సాక్షి, హైదరాబాద్: తమ విధులు ముగిసినా.. అత్యవసర మరమ్మతుల కోసం మళ్లీ ప్లాంట్‌కు వచ్చి ముగ్గురు మరణించడం పలువురిని కలచివేస్తోంది. శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఏఈలు ఉజ్మా ఫాతిమా, మోహన్‌కుమార్, జూనియర్ ప్లాంట్ అటెండర్ కిరణ్ జనరల్ డ్యూటీలో విధులు ముగించుకుని రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్లిపోయారు. అయితే, బ్యాటరీల మరమ్మతు చేయడం కోసం హైదరాబాద్‌కు చెందిన అమరాన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేశ్‌కుమార్, మహేశ్‌కుమార్ వచ్చారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ ఉండటంతో డీఈ శ్రీనివాస్‌గౌడ్ ఫోన్ చేసి వారిని రావాలని కోరడంతో.. ముగ్గురూ తిరిగి ప్లాంట్‌కు వచ్చి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడటంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
మూడేళ్ల క్రితం పదోన్నతిపై వెళ్లి..
హైదరాబాద్ చంపాపేటకు చెందిన జెన్‌కో డీఈ బత్తిని శ్రీనివాస్‌గౌడ్ 2002లో జెన్‌కోలో ఏఈగా ఉద్యోగంలో చేరారు. మూడేళ్లపాటు కేటీపీఎస్‌లో పని చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని విద్యుత్‌సౌధలో పదేళ్లపాటు పనిచేశారు. ఐదేళ్ల క్రితం ఏడీగా పదోన్నతిపై నాగార్జునసాగర్‌కు వెళ్లారు. అనంతరం డీఈగా మూడేళ్ల క్రితం శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి బదిలీ అయ్యారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. శ్రీనివాస్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
మొదటి నుంచి అక్కడే..
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన హెచ్‌ఎంటీ రిటైర్డ్ ఉద్యోగి నరసింహారావు పెద్దకుమారుడు మోహన్‌కుమార్.. జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేశారు. 2013–14లో సబ్ ఇంజనీర్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఏఈగా పదోన్నతి పొందారు. మొదటి నుంచి ఆయన శ్రీశైలంలోనే పని చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు పార్ధు(5), నిహారిక(7 నెలలు) ఉన్నారు. విధుల్లోకి వెళ్లిన మోహన్‌కుమార్ కాసేపటికే భార్య పావనికి ఫోన్ చేసి.. ‘ఇక్కడ ప్రమాదం జరిగింది. నేను వస్తానో, రానో..’అని చెప్పి ఫోన్ పెట్టేశారని భార్య రోదిస్తూ చెప్పారు. (మృత్యుసొరంగం)
నాలుగున్నరేళ్ల క్రితం ఏఈగా ఎంపికై..
హైదరాబాద్ కాలాపత్తర్‌కు చెందిన ఉజ్మాఫాతిమా(26) నాంపల్లి ఎగ్జిబిషన్ కాలేజీలో ఇంటర్ పూర్తిచేశారు. సీబీఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నాలుగున్నరేళ్ల క్రితం ఏఈగా ఎంపికయ్యారు. తొలి పోస్టింగ్ శ్రీశైలంలో వేశారు. ప్రమాదంలో మృతిచెందడంతో ఆమె నివాసం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన ఫాతిమాకు డీఈ శ్రీనివాస్‌గౌడ్ ఫోన్ చేయడంతో మళ్లీ వెళ్లిందని, తిరిగి ఇలా శవమై వస్తుందని ఊహించలేదని ఫాతిమా తల్లి రోదిస్తూ చెప్పారు. ఫాతిమాకు ఇంకా వివాహం కాకపోవడంతో తల్లితో కలసి స్థానికంగానే ఉంటున్నారు. (ఇదే తొలి ప్రమాదం)
కేటీపీఎస్ నుంచి శ్రీశైలానికి...
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లికి చెందిన ఎట్టి రాంబాబు(40) 2013లో పాల్వంచ కేటీపీఎస్‌లో కాంట్రాక్టు పద్ధతిలో విధుల్లో చేరారు. అనంతరం జూనియర్ ప్లాంట్ ఆపరేటర్‌గా పర్మనెంట్ అయింది. ఆ తర్వాత శ్రీశైలం పవర్ హౌస్‌కు బదిలీ కావడంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే ఖమ్మం జిల్లా మధిర మండలం మహదేవపురం గ్రామానికి చెందిన మర్సకట్ల పెద్ద వెంకట్రావ్(47) పాల్వంచ కేటీపీఎస్‌లో పనిచేసి.. బదిలీపై శ్రీశైలం వెళ్లారు అక్కడ ఏఈగా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
యాదాద్రి నుంచి డిప్యుటేషన్‌పై..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన మాలోతు కిరణ్(35) కేటీపీఎస్ ఓఅండ్‌ఎం కర్మాగారం ‘సీ’స్టేషన్‌లో జూనియర్ ప్లాంట్ అటెండెంట్(జేపీఏ)గా విధులు నిర్వహించేవారు. జూన్‌లో కర్మాగారం మూసివేయడంతో నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు బదిలీ అయ్యారు. అక్కడి నుంచి ఇటీవల శ్రీశైలం జల విద్యుత్ కేంద్రానికి డిప్యుటేషన్‌పై వెళ్లి, మృత్యువాతపడ్డారు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇటీవలే అమరాన్ కంపెనీలోకి..
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన వడ్డాణం వీరభద్రయ్య, ధనమ్మల ఏకైక కుమారుడు మహేశ్‌కుమార్ (35).. లాక్‌డౌన్‌కు ముందు రైల్వేలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవారు. లాక్‌డౌన్ కారణంగా ఏ పని లేకపోవడంతో అక్కడ మానేశారు. ఇటీవల వరంగల్‌లో ఉన్న అమరాన్ బ్యాటరీ కంపెనీలో చేరారు. మహేశ్‌కు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
సీఐడీ విచారణ
♦విచారణ అధికారిగా సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్
♦ప్రమాద కారణాలు వెలికి తీయాలని సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీఐడీ విచారణకు ఆదేశించారు. దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులు, ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని స్పష్టంచేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
దురదృష్టకర ఘటన..
అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణ నష్టం జరగడంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చికిత్స పొందుతున్నవారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాన్ని అత్యంత దురదృష్టకర ఘటనగా పేర్కొన్న సీఎం.. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.
తీవ్ర విషాద ఘటన..
నా సుదీర్ఘ అనుభవంలో ఇంతటి విషాద ఘటన ఎన్నడూ చూడలేదు. మంటలు ఎగిసి పడుతున్నా, ప్లాంటును కాపాడేందుకు ప్రయత్నించి ఆ క్రమంలోనే మరణించారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
– ట్రాన్స్‌కో–జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment