ఈ ప్రమాదం గుణపాఠం కావాలి | Sakshi Editorial On Srisalam Power Project Fire Accident | Sakshi
Sakshi News home page

ఈ ప్రమాదం గుణపాఠం కావాలి

Published Wed, Aug 26 2020 12:19 AM | Last Updated on Wed, Aug 26 2020 5:34 AM

Sakshi Editorial On Srisalam Power Project Fire Accident

శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 9మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరిలోనూ విషాదం నింపింది. సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు అందులో చిక్కుకున్నవారు చివరి క్షణాలు ఎలా గడిపారో, ఏం ఆలోచించారో తెలిసే అవకాశం లేదు. కానీ ఈ విషాద ఘటనలో సిబ్బంది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ తమ శక్తికొద్దీ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసిన వైనం వెల్లడైంది. అలాగే తప్పించుకోవడానికి అవకాశం వుండి కూడా సహచర ఉద్యోగులను సురక్షితంగా బయటకు పంపి, చివరకు తమ ప్రాణాలు బలిపెట్టినవారున్నారు. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సుందర్‌ తన జీవన సహచరికి ఫోన్‌ చేసి తాము ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడం కంటతడి పెట్టిస్తుంది. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని రక్షించడానికి చివరి క్షణం వరకూ ఆ సిబ్బంది కృషి చేసిన తీరు ప్రశంసనీయమైనది. ఒకపక్క పొగలు కమ్ముకొస్తున్నా వారు మంటలు మరింత విస్తరించకుండా చూడటానికే ప్రాధాన్య మిచ్చారు. ఆ కృషి వల్లనే నష్టం కనిష్ట స్థాయికి పరిమితమైంది. విద్యుత్‌ పంపిణీకి ఎలాంటి ఇబ్బం దులూ ఎదురుకాలేదు. ఒక ప్యానెల్‌ బోర్డులో రాజుకున్న మంటలు క్షణాల్లో విస్తరించి ఈ పెను ప్రమాదానికి కారణమయ్యాయని చెబుతున్నారు. ఆధునిక జీవనం సమస్తం విద్యుత్‌తో ముడిపడి వుంటుంది. కనుక విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు రాత్రింబగళ్లు నిరంతరాయంగా పనిచేయక తప్పదు. అందరికీ నిరంతరాయంగా 24 గంటల విద్యుత్‌ను అందిస్తామని తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. విద్యుత్‌ సిబ్బంది అంకితభావంతో పనిచేయబట్టే ఆ లక్ష్యాన్ని తెలం గాణ చేరుకోగలిగింది. తాజా ఉదంతంలో సైతం సిబ్బంది అదే అంకితభావాన్ని ప్రదర్శించారు. 

కొన్ని ఉద్యోగ బాధ్యతలు అడుగడుగునా ప్రమాదాలతో ముడిపడి వుంటాయి. సైన్యం, పోలీసు విభాగం, వైద్య వృత్తి తదితరాలు అలాంటివి. విద్యుత్‌ ఉత్పాదన, పంపిణీ తదితర సేవల్లో నిమగ్న మయ్యే సిబ్బంది బాధ్యతలు కూడా అలాంటివే. చిన్న పొరపాటు కూడా పెను ప్రమాదానికి దారి తీస్తుంది. ప్రాణానికి ముప్పు ఏర్పడుతుంది. సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రామాణికమైన పరికరాలు వారికి అందుబాటులో లేకపోయినా, మండే స్వభావం వున్నవాటిని ఎప్పటికప్పుడు గమ నిస్తూ తొలగించకపోయినా సమస్యలేర్పడతాయి. అలాగే అత్యవసర సమయాల్లో ఎలాంటి జాగ్ర త్తలు తీసుకోవాలన్న అంశంలో కూడా అక్కడుండే సిబ్బందికి సంపూర్ణమైన అవగాహన కలిగించాలి. ప్రమాదం తలెత్తినప్పుడు రికార్డయిన మాటల్నిబట్టి సిబ్బందికి ఏం జరిగిందన్న విషయంలో తగిన అవగాహన వున్నదని తెలుస్తూనే వుంది. అయితే దాన్ని ఎదుర్కొనడానికి అవసరమైన అగ్నిమాపక పరికరాలు వారికి అందుబాటులో వున్నాయా అన్నది చూడాలి. అలాగే విద్యుదుత్పాదన ప్రక్రియలో ఉపయోగిస్తున్న యంత్రాలు మెరుగైన స్థితిలోనే వున్నాయా అన్నది తేల్చాలి. ఇప్పుడు ప్రారంభమైన సీఐడీ దర్యాప్తులో ఇలాంటి అంశాలన్నీ వెల్లడవుతాయని ఆశించాలి. 2009 అక్టోబర్‌లో కుడి గట్టు, ఎడమ గట్టు విద్యుత్‌ ఉత్పాదన కేంద్రాలు రెండింటినీ వరద జలాలు ముంచెత్తాయి. పర్యవసా నంగా విద్యుత్‌ ఉత్పాదన నిలిపేయాల్సివచ్చింది. అంతకు చాలాముందు 1998లో సైతం ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. నీటిని బయటకుతోడటానికి పది రోజులు పట్టగా ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు మరో రెండు నెలలకుగానీ పూర్తి కాలేదు. వరద జలాలు ముంచెత్తాక అక్కడున్న భద్రతా ప్రమాణా లను మరింతగా పెంచడం, యంత్రాలను మార్చడంవంటివి చేయకపోతే ముప్పుపొంచి ఉంటుంది. ఆ విషయంలో గతంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తేల్చవలసివుంది. సిబ్బందికి కేవలం పోర్ట బుల్‌ అగ్నిమాపక యంత్రాలు మాత్రమే అందుబాటులో వున్నాయని నిపుణులు అంటున్నారు. యూనిట్‌లో మంటలు చెలరేగితే అవి ప్రతి 30 సెకన్లకూ రెట్టింపవుతాయని... వీటిపై పూర్తి స్థాయి అవగాహన సిబ్బందిలో ఉంటే వెంటనే వెనక్కివచ్చే ప్రయత్నం చేసేవారని నిపుణులు అంటున్నారు.  

సిబ్బందికి భద్రత విషయంలో ఎప్పటికప్పుడు తగిన శిక్షణనివ్వడం ముఖ్యం. గత నెల 1న తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని ఒక బాయి లర్‌ పేలి 13మంది మరణించారు. అంతక్రితం కూడా అదే యూనిట్‌లో పేలుడు సంభవించి అయి దుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ప్రమాదాలకూ కారణం యూనిట్‌లో పనిచేసే సిబ్బం దికి భద్రతపై తగిన అవగాహన లేకపోవడమేనని అక్కడి కార్మిక సంఘాలు ఆరోపించాయి. పై స్థాయి సిబ్బందిలో అత్యధికులు హిందీ, ఇంగ్లిష్‌ మాట్లాడేవారు కావడంతో తమిళం మాత్రమే తెలి సిన కార్మికులకు వారు చెప్పినవి సరిగా అవగాహన కాలేదని, ఎలాంటి జాగ్రత్తలు అవసరమో సరిగా తెలియలేదన్నది ఆ సంఘాలు చెబుతున్న మాట. యూనిట్‌లో వినియోగిస్తున్న యంత్రాలు కాలం చెల్లినవని, వాటిని మార్చడంలో ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని కూడా కార్మిక సంఘాలు తెలిపాయి. మొన్న మే నెలలో విశాఖలోని ఎల్‌జీ పాలిమార్స్‌ కర్మాగారంలో కూడా భద్రతా ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లే పలువురు ప్రాణాలు కోల్పో యారు. లాక్‌డౌన్‌ విధించే సమయానికి ఫ్యాక్టరీ ఆవరణలోని స్టోరేజీ ట్యాంకులో 1,800 టన్నుల స్టెరీన్‌ నిల్వలు మిగిలిపోగా దాన్ని శుభ్రం చేసే క్రమంలో గ్యాస్‌ లీకై ఆ నగరాన్ని కాటేసింది. ఇలాంటి విషాద ఉదంతాలు అందరికీ గుణపాఠం కావాలి. తాజా ఉదంతంలో సీఐడీ దర్యాప్తుతోపాటు నిపు ణులతో కూడా సమగ్రంగా అధ్యయనం చేయించి ఈ మాదిరి ఉదంతాలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు అమలు చేయాలన్న విషయంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి కేంద్రీ కరించాలి. ప్రమాద సమయంలో అంకితభావంతో పనిచేసి తమ ప్రాణాలు బలిపెట్టిన సిబ్బంది కుటుంబాలకు అన్నివిధాలా అండగా నిలవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement