కువైట్ దక్షిణ ప్రాంతంలోని మంగఫ్ నగరంలో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 49 మంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా గాయాల పాలవడం విషాదం.
మృతుల్లో 43 మంది స్వదేశంలోని కుటుంబాలను పోషించడం కోసం కడుపు కట్టుకొని వలస వెళ్ళిన మన భారతీయులే కావడం మరింత విషాదం. వలస కార్మికులు ఎక్కువగా నివసించే ఆ ప్రాంతంలో ఆరంతస్థుల అల్–మంగఫ్ అపార్ట్‌మెంట్ల భవనంలో ఒక్కసారిగా రేగిన మంటలు ఇంతటి ఘోర ప్రమాదానికి దారి తీశాయి.
కేరళ, తమిళనాడు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన దాదాపు 200 మంది కార్మికులు నివసిస్తున్న ఆ భవనం మన కేరళకు చెందిన వ్యక్తిది కాగా, మృతుల్లో ఎక్కువ (24) మంది కేరళ వారే! చీకటి వేళ సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో అత్యధికులు ఆ మంటలు, పొగలో చిక్కుకొని ఊపిరి ఆడక చనిపోయారు. ఓ వంట గదిలో మంటలు మొదలయ్యాయనీ, అవి భవనమంతటికీ వ్యాపించాయనీ స్థానిక మీడియా కథనం. ఈ ఘటనపై కూలంకషంగా దర్యాప్తు జరిపి, ఎవరు బాధ్యులనేది నిర్ణయిస్తామని కువైట్ చెబుతోంది.
కారణాలు ఏమైనా బాధిత కుటుంబాల కన్నీళ్ళు ఆగేవి కావు. కష్టపడి నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదించి, ఊళ్ళోని కుటుంబాలను బాగా చూసుకోవాలని బయలుదేరిన పలువురి జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. కువైట్‌లో అగ్ని ప్రమాదాల చరిత్ర గమనిస్తే, 2009లో రెండో పెళ్ళి చేసుకుంటున్న తన భర్తపై ప్రతీకారంతో ఓ కువైట్ మహిళ వివాహ విందులో గుడారానికి నిప్పు పెట్టినప్పుడు 57 మంది చనిపోయారు.
ఆ తర్వాత ఆ దేశంలో ఇదే అతి పెద్ద ఘోరకలి. 2022 మార్చిలోనూ కువైట్‌లో పేరున్న ముబారకియా మార్కెట్ వాణిజ్యప్రాంతంలో ఇప్పటిలానే అగ్నిప్రమాదం సంభవించింది. మళ్ళీ ఇప్పుడీ తాజా ప్రమాదం. జాగ్రత్తలు తీసుకుంటామంటూ అధికారులు చెబుతున్నా అవేవీ వాస్తవ రూపం ధరించడం లేదు. ఈ ఘటనల వెనుక స్థానికంగా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, దురాశ లాంటివెన్నో ఉన్నాయనే వాదనలూ వినిపిస్తున్నాయి.
ఒక్క కువైట్‌లోనే కాదు, మధ్యప్రాచ్యంలోని అనేక ప్రాంతాల్లోనూ వలస కార్మికులు అవస్థలు, వారి అమానవీయ జీవన పరిస్థితులు అనేకం. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వల్లో ఆరో స్థానంలో ఉన్న కువైట్ మొత్తం 42 లక్షల పైగా జనాభాలో స్థానికుల కన్నా పని చేయడానికి వలస వచ్చినవారే ఎక్కువ. ఆ దేశంలో మన ప్రవాసీయుల సంఖ్య పది లక్షల పైనే! ఇంకా చెప్పాలంటే, కువైట్ మొత్తం జనాభాలో 21 శాతం మనవాళ్ళే! అక్కడి శ్రామిక వర్గంలో 30 శాతం మంది మనమే.
1990 – 91లో గల్ఫ్ యుద్ధ ప్రభావంతో లక్షలాది భారతీయులు కువైట్ నుంచి వెనక్కి వచ్చేసినా, అనంతరం భారీగా తరలివెళ్ళారు. ఒకప్పుడు అధికంగా ఉన్న పాలస్తీనియుల్ని మనం మించిపోయాం. వడ్రంగులు, తాపీ మేస్త్రీలు, పనివాళ్ళు, డ్రైవర్ల దగ్గర నుంచి ఫుడ్, కొరియర్ బాయ్స్ దాకా కువైట్‌లో అధికశాతం భారతీయులే. ఇంజనీర్లు, డాక్టర్ల లాంటి వృత్తి నిపుణులున్నా ఎక్కువ మంది అన్–స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులే. ఇలాంటి కార్మికులకు అక్కడ డిమాండ్ ఎక్కువ. అందుకు తగ్గట్టే మన దేశంతో పోలిస్తే, అక్కడ ఆదాయమూ అధికమే. కువైట్, యూఏఈ, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ అనే అరడజను గల్ఫ్ దేశాలకు మన వలసలకదే కారణం.
తాజా ఘటనలో చనిపోయిందీ ఇలాంటి వలసజీవులే! అందరూ 20 నుంచి 50 ఏళ్ళ మధ్య వయసు వారే! కేంద్ర మంత్రి, కేరళ ఆరోగ్య మంత్రి సహా పలువురు హుటాహుటిన కువైట్‌కు పయనమయ్యారు. బాధిత కుటుంబాలకు కేంద్రం, కేరళ ప్రభుత్వాలు తోచిన నష్టపరిహారం ప్రకటించాయి. కానీ, కేవలం ఇది సరిపోతుందా అన్నది బేతాళ ప్రశ్న.
కూలి కోసం, కూటి కోసం విదేశాలకు వెళ్ళి, అక్కడ సంపాదించిన సొమ్మును స్వదేశంలోని ఇంటికి పంపి, పరోక్షంగా మన ఆర్థిక వ్యవస్థ పురోగతికి అండగా నిలుస్తున్న తోటి భారతీయుల పట్ల మన అక్కర అంత మాత్రమేనా? గల్ఫ్ సహా వివిధ ప్రాంతాలకు వెళ్ళే వలస కార్మికులు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ, ఇవాళ్టికీ వీరి వెతల గురించి అక్కడి, ఇక్కడి ప్రభుత్వాలు పట్టించుకొనేది తక్కువే. వెళ్ళినవారు అనుకోకుండా ఏ చిక్కుల్లో పడినా, ఆఖరుకు ప్రాణాలే కోల్పోయినా ప్రవాస తెలుగు, తమిళ, మలయాళీ సంఘాల లాంటి ప్రైవేట్ సంస్థలే చొరవ తీసుకొని సాయపడుతున్నాయి.
భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్క కువైట్‌లోనే 2014 నుంచి 2018 మధ్య 2932 మంది భారతీయులు మరణించారు. 2023లో 708 మంది చనిపోయారు. అనూహ్య ప్రమాదాలప్పుడు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే తప్ప, అసలీ వలస కార్మికులు, ప్రవాస భారతీయుల కష్టనష్టాలను నిరంతరం గమనించేందుకు మనకంటూ ఇప్పటికీ పటిష్ఠమైన వ్యవస్థ, ప్రత్యేక మంత్రిత్వ శాఖ లాంటివి లేవు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నిబంధనల మేరకు గల్ఫ్ వెళ్ళే భారత కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలనే భరోసా, కువైట్ వలస కార్మికులకు రూ. 10 లక్షల ప్రవాసీ భారతీయ బీమా పథకం ఉన్నా, విదేశాంగ శాఖలో నమోదు చేసుకొని, అన్ని పత్రాలూ ఉన్నవారికే అవి వర్తిస్తాయి.
కానీ, అవేవీ పాటించకుండా పొట్టకూటి కోసం దళారుల్ని ఆశ్రయించి వెళ్ళే బడుగు జీవులే మన దగ్గర ఎక్కువ. పశ్చిమాసియాలోని మన వలస బిడ్డల సంపూర్ణ రక్షణకై ఇప్పటికైనా మన ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. సరైన నివాస వసతి సహా కనీస సౌకర్యాలతో జీవించే ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వాలతో కలసి కృషి చేయాలి. ఆర్థిక వ్యవస్థను ప్రపంచ పటంలో ఉన్నతంగా నిలుపుతున్న ఈ కనిపించని శ్రామిక శక్తి పట్ల అది కనీస కర్తవ్యం. జీవితంలో వారు, దేశంగా మనమూ గెలవడం సరే... ముందు హుందాగా బతకడం ముఖ్యం.
వలస పోయిన మందహాసం
Published Fri, Jun 14 2024 4:12 AM | Last Updated on Fri, Jun 14 2024 4:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment