కువైట్ అగ్నిప్రమాదం
కువైట్ సిటీ/ దుబాయ్: గల్ఫ్ దేశం కువైట్‌లో బుధవారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో అగ్నికి ఆహుతైన 49 మందిలో 45 మంది భారతీయులేనని అధికారులు తెలిపారు. మరో ముగ్గురు ఫిలిప్పీన్స్ దేశస్తులు కాగా మరో మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మృతుల్లో మలయాళీలు 24 మంది ఉన్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది.
ఆ రాష్ట్ర వాసులు మరో ఏడుగురు వివిధ ఆస్పత్రుల్లో ఐసీయూల్లో చికిత్స పొందుతున్నట్లు గుర్తించామని వెల్లడించింది. విదేశాంగ శాఖ నుంచి ధ్రువీకరణ సమాచారం అందాక బాధితుల వివరాలను వెల్లడిస్తామని తెలిపింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్ ప్రాంతంలోని ఏడంతస్తుల భవనంలో బుధవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో 49 మంది మృతి చెందగా మరో 50 మంది వరకు గాయపడ్డారు.
గురువారం కువైట్ చేరుకున్న విదేశాంగ మంత్రి కీర్తివర్థన్ సింగ్ క్షతగాత్రులైన భారతీయులతో మాట్లాడి, వారికి అవసరమైన సాయం అందేలా చూస్తున్నారు. ముబారక్ అల్‌కబీర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న భారతీయులను పరామర్శించారు. అదేవిధంగా, మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
నీళ్ల ట్యాంకుపైకి దూకి..
ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో ఆ భవనంలో కేరళలోని త్రిక్కారిపూర్‌కు చెందిన నళినాక్షన్ కూడా నిద్రిస్తున్నారు. మూడో అంతస్తులో ఉన్న ఆయన జనం హాహాకారాలు విని, వెంటనే అప్రమత్తం అయ్యారు. భవనం సమీపంలోనే ఉన్న వాటర్ ట్యాంకుపైకి దూకారు. పక్కటెముకలు విరిగి, తీవ్రంగా గాయపడిన నళినాక్షన్ ట్యాంకుపైన చిక్కుకుపోయారు. కదల్లేని స్థితిలో ఆయన్ను ఉదయం 11 గంటల సమయంలో కొందరు గుర్తించి కిందికి దించి, ఆస్పత్రికి తరలించారని అతడి మామ బాలకృష్ణన్ చెప్పారు.
కుమార్తెకు బహుమతిగా ఫోన్ ఇవ్వాలని..
12వ తరగతి బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన తన కూతురికి ఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకున్నారు లుకాస్. ఇంటికెళ్లాక కుమార్తెను స్వయంగా బెంగళూరు తీసుకెళ్లి నర్సింగ్ స్కూల్‌లో చేర్పిద్దామనుకున్నారు. అయితే, ఆ కల నెరవేరలేదు. కువైట్ ప్రమాదంలో అగ్నికి ఆహుతైన వారిలో కేరళలోని కొల్లంకు చెందిన లుకాస్ కూడా ఉన్నారు. బుధవారం వేకువజామున ప్రమాదం జరిగిన సమయంలో లూకాస్ తమ సొంతూళ్లోని చర్చి ఫాదర్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. హఠాత్తుగా ఫోన్ డిస్ కనెక్టయ్యింది. తర్వాత చర్చి ఫాదర్ ఫోన్ చేసినా లూకాస్ లిఫ్ట్ చేయ్యలేదు. 18 ఏళ్లుగా కువైట్‌లో ఉంటున్న లూకాస్‌కు వృద్ధులైన తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment