సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: తెలంగాణ దెబ్బకు జలాశయాలు ఖాళీ అవుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయాలను ఖాళీ చేస్తోంది. శ్రీశైలంలో కనీస నీటిమట్టానికి దిగువన నీటి నిల్వ ఉన్నప్పటికీ జూన్ 1 నుంచే తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తూ.. ప్రాజెక్టును ఖాళీ చేస్తూ.. తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు పదే పదే ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలంటూ కృష్ణా బోర్డు జారీ చేసిన ఆదేశాలను తుంగలో తొక్కి మూడు ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమకు న్యాయం చేయాలని ఈ వివాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ల దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం శ్రీశైలంలోకి 6,287 క్యూసెక్కులు వస్తుండగా.. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 21,189 క్యూసెక్కులను తెలంగాణ దిగువకు వదిలేస్తోంది. దీంతో శ్రీశైలంలో నీటిమట్టం 819.49 అడుగులకు పడిపోయింది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వ 40.45 టీఎంసీలకు తగ్గింది.
అలాగే నాగార్జునసాగర్‌లోకి వచ్చిన నీటిని వస్తున్నట్టుగా వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేయడంతో నీటిమట్టం 533.69 అడుగులకు పడిపోయింది. నీటి నిల్వ 175.45 టీఎంసీలకు తగ్గిపోయింది. పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు 9,000 క్యూసెక్కులు వదిలేస్తోంది. ప్రకాశం బ్యారేజీలో పూర్తి స్థాయిలో 3.07 టీఎంసీలు నిల్వ ఉండటంతో.. ఆరు గేట్లు ఎత్తి 8,340 క్యూసెక్కులు సముద్రంలోకి వృథాగా విడుదల చేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment