Srisailam Power Project
-
కేఆర్ఎంబీకి ఏపీ ఈఎన్సీ లేఖ
-
కేఆర్ఎంబీకి ఏపీ ఈఎన్సీ లేఖ
సాక్షి, విజయవాడ: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం కుడిగట్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని కేఆర్ఎంబీకి ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి లేఖ రాశారు. మూడు, నాలుగు రోజుల్లో శ్రీశైలం జలాశయానికి మిగులు జలాలు రానున్నందున ఏపీ ప్రభుత్వం అనుమతి కోరింది. -
యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్
-
యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: తెలంగాణ దెబ్బకు జలాశయాలు ఖాళీ అవుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయాలను ఖాళీ చేస్తోంది. శ్రీశైలంలో కనీస నీటిమట్టానికి దిగువన నీటి నిల్వ ఉన్నప్పటికీ జూన్ 1 నుంచే తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తూ.. ప్రాజెక్టును ఖాళీ చేస్తూ.. తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు పదే పదే ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలంటూ కృష్ణా బోర్డు జారీ చేసిన ఆదేశాలను తుంగలో తొక్కి మూడు ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు న్యాయం చేయాలని ఈ వివాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ల దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం శ్రీశైలంలోకి 6,287 క్యూసెక్కులు వస్తుండగా.. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 21,189 క్యూసెక్కులను తెలంగాణ దిగువకు వదిలేస్తోంది. దీంతో శ్రీశైలంలో నీటిమట్టం 819.49 అడుగులకు పడిపోయింది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వ 40.45 టీఎంసీలకు తగ్గింది. అలాగే నాగార్జునసాగర్‌లోకి వచ్చిన నీటిని వస్తున్నట్టుగా వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేయడంతో నీటిమట్టం 533.69 అడుగులకు పడిపోయింది. నీటి నిల్వ 175.45 టీఎంసీలకు తగ్గిపోయింది. పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు 9,000 క్యూసెక్కులు వదిలేస్తోంది. ప్రకాశం బ్యారేజీలో పూర్తి స్థాయిలో 3.07 టీఎంసీలు నిల్వ ఉండటంతో.. ఆరు గేట్లు ఎత్తి 8,340 క్యూసెక్కులు సముద్రంలోకి వృథాగా విడుదల చేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. -
విద్యుదుత్పత్తి ఆపని తెలంగాణ
సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పత్తిని తక్షణమే నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా తెలంగాణ సర్కార్ వైఖరిలో మార్పు కనిపించడం లేదు. ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి, ఒప్పందాలు, జాతీయ జలవిధానాన్ని బుట్టదాఖలు చేస్తూ భారీ పోలీసు బందోబస్తు మధ్య యథేచ్ఛగా విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. ఈ మేరకు ప్రాజెక్టులను ఖాళీ చేస్తూ.. వృథాగా దిగువకు నీటిని వదిలేస్తోంది. ఏపీకి నష్టం జరుగుతోందని ఉన్నతాధికారులు తెలంగాణ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో భారీగా మోహరించిన ఏపీ పోలీసు బలగాలు వెనుదిరిగాయి. తెలంగాణ అనాలోచిత ఏకపక్ష వైఖరి వల్ల రానున్న రోజుల్లో ఆ రాష్ట్ర ప్రజలు తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని నీటిపారుదల రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం శ్రీశైలంలోకి ఎగువ నుంచి 13,542 క్యూసెక్కులు చేరుతుండగా.. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులను దిగువకు తెలంగాణ సర్కార్ వదిలేస్తోంది. దీని వల్ల శ్రీశైలం నీటిమట్టం 820.64 అడుగులకు తగ్గిపోయింది. అలాగే నాగార్జునసాగర్‌లోకి వస్తున్న నీటిని వచ్చినట్టుగా వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది. పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత పెంచింది. 9,100 క్యూసెక్కులను వాడుకుంటూ 35 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది. శ్రీశైలం, సాగర్లను విద్యుదుత్పత్తి కోసం ఖాళీ చేయడం వల్ల తెలంగాణలో ఆ ప్రాజెక్టులపై ఆధారపడిన ఆయకట్టు రైతులకు నీళ్లందే అవకాశం ఉండదు. హైదరాబాద్ తాగునీటికీ ఇబ్బందులు తప్పవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ తెలంగాణ సర్కార్‌కు తెలియనివి కాదని.. ఏపీ హక్కులకు విఘాతం కల్పించాలనే లక్ష్యంతోనే ఇలా చేస్తోందని అంటున్నారు. కాగా, శుక్రవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఇరు రాష్ట్రాల సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రకాశం బ్యారేజీలో గరిష్ట స్థాయికి నీటి నిల్వ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 8,424 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఖరీఫ్ పంటల సాగుకు కృష్ణా డెల్టా రైతులు సంసిద్ధంగా లేకపోవడం.. బ్యారేజీలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో.. చేసేది లేక ఆరు గేట్లు ఎత్తి 8,424 క్యూసెక్కులను అధికారులు వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. చదవండి: (జల జగడంపై కదిలిన కృష్ణా బోర్డు) -
‘శ్రీశైలం’ బాధితులకు రూ.కోటి సాయం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలంలోని తెలంగాణ ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డీఈ కుటుంబానికి రూ.50 లక్షలు, మిగతా ఉద్యోగులకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. దీనికి అదనంగా ఒక్కో కుటుంబానికి రూ.75 లక్షల చొప్పున జెన్కో సాయం అందిస్తుందని తెలిపారు. దీంతో డీఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, ఇతర ఉద్యోగుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందుతుందని ప్రభాకర్‌రావు వెల్లడించారు. అలాగే మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి విద్యుత్ సంస్థల్లో ఉద్యోగమివ్వాలని నిర్ణయించామని తెలిపారు. విద్యార్హతలను బట్టి డీఈ, ఏఈల కుటుంబాలకు ఏఈ/పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఇతరులకు జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇతర శాఖాపరమైన సాయం కూడా త్వరితగతిన అందించనున్నట్లు వెల్లడించారు. ప్రభాకర్‌రావు అధ్యక్షతన శనివారం విద్యుత్ సౌధలో జెన్కో బోర్డు సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా పాల్గొన్నారు. శ్రీశైలం ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ‘ప్రమాదంలో మన తోటి ఉద్యోగులు మరణించడం అత్యంత దురదృష్టకరమైన విషయం. మరణించిన వారిది గొప్ప సాహసం, త్యాగం. వారిని మళ్లీ తీసుకురాలేం. కానీ మానవ మాత్రులుగా సాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ ఘట నను ప్రత్యేక అంశంగా పరిగణించి ప్రభుత్వ సాయంతో పాటు జెన్కో తరఫున అదనపు సాయం అందించాలని భావిస్తున్నాం’అని ప్రభాకర్ రావు సమావేశంలో ప్రకటించగా, బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్యుదుత్పత్తి పునఃప్రారంభానికి కమిటీ.. ప్రమాదానికి గురైన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో తిరిగి ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభాకర్‌రావు నియమించారు. జెన్కో హైడల్, సివిల్ డైరెక్టర్లు, శ్రీశైలం ప్రాజెక్టు సీఈలు ఇందులో సభ్యులుగా ఉంటారు. శ్రీశైలం ప్లాంటులో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడంతో పాటు, అక్కడికక్కడే అవసరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. వీలైనంత త్వరగా ప్లాంటును పునరుద్ధరించే లక్ష్యంగా కమిటీ పనిచేస్తుంది. -
శ్రీశైలం అగ్ని ప్రమాదం: పరిహారం భారీగా పెంపు
సాక్షి, నాగర్ కర్నూల్ : శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఎక్స్ గ్రేషియాకు అదనంగా రూ.75 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్ కో- ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన డిఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, మిగతా ఉద్యోగుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందుతుందని ఆయన వెల్లడించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇతర శాఖాపరమైన సహాయం కూడా త్వరితగతిన అందించనున్నట్లు వెల్లడించారు. (శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ఉత్కంఠ!) తెలంగాణ జెన్ కో బోర్డు సమావేశం సీఎండీ ప్రభాకర్ రావు అధ్యక్షతన విద్యుత్ సౌధలో శనివారం జరిగింది. శ్రీశైలం ప్రమాదంపై బోర్డు సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మరణించిన వారికి బోర్డు సభ్యులు సంతాపం తెలిపారు. సమావేశంలో సీఎండీ పాటు డైరెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీశైలం ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. కుటుంబ పెద్దను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. (శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో మళ్లీ పేలుడు?) గతంలో ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి సహాయం అందింది, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయంతో సంబంధం లేకుండా శ్రీశైలం ప్రమాదాన్ని ప్రత్యేక పరిస్థితిగా పరిగణలోకి తీసుకుని, ప్రత్యేక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చేయగలిగినంత సాయం చేయాల్సిందిగా సీఎండీని కోరారు. ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాలను పరిగణలోకి తీసుకుని, మరణించిన వారి త్యాగాన్ని, సాహసాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన సహాయంపై బోర్డు విస్తృతంగా చర్చించింది. శ్రీశైలం ప్రమాదాన్ని ప్రత్యేకమైన అంశంగా పరిగణించి సహాయం అందించాలని బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయించింది. ‘‘ప్రమాదంలో మన తోటి ఉద్యోగులు మరణించడం అందరినీ కలిచివేస్తున్నది. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. మరణించిన వారిది గొప్ప సాహసం, త్యాగం. మరణించిన వారిని మళ్లీ తీసుకురాలేకపోవచ్చు. కానీ మానవ మాత్రులుగా చేయాల్సినంత సహాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా కాకుండా, ప్రత్యేక అంశంగా పరిగణించి సహాయం అందించాలి. ప్రభుత్వం ప్రకటించిన సహాయానికి అదనంగా తెలంగాణ జెన్ కో పక్షాన అదనపు సహాయం అందించాలని భావిస్తున్నాం’’ అని సీఎండీ ప్రభాకర్ రావు సమావేశంలో ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతిపాదనలు చేయగా, వాటిని బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. అవి 1. ప్రమాదంలో మరణించిన డిఇకి రూ.50 లక్షలు, మిగతా ఉద్యోగులకు రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. దీనికి అదనంగా తెలంగాణ జెన్ కో ఒక్కొక్క కుటుంబానికి రూ.75లక్షల చొప్పున సహాయం అందిస్తుంది. దీని వల్ల డిఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, ఇతర ఉద్యోగుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున సహాయం అందుతుంది. 2. మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి విద్యుత్ సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పించబడుతుంది. విద్యార్హతలను బట్టి డిఈ, ఎఈల కుటుంబాలకు ఎఈ/పీఓ ఉద్యోగాలు, ఇతరులకు జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. 3. ప్రమాదానికి గురైన శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో తిరిగి ఉత్పత్తి ప్రారంభించేందుకు అసవరమైన చర్యలు తీసుకోవడానికి ముగ్గురు సభ్యుల కమిటీని సీఎండీప్రభాకర్ రావు నియమించారు. జెన్ కో హైడల్, సివిల్ డైరెక్టర్లు, శ్రీశైలం ప్రాజెక్టు సిఇలు ఇందులో సభ్యులుగా ఉంటారు. శ్రీశైలం ప్లాంటులో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడంతో పాటు, అక్కడికక్కడే అవసరమైన నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. వీలైనంత త్వరగా ప్లాంటును పునరుద్ధరించడం లక్ష్యంగా కమిటీ పనిచేస్తుంది. -
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ఉత్కంఠ!
సమయం: బుధవారం సాయంత్రం 5:30 గంటలు ప్రదేశం: నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం (గత నెల 20న విద్యుత్ ప్రమాదం జరిగిన ప్రాంతం). సందర్భం: విద్యుత్ కేంద్రం బయట వర్షం. కేంద్రం ప్రవేశద్వారం వద్ద ఒక్కసారిగా ఎగిసిన మంటలు.. భయంతో అధికారులు, ఉద్యోగుల పరుగులు. సాక్షి, నాగర్‌కర్నూల్: అసలేం జరుగుతుందో తెలి యదు. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో క్షణాల వ్యవధిలోనే విద్యుత్ నిలిచిపోయింది. విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు. అప్పటికే బయట కురుస్తున్న వర్షానికి తడిసి ముద్దయ్యారు. వెంటనే రంగంలో దిగిన అగ్నిమాపక వాహనం మంటల్ని ఆర్పింది. సుమారు గంటసేపు తీవ్ర ఉత్కంఠతో ఉన్న ఉద్యోగులు, అధికారులకు అదంతా మాక్‌డ్రిల్ అంటూ ఉన్నతాధికారుల నుంచి అందిన వార్త ప్రాణం పోసినట్టుయింది. గత నెల 20న అగ్నిప్రమాదం జరిగిన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్లో పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. వంద మందికిపైగా ఉద్యోగులు, అధికారులు, కార్మికులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో విద్యుత్ కేంద్రం ప్రవేశద్వారం నుంచి నీళ్ల మోటార్ల లోడుతో వెళ్తున్న డీసీఎం.. నేల మీద ఉన్న విద్యుత్ తీగలపై నుంచి వెళ్లింది. దీంతో షార్ట్‌సర్క్యూట్ అయి ఒక్కసారిగా పెద్ద శబ్దాలతో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే విద్యుత్ నిలిచిపోయింది. ఆ సమయంలో పునరుద్ధరణ పనులు చేస్తున్న సిబ్బంది అంతా అయోమయానికి గురై బయటికి పరుగుతీశారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్టెన్షన్)తో మంటలను ఆర్పారు. విద్యుత్ కేంద్రంలో రెండోసారి జరిగిన ప్రమాదం వార్త వెంటనే సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ ఉలికిపడ్డారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అనేక చర్చలు మొదలయ్యాయి. ఇలా సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు (గంట పాటు) ఉత్కంఠ నెలకొంది. తర్వాత ఇది మాక్‌డ్రిల్ అని తేలడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. మాక్‌డ్రిల్‌పై భిన్నాభిప్రాయాలు అధికారులు నిర్వహించిన ఈ మాక్‌డ్రిల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 20న అగ్నిప్రమాదం జరిగిన తర్వాత అందులో పనిచేస్తున్న తమకు ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని అందులో పనిచేసే ఓ ఉద్యోగి తెలిపారు. 15 రోజుల క్రితం జరిగిన ప్రమాదం నుంచి ఇంకా తేరుకోని తమను మాక్‌డ్రిల్ పేరిట భయపెట్టే యత్నం చేయడం ఆవేదన కలిగించిందన్నారు. మరోవైపు బయట వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ కేంద్రంలో మాక్‌డ్రిల్ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా 15రోజుల నుంచి ఆ కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో దోమలపెంట సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ కేంద్రానికి కేబుళ్లు వేసిన అధికారులు వాటి ద్వారా లైట్లు, మోటార్లు నడిపిస్తున్నారు. మాక్‌డ్రిల్‌తో ఆ కేబుళ్లు కాలిపోయాయి. తర్వాత రంగంలో దిగిన అధికారులు కేబుళ్లు మార్చి విద్యుదుత్పత్తిని పునరుద్ధరించారు. (ఇక్కడ ప్రమాదం జరిగింది.. నేను చనిపోవచ్చు.. ) ప్రమాదం కాదు.. మాక్‌డ్రిల్ శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సిబ్బంది అప్రమత్తతను పరిశీలించేందుకే రహస్యంగా మాక్‌డ్రిల్ నిర్వహించాం. ఈ కేంద్రాన్ని పరిశీలించేందుకు విశ్రాంత అధికారి అజయ్‌తో కలిసి వెళ్లా. ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో తెలిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం. – ప్రభాకర్‌రావు, సీఎండీ, టీఎస్ ట్రాన్ ్సకో, జెన్ కో -
ఈ ప్రమాదం గుణపాఠం కావాలి
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 9మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరిలోనూ విషాదం నింపింది. సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు అందులో చిక్కుకున్నవారు చివరి క్షణాలు ఎలా గడిపారో, ఏం ఆలోచించారో తెలిసే అవకాశం లేదు. కానీ ఈ విషాద ఘటనలో సిబ్బంది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ తమ శక్తికొద్దీ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసిన వైనం వెల్లడైంది. అలాగే తప్పించుకోవడానికి అవకాశం వుండి కూడా సహచర ఉద్యోగులను సురక్షితంగా బయటకు పంపి, చివరకు తమ ప్రాణాలు బలిపెట్టినవారున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ సుందర్ తన జీవన సహచరికి ఫోన్ చేసి తాము ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడం కంటతడి పెట్టిస్తుంది. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రక్షించడానికి చివరి క్షణం వరకూ ఆ సిబ్బంది కృషి చేసిన తీరు ప్రశంసనీయమైనది. ఒకపక్క పొగలు కమ్ముకొస్తున్నా వారు మంటలు మరింత విస్తరించకుండా చూడటానికే ప్రాధాన్య మిచ్చారు. ఆ కృషి వల్లనే నష్టం కనిష్ట స్థాయికి పరిమితమైంది. విద్యుత్ పంపిణీకి ఎలాంటి ఇబ్బం దులూ ఎదురుకాలేదు. ఒక ప్యానెల్ బోర్డులో రాజుకున్న మంటలు క్షణాల్లో విస్తరించి ఈ పెను ప్రమాదానికి కారణమయ్యాయని చెబుతున్నారు. ఆధునిక జీవనం సమస్తం విద్యుత్‌తో ముడిపడి వుంటుంది. కనుక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు రాత్రింబగళ్లు నిరంతరాయంగా పనిచేయక తప్పదు. అందరికీ నిరంతరాయంగా 24 గంటల విద్యుత్‌ను అందిస్తామని తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. విద్యుత్ సిబ్బంది అంకితభావంతో పనిచేయబట్టే ఆ లక్ష్యాన్ని తెలం గాణ చేరుకోగలిగింది. తాజా ఉదంతంలో సైతం సిబ్బంది అదే అంకితభావాన్ని ప్రదర్శించారు. కొన్ని ఉద్యోగ బాధ్యతలు అడుగడుగునా ప్రమాదాలతో ముడిపడి వుంటాయి. సైన్యం, పోలీసు విభాగం, వైద్య వృత్తి తదితరాలు అలాంటివి. విద్యుత్ ఉత్పాదన, పంపిణీ తదితర సేవల్లో నిమగ్న మయ్యే సిబ్బంది బాధ్యతలు కూడా అలాంటివే. చిన్న పొరపాటు కూడా పెను ప్రమాదానికి దారి తీస్తుంది. ప్రాణానికి ముప్పు ఏర్పడుతుంది. సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రామాణికమైన పరికరాలు వారికి అందుబాటులో లేకపోయినా, మండే స్వభావం వున్నవాటిని ఎప్పటికప్పుడు గమ నిస్తూ తొలగించకపోయినా సమస్యలేర్పడతాయి. అలాగే అత్యవసర సమయాల్లో ఎలాంటి జాగ్ర త్తలు తీసుకోవాలన్న అంశంలో కూడా అక్కడుండే సిబ్బందికి సంపూర్ణమైన అవగాహన కలిగించాలి. ప్రమాదం తలెత్తినప్పుడు రికార్డయిన మాటల్నిబట్టి సిబ్బందికి ఏం జరిగిందన్న విషయంలో తగిన అవగాహన వున్నదని తెలుస్తూనే వుంది. అయితే దాన్ని ఎదుర్కొనడానికి అవసరమైన అగ్నిమాపక పరికరాలు వారికి అందుబాటులో వున్నాయా అన్నది చూడాలి. అలాగే విద్యుదుత్పాదన ప్రక్రియలో ఉపయోగిస్తున్న యంత్రాలు మెరుగైన స్థితిలోనే వున్నాయా అన్నది తేల్చాలి. ఇప్పుడు ప్రారంభమైన సీఐడీ దర్యాప్తులో ఇలాంటి అంశాలన్నీ వెల్లడవుతాయని ఆశించాలి. 2009 అక్టోబర్‌లో కుడి గట్టు, ఎడమ గట్టు విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు రెండింటినీ వరద జలాలు ముంచెత్తాయి. పర్యవసా నంగా విద్యుత్ ఉత్పాదన నిలిపేయాల్సివచ్చింది. అంతకు చాలాముందు 1998లో సైతం ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. నీటిని బయటకుతోడటానికి పది రోజులు పట్టగా ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు మరో రెండు నెలలకుగానీ పూర్తి కాలేదు. వరద జలాలు ముంచెత్తాక అక్కడున్న భద్రతా ప్రమాణా లను మరింతగా పెంచడం, యంత్రాలను మార్చడంవంటివి చేయకపోతే ముప్పుపొంచి ఉంటుంది. ఆ విషయంలో గతంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తేల్చవలసివుంది. సిబ్బందికి కేవలం పోర్ట బుల్ అగ్నిమాపక యంత్రాలు మాత్రమే అందుబాటులో వున్నాయని నిపుణులు అంటున్నారు. యూనిట్లో మంటలు చెలరేగితే అవి ప్రతి 30 సెకన్లకూ రెట్టింపవుతాయని... వీటిపై పూర్తి స్థాయి అవగాహన సిబ్బందిలో ఉంటే వెంటనే వెనక్కివచ్చే ప్రయత్నం చేసేవారని నిపుణులు అంటున్నారు. సిబ్బందికి భద్రత విషయంలో ఎప్పటికప్పుడు తగిన శిక్షణనివ్వడం ముఖ్యం. గత నెల 1న తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఒక బాయి లర్ పేలి 13మంది మరణించారు. అంతక్రితం కూడా అదే యూనిట్లో పేలుడు సంభవించి అయి దుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ప్రమాదాలకూ కారణం యూనిట్లో పనిచేసే సిబ్బం దికి భద్రతపై తగిన అవగాహన లేకపోవడమేనని అక్కడి కార్మిక సంఘాలు ఆరోపించాయి. పై స్థాయి సిబ్బందిలో అత్యధికులు హిందీ, ఇంగ్లిష్ మాట్లాడేవారు కావడంతో తమిళం మాత్రమే తెలి సిన కార్మికులకు వారు చెప్పినవి సరిగా అవగాహన కాలేదని, ఎలాంటి జాగ్రత్తలు అవసరమో సరిగా తెలియలేదన్నది ఆ సంఘాలు చెబుతున్న మాట. యూనిట్లో వినియోగిస్తున్న యంత్రాలు కాలం చెల్లినవని, వాటిని మార్చడంలో ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని కూడా కార్మిక సంఘాలు తెలిపాయి. మొన్న మే నెలలో విశాఖలోని ఎల్జీ పాలిమార్స్ కర్మాగారంలో కూడా భద్రతా ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లే పలువురు ప్రాణాలు కోల్పో యారు. లాక్డౌన్ విధించే సమయానికి ఫ్యాక్టరీ ఆవరణలోని స్టోరేజీ ట్యాంకులో 1,800 టన్నుల స్టెరీన్ నిల్వలు మిగిలిపోగా దాన్ని శుభ్రం చేసే క్రమంలో గ్యాస్ లీకై ఆ నగరాన్ని కాటేసింది. ఇలాంటి విషాద ఉదంతాలు అందరికీ గుణపాఠం కావాలి. తాజా ఉదంతంలో సీఐడీ దర్యాప్తుతోపాటు నిపు ణులతో కూడా సమగ్రంగా అధ్యయనం చేయించి ఈ మాదిరి ఉదంతాలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు అమలు చేయాలన్న విషయంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి కేంద్రీ కరించాలి. ప్రమాద సమయంలో అంకితభావంతో పనిచేసి తమ ప్రాణాలు బలిపెట్టిన సిబ్బంది కుటుంబాలకు అన్నివిధాలా అండగా నిలవాలి. -
4 యూనిట్లలో భారీ నష్టం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాద ఘటనలో జరిగిన ఆస్తి నష్టంపై ప్రాథమిక అంచనాకు వచ్చేందుకు ఒక ట్రెండు రోజులుపట్టే అవకాశముందని విద్యుత్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. జల విద్యుత్ కేంద్రంలో 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంగల ఆరు యూనిట్లు ఉండగా, నాలుగు యూనిట్లలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మొదటి, రెండో యూనిట్లో ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో నష్టం కూడా స్వల్పం గానే ఉండే అవకాశముందని భావిస్తున్నారు. స్వల్ప మరమ్మతులతో ఒకటి, రెండో యూని ట్లను వీలైనంత త్వరగా పునరుద్ధరించి తిరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశముందని జెన్కో వర్గాలు ‘సాక్షి’కి వెల్లడించాయి. ఆరో యూనిట్ నుంచి మంటలు.. ఆరో యూనిట్‌లోని ఎక్సైలేషన్ ప్యానెల్లో అగ్ని ప్రమాదం తలెత్తి ఐదు, నాలుగు, మూడో యూనిట్ వరకు విస్తరించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రమాదం జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఘటనాస్థలికి అధి కారులు చేరుకోలేకపోతున్నారు. పొగతోపాటు తీవ్రమైన వేడి ఉండటంతో పూర్తిస్థాయిలో ప్రమాద నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు. ప్యానెళ్లు, కేబుళ్లు, స్టార్టర్లు ఇతర సామగ్రి దెబ్బతినడంతో నష్టం ఏ స్థాయిలో జరిగిందో తెలుసుకొనేందుకు కొంత సమయం పడుతుందని భావిస్తున్నారు. సోమవారం నాటికి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబున్నారు. నష్టం అంచనాకు టెక్నికల్ కమిటీ... శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఈ నెల 20న జరిగిన అగ్నిప్రమాద ఘటనపై విచారణకు సంబంధించి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేస్తూ జెన్కో–ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ ఇంజనీర్లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జి. రఘుమారెడ్డి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీకి జెన్కో సీఈ పి.రత్నాకర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ట్రాన్స్‌కో జెఎండీ సి. శ్రీనివాస్‌రావు, ట్రాన్స్‌కో డైరెక్టర్ టి. జగత్‌రెడ్డి, జెన్కో డైరక్టర్ ఎం.సచ్చిదానందం కమిటీ సభ్యులుగా ఉంటారు. జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ప్రతిపాదనలతో కూడిన నివేదికను 15 రోజుల్లోగా కమిటీ సమర్పించాల్సి ఉంటుంది. బాధిత కుటుంబాలకు జెన్కో తరఫునా సాయం: సీఎండీ శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు తాను ఘటనాస్థలికి చేరుకున్నా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ట్రాన్స్‌కో–జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ‘ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాం. ప్లాంటులో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటి, పొగ అలుముకొని ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే యూనిట్ ఆటోమెటిక్‌గా ట్రిప్ కావాల్సి ఉన్నా ఎందుకు జరగలేదనే దానిపై విచారణ కమిటీ వేశాం. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఎమర్జెన్సీ వెంటిలేటర్ కూడా తెరుచుకోకపోవడంతో వెంటిలేషన్ నిలిచిపోయింది. నెల రోజులుగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా రోజుకు 128 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉందని కొంత మేర తగ్గించాం. గతంలోనూ ఎన్టీపీసీతోపాటు నైవేలి లిగ్నైట్ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో జరిగిన ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీశైలం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. జెన్కో తరఫున కూడా బాధిత కుటుంబాలకు సాయం అందజేస్తాం. ఒకటి, రెండు యూనిట్లలో 15 రోజుల్లోగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఇంజనీర్లు కృషి చేస్తున్నారు’ అని సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను సీఎండీ స్వయంగా పరామర్శించి బాధిత కుటుంబాల్లో భరోసా నింపాలని నిర్ణయించారు. మన పని అయిపోయింది మోహన్‌తో సుందర్ చివరి సంభాషణ సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి ఏఈలు సుందర్ నాయక్, మోహన్ల చివరి సంభాషణ వెలుగులోకి వచ్చింది. అలాగే చనిపోయే ముందు మోహన్ తన సెల్ఫోన్లో తీసిన ప్రమాద దృశ్యాల వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. భర్త ఫోన్‌కు చార్జింగ్ పెట్టిన మోహన్ భార్య ఆ వీడియోలోని దృశ్యాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సంభాషణ ఇదీ... సుందర్: ఇక కష్టం! మన పని అయిపోయింది. ఆశలు వదులుకో... మోహన్: నై బై.. ఆశగా ఉండాలె. కొద్దిసేపు ఆలోచించుకొని పోదాం. సుందర్: ఇక మనం బతకం. పొగ మొత్తం అలుముకుంది. నేను చనిపోవచ్చు.. పిల్లలు జాగ్రత్త: భార్యతో సుందర్ చివరి మాటలు చివ్వెంల (సూర్యాపేట): ఏఈ సుందర్ నాయక్ తన భార్యతో జరిపిన ఫోన్ సంభాషణ కూడా వైరల్‌గా మారింది. ‘ఇక్కడ ప్రమాదం జరిగింది.. నేను చనిపోవచ్చు.. పిల్లలు జాగ్రత్త. ఇక్కడ మంటలు, పొగ బాగా వస్తున్నాయి. నేను మాట్లాడే పరిస్థితి లేదు’ అంటూ తన భార్య ప్రమీలతో సుందర్ చివరిసారిగా మాట్లాడారు. తన భర్త చేసిన చివరి ఫోన్కాల్తోపాటు ఆ రోజు జరిగిన విషయాలను ప్రమీల ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలోని ఎంసీఆర్ (మెయిన్ కంట్రోల్ రూమ్)లో విధులు నిర్వహించేందుకు ఇంటి నుంచి ఆయన 20వ తేదీ రాత్రి 8:15 గంటలకు బయలుదేరారు. రాత్రి 11:45 గంటలకు ఆయన నుంచి ఫోన్ వచ్చింది.. అది చూస్తూనే ఏదో జరిగిందని అర్థమైంది. ఆయన మాట్లాడుతుండగానే ఫోన్ కట్ అయింది. 33 సెకన్లు మాత్రమే నాతో మాట్లాడిండు. ఆ తర్వాత గంట వరకు ఫోన్ చేసినా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అర్ధరాత్రి 2 గంటల వరకు మెయిన్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏదో జరిగిందని భయం వేసి ఆ రాత్రే నా పిల్లలతో వెళ్లి కాలనీలో పక్కనే తెలిసిన వారింట్లో ఉన్నా. 21వ తేదీ ఉదయం అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా జల విద్యుత్ కేంద్రంలో పేలుడు జరిగిందని, అందులో కొందరు చిక్కుకుపోయారని తెలిసింది. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో నా భర్త చనిపోయారని చెప్పారు. ఆయన ఇక మాకు దక్కడని, ఇంత ప్రమాదం జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు. ఆయన చివరి మాటలు ఇప్పటికీ నా చెవిలో మార్మోగుతున్నాయి’ అంటూ ప్రమీల కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాద సమయంలో ఫోన్లో ఆయన తీసిన వీడియోలు మాకు వచ్చాయి. ఆయన ఎంత ప్రమాదంలో చిక్కుకున్నారో అవి చూశాక అర్థమైంది. చీకట్లో ఆయన వీడియో తీస్తూ మిత్రులతో ఆపద ఉన్నట్లు మాట్లాడింది చూస్తే ఆయన బతికి ఉంటాడేమో అనిపించింది. కానీ మంటలు, పొగ వల్ల ఆయన ఒళ్లంతా కాలి చనిపోయారు’ అని ప్రమీల విలపించారు. సీఐడీ విచారణ షురూ ►భూగర్భ జలవిద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన సీఐడీ చీఫ్ గోవింద్‌సింగ్ ►నాలుగు బృందాలతో విచారణ ►ప్యానెల్ బోర్డులకు రివర్స్ పవర్‌పై అనుమానాలు సాక్షి, నాగర్‌కర్నూల్/మన్ననూర్/అమ్రాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేం ద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ ప్రారంభమైంది. సీఐడీ చీఫ్ అదనపు డీజీ గోవింద్ సింగ్ నేతృత్వంలో డీఐజీ సుమతి, సీఐడీ ఏఎస్పీ శ్రీనివాసన్, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్స్పె క్టర్లు, ఎలక్ట్రికల్, ఫోరెన్సిక్ సైన్స్, సీఐడీ, స్థానిక పోలీసులు.. 4 టీమ్‌లతో 25 మందితో కూడిన బృందం విచారణ చేపట్టింది. శనివారం మధ్యా హ్నం జెన్కో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అగ్నిప్రమాదానికి సంబంధించి విచారణకు అన్ని విభాగాల అధికారులు, కార్మికులు సహకరించాలని గోవింద్‌సింగ్ బృందం కోరింది. సంఘటకు సంబంధించి జెన్కో అధికారులను అడిగి ప్రాథమికంగా వివరాలు సేకరించింది. కాగా, ఆదివారం ప్రమాద సంఘటనపై సమీక్ష జరిపిన గోవింద్‌సింగ్.. పవర్‌హౌస్‌లో ప్రమాదం జరిగిన ప్రదేశాలు, ప్లాంట్లను సీఈ ప్రభాకర్, డీఎస్పీ నర్సింహులు తదితర ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు. ఇప్పటికీ తగ్గని పొగలు.. అగ్ని ప్రమాదంలో విద్యుత్ కేంద్రంలోని 4వ యూనిట్లో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. దీనికి సంబంధించిన కొన్ని బ్యాటరీలు ధ్వంసమయ్యాయి. కాగా, పవర్ ప్లాంట్‌లో ఇప్పటికీ పొగలు తగ్గలేదు. ప్రస్తుతం బ్లోజర్స్ను ఉపయోగించి పొగ తగ్గించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సిబ్బంది పవర్ హౌస్‌లోకి వెళ్లేందుకు వీలుగా తాత్కాలికంగా విద్యుత్ సదుపాయం కల్పించి, ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ధ్వంసమైన విభాగాలను గుర్తించే పనిలో ప్రస్తుతం సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. ప్రమాదంపై వివిధ కోణాల్లో విచారణ.. ప్రమాద ఘటనపై వివిధ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆశించిన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు అదనపు బ్యాటరీల అవసరం ఉందని జెన్కో ఏఈలు రెండు నెలలుగా కోరుతున్నప్పటికీ వెంటనే స్పందించని ఓ ఉన్నతాధికారి, ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందే బ్యాటరీలు తెప్పించినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే కార్మికుల కృషి ఫలితంగా ఆశించిన మేరకు యూనిట్లు పని చేస్తున్నాయని, హైదరాబాద్‌కు చెందిన ఓ అధికారి సూచన మేరకు బ్యాటరీలు మార్పిడి చేశారని సమాచారం. ఆ విధంగా మార్చడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని పవర్ ప్లాంట్ ఇంజనీర్లు పదేపదే సూచనలు చేసినప్పటికీ ఆ అధికారి బ్యాటరీలను బిగింపజేశారని పలువురు ఉద్యోగులు, కార్మికులు ఆరోపణలు చేస్తున్నారు. బ్యాటరీల సామర్థ్యం పెరగడంతో 180 మెగావాట్లు ఉత్పత్తి కావాల్సిన విద్యుత్.. ఒక్కసారిగా 200 మెగావాట్లకు చేరడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించి ఉండొచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి అధికంగా జరగడమే ప్రమాదానికి కారణమా? అనే కోణంలో కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. బ్యాటరీల నుంచి రివర్స్ పవర్ ప్యానల్ బోర్డులకు రావడం వల్ల కూడా ఘటన జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ప్రమాదం సందర్భంగా ఉద్యోగులు తీసిన వీడియోలు, సీసీ కెమెరాల ఫుటేజీలను, ఇతర ఆధారాలను సీఐడీ సేకరిస్తోంది. అమరాన్ కంపెనీ టెక్నీషియన్ల పనితీరుపైనా సీఐడీ అధికారులు ఆరా తీశారు. ప్యానల్ నుంచి ట్రాన్స్ఫార్మర్లకు, రియాక్టర్లకు మంటలు ఎలా వ్యాపించాయి? సంఘటన జరిగినప్పుడు అలారం సైరన్లు పని చేశాయా? లేదా? అనే అంశాలపై అధికారులు విచారించారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను కూడా పరిశీలించారని, మృతుల శరీరాల్లో సరిపడినంత ఆక్సిజన్ లేకపోవడం, ఊపిరి తిత్తుల్లో పొగ నిండిపోవడమే 9 మంది మరణానికి కారణంగా నివేదికలో ఉన్నట్లు సమాచారం. పొగలు కమ్ముకోవడంతోనే మృతి! యూనిట్–4 పవర్ బోర్డులో మంటలు రావడంతో దట్టమైన పొగలు కమ్ముకోవడవం వల్లే అందులో చిక్కుకున్న ఉద్యోగులు చనిపోయారని జెన్కో అధికారులు సీఐడీ బృందానికి వివరించినట్లు తెలిసింది. మంటలు ఆర్పే ప్రయత్నంలోనే 9 మంది సిబ్బంది యూనిట్–1లో చిక్కుకున్నారని, ప్రమాదం కారణంగా కరెంటు çపవర్ ట్రిప్ కావడంతో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పనిచేయకపోవడం వల్ల పొగ పేరుకుందని, మొత్తం చీకటిగా మారడంతో సిబ్బంది పూర్తిగా పొగలో చిక్కుకుపోయారని సీఐడీ బృందానికి తెలిపారు. క్షణాల్లో పొగలు కమ్ముకోవడంతో సిబ్బందికి ఆక్సిజన్ సమస్య ఎదురైందని, ముగ్గురు సిబ్బంది సీట్లోనే చనిపోయారని, మిగిలిన ఆరుగురు ఎగ్జిట్ వైపు పరుగులు తీశారని సీఐడీకి వివరించారు. ఉద్యోగులు, కార్మికుల మృతికి సంతాపం.. ప్రమాదంలో మృతి చెందినవారికి నివాళిగా ఉద్యోగులు మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం పవర్ హౌస్ గేటు ముందు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ తమతో కలసి పని చేసిన మిత్రులు కళ్ల ముందే నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ, ఈ నెల 25న సంతాప సభ నిర్వహిస్తామని ఉద్యోగ నేతలు పేర్కొన్నారు. -
శ్రీశైలం ప్రమాదం : రాత్రంతా ప్రయత్నించాం కానీ..
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో చోటుచుకున్న ప్రమాదం చాలా దురదృష్టకరమని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏడుగురు ఇంజనీర్లుతో పాటు ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, తాము ఎంతో చింతిస్తున్నామని అన్నారు. సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అక్కడకు చేరుకున్నామని, సిబ్బందిని కాపాడడం కోసం అనేక ప్రయత్నాలు చేశామని తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రితో కలిసి ఆ రోజు రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించామని కానీ తమ వల్లకాలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ప్రభాకర్‌రావు ప్రమాద వివరాలను వెల్లడించారు. ‘ప్రమాదం అనంతరం విద్యుత్ కేంద్రంలో కరెంట్ పోయింది. దీనితో లోపల అంధకారమయ్యింది. పొగతో ఆక్సిజన్ లభించలేదు. పొగను బయటకు పంపించేందుకు చాలా కష్టపడ్డాం. అయినా దురదృష్టవశాత్తు వారు చనిపోయారు. విద్యుత్ కేంద్రలో ప్రమాదం జరిగితే వెంటనే ఆటోమేటిక్ ట్రిప్ కావాలి. కానీ కాలేదు ఎందుకు ట్రిప్ కాలేదు అనేదానిపై కమిటీ వేశాం. ఇలాంటి సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పవర్ పోవడంతో వెంటిలేషన్ ఆగిపోయింది, దీనితో ఎమర్జెన్సీ వే కూడా తెరుచుకోలేదు. గత 30 రోజుల నుండి చాలా చక్కగా జరుగుతున్నాయి. రోజుకు 128 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది గతంలో కూడా ఎన్టీపీసీ లో బాయిలర్ బ్లాస్ట్ అయింది. ఆ ప్రమాదంలో దాదాపు 30 చనిపోయారు. తమిళనాడులో కూడా గతంలో ఇలాంటి సంఘటన జరిగింది. దురదృష్టవశాత్తు మన దగ్గర కూడా జరిగింది దీనిపై కమిటీ వేశామ్. కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తారు.ప్రభుత్వం నుండి ఇప్పటికే వాళ్లకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాం. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటాం. త్వరలోనే వాళ్ళ కుటుంబాలకు జెన్కో నుంచీ సహాయం అందజేస్తాం. ఇలాంటి సంఘటనలు జరిగిన రాష్ట్రాల్లో ఇంత మొత్తంలో ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు’అని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై త్వరలోనే కమిటీ పూర్తి నివేదికను అందిస్తుందని ప్రభాకర్‌రావు తెలిపారు. కాగా మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
అపాయింట్మెంట్ లేదని అరెస్ట్ చేశారు
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా డీజీపీ ఇంటికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఘటనాస్థలానికి వెళ్లిక టీ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ డీజీపీ మహేందర్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే సంపత్, అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు మరి కొంతమంది నేతలు శనివారం నగంరలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే వారికి డీజీపీ అపాయింట్మెంట్ మంజూరు చేయకపోవడంతో లోపలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడున్న సిబ్బంది వారిని అరెస్ట్ చేసి నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా అంతకుముందే తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టిన శ్రీశైలం పర్యటన ఉద్రిక్తతంగా మారింది. శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, మల్లు రవిని పోలీసులు అడ్డగించడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. -
డ్యూటీ ముగిసినా.. విధుల్లోకి వెళ్లి..
సాక్షి, హైదరాబాద్: తమ విధులు ముగిసినా.. అత్యవసర మరమ్మతుల కోసం మళ్లీ ప్లాంట్‌కు వచ్చి ముగ్గురు మరణించడం పలువురిని కలచివేస్తోంది. శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఏఈలు ఉజ్మా ఫాతిమా, మోహన్‌కుమార్, జూనియర్ ప్లాంట్ అటెండర్ కిరణ్ జనరల్ డ్యూటీలో విధులు ముగించుకుని రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్లిపోయారు. అయితే, బ్యాటరీల మరమ్మతు చేయడం కోసం హైదరాబాద్‌కు చెందిన అమరాన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేశ్‌కుమార్, మహేశ్‌కుమార్ వచ్చారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ ఉండటంతో డీఈ శ్రీనివాస్‌గౌడ్ ఫోన్ చేసి వారిని రావాలని కోరడంతో.. ముగ్గురూ తిరిగి ప్లాంట్‌కు వచ్చి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడటంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. మూడేళ్ల క్రితం పదోన్నతిపై వెళ్లి.. హైదరాబాద్ చంపాపేటకు చెందిన జెన్కో డీఈ బత్తిని శ్రీనివాస్‌గౌడ్ 2002లో జెన్కోలో ఏఈగా ఉద్యోగంలో చేరారు. మూడేళ్లపాటు కేటీపీఎస్‌లో పని చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని విద్యుత్‌సౌధలో పదేళ్లపాటు పనిచేశారు. ఐదేళ్ల క్రితం ఏడీగా పదోన్నతిపై నాగార్జునసాగర్‌కు వెళ్లారు. అనంతరం డీఈగా మూడేళ్ల క్రితం శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి బదిలీ అయ్యారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. శ్రీనివాస్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మొదటి నుంచి అక్కడే.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగి నరసింహారావు పెద్దకుమారుడు మోహన్‌కుమార్.. జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. 2013–14లో సబ్ ఇంజనీర్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఏఈగా పదోన్నతి పొందారు. మొదటి నుంచి ఆయన శ్రీశైలంలోనే పని చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు పార్ధు(5), నిహారిక(7 నెలలు) ఉన్నారు. విధుల్లోకి వెళ్లిన మోహన్‌కుమార్ కాసేపటికే భార్య పావనికి ఫోన్ చేసి.. ‘ఇక్కడ ప్రమాదం జరిగింది. నేను వస్తానో, రానో..’అని చెప్పి ఫోన్ పెట్టేశారని భార్య రోదిస్తూ చెప్పారు. (మృత్యుసొరంగం) నాలుగున్నరేళ్ల క్రితం ఏఈగా ఎంపికై.. హైదరాబాద్ కాలాపత్తర్‌కు చెందిన ఉజ్మాఫాతిమా(26) నాంపల్లి ఎగ్జిబిషన్ కాలేజీలో ఇంటర్ పూర్తిచేశారు. సీబీఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నాలుగున్నరేళ్ల క్రితం ఏఈగా ఎంపికయ్యారు. తొలి పోస్టింగ్ శ్రీశైలంలో వేశారు. ప్రమాదంలో మృతిచెందడంతో ఆమె నివాసం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన ఫాతిమాకు డీఈ శ్రీనివాస్‌గౌడ్ ఫోన్ చేయడంతో మళ్లీ వెళ్లిందని, తిరిగి ఇలా శవమై వస్తుందని ఊహించలేదని ఫాతిమా తల్లి రోదిస్తూ చెప్పారు. ఫాతిమాకు ఇంకా వివాహం కాకపోవడంతో తల్లితో కలసి స్థానికంగానే ఉంటున్నారు. (ఇదే తొలి ప్రమాదం) కేటీపీఎస్ నుంచి శ్రీశైలానికి... ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లికి చెందిన ఎట్టి రాంబాబు(40) 2013లో పాల్వంచ కేటీపీఎస్‌లో కాంట్రాక్టు పద్ధతిలో విధుల్లో చేరారు. అనంతరం జూనియర్ ప్లాంట్ ఆపరేటర్‌గా పర్మనెంట్ అయింది. ఆ తర్వాత శ్రీశైలం పవర్ హౌస్‌కు బదిలీ కావడంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే ఖమ్మం జిల్లా మధిర మండలం మహదేవపురం గ్రామానికి చెందిన మర్సకట్ల పెద్ద వెంకట్రావ్(47) పాల్వంచ కేటీపీఎస్‌లో పనిచేసి.. బదిలీపై శ్రీశైలం వెళ్లారు అక్కడ ఏఈగా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. యాదాద్రి నుంచి డిప్యుటేషన్‌పై.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన మాలోతు కిరణ్(35) కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారం ‘సీ’స్టేషన్లో జూనియర్ ప్లాంట్ అటెండెంట్(జేపీఏ)గా విధులు నిర్వహించేవారు. జూన్‌లో కర్మాగారం మూసివేయడంతో నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు బదిలీ అయ్యారు. అక్కడి నుంచి ఇటీవల శ్రీశైలం జల విద్యుత్ కేంద్రానికి డిప్యుటేషన్‌పై వెళ్లి, మృత్యువాతపడ్డారు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవలే అమరాన్ కంపెనీలోకి.. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన వడ్డాణం వీరభద్రయ్య, ధనమ్మల ఏకైక కుమారుడు మహేశ్‌కుమార్ (35).. లాక్‌డౌన్‌కు ముందు రైల్వేలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవారు. లాక్డౌన్ కారణంగా ఏ పని లేకపోవడంతో అక్కడ మానేశారు. ఇటీవల వరంగల్‌లో ఉన్న అమరాన్ బ్యాటరీ కంపెనీలో చేరారు. మహేశ్‌కు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. సీఐడీ విచారణ ♦విచారణ అధికారిగా సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్ ♦ప్రమాద కారణాలు వెలికి తీయాలని సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీఐడీ విచారణకు ఆదేశించారు. దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులు, ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని స్పష్టంచేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. దురదృష్టకర ఘటన.. అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణ నష్టం జరగడంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చికిత్స పొందుతున్నవారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాన్ని అత్యంత దురదృష్టకర ఘటనగా పేర్కొన్న సీఎం.. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. తీవ్ర విషాద ఘటన.. నా సుదీర్ఘ అనుభవంలో ఇంతటి విషాద ఘటన ఎన్నడూ చూడలేదు. మంటలు ఎగిసి పడుతున్నా, ప్లాంటును కాపాడేందుకు ప్రయత్నించి ఆ క్రమంలోనే మరణించారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. – ట్రాన్స్‌కో–జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు -
మృత్యుసొరంగం
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు పంచుతున్న భారీ జలవిద్యుత్ కేంద్రం కొందరు ఉద్యోగుల జీవితాలను చీకటిమయం చేసింది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన భారీ అగ్నిప్రమాదం తొమ్మిది మందిని పొట్టన పెట్టుకుంది. రూ. వందల కోట్ల ఆస్తి నష్టాన్ని మిగిలిచ్చింది. జలవిద్యుత్ కేంద్రంలోని 4వ యూనిట్ ప్యానల్ బోర్డులో మంటలు చెలరేగడం, ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్ పేలుడుతో భారీ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు ఉండగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఏడుగురు జెన్కో ఉద్యోగులుకాగా, మిగిలిన ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన వారు. మరో ఎనిమిది మంది ఉద్యోగులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు... గురువారం రాత్రి 10:30 నుంచి 11:00 గంటల సమయంలో 900 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంగల శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉన్న 4వ యూనిట్‌లోని ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్‌తో తొలుత మంటలు రేగాయి. ఆ వెంటనే ఆగ్జిలరీ వోల్టేజీ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో విధుల్లో ఉన్న డీఈ పవన్, ఇతర ఉద్యోగులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడమే కాకుండా కేవలం 3 నిమిషాల్లోనే పవర్‌హౌస్‌లో పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన ఆరుగురు ఉద్యోగులు వెంటనే కారులో బయటకు వచ్చారు. ఎలక్ట్రికల్ డీఈ అంకినీడు, మరో ఉద్యోగి అతికష్టం మీద డీజిల్ సెట్ వెళ్లే సొరంగ మార్గంలో పరుగులు పెడుతూ బయటికి వచ్చి సొమ్మసిల్లిపడిపోయారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ట్రాన్స్ఫార్మర్ పేలుడుకు కారణం అదేనా? శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల సామర్థ్యంగల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. కృష్ణా నదిలో హెడ్ (నీటి ఇన్‌టేక్, నీటి డిశ్చార్జ్ పాయింట్ మధ్య హెచ్చుతగ్గులు) ఎక్కువగా ఉండటం వల్ల సహజంగానే 150 మెగావాట్ల సామర్థ్యంగల యూనిట్లు అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇదే కారణంతో ఒక్కో యూనిట్ 180 మెగావాట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు తెలిసింది. అయితే పేలుడు సంభవించిన నాలుగో యూనిట్‌కు చెందిన ఆక్సిలరీ వోల్జేజీ ట్రాన్స్ఫార్మర్, ప్యానల్ బోర్డు మాత్రం ఒక్కసారిగా 200 మెగావాట్ల ఉత్పత్తికి వెళ్లిపోయింది. ఆగ్జిలరీ వోల్టేజీ ట్రాన్స్ఫార్మర్ పేలడానికి ఇదే ప్రధాన కారణం అయి ఉండొచ్చని ఓ అధికారి చెప్పారు. డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు నాలుగో యూనిట్ విద్యుత్ ఉత్పత్తిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆగిపోలేదని సమాచారం. ఈ క్రమంలో పేలుళ్లు, మంటలు సంభవించి విద్యుత్ కేంద్రం మొత్తం చీకటిగా మారింది. అడుగు దూరంలో ఉన్న మనిషిని సైతం చూడలేని పరిస్థితి ఏర్పడిందని, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది కలిగిందని బయటకు వచ్చిన ఇంజనీర్లు, ఇతర అధికారులు పేర్కొన్నారు. హుటాహుటిన ఘటనాస్థలికి మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు, ఎస్పీఈ సిబ్బంది, అధికారులు, కార్మికులు, నాన్ ఇంజనీర్లు ఆక్సిజన్ ధరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ దట్టమైన పొగల వల్ల సాధ్యం కాలేదు. కారు లైట్లు వేసుకొని వెళ్లినా దారి కనిపించలేదు. విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఎల్. శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ విద్యుత్ కేంద్రం వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి 2:15 గంటలకు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి పొగ కమ్ముకోవడంతో వెనుదిరిగారు. అనంతరం జగదీశ్‌రెడ్డి ప్రమాద ఘటనపై జెన్కో అధికారులతో సమీక్షించారు. ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులను అతికష్టం మీద లోపలికి పంపించారు. పవర్‌హౌస్‌లోని గ్యాస్ ఇన్సులేటెడ్ సిస్టమ్ దిగువ ప్రాంతంలో ఆయిల్ లీక్ కావడంతో మంటలు మరింత ఎగసిపడ్డాయి. అయినా అతికష్టం మీద ఫైర్ సిబ్బంది ప్రయత్నం కొనసాగించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎండీ ప్రభాకర్‌రావు, జిల్లా కలెక్టర్ శర్మన్ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్, సీఐఎస్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకొని పొగలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. పొగ ఎక్కువగా ఉండటంతో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ప్రమాదం జరిగిన ప్లాంటులోకి ప్రవేశించి గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతికారు. ప్రమాదంలో చిక్కుకున్న వారు దురదుష్టవశాత్తు మరణించడంతో మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. మృతులు వీరే.. 1. డీఈ శ్రీనివాస్‌గౌడ్ (హైదరాబాద్) 2. ఏఈ వెంకటేశ్వర్రావు (పాల్వంచ) 3. ఏఈ మోహన్ కుమార్ (హైదరాబాద్) 4. ఏఈ ఉజ్మా ఫాతిమా (హైదరాబాద్) 5. ఏఈ సుందర్ (సూర్యాపేట) 6. ప్లాంట్ అటెండర్ రాంబాబు (ఖమ్మం జిల్లా) 7. జూనియర్ ప్లాంట్ అటెండర్ కిరణ్ (పాల్వంచ) 8. వినేష్ కుమార్ (అమరాన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి) 9. మహేష్ కుమార్ (అమరాన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి) వీరందరూ ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. -
శ్రీశైలం ప్రమాదం: పరిహారం ప్రకటించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే ఏఈలతో పాటు సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాషియా ప్రకటించి అండగా నిలిచింది. అంతేకాకుండా మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రమాదం అనంతరం అత్యున్నత స్థాయి అధికారులతో అత్యవసర సమావేశమైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. (విషాదం: లోపలున్న 9 మందీ మృతి) గురువారం అర్థరాత్రి అనంతరం చోటుచేసుకున్న ప్రమాదంలో 9 మంది దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఘటనలో మరో 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై సీఎం కేసీఆర్ ఇదివరకు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది ఉద్యోగులు మృత్యువాత పడటం బాధకరమన్నారు. మృతుల వివరాలు 1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ 2.AE వెంకట్రావు, పాల్వంచ 3.AE మోహన్ కుమార్, హైదరాబాద్ 4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్ 5.AE సుందర్, సూర్యాపేట 6. జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ రాంబాబు, ఖమ్మం జిల్లా 7. జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ కిరణ్, పాల్వంచ 8. టెక్నీషియన్ మహేష్ కుమార్ 9.హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి వినేష్ కుమార్ -
నువ్వు, పిల్లలు జాగ్రత్త.. సుందర్ చివరి మాటలు
సాక్షి, నాగర్ కర్నూల్: ‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు’ అని ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు ఇవి. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిదిమంది మృత్యువాత పడ్డారు. ఇందులో సుందర్ నాయక్ ఒకరు. 35 ఏళ్ల సుందర్ నాయక్ నిన్ననే తిరిగి విధుల్లో చేరాడు. కరోనా బారిన పడి కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్న తర్వాత తేరుకున్న సుందర్ డ్యూటీకి గురువారం హాజరయ్యాడు. (చదవండి: జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) కాగా, కరోనాను జయించిన సుందర్.. ఇలా విద్యుత్ ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందుతాడని ఎవరూ అనుకోలేదు. కానీ మృత్యుంజయుడనుకున్న సుందర్‌ను విధి మరోలా వక్రించడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో తొలుత లభించిన మృతదేహం కూడా సుందర్‌దే. ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత ఇక ప్రాణాలతో బయటపడలేమని ఊహించిన సుందర్.. భార్యకు జాగ్రత్తలు చెప్పాడు. ‘నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడలేకపోతే బ్రతికే పరిస్థితి లేదు’ అని భార్యకు ఫోన్లో ప్రమాద తీవ్రతను వివరించాడు. కాగా, మోహన్ అనే మరో ఏఈ తోటి వారిని కాపాడటానికి సహకరించాడు. ఈ ఘటనలో 17 మంది విధుల్లో ఉండగా, ఎనిమిది మంది బయటపడ్డారు. మిగతా తొమ్మిది మంది ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: పవర్ హౌజ్ ప్రమాదం: సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశం) -
శ్రీశైలం పవర్ ప్లాంట్: ఆరుకు చేరిన మృతుల సంఖ్య
-
మరో ఐదు మృతదేహాలు గుర్తింపు
సాక్షి, నాగర్ కర్నూలు: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. తొలుత రెస్క్యూ బృందం మూడో ఫ్లోర్లో ఏఈ సుందర్ నాయక్ (35) మృతదేహాన్ని గుర్తించింది. ఆ తర్వాత మోహన్‌తో పాటు మరో నలుగురి మృతదేహాలను గుర్తించింది. ఏఈ సుందర్‌తో పాటు మోహన్ మృత దేహాలను బయటకు తరలించారు. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెస్య్కూ ఆపరేషన్ పూర్తయ్యేందుకు మరో అయిదు గంటల సమయం పట్టనుంది. కాగా గురువారం రాత్రి 10.35 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ప్రమాద ఘటన గురించి సీం కేసీఆర్‌కు వివరించామని పేర్కొన్నారు (గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు..) -
కరోనాపై గెలిచి, అనూహ్యంగా మృత్యువాత
నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం అగ్ని ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ఒకరు మృతి చెందారు. ఏఈ సుందర్ నాయక్ (35) మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించింది. మిగతా 8 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో రెండు గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, మృతుడు సుందర్ నాయక్ది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం, జగన తండాగా తెలిసింది. అతనికి భార్య ప్రమీల ఇద్దరు కూతుళ్లు మనస్వి, నిహస్వి ఉన్నారు. నెల రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సుందర్ నాయక్ సొంతూరుకు వచ్చి 15 రోజులు హోమ్ క్వారెంటైన్లో ఉండి కరోనాను జయించారు. నిన్న రాత్రి 9 గంటలకు శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విధులకు హాజరయ్యారు. అతని తండ్రి నాగేశ్వరరావు కోపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. (35 మందితో పవర్ హౌస్‌లోకి రెస్క్యూ టీమ్) -
శ్రీశైలం పవర్ హౌస్‌లోకి రెస్క్యూ టీమ్
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ జల విద్యుత్ ఉత్పతి కేంద్రంలో చిక్కుకుపోయిన తొమ్మిదిమంది జెన్కో ఉద్యోగులను రక్షించేందుకు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పొగతో పాటు మంటలు అదుపులోకి రాకపోవడంతో గత రాత్రి సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సీఐఎస్ఎఫ్ కమాండెంట్ సిద్ధార్థ రెహ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. అధునాతన పరికరాలతో పవర్ హౌస్‌లోకి వెళ్లిన 35మంది సీఐఎస్ఎఫ్ సభ్యుల బృందం సహాయక చర్యలు మొదలుపెట్టింది. మరోవైపు అదనపు డీజీ సీవీ ఆనంద్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ డీజీపీ విజ్ఞప్తితో సీఐఎస్ఎఫ్ ప్రత్యేక బృందాన్ని పంపింది. ఇవాళ మధ్యాహ్నానికి పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. (చదవండి: జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) మంటల్లో చిక్కుకున్నవారి వివరాలు 1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ 2.AE వెంకట్రావు, పాల్వంచ 3.AE మోహన్ కుమార్, హైదరాబాద్ 4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్ 5.AE సుందర్, సూర్యాపేట 6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా 7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ 8,9 హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ (చదవండి: గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు) ఏపీ గవర్నర్ దిగ్భ్రాంతి శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమ గట్టు భూగర్భ జల విధ్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూగర్భ జల విధ్యుత్ కేంద్రంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఉద్యోగులు క్షేమంగా బయటకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలం వద్ద ఏపీ ఎమ్మెల్యేలు పలువురు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ప్రమాదం జరిగిన శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమ గట్టు భూగర్భ జల విధ్యుత్ కేంద్రం వద్దకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. లోపల చిక్కుకుపోయిన 9 మంది క్షేమంగా తిరిగిరావాలని ఆకాక్షించారు.