలు పట్టించుకోని కృష్ణా బోర్డు ► నీటిని విడుదల చేయాలని కోరినా పట్టనట్లే.. ► ఏపీ అవసరాలకు మాత్రం నీరివ్వాలని సూచనలు ► సాగర్ నుంచి 4 టీఎంసీలు విడుదల చేయాలని స్పష్టీకరణ ► మండిపడుతున్న తెలంగాణ సర్కారు ► శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తేనే సాగర్‌కు విడుదల సాధ్యమని బోర్డుకు లేఖ ► 503 అడుగుల వద్ద నీటిని తోడడం కష్టమని వివరణ హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం, వివాదాల పరిష్కారంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణకు మింగుడుపడటం లేదు. రాష్ట్ర నీటి అవసరాలపై నోరు మెదపని బోర్డు.. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు మాత్రం నీటిని విడుదల చేయాలని సూచించడం పుండుపై కారం చల్లినట్లుగా ఉందని ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల ట్రయల్ రన్లకు నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం చెప్పకుండా ఏపీ అడిగిందే తడవుగా నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీటిని విడుదల చేయాలనడం తమపట్ల వివక్ష చూపడమేనని భావిస్తోంది. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తేనే సాగర్ కుడికాల్వకు నీటి విడుదల సాధ్యమవుతుందని తెలంగాణ తాజాగా బోర్డుకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో బోర్డు సరైన న్యాయం చేస్తుందా? లేక ఏపీ వైపే మొగ్గు చూపుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అవసరాలు పట్టని బోర్డు ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాల వినియోగంపై ఈ నెల 20న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ జరిగింది. నాగార్జునసాగర్ కుడి కాలువకు 8, తాగునీటి అవసరాలకు 4, కృష్ణా పుష్కరాలకు 4 టీఎంసీలు కలిపి మొత్తంగా 16 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం బోర్డును కోరింది. ఇదే సమయంలో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 3, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల ట్రయల్ రన్ నిర్వహణకు 4 టీఎంసీలతో పాటు నల్లగొండ తాగునీటి అవసరాలను తెలంగాణ వివరించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో నీటి విడుదల చేయడం సాధ్యం కాదని సమావేశంలో స్పష్టం చేసిన బోర్డు... మూడ్రోజులకే మాట మార్చింది. ఏపీ అవసరాల నిమిత్తం 4 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణకు సూచించింది. కనీస నీటి మట్టాలకు దిగువన సాగర్ నిల్వలు పడిపోయిన అంశాన్ని కూడా విస్మరించి బోర్డు చేసిన ఈ సూచనపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సాగర్ కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా ప్రస్తుతం సాగర్‌లో 503.50 అడుగులకు పడిపోయింది. ఇంతకుమించి నీటిని తోడడం సాధ్యం కాదని తెలంగాణ చెబుతోంది. అయితే 500 అడుగులకు వరకు తోడవచ్చని, అప్పటికీ సుమారు 6.07 టీఎంసీల లభ్యత ఉంటుందన్న ఏపీ వాదనకు బోర్డు వత్తాసు పలుకుతోందని తెలంగాణ భావిస్తోంది. శ్రీశైలంలోకి నీరు వస్తున్నా.. అక్కడినుంచి సాగర్‌కు నీటిని విడుదల చేయాలని ఏపీకి సూచించకుండా సాగర్ నీటిని ఏపీకి ఇవ్వాలనడం సరికాదని అంటోంది. శ్రీశైలం నుంచి వదిలితేనే.. నాగార్జున సాగర్ కుడి కాలువకు 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్న బోర్డు సూచనపై మంగళవారం తెలంగాణ ఘాటుగానే స్పందించింది. ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల విషయంలో తామేమీ చేయలేమని బోర్డుకు స్పష్టం చేసింది. సాగర్‌లో నీటిమట్టాలు పడిపోయిన దృష్ట్యా నీటి విడుదల అసాధ్యమని, శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేస్తే తప్ప ఏపీకి నీరు విడుదల చేయలేమని తేల్చిచెప్పింది. సాగర్ కుడి కాలువ అవసరాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం నుంచి నీటి విడుదలకు ఏపీని ఒప్పించాలని బోర్డుకు రాసిన లేఖలో పేర్కొంది. ఎగువ నుంచి శ్రీశైలంలోకి ఆశించిన స్థాయిలో నీరు వ స్తోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేస్తే సాగర్ నుంచి కుడి కాలువకు నీటిని ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని వివరించింది. బోర్డు ఏం చెబుతుందో..? తెలంగాణ వినతిపై బోర్డు ఎలా స్పందిస్తున్న దానిపై ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 885 అడుగులు. గరిష్టంగా 215.8 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. ప్రాజెక్టు కనీస నీటిమట్టం 854 అడుగులు. గతేడాది 790 అడుగుల వరకూ నీటిని వాడుకునేలా ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నా.. 786 అడుగుల వరకూ నీటిని వినియోగించుకున్నాయి. దీంతో ఏపీ సర్కారుకు రాయలసీమ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. శ్రీశైలంలో 874 అడుగుల నీటిమట్టం ఉంటేనే.. దిగువకు నీటిని విడుదల చేయాలని రాయలసీమ రైతులు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం 802.7 అడుగుల వద్ద 30.35 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దిగువకు నీటిని విడుదల చేయడానికి ఏపీ అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బోర్డు చెప్పే నిర్ణయం కీలకం కానుంది. -
కృష్ణానది జలాల పంపకాలపై అధికారుల భేటీ
హైదరాబాద్: కృష్ణానది జలాల పంపకాలపై అధికారుల సమావేశం హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు హాజరయ్యారు. కృష్ణానది బోర్డు నిర్వహణ, విధి విధానాలపై రెండు రాష్ట్రాల అధికారులు ప్రధానంగా చర్చించనున్నారు. -
కృష్ణా జలాలపై పాండ్యా కమిటీ
► ఈ నెల రెండో వారంలో రాష్ట్రంలో పర్యటించనున్న త్రిసభ్య కమిటీ ► 5న ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శుల సమావేశం! సాక్షి, హైదరాబాద్: కృష్ణానదీ జలాలపై నెల కొన్న వివాదాలను కొలిక్కి తెచ్చే ప్రక్రియలో భాగంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సీడబ్ల్యూసీ(కేంద్ర జల సంఘం) మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్లు ఏకే బజాజ్, సురేష్‌చంద్ర సభ్యులుగా ఉంటారు. ఇరు రాష్ట్రాలకు కృష్ణా జలాల తాత్కాలిక పంపిణీ, కేఆర్ఎంబీ పరిధి, విధి విధానాల ఖరారు చేసే బాధ్యతలను ఈ కమిటీకి కట్టబెట్టింది. కమిటీ ఈ నెల రెండో వారంలో రాష్ట్రంలో పర్యటించే అవకాశాలున్నాయని తెలిసింది. కృష్ణా జలాల పం పకం, ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేకకార్యదర్శి అమర్జీత్సింగ్ అధ్యక్షతన ఈ నెల 21 నుంచి 23 వరకు తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించినా ఏకాభిప్రా యం కుదరని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ నియమిస్తామని కేంద్రం తెలిపింది. నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ ఈ కమిటీని కేంద్రం ఆదేశిం చింది. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఈ నెల రెండో వారంలో దిగువ కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులి చింతల, ప్రకాశం బ్యారేజీ, సుంకేసుల జలాశయాలను సందర్శించనుంది. ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఈఎన్సీలు, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు, కృష్ణా బోర్డు ఇన్చార్జి చైర్మన్ రాంశరాణ్‌తో సమావేశం కానుంది. కమిటీ పర్యటనకు ముందే ఈ నెల 5న ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శుల సమావేశం జరిగే అవకాశం ఉంది. -
కృష్ణా బోర్డు నుంచి గుప్తా ఔట్
►తెలంగాణ విజ్ఞప్తి మేరకు తొలగించిన కేంద్రం ►గోదావరి బోర్డు సభ్య కార్యదర్శికి అదనపు బాధ్యతలు ►తెలంగాణ అభిప్రాయం కోరకుండానే ప్రాజెక్టుల ►నియంత్రణపై మొండిగా వ్యవహరించిన గుప్తా సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సభ్య కార్యదర్శి పదవి నుంచి ఆర్కే గుప్తాను తొలగిస్తూ కేంద్ర జల వనరుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుల నియంత్రణ అంశంలో గుప్తా వ్యవహార శైలి వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది. గోదావరి బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్న సమీర్ ఛటర్జీని గుప్తా స్థానంలో నియమించింది. కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న గుప్తా.. కృష్ణా బోర్డు మొదట్నుంచీ సభ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. దీంతోపాటు తుంగభద్ర బోర్డు చైర్మన్‌గా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కృష్ణా జలాల నీటి వినియోగం, విడుదలకు సంబంధించిన ఎలాంటి అంశాల్లో అయినా గుప్తా తీసుకునే నిర్ణయాల ఆధారంగానే ఆదేశాలు వెలువడుతుంటాయి. నీటి పంపకాల్లో ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తొలి నుంచీ గుప్తాపై తెలంగాణ గుర్రుగా ఉన్నా.. ఆయనపై నేరుగా కేంద్రానికి ఏనాడూ ఫిర్యాదు చేయలేదు. అయితే ఇటీవల కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చుకునే అంశంలో గుప్తా కొంత మొండిగా వ్యవహరించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేనందున ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణ అవసరం లేదని పలు వేదికలపై తెలంగాణ పదేపదే విన్నవిస్తున్నా.. వాటిని గుప్తా పట్టించుకోకుండా డ్రాప్ట్ నోటిఫికేషన్‌ను తయారు చేసి, దాన్ని ఆమోదించాలంటూ నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. ప్రాజెక్టుల నియంత్రణ నోటిఫికేషన్‌పై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా కేంద్రానికి పంపడంపై బోర్డు సమావేశంలో తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అయినా పట్టించుకోని గుప్తా.. పదిహేను రోజుల్లో నియంత్రణ అంశంపై అభిప్రాయం చెప్పకుంటే ఆమోదం తెలిపినట్లుగా పరిగణిస్తామంటూ రాష్ట్రానికి లేఖలు రాశారు. ఈ లేఖలతో అగ్గిమీద గుగ్గిలమైన తెలంగాణ.. గుప్తా వ్యవహారాన్ని నేరుగా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేసింది. పూర్తిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డెరైక్షన్‌లో గుప్తా పనిచేస్తున్నారని, ఆయన వల్లే వివాదాలు జటిలం అవుతున్నాయని వివరించింది. దీనిపై వివిధ వర్గాల నుంచి సమాచారం తీసుకున్న కే ంద్ర జల వనరుల శాఖ గుప్తాను బోర్డు బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. -
నీళ్ల లొల్లిపై కమిటీ
కృష్ణాపై ఏకాభిప్రాయం రాకపోవడంతో కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయం ముగ్గురు సీడబ్ల్యూసీ రిటైర్డ్ చైర్మన్లతో అధ్యయనం కేఆర్ఎంబీపై మార్గదర్శకాలు రూపొందించనున్న కమిటీ.. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్రం సూచన.. మూడోరోజు చర్చల్లోనూ ప్రతిష్టంభన 90 టీఎంసీల వాటాకు తెలంగాణ పట్టు.. వ్యతిరేకించిన ఏపీ అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలి: హరీశ్‌రావు టెలిమెట్రిక్ విధానం పెట్టి ప్రతి చుక్కనూ లెక్కించాలని డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంచాయితీ మూడోరోజు కూడా ఎటూ తేలలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మంత్రులూ ఎవరి వాదనకు వారే కట్టుబడి ఉండటంతో జగడం తెగలేదు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సూచనల మేరకు గురువారం ఉదయం జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జిత్ సింగ్ సమక్షంలో ఇరురాష్ట్రాల నీటి పారుదల మంత్రులు టి.హరీశ్‌రావు, దేవినేని ఉమామహేశ్వరరావు సమావేశమయ్యారు. గడచిన రెండ్రోజులుగా ఉన్నతాధికారులు చేసిన వాదనలనే మంత్రులూ వినిపించారు. గోదావరి నుంచి పోలవరం, పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి మళ్లించిన నీటిలో తమ వాటాగా 90 టీఎంసీలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ పట్టుపట్టగా.. దాన్ని ఏపీ వ్యతిరేకించింది. నాగార్జున సాగర్ కుడికాలువ తమ భూభాగంలో ఉన్నందున తామే నిర్వహించుకుంటామని ఏపీ వాదించగా అది కుదరదని, అన్ని ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి తీసుకురావాల్సిందేనని తెలంగాణ వాదించింది. ఈ చర్చల్లో ఏదీ తేలే పరిస్థితి లేదని భావించిన కేంద్రం చివరకు... కేఆర్ఎంబీ నోటిఫికేషన్ జారీకి ముందు మార్గదర్శకాలను రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చింది. జూలై మొదటి వారంలో కేంద్ర జల వనరుల సంఘం మాజీ చైర్మన్లు ముగ్గురితో ఒక కమిటీ వేస్తామని, రెండు మూడు నెలల్లో ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందిస్తుందని, ఆ తర్వాత కేఆర్ఎంబీ పరిధి, అధికారాలు నిర్ణయిస్తామని తెలిపింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగాలని సూచించింది. అందుకు తెలంగాణ అంగీకరించింది. ఏపీ కూడా సాధ్యమైనంత త్వరగా ఆ కమిటీ మార్గదర్శకాలు రూపొందించాలని, అందుకు సుముఖంగా ఉన్నామని తెలిపింది. అయితే యథాతథ స్థితిని కేవలం నెలరోజులకే పరిమితం చేయాలని కోరింది. తాత్కాలిక యాజమాన్య ఏర్పాట్లపై నెల రోజుల్లోగా ఏకాభిప్రాయానికి రాని పక్షంలో మరోసారి ఇరుపక్షాలు సమావేశమయ్యే అవకాశం ఉంది. సమావేశం ముగిసిన అనంతరం ఇద్దరు మంత్రులు విడివిడిగా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలి: హరీశ్‌రావు సమావేశంలో ఎలాంటి స్పష్టత రాలేదు. ఏపీది అదే మొండి వైఖరి. నిరంకుశంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సూచనలను పట్టించుకోకుండా వితండ వాదన చేస్తోంది. చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇప్పటికే బచావత్ అవార్డు స్పష్టత ఇచ్చింది. గోదావరి నీళ్లను కృష్ణాకు మళ్లిస్తే పైరాష్ట్రాలకు హక్కులు ఉంటాయని ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పినందున... తెలంగాణ వాటా కింద 90 టీఎంసీలు ఇవ్వాలి. తాత్కాలిక అవగాహన ప్రకారం వచ్చిన 299 టీఎంసీలు కూడా చాలా తక్కువే. బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది కేటాయింపులు ఇచ్చే వరకు చేయగలిగిందేమీ లేనందున.. బచావత్ అవార్డు అందుబాటులో ఉన్నందున దాన్ని అమలు చేయాలి. 299 టీఎంసీలకు అదనంగా 90 టీఎంసీలు కేటాయించాలని కోరాం. ఏపీ అందుకు అంగీకరించలేదు. జూలై మొదటి వారంలో ముగ్గురు రిటైర్డ్ సీడబ్ల్యూసీ చైర్మన్లతో కమిటీ వేసి వచ్చే మూడు నెలల్లోగా కేఆర్ఎంబీని నిర్వహణలోకి తెస్తామని కేంద్రం చెప్పింది. ఈ మూడు నెలలపాటు యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్రం అభ్యర్థించింది. మేం అందుకు సమ్మతించాం. కానీ ఏపీ అందుకు అంగీకరించని పరిస్థితి ఉంది. అనేక సమస్యలకు పరిష్కారం వచ్చాకే కేఆర్ఎంబీ విధులు నిర్వర్తించగలుగుతుంది. దాన్ని నిర్వహణలోకి తేవడంలో మాకు అభ్యంతరం లేదు. కానీ కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలి. అప్పుడు మాకు అభ్యంతరం ఉండదు. టెలీమెట్రిక్ విధానం పెట్టండి. సంయుక్త బృందాలను ఏర్పాటు చేయండి. ప్రతి చుక్కను కూడా లెక్కపెడితే రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి మేం సిద్ధంగా ఉన్నామని మేం చెప్పాం. మేం మహారాష్ట్ర, కర్ణాటకతో కలిసి పనిచేయగలుగుతున్నాం. కానీ ఏపీ మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. తెలంగాణకు అన్యాయం జరిగితే ఢిల్లీ స్థాయిలో పోరాడుతాం. న్యాయస్థానంలో పోరాడుతాం. ఏపీకి సంబంధించి ఒక చుక్క కూడా మాకు అవసరం లేదు. మా హక్కుల కోసం మేం కొట్లాడుతాం. నీటి నిర్వహణలో ఇబ్బందులను వివరించాం: దేవినేని ఉమామహేశ్వరరావు కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబీ పరిధిని ప్రకటించాలి. సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులతో దీనిపై కమిటీ వేస్తానంది. త్వరితగతిన మార్గదర్శకాలు విడుదల చేసి కేఆర్ఎంబీ నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. నెల రోజుల తాత్కాలిక ఏర్పాట్లపై మరోసారి చర్చలకు పిలుస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ సీఈ ఆధ్వర్యంలో ఉన్నా.. ప్రాజెక్టులోకి నీళ్లు రాగానే తెలంగాణ కేఆర్ఎంబీ ఆదేశాలు పట్టించుకోకుండా విద్యుదుత్పత్తి చేస్తోందని చెప్పాం. రాయలసీమకు మంచినీళ్లు ఇవ్వకుండా విద్యుత్ కోసం గేట్లు ఎత్తేస్తున్నారు. నాగార్జున సాగర్ కుడికాల్వ వద్ద మా ఎస్పీఎఫ్ను పెట్టుకుంటామని చెబితే.. మొండిగా, తొండిగా వ్యవహరిస్తున్నారు. వాళ్లకు కేటాయించిన నీళ్లు వాళ్లు ఉపయోగించుకోవాలి. మొండిగా ఒకసారి 45 టీఎంసీలు, తొండిగా మరోసారి 90 టీఎంసీలు అంటున్నారు. -
తేలని పంచాయితీ!
►నదీ జలాలు, ప్రాజెక్టులపై పట్టు విడవని రెండు రాష్ట్రాలు ►కృష్ణా బోర్డు పరిధి, అధికారాలపై నోటిఫికేషన్ జారీ చేయాలన్న ఏపీ ►ట్రిబ్యునల్, కోర్టుల్లో వాటాలు తేలేవరకు వద్దన్న తెలంగాణ సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నది జలాలపై ఎడతెగని పంచాయితీ మళ్లీ అసంపూర్తిగానే ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ, ప్రాజెక్టులు, కృష్ణాబోర్డు పరిధి, అధికారాలపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ వద్ద జరిగిన సమావేశం ఓ కొలిక్కి రాకుండానే వాయిదా పడింది. దీనిపై బుధవారం మరోసారి సమావేశం కావాలని కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. ఢిల్లీలోని శ్రమశకి ్త భవన్లో జరిగిన ఈ భేటీలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్సింగ్, కృష్ణా బోర్డు ఇన్చార్జి చైర్మన్ రామ్ శరాణ్, సభ్య కార్యదర్శి ఆర్.కె.గుప్తా, ఏపీ నీటి పారుదల ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, తెలంగాణ నీటి పారుదల ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, ఈఎన్సీ మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఉదయం ఇరు రాష్ట్రాలు తమ అవసరాలపై వాదనలు వినిపించాయి. మధ్యాహ్నం స్టేట్ ప్రాజెక్ట్స్ కమిషనర్ కుష్విందర్ వోరా వద్ద దాదాపు నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి. తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:15 వరకు అమర్జిత్సింగ్ సమక్షంలో చర్చించారు. పరస్పర భిన్న వాదనలు కృష్ణా బోర్డు పరిధి, అధికారాలు, బాధ్యతలను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని ఏపీ పట్టుబట్టింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసి, వాటిపై నిర్వహణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు అప్పగించాలని కోరింది. కానీ కృష్ణా జలాల తుది కేటాయింపులు జరిగే వరకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు సరికాదని... కృష్ణా బోర్డుకు ఆ అధికారమే లేదని తెలంగాణ వాదించింది. ఏపీ నిర్మిస్తున్న పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు వాటా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ రెండు వాదనల్లో ఎవరూ పట్టు సడలించకపోవడంతో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక ప్రాజెక్టులపై తాత్కాలిక యాజమాన్య ఏర్పాట్లపై అవగాహన చేసుకోవాలన్న కేంద్ర సూచనపైనా ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. అయితే తొలి ఏడాదికి సంబంధించి కొన్ని స్వల్ప వివాదాలున్నా మొత్తంగా విజయవంతమైందని ఇరు పక్షాలు అంగీకరించాయి. దానినే కొనసాగిస్తారా, లేదా.. ప్రత్యామ్నాయం ఏమిటన్న దానిపై స్పష్టత రాలేదు. కాగా సమావేశం అనంతరం దీనిపై తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌రావు మాట్లాడారు. గతేడాది కుదుర్చుకున్న తాత్కాలిక అవగాహన బాగానే కొనసాగిందని, దాన్ని ఈసారీ కొనసాగిస్తే ఎలాగుంటుందన్న అంశంపై చర్చించామని చెప్పారు. అయినా చర్చలు ఓ కొలిక్కి రాలేదన్నారు. -
మా వాటా పెంచండి
►కృష్ణాలో నికర జలాలపై కేంద్ర జలవనరుల శాఖ సమావేశంలో తెలంగాణ విజ్ఞప్తి ►మా వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచండి ►ఏపీ వాటా 512 టీఎంసీల నుంచి 422 టీఎంసీలకు తగ్గించండి ►పట్టిసీమ, పోలవరంలో తెలంగాణకు నిర్ణీత వాటా ఉంటుంది ►811 టీఎంసీలపైన వచ్చే నీటిని 66.7:33.3 నిష్పత్తిలో పంచండి ►పాలమూరు, డిండి పాత ప్రాజెక్టులేబోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల నియంత్రణ అవసరం లేదు ►గతేడాది ఏపీ అదనంగా వాడుకున్న 13 టీఎంసీలను ►ఈ ఏడాది సర్దుబాటు చేయాలి సాక్షి, హైదరాబాద్ కృష్ణా నదీ జలాల్లో తమకున్న నికర జలాల కేటాయింపులను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ప్రస్తుతం ఉన్న 299 టీఎంసీల నీటి వాటాకు అదనంగా మరో 90 టీఎంసీల మేర నీటి వాటా తమకు న్యాయంగా దక్కుతుందని తెలిపింది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు వాటాలు దక్కుతాయన్న అంశాన్ని వివరిస్తూ... తమ వాటాను 389 టీఎంసీలకు పెంచాలని, ఏపీ వాటాను 422 టీఎంసీలకు తగ్గించాలని కోరింది. 2016-17 వాటర్ ఇయర్లో కృష్ణా నీటి కేటాయింపులు, వినియోగంపై మంగళవారం కేంద్ర జల వనరుల శాఖ వద్ద జరిగిన సమావేశానికి తెలంగాణ తరఫున నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీ, ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు కోటేశ్వర్రావు, నరసింహారావు, అడ్వొకేట్ రవీందర్రావు తదితరులు హాజరయ్యారు. పట్టిసీమ కొత్త ప్రాజెక్టే: ఏపీ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో భాగం కాదని తెలంగాణ స్పష్టంచేసింది. ‘‘1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. 80 టీఎంసీల కేటాయింపుల్లో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీ వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఈ నీటి వాటా హక్కు తెలంగాణదే. బచావత్ అవార్డులో పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణం పై రాష్ట్రాలకు వాటా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఏపీ పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతోంది. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదని లోక్‌సభలో వైఎస్సార్సీసీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. అంటే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలి. ఈ లెక్కన మొత్తంగా తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచి, ఏపీ వాటాను 512 టీఎంసీల నుంచి 422 టీఎంసీలకు తగ్గించాలి. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని ఆచరణలోకి తేవాలి’’ అని కోరింది. దీంతోపాటే గతేడాది నిర్ణీత వాటాలో తక్కువగా వాడుకున్న 13 టీఎంసీల నీటిని కూడా ఈ ఏడాది నీటి పంపకాల్లో సర్దుబాటు చేయాలని కోరింది. మొత్తంగా తెలంగాణకు 402 టీఎంసీలను కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే ఏడు దశాబ్దాలుగా ఆయకట్టు అభివృద్ధి విషయంలో తెలంగాణ ఒడిదుడుకులను ఎదుర్కొందని, మొత్తం కృష్ణా బేసిన్లో సాగుకు యోగ్యంగా 37.19 లక్షల హెక్టార్లు ఉన్నా.. కేవలం 6.39 లక్షల హెక్టార్లే సాగు చేసుకోగలుగుతోందని తెలిపింది. ఈ దృష్ట్యా 811 టీఎంసీల నికర జలాలకుపైన వచ్చే అదనపు జలాలను 63.7ః33.3 నిష్పత్తిన తెలంగాణ, ఏపీలకు పంచాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ వాదనలోని ముఖ్యాంశాలివీ.. - కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తేవాలని కోరుతూ బోర్డు వర్కింగ్ మాన్యువల్ సిద్ధం చేసి నోటిఫికేషన్ కోసం కేంద్రానికి పంపింది. అయితే దీన్ని రాష్ట్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి బ్రజేశ్ ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చే వరకు ఆమోదించరాదని కోరింది. ప్రస్తుతం ఇది కేంద్ర పరిశీలనలో ఉన్నందున నియంత్రణపై తొందర అక్కర్లేదు. - రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89(ఏ), (బీ)ల ప్రకారం ట్రిబ్యునల్ కాల పరిమితిని రెండేళ్లు పెంచారు. దీనిలో కృష్ణా జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్యా లేదా నాలుగు రాష్ట్రాల మధ్యా అన్న అంశం తేలలేదు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేవు. నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాలు బ్రజేశ్ ట్రిబ్యునల్ పరిశీలనలో ఉన్నాయి. అలాంటప్పుడు బోర్డు నియంత్రణ అన్న ప్రశ్నే ఉదయించదు. - ఇదే చ ట్టంలోని 85(8), 87(1) సెక్షన్ల ప్రకారం కృష్ణా బోర్డు.. కేవలం ట్రిబ్యునల్లు ఇచ్చిన నిర్ణయాన్ని మాత్రమే అమలు పరచాలి. అంతే తప్ప నోటిఫికేషన్ తయారు చేయలేదు. బ్రజేశ్ ట్రిబ్యునల్ అమల్లోకి రానందున బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని ఉమ్మడి ఏపీలో చేసుకున్న తాత్కాలిక ఏర్పాట్ల మేరకు తెలుగు రాష్ట్రాలు తమ సరిహద్దుల్లో ఎక్కడైనా వాడుకునేలా మాత్రమే చూడాలి. - పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు కొత్త ప్రాజెక్టులు అనడం సరికాదు. కృష్ణాలో 70 టీఎంసీల నీటిని వినియోగించుకుంటూ చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతలపై డీపీఆర్ తయారు చేయాలంటూ 2013లోనే జీవో 72 ఇచ్చారు. అదే కృష్ణాలో 30 టీఎంసీల నీటిని వాడుకుంటూ డిండి ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై 7న జీవో 159 ఇచ్చారు. అలాంటప్పుడు అవి ముమ్మాటికీ పాత ప్రాజెక్టులే. ఈ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రుల స్థాయిలో ఉంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశం అవసరం లేదు. -
'ఢిల్లీ వెళ్లి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు'
విజయవాడ: తెలంగాణ నేతలు ఢిల్లీ వెళ్లి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు జరిగాయని, కేటాయింపుల్లో కృష్ణానదీ యాజమాన్య బోర్డు జాగ్రత్తలు తీసుకోవాలని సంతకాలు జరిగాయని గుర్తు చేశారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు అనుగుణంగా 512 టీఎంసీలు రాష్ట్రానికి కేటాయింపులు జరిగాయని వివరించారు. కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన విజయవాడలో స్పష్టం చేశారు. విభజన ప్రకారమే కృష్ణా బోర్డు నడుస్తుందన్నారు. విభజన చట్టాన్ని రూపొందించింది టీఆర్ఎస్సేనని, ఇప్పుడెందుకు జలాల పంపిణీపై దుష్ప్రచారం చేస్తున్నారని దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు. -
శ్రీశైలం డ్యాం నుంచి నీటి విడుదల
కర్నూలు : శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటి విడుదల బుధవారం ఉదయం ప్రారంభమైంది. తాగునీటి అవసరాల కోసం రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు విడుదల చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. దీంతో బుధవారం ఉదయం 7.30 గంటలకు నీటి విడుదల ప్రారంభించారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో రెండు జనరేటర్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. -
శ్రీశైలంలో నీటి విడుదల నేటి నుంచే
⇒ 4.3 టీఎంసీలు విడుదల ⇒ ఏపీ, తెలంగాణకు చెరో 2 టీఎంసీలు ⇒ నిర్ణయం తీసుకున్న కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్ హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వర్కింగ్ గ్రూప్ సమావేశం నిర్ణయించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని మంగళవారం నుంచే విడుదల చేయాలని, పది రోజులపాటు కొనసాగించాలని నిర్ణయించారు. 4.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని, ఈ నీటిని ఇరు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని, ఆ తర్వాత అవసరాల మేరకు మరోసారి నిర్ణయానికి రావాలన్న కృష్ణా బోర్డు సూచనకు ఏపీ, తెలంగాణ అంగీ కారం తెలిపాయి. దీంతో 2 రాష్ట్రాల్లో తాగునీటి సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం లభించినట్లయ్యింది. కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూపు సోమవారం కేంద్ర జల సంఘం కార్యాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి బోర్డు చైర్మన్ ఎస్.కె.జి.పండిట్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ చీఫ్ ఇంజనీర్(ఇంటర్‌స్టేట్) రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోకి వచ్చిన నీరు, వినియోగం, ప్రాజెక్టుల్లో నిల్వలపై చర్చించారు. సాగర్ కుడి కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీలు కావాలని ఏపీ కోరింది. పట్టణాలు, గ్రామాల్లో నీటిఎద్దడి తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది. తమ తాగునీటి అవసరాలకూ తక్షణమే 5 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. జంట నగరాలు, నల్లగొండ జిల్లాలో ప్రజలు తాగునీరు దొరక్క అల్లాడుతున్నారని వెల్లడించింది. ఆవిరి, సరఫరా నష్టాలు.. 2.3 టీఎంసీలు ఇరు రాష్ట్రాల అవసరాలను విన్న బోర్డు శ్రీశైలంలో 785 అడుగుల మట్టం వరకు తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకోవచ్చని తెలి పింది. కేవలం 8 టీఎంసీలే తాగునీటికి వాడుకోవచ్చని వివరించింది. నీటినంతా ఒకేసారి పంచలేమని స్పష్టం చేసింది. తొలివిడతగా 4.3 టీఎంసీల నీటిని విడుదల చేద్దామని ప్రతిపాదించింది. ఇందులో 0.3 టీఎంసీల నీటిలో ఆవిరి, సరఫరా నష్టాలున్నా, మిగతా 4 టీఎంసీల్లో ఒక్కో రాష్ట్రానికి 2 టీఎంసీల చొప్పున సాగర్ నుంచి తీసుకోవాలని సూచిం చింది. దీనిపై ఏపీ తొలుత కొంత తటపటాయించినా.. తర్వాత అంగీకరించింది. -
కృష్ణా జలాలు తాగు అవసరాలకే
* కృష్ణా నదీ బోర్డు వర్కింగ్ గ్రూప్ భేటీలో నిర్ణయం * శ్రీశైలం, సాగర్‌లలో ప్రస్తుత లభ్యత 9.5 టీఎంసీలుగా అంచనా * తాగునీటి ఎద్దడి దృష్ట్యా ఖరీఫ్‌ను పక్కనపెట్టాలని బోర్డు సూచన.. * ఇరు రాష్ట్రాల అంగీకారం * రెండు మూడు రోజుల్లో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసే అవకాశం సాక్షి, హైదరాబాద్: ప్రధాన జలాశయాలు అడుగంటిన దృష్ట్యా కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి వినియోగానికే పరిమితం చేయాలని కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్ నిర్ణయించింది. సాగు అవసరాలకు నీటిని మళ్లించకుండా చూడాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాలపై ఉంటుందని స్పష్టం చేసింది. తాగునీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకోవాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టుల్లో నీరు చేరేవరకు ఖరీఫ్ సాగు అవసరాలను పక్కనపెట్టాలని... ఈ దిశగా రైతులను అప్రమత్తం చేయాలని సూచించింది. కృష్ణాలో ఉన్న కొద్దిపాటి జలాలను తెలంగాణ, ఏపీ రాష్ట్రాల తాగునీటి అవసరాలకు ఏవిధంగా పంచుకోవాలన్న అంశంపై సోమవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్కేజీ పండిత్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు వెంకటేశ్వరరావు, మురళీధర్‌లతో కూడిన వర్కింగ్ గ్రూప్ కేంద్ర జల సంఘం కార్యాలయంలో సమావేశమై చర్చించింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల పరిధిలో లభ్యత ఉన్న జలాలు, అవసరాలను ఇరు రాష్ట్రాల అధికారులు వర్కింగ్ గ్రూప్ దృష్టికి తీసుకెళ్లారు. నాగార్జునసాగర్‌పై ఆధారపడి కుడి కాలువ కింద 12లక్షలు, ఎడమ కాలువ కింద 10లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని... ప్రస్తుతం సాగర్‌లో నీటిమట్టం 510.9 అడుగులకు పడిపోగా, శ్రీశైలంలో 802 అడుగులకు తగ్గిందన్న అంశాలను బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కల్పించుకున్న బోర్డు చైర్మన్.. నీటి లోటును దృష్టిలో పెట్టుకుని తాగునీటి అవసరాలకే పరిమితమవ్వాలని సూచించారు. రెండు ప్రాజెక్టుల్లో వినియోగించుకోగలిగే నీరు కేవలం 9.5టీఎంసీల మేరకే ఉన్న దృష్ట్యా ఖరీఫ్ అవసరాలకు ఈ నీటిని మళ్లించరాదని చెప్పారు. దీనికి ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. అవసరాన్ని బట్టి శ్రీశైలం నుంచి.. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లో వాడుకునేందుకు అవకాశమున్న 9.5 టీఎంసీలను తాగునీటి కోసం అవసరాన్ని బట్టి విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సాగర్‌లో కనీస నీటిమట్టం 510 అడుగులను కాపాడాలంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించకూడదని... శ్రీశైలంలో 785 అడుగుల వరకు వెళితే 8 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని అంచనా వేశారు. రాయలసీమ, జంట నగరాలు, నల్లగొండ, కోస్తా జిల్లాల తాగునీటి అవసరాలకు ఈ నీటిని వినియోగించుకునేందుకు వీలుగా ఇరు రాష్ట్రాలు చర్చించుకుని షెడ్యూల్‌ను ఖరారు చేసుకోవాలని సూచించారు. తొలి విడతగా రెండుమూడు రోజుల్లో శ్రీశైలం నుంచి నీటి విడుదల చేయాలని ఇరు రాష్ట్రాలు బోర్డు సమక్షంలో నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఈ సమావేశంలో బోర్డు వెబ్సైట్ రూపకల్పనపైనా చర్చ జరిగింది. బోర్డు వెబ్సైట్లో ఎలాంటి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి, ఇరు రాష్ట్రాలు ఏయే అంశాలను అందులో చేర్చాలన్న దానిపై బోర్డు చైర్మన్ పలు సూచనలు చేశారు. ఈ నెల చివరి నాటికి ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేవాలని బోర్డు భావిస్తోంది. -
కృష్ణా జలాల పంపకాలపై ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల పంపకాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరింది. ఢిల్లీలో జరిగిన కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. ఇరు రాష్ట్రాల సమ్మతితో మార్గదర్శకాలు ఖరారు చేశారు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిని కలసి కృష్ణా యాజమాన్య బోర్డు దీన్ని సమర్పించింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పరిశీలనకు పంపి ఆ తర్వాత కేంద్రం నోటిఫై చేయనుంది. ఈ సమావేశంలో ఖరారైన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. కృష్ణా నుంచి ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు ఇవ్వాలనే అంశంపై ఏకాభిప్రాయం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటిని ఎక్కడి నుంచైనా వాడుకోవచ్చు వరదల సమయంలో వచ్చే అదనపు నీటిని ఇదే నిష్పత్తిలో వాడుకోవాలి. ట్రిబ్యునల్, సుప్రీం కోర్టు తదుపరి ఉత్తర్వులతో ప్రభావితం కాకుండా ఇప్పటి నిర్ణయాలు అమలు 2015-16 సంవత్సరానికి మాత్రమే ప్రస్తుత మార్గదర్శకాలు ప్రాజెక్టుల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనేలా వ్యవహరించరాదు చెన్నై తెలుగు గంగకు 5, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు ఇవ్వాలి కేటాయింపుల నుంచి మినహాయించి నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి బచావత్ కేటాయింపుల ప్రకారమే రెండు రాష్ట్రాలకు కేటాయింపు ఇతర రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలి తుంగభద్ర, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు న్యాయమైన వాటా వచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి రోజువారి వ్యవహారాలకు రెండు రాష్ట్రాల ఇంజినీరింగ్ చీఫ్‌లు బోర్డు ప్రతినిధితో త్రిసభ్య కమిటీ ఏర్పాటు -
కృష్ణా జలాల పంపకాలపై ఏకాభిప్రాయం
-
మీరే తేల్చుకోండి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది జలాల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంలో జోక్యానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు నిరాకరించింది. దీనిపై ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ప్రతినిధులు కూర్చొని చర్చించుకోవాలని, నీటి వినియోగంపై రాష్ట్రాల అవగాహన మేరకు తాము పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటామని సూచించింది. నీటి వినియోగం లెక్కలు సమర్పించకపోవడం, బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులపై స్పష్టత లేకపోవడం, శ్రీశైలం విషయంలో తామిచ్చిన ఆదేశాల ధిక్కరణ తదితరాల అంశాల నేపథ్యంలో.. ఇరు రాష్ట్రాల మధ్య జోక్యంపై బోర్డు చేతులెత్తేసింది. బోర్డు నిర్ణయాన్ని కాదని కేంద్రం అనుమతితో తెలం గాణ ప్రభుత్వం శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులకన్నా దిగువన కూడా విద్యుదుత్పత్తి చేస్తోంది. దీంతో ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు బోర్డు సానుకూలత వ్యక్తం చేయలేదు. శ్రీశైలం నీటి వాడకంపై నవంబర్ 15 తర్వాత చర్చిద్దామని చెప్పినా... ఇంతవరకు ఎలాంటి సమావేశం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద నీటి విడుదలపై స్పష్టత ఇవ్వాలని ఇటీవల రెండు రాష్ట్రాలు కృష్ణా బోర్డును కోరాయి. దీనిపై పార్లమెంట్ సమావేశాల వరకు సమావేశం ఏర్పాటు సాధ్యం కాదని తెలిపిన బోర్డు... తాజాగా శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాలు ఒక అవగాహనకు రావాలని, అలా వస్తేనే సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేసినట్లు తెలిసింది. రాష్ట్రాల అవగాహన మేరకు నీటి వాడకంపై పర్యవేక్షణ, నియంత్రణ చేస్తామని, అంతేతప్ప అనవసర జోక్యం చేసుకోలేమని తెలిపినట్లు బోర్డు వర్గాల సమాచారం. బోర్డు తాజా నిర్ణ యం నేపథ్యంలో... ఉమ్మడి సమావేశం నిర్వహణపై ఇరు రాష్ట్రాలు తర్జనభర్జన పడుతున్నాయి. -
తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు!
హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రం నీటిని వాడుకుంటుందని ఆరోపిస్తూ కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. వరద జలాలతోనే విద్యుత్ ఉత్పత్తి చేయాలని, మిగులు జలాలతో విద్యుత్ ఉత్పత్తి చేయకూడదని లేఖలో ఏపీ ప్రభుత్వం సూచించింది. మిగులు జలాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల భవిష్యత్ లో సమస్యలు ఎదురవుతాయని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించకపోతే ఇరు రాష్ట్రాల్లో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. -
‘కృష్ణా బోర్డు’ ముందుకు సర్కారు అభ్యంతరాలు
* నేడు హైదరాబాద్‌లో కృష్ణా రివర్ బోర్డు భేటీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కృష్ణా నది యాజమాన్య మండలి సోమవారం ఇక్కడ భేటీ కానుంది. కేంద్ర జల సంఘం కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి బోర్డు చైర్మన్ పాండ్యా, సభ్యుడు గుప్తాతో పాటు ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు హాజరుకానున్నారు. కృష్ణా నదిలో నీటి లభ్యత, దాని ఆధారంగా ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, వినియోగం తదితర అంశాలపై బోర్డు సమగ్ర వివరాలు సేకరించనుంది. దీంతో పాటు బోర్డు నియంత్రణలో ఉంచాల్సిన ప్రాజెక్టులు, బోర్డు పర్యవేక్షణలో మాత్రమే ఉంచాల్సిన ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల నుంచి వ చ్చే ప్రతిపాదనలపై చర్చించనుంది. వివాదాల పరిష్కారంలో భాగంగా మంగళవారం నుంచి బోర్డు సభ్యులు ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులను సందర్శించనున్నారు. 6న బోర్డు సభ్యులు నాగార్జునసాగర్‌ను సందర్శించేఅవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాలకోసం నీటి విడుదలపై వివాదం జరుగుతున్న విషయం విదితమే. నెల రోజుల క్రితం డెల్టాకు నీటి విడుదలలో తలెత్తిన వివాదంలో బోర్డు కల్పించుకొని నీటి విడుదల జరిగేలా చొరవ చూపింది. ప్రస్తుతం దీనిపై తమ అభ్యంతరాలు తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా జూన్‌లో డెల్టాకు నీటి విడుదలపై రాష్ట్రం అభ్యంతరం చెబుతోంది. తాగునీటి అవసరాలపేరుతో ఆంధ్రప్రదేశ్ ఆ నీటిని సాగుకోసం వాడుకుంటోందని, ఈ దృష్ట్యా డెల్టాకు నీటి విడుదలను ఆ సమయంలో కాకుండా మరో సమయానికి మార్చాలని రాష్ట్రం కోరనుంది. ఇక వీటితో పాటు కృష్ణా ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పు మేరకు కృష్ణానది నీటిలో ఉమ్మడి రాష్ట్రానికి 188 టీఎంసీల మిగులు జలాల వాటా దక్కింది. ఈ నీటిని ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టులకు వాడుకోవచ్చని తెలిపిన ట్రిబ్యునల్ ఏయే ప్రాజెక్టుకు ఎంత వాడుకోవాలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. కేవలం జూరాల ప్రాజెక్టుకు 7 టీఎంసీలు, తెలుగుగంగకు 25 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కెనాల్‌కు 4 టీఎంసీల మిగులు జలాలను వాడుకోవాలని స్పష్టంగా చెప్పిన ట్రిబ్యునల్ మిగతా ప్రాజెక్టులకు నీటి వాడకాన్ని తేల్చలేదు. దీంతో మిగులు జలాలను ఏయే ప్రాజెక్టులు.. ఎంతమేర వాడుకోవాలన్న దానిపై ఇరు రాష్ట్రాలు బోర్డును స్పష్టత కోరే అవకాశం ఉంది. -
'తెలంగాణ నేతలు విద్వేషాలను రెచ్చగొడుతున్నారు'
విజయవాడ: తెలంగాణ నేతలు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. నీటి విడుదలపై తెలంగాణ నేతలు రాద్దాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. కృష్ణా రివర్ బోర్డ్ ఆదేశాల మేరకే సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారని ఆయన వివరణ ఇచ్చారు. మంచి నీళ్లు అడిగితే నారు మడులకు నీటిని మళ్లిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని దేవినేని ఉమ అన్నారు. కృష్ణాబేసిన్‌లో న్యాయమైన వాటాకోసం తెలంగాణ నేతలు పోరాటం చేయాలని మంత్రి దేవినేని ఉమ సూచించారు. -
కృష్ణా రివర్‌బోర్డు సాగర్‌లో ఉండాల్సిందే..
నాగార్జునసాగర్ :తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేరైన నేపథ్యంలో కృష్ణా నీటి పంపకాల దగ్గరి నుంచి ఆయా ప్రాంతాల నీటి అవసరాలను గుర్తించి విడుదలను సూచిం చడం.. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతను చేపట్టేందుకు కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఏర్పడింది. అయితే ఈ బోర్డును నాగార్జునసాగర్‌లో ఏర్పాటుచేయాలని సాగునీటి శాఖ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఉంటేనే అందరికీ అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ పరిధిలో కృష్ణానది పరీవాహక ప్రాంతం అధికంగా ఉంది. ఎగువ ప్రాంతంలోనే బోర్డు ఉంటే పర్యవేక్షణ సరిగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మిగతా నదుల బోర్డులు కూడా ఆయా నదుల ఎగువ ప్రాంతాల్లో ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తుంగభద్ర రివర్ బోర్డు ఎగువ ప్రాంతమైన కర్నాటకలో ఏర్పాటు చేశారు. ఎగువప్రాంత నదీ పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలు, వచ్చే వరదలు జలాశయాలలో నిల్వ చేయాల్పిన నీటి పరిమాణం, నదుల పొడవున ఉన్న నీటిని గమనించి ఆయా జలాశయాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం అంచనా వేయలేకపోయినా.. క్షేత్రస్థాయి సిబ్బంది ఏమరపాటుగా ఉన్నా జలాశయాలకు ముప్పువాటిల్లే అవకాశాలుంటాయి. అదే మాదిరిగా అదనపు జలాల ఆధారంగా నూతనంగా ఏర్పాటయ్యే ప్రాజెక్టుల అనుమతులు తదితర అంశాలను చూడాల్సి ఉంటుంది. గతంలో కేంద్ర జలసంఘం నూతన ప్రాజెక్టులకు అనుమతులివ్వడంతోపాటు ఈఎన్సీ కార్యాలయ ఉద్యోగులు ఆయా జలాశయాల్లో ఉన్న నీటిలెవల్స్ చూసి గేట్లెత్తే విషయాలను గంటగంటకు బులిటిన్ల ద్వారా ఆయా ప్రాజెక్టుల సిబ్బందికి తెలిపేవారు. ఇక ఇప్పుడు ఏర్పాటయ్యే రివర్బోర్డులే ఆ పనులను చూస్తాయి. ఎగువన ఉంటేనే వీటి పర్యవేక్షణ చేయవచ్చు. అలాకాకుండా దిగువ ప్రాంతంలో ఎక్కడో దూరంగా ఏర్పాటుచేస్తే ఇబ్బందులు తలెత్తుతాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. శ్రీశైలం జలాశయం ఆధారంగా కొన్ని ప్రాజెక్టులు అదనపు నీటితో నింపుకునే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. పోతిరెడ్డిపాడు, ఆర్డీఎస్, సుంకేశుల డ్యాం, కేసీ కెనాల్, హంద్రీనీవా, సుజల స్రవంతి, గాలేరు-నగరీ తదితర ప్రాజెక్టులున్నాయి. వీటితోపాటు ఎస్ఎల్బీసీ, వరదకాలువ తదితర సాగునీటినందించే ప్రాజెక్టులు నిర్మాణదశలో ఉ న్నాయి. ఈ రివర్‌బోర్డును హైదరాబాద్ లేదా నాగార్జునసాగర్‌లో ఏర్పాటు చేస్తేనే అన్నింటికీ అనుకూలంగా ఉం టుంది. కాగా, రాయలసీమ ప్రాంతీ యులు సైతం కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో ఏర్పాటుకు సన్నాహాలు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని సమాచారం వచ్చినప్పటినుంచి నీళ్లు, నిధుల తరలింపుపై కన్నేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆంధ్రా ఉద్యోగులు కృష్ణా రివర్ బోర్డును విజయవాడలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులను సైతం డిప్యుటేషన్‌పై పనిచేయడానికి కొంతమందిని రివర్బోర్డులోకి పంపనున్నట్టు తెలిసింది. కొద్దిరోజుల తర్వాత పూర్తిస్థాయి సిబ్బందిని నియమించుకోవచ్చని వారి ఆలోచనగా సమాచారం. -
ఉమాభారతితో ముగిసిన చంద్రబాబు భేటీ
పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర నీటి వనరులు శాఖ మంత్రి ఉమాభారతి హామీ ఇచ్చారని టీడీపీ అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఉమాభారతితో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు అథారటీగా ప్రకటించాలన్న తమ విజ్ఞప్తిని ఉమాభారతి సానుకూలంగా స్పందించారని చెప్పారు. అలాగే కృష్ణా, తుంగభద్ర బోర్డులను ఏర్పాటుపై కూడా ఆమెతో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితిలు, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించారు. -
సీఐఎస్ఎఫ్ నీడలో నాగార్జునసాగర్
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు, విద్యుదుత్పాదన కేం ద్రాలు సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) పరిధిలోకి వెళ్లనున్నట్టు సమాచారం. సోమవారం సీఐఎస్ఎఫ్ డీఐజీ వేణుగోపాల్, అసిస్టెంట్ కమాండెంట్ శశికాంత్ తమ సిబ్బందితో ప్రాజెక్టు సందర్శించడం ఈ వాదనకు బలం చేకూర్చుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో నాగార్జునసాగర్, జూరాల, శ్రీశైలం, పులిచింత ల ప్రాజెక్టులు అంతరాష్ట్రాల పరిధిలోకి వస్తున్నాయి. వీటన్నింటిని కలిపి కృష్ణా రివర్‌బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఇది కేంద్రప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. దీనికి స్వయంప్రతిపత్తి ఉంటుంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతా వ్యవహారాలన్నీ ఎస్పీఎఫ్ (స్పెషల్ ప్రొటక్షన్ఫోర్స్) చేస్తున్నది. కృష్ణా రివర్‌బోర్డు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఎస్పీఎఫ్ స్థానే సీఐఎస్ఎఫ్కు రక్షణ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. సీఐఎస్ఎఫ్ అధికారులతో పాటు డ్యామ్‌ను సందిర్శించిన వారిలో ఎన్ఎస్పీ అధికారులు డ్యాం ఎస్ఈ విజయభాస్కర్‌రావు, ఈఈ విష్ణుప్రసాద్ ఎస్పీఎఫ్ అధికారులు ఆర్ఐ భాస్కర్, ఏఎస్ఐ రమేశ్‌లున్నారు. వారు అడిగిన సమాచారమంతా ఇచ్చారు. ఖమ్మంలోనూ సీఐఎస్ఎఫ్ బృందం పర్యటన ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలో సోమవారం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) బృందం పర్యటించింది. రెండు రాష్ట్రాలు ఏర్పడిన అనంతరం నీటి పంపిణీలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కాల్వ పరిధిలో మూడు సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ సెక్యూరిటీ బృందం సభ్యులు ముగ్గురు జిల్లాలోని నేలకొండపల్లి, బోనకల్లు, కృష్టాజిల్లాలోని విసన్నపేట పరిధిలో కాల్వలు పరిశీలించేందుకు జిల్లాకు చేరుకున్నారు. సోమవారం నేలకొండపల్లి ప్రాంతంలో పర్యటించారు. ఎడమ కాల్వ ద్వారా రెండు రాష్ట్రాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నీటి పంపిణీ విషయంలో ఘర్షణలు తలెత్తకుండా సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ పర్యవేక్షించనుంది. ఇందుకు ముందస్తుగానే ఎడమ కాల్వ రెండో జోన్ పరిధిలో మూడు సెక్యూరిటీ ఫోర్స్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం, కల్లూరు, విసన్నపేటల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. పరిశీలన అనంతరం కాల్వలు, ఆయకట్టు వివరాలతో నివేదిక రూపొందించనున్నారు. లోకేశ్