సాగర్‌లో జలజగడం
కుడికాల్వకు నీటి నిలిపివేతపై ఆంధ్రా అధికారుల వాగ్వాదం
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాల్వకు నీటి నిలిపివేతపై ఘర్షణ వాతావరణం నెలకొంది. డ్యాం ఉద్యోగులు, సిబ్బందితో ఆంధ్రా అధికారులు వాగ్వాదానికి దిగారు. కృష్ణానది బోర్డు నిర్ణయించిన మేరకు సోమవారం ఉదయానికి కుడికాల్వకు నీటి విడుదల పూర్తి కావడంతో నిలిపివేయాలని తెలంగాణ ఉన్నతాధి కారుల ఆదేశాల మేరకు డీఈ విజయకుమార్ ఆధ్వర్యంలో ఉదయం నీటి విడుద లను 7 వేల క్యూసెక్కుల నుంచి 2 వేల క్యూసెక్కులకు తగ్గిస్తూ వచ్చారు.
సమాచారం అందుకున్న ఆంధ్రా కుడికాల్వ డీఈ నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, ఏఈలు డ్యాం కంట్రోల్ గదికి చేరుకున్నారు. ఇటీవల 5.6 టీఎంసీల నీటిని కుడి కాల్వకు విడుదల చేయాలని బోర్డు నుంచి ఉత్తర్వులున్నాయని, ఇప్పటి వరకు 3.9 టీఎంసీలు మాత్రమే విడుదల చేశారని.. ఆవిరి రూపంలో కొంత పోయినా మరో టీఎంసీ నీటిని కుడి కాల్వకు విడుదల చేయాలంటే డ్యాం అధికారులతో వాదనకు దిగారు. దీంతో తెలంగాణ అ«ధికారులు డ్యాం సెక్యూరిటీ సహకారంతో కుడి కాల్వకు నీటిని పూర్తిగా నిలిపివేశారు.
ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునీల్ మాట్లాడుతూ ఫిబ్రవరి మూడు నుంచి ఇప్పటి వరకు కుడికాల్వకు నిర్ణీత 22.5 టీఎంసీల నీటిని విడుదల చేశామని తెలిపారు. నీటి నిలిపివేత విషయంలో ప్రతిసారీ పేచీలు పెట్టడం.. ఘర్షణకు దిగడం ఆంధ్రా అధికారులకు ఆనవాయితీగా మారిందన్నారు. డ్యాం, సెక్యూరిటీ అధికారు లు, సిబ్బందిపై ఆంధ్రా అధికారులు ఏపీపరిధిలోని రైట్‌బ్యాంకు (దక్షిణ విజయపురి) పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చేయిచేసుకుని నెట్టి వేశారని పేర్కొన్నారు.