మృత్యుసొరంగం | Telangana Srisailam Power Plant Fire: 9 Deceased | Sakshi
Sakshi News home page

మృత్యుసొరంగం

Published Sat, Aug 22 2020 3:28 AM | Last Updated on Sat, Aug 22 2020 7:39 AM

Telangana Srisailam Power Plant Fire: 9 Deceased - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్‌ వెలుగులు పంచుతున్న భారీ జలవిద్యుత్‌ కేంద్రం కొందరు ఉద్యోగుల జీవితాలను చీకటిమయం చేసింది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో గురువారం రాత్రి షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల సంభవించిన భారీ అగ్నిప్రమాదం తొమ్మిది మందిని పొట్టన పెట్టుకుంది. రూ. వందల కోట్ల ఆస్తి నష్టాన్ని మిగిలిచ్చింది. జలవిద్యుత్‌ కేంద్రంలోని 4వ యూనిట్‌ ప్యానల్‌ బోర్డులో మంటలు చెలరేగడం, ఆ తర్వాత ట్రాన్స్‌ఫార్మర్‌ పేలుడుతో భారీ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు ఉండగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఏడుగురు జెన్‌కో ఉద్యోగులుకాగా, మిగిలిన ఇద్దరు అమరాన్‌ బ్యాటరీ కంపెనీకి చెందిన వారు. మరో ఎనిమిది మంది ఉద్యోగులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బయటపడ్డారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు...
గురువారం రాత్రి 10:30 నుంచి 11:00 గంటల సమయంలో 900 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యంగల శ్రీశైలం జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో ఉన్న 4వ యూనిట్‌లోని ప్యానల్‌ బోర్డులో షార్ట్‌ సర్క్యూట్‌తో తొలుత మంటలు రేగాయి. ఆ వెంటనే ఆగ్జిలరీ వోల్టేజీ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో విధుల్లో ఉన్న డీఈ పవన్, ఇతర ఉద్యోగులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడమే కాకుండా కేవలం 3 నిమిషాల్లోనే పవర్‌హౌస్‌లో పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన ఆరుగురు ఉద్యోగులు వెంటనే కారులో బయటకు వచ్చారు. ఎలక్ట్రికల్‌ డీఈ అంకినీడు, మరో ఉద్యోగి అతికష్టం మీద డీజిల్‌ సెట్‌ వెళ్లే సొరంగ మార్గంలో పరుగులు పెడుతూ బయటికి వచ్చి సొమ్మసిల్లిపడిపోయారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ పేలుడుకు కారణం అదేనా?
శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో ఒక్కో యూనిట్‌ 150 మెగావాట్ల సామర్థ్యంగల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. కృష్ణా నదిలో హెడ్‌ (నీటి ఇన్‌టేక్, నీటి డిశ్చార్జ్‌ పాయింట్‌ మధ్య హెచ్చుతగ్గులు) ఎక్కువగా ఉండటం వల్ల సహజంగానే 150 మెగావాట్ల సామర్థ్యంగల యూనిట్లు అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇదే కారణంతో ఒక్కో యూనిట్‌ 180 మెగావాట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు తెలిసింది. అయితే పేలుడు సంభవించిన నాలుగో యూనిట్‌కు చెందిన ఆక్సిలరీ వోల్జేజీ ట్రాన్స్‌ఫార్మర్, ప్యానల్‌ బోర్డు మాత్రం ఒక్కసారిగా 200 మెగావాట్ల ఉత్పత్తికి వెళ్లిపోయింది. ఆగ్జిలరీ వోల్టేజీ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడానికి ఇదే ప్రధాన కారణం అయి ఉండొచ్చని ఓ అధికారి చెప్పారు. డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు నాలుగో యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆగిపోలేదని సమాచారం. ఈ క్రమంలో పేలుళ్లు, మంటలు సంభవించి విద్యుత్‌ కేంద్రం మొత్తం చీకటిగా మారింది. అడుగు దూరంలో ఉన్న మనిషిని సైతం చూడలేని పరిస్థితి ఏర్పడిందని, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది కలిగిందని బయటకు వచ్చిన ఇంజనీర్లు, ఇతర అధికారులు పేర్కొన్నారు.

హుటాహుటిన ఘటనాస్థలికి మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ
ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు, ఎస్పీఈ సిబ్బంది, అధికారులు, కార్మికులు, నాన్‌ ఇంజనీర్లు ఆక్సిజన్‌ ధరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ దట్టమైన పొగల వల్ల సాధ్యం కాలేదు. కారు లైట్లు వేసుకొని వెళ్లినా దారి కనిపించలేదు. విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ ఎల్‌. శర్మన్, ఎస్పీ సాయిశేఖర్‌ విద్యుత్‌ కేంద్రం వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి 2:15 గంటలకు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి పొగ కమ్ముకోవడంతో వెనుదిరిగారు. అనంతరం జగదీశ్‌రెడ్డి ప్రమాద ఘటనపై జెన్‌కో అధికారులతో సమీక్షించారు. ఫైర్‌ ఇంజన్లు, అంబులెన్సులను అతికష్టం మీద లోపలికి పంపించారు. పవర్‌హౌస్‌లోని గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సిస్టమ్‌ దిగువ ప్రాంతంలో ఆయిల్‌ లీక్‌ కావడంతో మంటలు మరింత ఎగసిపడ్డాయి. అయినా అతికష్టం మీద ఫైర్‌ సిబ్బంది ప్రయత్నం కొనసాగించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎండీ ప్రభాకర్‌రావు, జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, తెలంగాణ స్టేట్‌ ఫైర్‌ సర్వీసెస్, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని పొగలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. పొగ ఎక్కువగా ఉండటంతో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ప్రమాదం జరిగిన ప్లాంటులోకి ప్రవేశించి గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతికారు. ప్రమాదంలో చిక్కుకున్న వారు దురదుష్టవశాత్తు మరణించడంతో మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు.

మృతులు వీరే.. 
1. డీఈ శ్రీనివాస్‌గౌడ్‌ (హైదరాబాద్‌)
2. ఏఈ వెంకటేశ్వర్‌రావు (పాల్వంచ)
3. ఏఈ మోహన్‌ కుమార్‌ (హైదరాబాద్‌)
4. ఏఈ ఉజ్మా ఫాతిమా (హైదరాబాద్‌)
5. ఏఈ సుందర్‌ (సూర్యాపేట)
6. ప్లాంట్‌ అటెండర్‌ రాంబాబు (ఖమ్మం జిల్లా)
7. జూనియర్‌ ప్లాంట్‌ అటెండర్‌ కిరణ్‌ (పాల్వంచ)
8. వినేష్‌ కుమార్‌ (అమరాన్‌ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి)
9. మహేష్‌ కుమార్‌ (అమరాన్‌ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి)
వీరందరూ ఎస్కేప్‌ టన్నెల్‌ ద్వారా బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement