4 యూనిట్లలో భారీ నష్టం | Srisailam Fire Accident: Preliminary Assessment Of Property Damage | Sakshi
Sakshi News home page

4 యూనిట్లలో భారీ నష్టం

Published Mon, Aug 24 2020 1:35 AM | Last Updated on Mon, Aug 24 2020 1:54 AM

Srisailam Fire Accident: Preliminary Assessment Of Property Damage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాద ఘటనలో జరిగిన ఆస్తి నష్టంపై ప్రాథమిక అంచనాకు వచ్చేందుకు ఒక ట్రెండు రోజులుపట్టే అవకాశముందని విద్యుత్‌ శాఖ వర్గాలు చెబుతున్నాయి. జల విద్యుత్‌ కేంద్రంలో 150 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంగల ఆరు యూనిట్లు ఉండగా, నాలుగు యూనిట్లలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మొదటి, రెండో యూనిట్‌లో ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో నష్టం కూడా స్వల్పం గానే ఉండే అవకాశముందని భావిస్తున్నారు. స్వల్ప మరమ్మతులతో ఒకటి, రెండో యూని ట్లను వీలైనంత త్వరగా పునరుద్ధరించి తిరిగి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించే అవకాశముందని జెన్‌కో వర్గాలు ‘సాక్షి’కి వెల్లడించాయి.

ఆరో యూనిట్‌ నుంచి మంటలు..
ఆరో యూనిట్‌లోని ఎక్సైలేషన్‌ ప్యానెల్‌లో అగ్ని ప్రమాదం తలెత్తి ఐదు, నాలుగు, మూడో యూనిట్‌ వరకు విస్తరించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రమాదం జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఘటనాస్థలికి అధి కారులు చేరుకోలేకపోతున్నారు. పొగతోపాటు తీవ్రమైన వేడి ఉండటంతో పూర్తిస్థాయిలో ప్రమాద నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు. ప్యానెళ్లు, కేబుళ్లు, స్టార్టర్లు ఇతర సామగ్రి దెబ్బతినడంతో నష్టం ఏ స్థాయిలో జరిగిందో తెలుసుకొనేందుకు కొంత సమయం పడుతుందని భావిస్తున్నారు. సోమవారం నాటికి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబున్నారు. 

నష్టం అంచనాకు టెక్నికల్‌ కమిటీ...
శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో ఈ నెల 20న జరిగిన అగ్నిప్రమాద ఘటనపై విచారణకు సంబంధించి టెక్నికల్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ జెన్‌కో–ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్‌ ఇంజనీర్లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. దక్షిణ మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ జి. రఘుమారెడ్డి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీకి జెన్‌కో సీఈ పి.రత్నాకర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ట్రాన్స్‌కో జెఎండీ సి. శ్రీనివాస్‌రావు, ట్రాన్స్‌కో డైరెక్టర్‌ టి. జగత్‌రెడ్డి, జెన్‌కో డైరక్టర్‌ ఎం.సచ్చిదానందం కమిటీ సభ్యులుగా ఉంటారు. జలవిద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ప్రతిపాదనలతో కూడిన నివేదికను 15 రోజుల్లోగా కమిటీ సమర్పించాల్సి ఉంటుంది.

బాధిత కుటుంబాలకు జెన్‌కో తరఫునా సాయం: సీఎండీ
శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు తాను ఘటనాస్థలికి చేరుకున్నా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ట్రాన్స్‌కో–జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ‘ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించాం. ప్లాంటులో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో చీకటి, పొగ అలుముకొని ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే యూనిట్‌ ఆటోమెటిక్‌గా ట్రిప్‌ కావాల్సి ఉన్నా ఎందుకు జరగలేదనే దానిపై విచారణ కమిటీ వేశాం. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం, ఎమర్జెన్సీ వెంటిలేటర్‌ కూడా తెరుచుకోకపోవడంతో వెంటిలేషన్‌ నిలిచిపోయింది.

నెల రోజులుగా విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుండగా రోజుకు 128 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. విద్యుత్‌ ఉత్పత్తి ఎక్కువగా ఉందని కొంత మేర తగ్గించాం. గతంలోనూ ఎన్‌టీపీసీతోపాటు నైవేలి లిగ్నైట్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో జరిగిన ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీశైలం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. జెన్‌కో తరఫున కూడా బాధిత కుటుంబాలకు సాయం అందజేస్తాం. ఒకటి, రెండు యూనిట్లలో 15 రోజుల్లోగా విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఇంజనీర్లు కృషి చేస్తున్నారు’ అని సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను సీఎండీ స్వయంగా పరామర్శించి బాధిత కుటుంబాల్లో భరోసా నింపాలని నిర్ణయించారు. 

మన పని అయిపోయింది
మోహన్‌తో సుందర్‌ చివరి సంభాషణ  
సాక్షి, నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి ఏఈలు సుందర్‌ నాయక్, మోహన్‌ల చివరి సంభాషణ వెలుగులోకి వచ్చింది. అలాగే చనిపోయే ముందు మోహన్‌ తన సెల్‌ఫోన్‌లో తీసిన ప్రమాద దృశ్యాల వీడియో సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. భర్త ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టిన మోహన్‌ భార్య ఆ వీడియోలోని దృశ్యాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సంభాషణ ఇదీ...
సుందర్‌: ఇక కష్టం! మన పని అయిపోయింది. ఆశలు వదులుకో...
మోహన్‌: నై బై.. ఆశగా ఉండాలె. కొద్దిసేపు ఆలోచించుకొని పోదాం.
సుందర్‌: ఇక మనం బతకం. పొగ మొత్తం అలుముకుంది.
నేను చనిపోవచ్చు.. పిల్లలు జాగ్రత్త: భార్యతో సుందర్‌ చివరి మాటలు

చివ్వెంల (సూర్యాపేట): ఏఈ సుందర్‌ నాయక్‌ తన భార్యతో జరిపిన ఫోన్‌ సంభాషణ కూడా వైరల్‌గా మారింది. ‘ఇక్కడ ప్రమాదం జరిగింది.. నేను చనిపోవచ్చు.. పిల్లలు జాగ్రత్త. ఇక్కడ మంటలు, పొగ బాగా వస్తున్నాయి. నేను మాట్లాడే పరిస్థితి లేదు’ అంటూ తన భార్య ప్రమీలతో సుందర్‌ చివరిసారిగా మాట్లాడారు. తన భర్త చేసిన చివరి ఫోన్‌కాల్‌తోపాటు ఆ రోజు జరిగిన విషయాలను ప్రమీల ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలోని ఎంసీఆర్‌ (మెయిన్‌ కంట్రోల్‌ రూమ్‌)లో విధులు నిర్వహించేందుకు ఇంటి నుంచి ఆయన 20వ తేదీ రాత్రి 8:15 గంటలకు బయలుదేరారు. రాత్రి 11:45 గంటలకు ఆయన నుంచి ఫోన్‌ వచ్చింది.. అది చూస్తూనే ఏదో జరిగిందని అర్థమైంది. ఆయన మాట్లాడుతుండగానే ఫోన్‌ కట్‌ అయింది. 33 సెకన్లు మాత్రమే నాతో మాట్లాడిండు. ఆ తర్వాత గంట వరకు ఫోన్‌ చేసినా ఆయన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. అర్ధరాత్రి 2 గంటల వరకు మెయిన్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసినా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది.

ఏదో జరిగిందని భయం వేసి ఆ రాత్రే నా పిల్లలతో వెళ్లి కాలనీలో పక్కనే తెలిసిన వారింట్లో ఉన్నా. 21వ తేదీ ఉదయం అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా జల విద్యుత్‌ కేంద్రంలో పేలుడు జరిగిందని, అందులో కొందరు చిక్కుకుపోయారని తెలిసింది. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో నా భర్త చనిపోయారని చెప్పారు. ఆయన ఇక మాకు దక్కడని, ఇంత ప్రమాదం జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు. ఆయన చివరి మాటలు ఇప్పటికీ నా చెవిలో మార్మోగుతున్నాయి’ అంటూ ప్రమీల కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాద సమయంలో ఫోన్‌లో ఆయన తీసిన వీడియోలు మాకు వచ్చాయి. ఆయన ఎంత ప్రమాదంలో చిక్కుకున్నారో అవి చూశాక అర్థమైంది. చీకట్లో ఆయన వీడియో తీస్తూ మిత్రులతో ఆపద ఉన్నట్లు మాట్లాడింది చూస్తే ఆయన బతికి ఉంటాడేమో అనిపించింది. కానీ మంటలు, పొగ వల్ల ఆయన ఒళ్లంతా కాలి చనిపోయారు’ అని ప్రమీల విలపించారు.

సీఐడీ విచారణ షురూ
►భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రాన్ని పరిశీలించిన సీఐడీ చీఫ్‌ గోవింద్‌సింగ్‌ 
►నాలుగు బృందాలతో విచారణ 
►ప్యానెల్‌ బోర్డులకు రివర్స్‌ పవర్‌పై అనుమానాలు 
సాక్షి, నాగర్‌కర్నూల్‌/మన్ననూర్‌/అమ్రాబాద్‌: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేం ద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ ప్రారంభమైంది. సీఐడీ చీఫ్‌ అదనపు డీజీ గోవింద్‌ సింగ్‌ నేతృత్వంలో డీఐజీ సుమతి, సీఐడీ ఏఎస్పీ శ్రీనివాసన్, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్‌స్పె క్టర్లు, ఎలక్ట్రికల్, ఫోరెన్సిక్‌ సైన్స్, సీఐడీ, స్థానిక పోలీసులు.. 4 టీమ్‌లతో 25 మందితో కూడిన బృందం విచారణ చేపట్టింది. శనివారం మధ్యా హ్నం జెన్‌కో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అగ్నిప్రమాదానికి సంబంధించి విచారణకు అన్ని విభాగాల అధికారులు, కార్మికులు సహకరించాలని గోవింద్‌సింగ్‌ బృందం కోరింది. సంఘటకు సంబంధించి జెన్‌కో అధికారులను అడిగి ప్రాథమికంగా వివరాలు సేకరించింది. కాగా, ఆదివారం ప్రమాద సంఘటనపై సమీక్ష జరిపిన గోవింద్‌సింగ్‌.. పవర్‌హౌస్‌లో ప్రమాదం జరిగిన ప్రదేశాలు, ప్లాంట్లను సీఈ ప్రభాకర్, డీఎస్పీ నర్సింహులు తదితర ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు.
 
ఇప్పటికీ తగ్గని పొగలు..
అగ్ని ప్రమాదంలో విద్యుత్‌ కేంద్రంలోని 4వ యూనిట్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయింది. దీనికి సంబంధించిన కొన్ని బ్యాటరీలు ధ్వంసమయ్యాయి. కాగా, పవర్‌ ప్లాంట్‌లో ఇప్పటికీ పొగలు తగ్గలేదు. ప్రస్తుతం బ్లోజర్స్‌ను ఉపయోగించి పొగ తగ్గించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సిబ్బంది పవర్‌ హౌస్‌లోకి వెళ్లేందుకు వీలుగా తాత్కాలికంగా విద్యుత్‌ సదుపాయం కల్పించి, ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ధ్వంసమైన విభాగాలను గుర్తించే పనిలో ప్రస్తుతం సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. 

ప్రమాదంపై వివిధ కోణాల్లో విచారణ..
ప్రమాద ఘటనపై వివిధ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆశించిన స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు అదనపు బ్యాటరీల అవసరం ఉందని జెన్‌కో ఏఈలు రెండు నెలలుగా కోరుతున్నప్పటికీ వెంటనే స్పందించని ఓ ఉన్నతాధికారి, ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందే బ్యాటరీలు తెప్పించినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే కార్మికుల కృషి ఫలితంగా ఆశించిన మేరకు యూనిట్లు పని చేస్తున్నాయని, హైదరాబాద్‌కు చెందిన ఓ అధికారి సూచన మేరకు బ్యాటరీలు మార్పిడి చేశారని సమాచారం. ఆ విధంగా మార్చడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని పవర్‌ ప్లాంట్‌ ఇంజనీర్లు పదేపదే సూచనలు చేసినప్పటికీ ఆ అధికారి బ్యాటరీలను బిగింపజేశారని పలువురు ఉద్యోగులు, కార్మికులు ఆరోపణలు చేస్తున్నారు. బ్యాటరీల సామర్థ్యం పెరగడంతో 180 మెగావాట్లు ఉత్పత్తి కావాల్సిన విద్యుత్‌.. ఒక్కసారిగా 200 మెగావాట్లకు చేరడంతో షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించి ఉండొచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్‌ ఉత్పత్తి అధికంగా జరగడమే ప్రమాదానికి కారణమా? అనే కోణంలో కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. బ్యాటరీల నుంచి రివర్స్‌ పవర్‌ ప్యానల్‌ బోర్డులకు రావడం వల్ల కూడా ఘటన జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ప్రమాదం సందర్భంగా ఉద్యోగులు తీసిన వీడియోలు, సీసీ కెమెరాల ఫుటేజీలను, ఇతర ఆధారాలను సీఐడీ సేకరిస్తోంది. అమరాన్‌ కంపెనీ టెక్నీషియన్ల పనితీరుపైనా సీఐడీ అధికారులు ఆరా తీశారు. ప్యానల్‌ నుంచి ట్రాన్స్‌ఫార్మర్లకు, రియాక్టర్లకు మంటలు ఎలా వ్యాపించాయి? సంఘటన జరిగినప్పుడు అలారం సైరన్‌లు పని చేశాయా? లేదా? అనే అంశాలపై అధికారులు విచారించారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను కూడా పరిశీలించారని, మృతుల శరీరాల్లో సరిపడినంత ఆక్సిజన్‌ లేకపోవడం, ఊపిరి తిత్తుల్లో పొగ నిండిపోవడమే 9 మంది మరణానికి కారణంగా నివేదికలో ఉన్నట్లు సమాచారం. 

పొగలు కమ్ముకోవడంతోనే మృతి!
యూనిట్‌–4 పవర్‌ బోర్డులో మంటలు రావడంతో దట్టమైన పొగలు కమ్ముకోవడవం వల్లే అందులో చిక్కుకున్న ఉద్యోగులు చనిపోయారని జెన్‌కో అధికారులు సీఐడీ బృందానికి వివరించినట్లు తెలిసింది. మంటలు ఆర్పే ప్రయత్నంలోనే 9 మంది సిబ్బంది యూనిట్‌–1లో చిక్కుకున్నారని, ప్రమాదం కారణంగా కరెంటు çపవర్‌ ట్రిప్‌ కావడంతో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు పనిచేయకపోవడం వల్ల పొగ పేరుకుందని, మొత్తం చీకటిగా మారడంతో సిబ్బంది పూర్తిగా పొగలో చిక్కుకుపోయారని సీఐడీ బృందానికి తెలిపారు. క్షణాల్లో పొగలు కమ్ముకోవడంతో సిబ్బందికి ఆక్సిజన్‌ సమస్య ఎదురైందని, ముగ్గురు సిబ్బంది సీట్లోనే చనిపోయారని, మిగిలిన ఆరుగురు ఎగ్జిట్‌ వైపు పరుగులు తీశారని సీఐడీకి వివరించారు. 

ఉద్యోగులు, కార్మికుల మృతికి సంతాపం..
ప్రమాదంలో మృతి చెందినవారికి నివాళిగా ఉద్యోగులు మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం పవర్‌ హౌస్‌ గేటు ముందు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ తమతో కలసి పని చేసిన మిత్రులు కళ్ల ముందే నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ, ఈ నెల 25న సంతాప సభ నిర్వహిస్తామని ఉద్యోగ నేతలు పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement