
సాక్షి, నాగర్ కర్నూల్: ‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు’ అని ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు ఇవి. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిదిమంది మృత్యువాత పడ్డారు. ఇందులో సుందర్ నాయక్ ఒకరు. 35 ఏళ్ల సుందర్ నాయక్ నిన్ననే తిరిగి విధుల్లో చేరాడు. కరోనా బారిన పడి కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్న తర్వాత తేరుకున్న సుందర్ డ్యూటీకి గురువారం హాజరయ్యాడు. (చదవండి: జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..)
కాగా, కరోనాను జయించిన సుందర్.. ఇలా విద్యుత్ ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందుతాడని ఎవరూ అనుకోలేదు. కానీ మృత్యుంజయుడనుకున్న సుందర్‌ను విధి మరోలా వక్రించడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో తొలుత లభించిన మృతదేహం కూడా సుందర్‌దే. ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత ఇక ప్రాణాలతో బయటపడలేమని ఊహించిన సుందర్.. భార్యకు జాగ్రత్తలు చెప్పాడు. ‘నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడలేకపోతే బ్రతికే పరిస్థితి లేదు’ అని భార్యకు ఫోన్‌లో ప్రమాద తీవ్రతను వివరించాడు. కాగా, మోహన్ అనే మరో ఏఈ తోటి వారిని కాపాడటానికి సహకరించాడు. ఈ ఘటనలో 17 మంది విధుల్లో ఉండగా, ఎనిమిది మంది బయటపడ్డారు. మిగతా తొమ్మిది మంది ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: పవర్ హౌజ్ ప్రమాదం: సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశం)
Comments
Please login to add a commentAdd a comment