కృష్ణా రివర్‌బోర్డు సాగర్‌లో ఉండాల్సిందే..
నాగార్జునసాగర్ :తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేరైన నేపథ్యంలో కృష్ణా నీటి పంపకాల దగ్గరి నుంచి ఆయా ప్రాంతాల నీటి అవసరాలను గుర్తించి విడుదలను సూచిం చడం.. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతను చేపట్టేందుకు కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఏర్పడింది. అయితే ఈ బోర్డును నాగార్జునసాగర్‌లో ఏర్పాటుచేయాలని సాగునీటి శాఖ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఉంటేనే అందరికీ అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ పరిధిలో కృష్ణానది పరీవాహక ప్రాంతం అధికంగా ఉంది. ఎగువ ప్రాంతంలోనే బోర్డు ఉంటే పర్యవేక్షణ సరిగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మిగతా నదుల బోర్డులు కూడా ఆయా నదుల ఎగువ ప్రాంతాల్లో ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
తుంగభద్ర రివర్ బోర్డు ఎగువ ప్రాంతమైన కర్నాటకలో ఏర్పాటు చేశారు. ఎగువప్రాంత నదీ పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలు, వచ్చే వరదలు జలాశయాలలో నిల్వ చేయాల్పిన నీటి పరిమాణం, నదుల పొడవున ఉన్న నీటిని గమనించి ఆయా జలాశయాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం అంచనా వేయలేకపోయినా.. క్షేత్రస్థాయి సిబ్బంది ఏమరపాటుగా ఉన్నా జలాశయాలకు ముప్పువాటిల్లే అవకాశాలుంటాయి. అదే మాదిరిగా అదనపు జలాల ఆధారంగా నూతనంగా ఏర్పాటయ్యే ప్రాజెక్టుల అనుమతులు తదితర అంశాలను చూడాల్సి ఉంటుంది. గతంలో కేంద్ర జలసంఘం నూతన ప్రాజెక్టులకు అనుమతులివ్వడంతోపాటు ఈఎన్‌సీ కార్యాలయ ఉద్యోగులు ఆయా జలాశయాల్లో ఉన్న నీటిలెవల్స్ చూసి గేట్లెత్తే విషయాలను గంటగంటకు బులిటిన్‌ల ద్వారా ఆయా ప్రాజెక్టుల సిబ్బందికి తెలిపేవారు. ఇక ఇప్పుడు ఏర్పాటయ్యే రివర్‌బోర్డులే ఆ పనులను చూస్తాయి.
ఎగువన ఉంటేనే వీటి పర్యవేక్షణ చేయవచ్చు. అలాకాకుండా దిగువ ప్రాంతంలో ఎక్కడో దూరంగా ఏర్పాటుచేస్తే ఇబ్బందులు తలెత్తుతాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. శ్రీశైలం జలాశయం ఆధారంగా కొన్ని ప్రాజెక్టులు అదనపు నీటితో నింపుకునే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. పోతిరెడ్డిపాడు, ఆర్డీఎస్, సుంకేశుల డ్యాం, కేసీ కెనాల్, హంద్రీనీవా, సుజల స్రవంతి, గాలేరు-నగరీ తదితర ప్రాజెక్టులున్నాయి. వీటితోపాటు ఎస్‌ఎల్‌బీసీ, వరదకాలువ తదితర సాగునీటినందించే ప్రాజెక్టులు నిర్మాణదశలో ఉ న్నాయి. ఈ రివర్‌బోర్డును హైదరాబాద్ లేదా నాగార్జునసాగర్‌లో ఏర్పాటు చేస్తేనే అన్నింటికీ అనుకూలంగా ఉం టుంది. కాగా, రాయలసీమ ప్రాంతీ యులు సైతం కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడలో ఏర్పాటుకు సన్నాహాలు?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని సమాచారం వచ్చినప్పటినుంచి నీళ్లు, నిధుల తరలింపుపై కన్నేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆంధ్రా ఉద్యోగులు కృష్ణా రివర్ బోర్డును విజయవాడలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులను సైతం డిప్యుటేషన్‌పై పనిచేయడానికి కొంతమందిని రివర్‌బోర్డులోకి పంపనున్నట్టు తెలిసింది. కొద్దిరోజుల తర్వాత పూర్తిస్థాయి సిబ్బందిని నియమించుకోవచ్చని వారి ఆలోచనగా సమాచారం.