సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/ధవళేశ్వరం/పోలవరం రూరల్/సాక్షి, అమలాపురం: నాగార్జునసాగర్‌లోకి కృష్ణా వరద ఉధృతి మరింత పెరిగింది. ప్రాజెక్టులో గురువారం .6 గంటలకు 3,69,866 క్యూసెక్కుల వరద చేరుతుండడంతో నీటినిల్వ 537.4 అడుగుల్లో 182.95 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా.. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 129.1 టీఎంసీలు అవసరం.
ఎగువ నుంచి వరద ఉధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మరో మూడు, నాలుగు రోజుల్లో సాగర్ నిండుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. అటు జూరాల.. ఇటు సుంకేశుల బ్యారేజ్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,64,019 క్యూసెక్కులు చేరుతుండంతో పదిగేట్లు 18 అడుగుల మేర ఎత్తి 4,31,370 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం నుంచి 24,917, ఎడమ కేంద్రం నుంచి 35,315 వెరసి 4,91,602 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు.
దీంతో నాగార్జునసాగర్‌లోకి చేరుతున్న వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. మరోవైపు.. మహారాష్ట్ర, కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టిలోకి వరద ఉధృతి మరింత పెరిగింది.
» ఆల్మట్టిలోకి 3.41 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
» నారాయణపూర్ డ్యాంలోకి 3.35 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3.25 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
» అలాగే, జూరాల ప్రాజెక్టులోకి 3.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3.03 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
» తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. ఈ డ్యామ్‌లోకి 1,98,109 క్యూసెక్కులు చేరుతుండగా 1,79,973 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
» మంత్రాలయం వద్ద తుంగభద్ర నీటి మట్టం 311 మీటర్ల(సముద్ర మట్టానికి)కు చేరుకుంది. దీంతో మంత్రాలయం వద్ద అధికారులు ప్రమాద హెచ్చరికను జారీచేసి నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
» ఈ నేపథ్యంలో.. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింత పెరగనుంది.
గోదావరిలో తగ్గుతున్న వరద..
ఇక ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో వరద ప్రవాహం క్రమేణ తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి గురువారం రాత్రి 7 గంటలకు 10,39,697 క్యూసెక్కులు చేరుతుండగా గోదావరి డెల్టాకు అధికారులు 8,800 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 10,30,897 క్యూసెక్కులను 175 గేట్లను ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 12.10 అడుగులుగా ఉంది.
ఎగువ నుంచి భద్రాచలం వద్దకు చేరుతున్న వరద 8.41 లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో అక్కడ నీటిమట్టం 40.30 అడుగులకు తగ్గింది. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. ఇక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గడిచిన 24 గంటలుగా వరద నిలకడగా ఉంది. గ్రామాల్లో ముంపు కొనసాగుతోంది. దీంతో అన్ని వరా>్గల వారు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment