►నదీ జలాలు, ప్రాజెక్టులపై పట్టు విడవని రెండు రాష్ట్రాలు
►కృష్ణా బోర్డు పరిధి, అధికారాలపై నోటిఫికేషన్ జారీ చేయాలన్న ఏపీ
►ట్రిబ్యునల్, కోర్టుల్లో వాటాలు తేలేవరకు వద్దన్న తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నది జలాలపై ఎడతెగని పంచాయితీ మళ్లీ అసంపూర్తిగానే ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ, ప్రాజెక్టులు, కృష్ణాబోర్డు పరిధి, అధికారాలపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ వద్ద జరిగిన సమావేశం ఓ కొలిక్కి రాకుండానే వాయిదా పడింది. దీనిపై బుధవారం మరోసారి సమావేశం కావాలని కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. ఢిల్లీలోని శ్రమశకి ్త భవన్‌లో జరిగిన ఈ భేటీలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్, కృష్ణా బోర్డు ఇన్‌చార్జి చైర్మన్ రామ్ శరాణ్, సభ్య కార్యదర్శి ఆర్.కె.గుప్తా, ఏపీ నీటి పారుదల ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, తెలంగాణ నీటి పారుదల ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఉదయం ఇరు రాష్ట్రాలు తమ అవసరాలపై వాదనలు వినిపించాయి. మధ్యాహ్నం స్టేట్ ప్రాజెక్ట్స్ కమిషనర్ కుష్విందర్ వోరా వద్ద దాదాపు నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి. తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:15 వరకు అమర్‌జిత్‌సింగ్ సమక్షంలో చర్చించారు.
పరస్పర భిన్న వాదనలు
కృష్ణా బోర్డు పరిధి, అధికారాలు, బాధ్యతలను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని ఏపీ పట్టుబట్టింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసి, వాటిపై నిర్వహణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు అప్పగించాలని కోరింది. కానీ కృష్ణా జలాల తుది కేటాయింపులు జరిగే వరకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు సరికాదని... కృష్ణా బోర్డుకు ఆ అధికారమే లేదని తెలంగాణ వాదించింది. ఏపీ నిర్మిస్తున్న పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు వాటా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ రెండు వాదనల్లో ఎవరూ పట్టు సడలించకపోవడంతో ఏకాభిప్రాయం కుదరలేదు.
ఇక ప్రాజెక్టులపై తాత్కాలిక యాజమాన్య ఏర్పాట్లపై అవగాహన చేసుకోవాలన్న కేంద్ర సూచనపైనా ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. అయితే తొలి ఏడాదికి సంబంధించి కొన్ని స్వల్ప వివాదాలున్నా మొత్తంగా విజయవంతమైందని ఇరు పక్షాలు అంగీకరించాయి. దానినే కొనసాగిస్తారా, లేదా.. ప్రత్యామ్నాయం ఏమిటన్న దానిపై స్పష్టత రాలేదు. కాగా సమావేశం అనంతరం దీనిపై తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌రావు మాట్లాడారు. గతేడాది కుదుర్చుకున్న తాత్కాలిక అవగాహన బాగానే కొనసాగిందని, దాన్ని ఈసారీ కొనసాగిస్తే ఎలాగుంటుందన్న అంశంపై చర్చించామని చెప్పారు. అయినా చర్చలు ఓ కొలిక్కి రాలేదన్నారు.