విద్యుదుత్పత్తి ఆపని తెలంగాణ | Telangana Will Not Stop Power Generation In Srisailam | Sakshi
Sakshi News home page

Krishna Water Dispute: విద్యుదుత్పత్తి ఆపని తెలంగాణ

Published Sat, Jul 3 2021 3:57 AM | Last Updated on Sat, Jul 3 2021 8:18 AM

Telangana Will Not Stop Power Generation In Srisailam - Sakshi

సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పత్తిని తక్షణమే నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా తెలంగాణ సర్కార్‌ వైఖరిలో మార్పు కనిపించడం లేదు. ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి, ఒప్పందాలు, జాతీయ జలవిధానాన్ని బుట్టదాఖలు చేస్తూ భారీ పోలీసు బందోబస్తు మధ్య యథేచ్ఛగా విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. ఈ మేరకు ప్రాజెక్టులను ఖాళీ చేస్తూ.. వృథాగా దిగువకు నీటిని వదిలేస్తోంది. ఏపీకి నష్టం జరుగుతోందని ఉన్నతాధికారులు తెలంగాణ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో భారీగా మోహరించిన ఏపీ పోలీసు బలగాలు వెనుదిరిగాయి. తెలంగాణ అనాలోచిత ఏకపక్ష వైఖరి వల్ల రానున్న రోజుల్లో ఆ రాష్ట్ర ప్రజలు తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని నీటిపారుదల రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శుక్రవారం శ్రీశైలంలోకి ఎగువ నుంచి 13,542 క్యూసెక్కులు చేరుతుండగా.. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులను దిగువకు తెలంగాణ సర్కార్‌ వదిలేస్తోంది. దీని వల్ల శ్రీశైలం నీటిమట్టం 820.64 అడుగులకు తగ్గిపోయింది. అలాగే నాగార్జునసాగర్‌లోకి వస్తున్న నీటిని వచ్చినట్టుగా వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది. పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత పెంచింది. 9,100 క్యూసెక్కులను వాడుకుంటూ 35 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది. శ్రీశైలం, సాగర్‌లను విద్యుదుత్పత్తి కోసం ఖాళీ చేయడం వల్ల తెలంగాణలో ఆ ప్రాజెక్టులపై ఆధారపడిన ఆయకట్టు రైతులకు నీళ్లందే అవకాశం ఉండదు. హైదరాబాద్‌ తాగునీటికీ ఇబ్బందులు తప్పవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ తెలంగాణ సర్కార్‌కు తెలియనివి కాదని.. ఏపీ హక్కులకు విఘాతం కల్పించాలనే లక్ష్యంతోనే ఇలా చేస్తోందని అంటున్నారు. కాగా, శుక్రవారం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఇరు రాష్ట్రాల సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంది.

ప్రకాశం బ్యారేజీలో గరిష్ట స్థాయికి నీటి నిల్వ
శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 8,424 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఖరీఫ్‌ పంటల సాగుకు కృష్ణా డెల్టా రైతులు సంసిద్ధంగా లేకపోవడం.. బ్యారేజీలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో.. చేసేది లేక ఆరు గేట్లు ఎత్తి 8,424 క్యూసెక్కులను అధికారులు వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నారు.  

చదవండి: (జల జగడంపై కదిలిన కృష్ణా బోర్డు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement