River Water
-
ఎన్నాళ్లీ తీస్తా వివాదం!
నదీజలాల విషయంలో ఆచితూచి అడుగేయకపోతే ఆ నీళ్లల్లోనే నిప్పులు పుట్టుకొస్తాయి. అంతర్గతంగా ప్రాంతాల మధ్యనే తరచు చిచ్చు రేపే నదీజలాలు... పొరుగునున్న దేశంతో పంచుకోవాల్సి వచ్చినప్పుడు సమస్యగా మారటంలో వింతేమీ లేదు. ఈమధ్యే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మన దేశాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో రెండు దేశాలమధ్యా పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరటంతోపాటు తీస్తా నదీజలాల పంపకంపై చర్చలు జరపాలనీ, ఫరక్కా జలాలపై తాజా ఒప్పందం కుదుర్చుకోవాలనీ ఇరు దేశాధినేతలూ నిర్ణయించారు. సరిగ్గా ఇదే ఇప్పుడు వివాదాన్ని రగిల్చింది. నదీజలాల విషయంలో ఉభయులకూ అంగీకారయోగ్యమైన పరిష్కారం కోసం కృషిచేయాలని భారత్, బంగ్లాదేశ్‌లు నిర్ణయించుకున్నాయని మంగళవారం ఢాకాలో హసీనా ప్రకటించిన వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చురుగ్గా స్పందించారు. ఈ అంశంలో తమను ఎందుకు సంప్రదించలేదంటూ కేంద్రంపై భగ్గుమన్నారు. ఇది సరికాదని అభ్యంతరం చెబుతూ ఆమె మోదీకి లేఖ రాశారు. మమత ఇలా స్పందించటం ఇది మొదటిసారేమీ కాదు. ప్రజానీకానికి గుక్కెడు నీళ్లందించాలన్నా, పచ్చటి పైర్లతో పొలాలు కళకళలాడాలన్నా బంగ్లాదేశ్‌కు ఈ నదీజలాలపై భారత్‌తో ఒప్పందం కుదరటం, ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావటం ఎంతో అవసరం. 2011లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తీస్తాపై ఒప్పందం దాదాపు ఖరారైంది. కానీ ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ అధినేత మమత అలకబూనటంతో అది ఆఖరు నిమిషంలో ఆగిపోయింది. రాజకీయంగా యూపీఏకు ఉన్న పరిమితులేమిటో, మమత స్వభావమేమిటో తెలిసిన హసీనా దానిపై పట్టుబట్టకుండా ఉండిపోయారు. ఈ నేపథ్యం తెలిసినందువల్లే ప్రధాని నరేంద్ర మోదీ 2015లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు తన ప్రతినిధి బృందంలో ఆమెను కూడా చేర్చారు. ఒప్పందం కుదరకపోవటం వల్ల తమ దేశానికి ఎదురవుతున్న సమస్యలను హసీనా ఆమెకు వివరించగా, రాష్ట్రంలో తనకెదురయ్యే ప్రతిబంధకాలను మమత తెలిపారని కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో తీస్తా ప్రాజెక్టు గురించి బంగ్లాదేశ్ ప్రస్తావించకపోలేదు. కానీ బెంగాల్ అభ్యంతరాలు ఎప్పటిలాగే ఉండటం ఈ సమస్యకు శాపంగా మారింది. నిజానికి చారిత్రకంగా, సాంస్కృతికంగా పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ఎంతో సన్నిహితమైనవి. దేశంలో జాతీయవాదం అంతకంతకు విస్తరించటానికి ఈ ప్రాంతమే కారణమని భావించిన బ్రిటిష్ వలసపాలకులు 1905లో బెంగాల్ విభజన చట్టం తీసుకొచ్చినప్పుడు నిరసనలు పెల్లుబికాయి. చివరకు 1911లో దాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ ప్రయత్నం హిందూ ముస్లింల మధ్య పొరపొచ్చాలను పెంచింది. స్వాతంత్య్రానంతరం దేశ విభజన జరిగినప్పుడు అది పాకిస్తాన్లో భాగంగా మారింది. పాకిస్తాన్ చెరలో తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించటానికి 1971లో మన దేశం అందించిన తోడ్పాటును బంగ్లా ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. కానీ బంగ్లాదేశ్ తన సమస్యలను వాయిదా వేస్తూ పోలేదు. తమ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బంగ్లా చిరకాల ఆకాంక్ష నెరవేర్చటం ఎలాగో మమతా బెనర్జీ ఆలోచించాలి. అవసరమైతే ఒక మెట్టు దిగేందుకు కూడా సిద్ధపడాలి. గంగానదిపై బెంగాల్లో నిర్మించిన ఫరక్కా బరాజ్ నుంచి బంగ్లాకు నదీజలాలు అందించటంపై 1996లో 30 ఏళ్లకు ఒప్పందం కుదిరింది.అది మరో రెండేళ్లలో పూర్తికావాల్సి వుంది. కనుక దానిపై కొత్తగా ఒప్పందం అవసరం. 1996లో తమకిచ్చిన హామీలను నెరవేర్చని కేంద్రం ఇప్పుడు మరోసారి తీస్తా, గంగా జలాలపై బంగ్లాతో చర్చించిందని మమత ఆరోపణ. అయితే అప్పుడూ ఇప్పుడూ కూడా బెంగాల్‌తో చర్చిస్తూనే ఉన్నామన్నది కేంద్రం జవాబు. 1996లో ఆ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న నీటిపారుదల శాఖ ప్రతినిధితో మాట్లాడారనీ, నిరుడు జూలై 24న కూడా ఫరక్కా జలాల అంశంపై ఏర్పడిన కమిటీలో బెంగాల్ నీటిపారుదల రంగం నిపుణుడు పాల్గొన్నారనీ కేంద్రం చెబుతోంది. మొన్న 14న ఆ కమిటీ నివేదిక కూడా సమర్పించిందని వివరించింది. అయితే ఇదంతా కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా చేసిందే తప్ప విధానపరమైన చర్చలు కాదని మమత సర్కారు జవాబు. తమ అధికారులు కేవలం కేంద్రం అడిగిన సాంకేతిక వివరాలు మాత్రమే అందించారని తెలిపింది. దక్షిణాసియాపైనా, మరీ ముఖ్యంగా ఈ ప్రాంత దేశాలతో భారత్‌కున్న సంబంధాలపైనా చైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇలాంటి సమయంలో పట్టుదలకు పోయి నదీజలాలపై వివాదం రాజేయటం మంచిది కాదు. తీస్తా ప్రాజెక్టుపై అటు చైనా, ఇటు భారత్ ప్రతిపాదనలిచ్చాయనీ, ఎవరి ప్రతిపాదన బాగుందో చూసి నిర్ణయిస్తామనీ మంగళవారం హసీనా తెలిపారు. ఇది ఒక రకంగా భారత్ ముందుకు రాకపోతే చైనావైపు చూస్తామని చెప్పటమే. ఎగుమతుల ద్వారా బంగ్లా సమకూర్చుకుంటున్న ఆదాయంలో 80 శాతం వాటావున్న దుస్తుల తయారీ ముడిసరుకంతా చైనాయే సరఫరా చేస్తోంది. పైగా బంగ్లా వాణిజ్యంలో చైనా అతి పెద్ద భాగస్వామి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బెంగాల్ వ్యవహరించాలి. విదేశాంగ విధాన నిర్ణయాలపై రాష్ట్రాల ప్రమేయం ఉండటం మంచిదికాదు. అదే సమయంలో బెంగాల్ ప్రయోజనాలు కాపాడటం కేంద్రం బాధ్యత. గత హామీలు నెరవేర్చలేకపోతే కారణాలేమిటో తెలుసుకుని వాటిని సరిదిద్దాలి. చిరకాల సమస్య అయిన తీస్తా వివాదంపై బెంగాల్‌ను ఒప్పించి బంగ్లా ఆకాంక్ష నెరవేర్చటం ఎలాగో కేంద్రం ఆలోచించాలి. -
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో బీఆర్ఎస్ విఫలమైంది
-
సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలం
సాక్షి, అమరావతి: కడలి పాలవుతున్న నదీ జలాలను ఒడిసిపట్టేందుకు దివంగత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞాన్ని పూర్తి చేసి రైతులకు ఫలాలను అందించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా శ్రమిస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు జలాలను గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా వరుసగా నాలుగేళ్లు ఖరీఫ్, రబీలో కోటి ఎకరాలకు నీళ్లందించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో సైతం వరుసగా నాలుగేళ్లు ఏటా కోటి ఎకరాలకు నీళ్లందించిన దాఖలాలు లేవు. టీడీపీ హయాంలో ఏటా సగటున 50 లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. నాడు దుర్భిక్షం.. నేడు సుభిక్షం ♦ టీడీపీ హయాంలో 2014–19 దుర్భిక్ష పరిస్థితులు నెలకొనగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం సుభిక్షంగా మారింది. ♦ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల (45.77 టీఎంసీలు), గండికోట (26.85 టీఎంసీలు), చిత్రావతి (పది టీఎంసీలు), సోమశిల (78 టీఎంసీలు), కండలేరు(68.03 టీఎంసీలు), గోరకల్లు (12.44 టీఎంసీలు), అవుకు (4.15 టీఎంసీలు) రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించారు. ♦ తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్‌లో 2019 నుంచే ఏటా గరిష్ట స్థాయిలో 16.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఇదే ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్‌వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి 2020లో గరిష్ట స్థాయిలో 17.74 టీఎంసీలను నిల్వ చేశారు. తద్వారా తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేలా మార్గం సుగమం చేశారు. ♦ శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ప్రాజెక్టులను నింపేలా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కాలువలను ఆధునికీకరించే పనులను చేపట్టారు. మహోజ్వల ఘట్టం సాగునీటి ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత క్రమంలో చకచకా పూర్తి చేస్తున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. ఈ రెండు బ్యారేజ్‌ల ద్వారా నెల్లూరు జిల్లాలో 4,84,525 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేశారు. నెల్లూరు నగరంతోపాటు పెన్నా పరీవాహక ప్రాంతంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. జలాశయంగా రూపుదిద్దుకున్న పోలవరం పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తూ మహానేత వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా చేపట్టారు. వంద శాతం వ్యయం భరించి పోలవరాన్ని తామే పూర్తి చేస్తామని విభజన చట్టం సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. కమీషన్ల దాహంతో 2013–14 ధరలకు తామే పూర్తి చేస్తామని నాడు చంద్రబాబు చెప్పడంతో 2016 సెపె్టంబర్ 7న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించింది. ఆ తర్వాత లాభాలు వచ్చే పనులను చేపట్టి ప్రాజెక్టును చంద్రబాబు గాలికి వదిలేశారు. కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని మోదీ సైతం వ్యాఖ్యానించడం అందుకు నిదర్శనం. చంద్రబాబు పాపాల ఫలితంగా గోదావరి వరద ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నాలుగు చోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి పనులు చేపట్టారు. -
రెండు రెట్లు కడలి పాలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తాగు, సాగునీటి కోసం వినియోగిస్తున్న నదీ జలాల కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా కడలి పాలవుతున్నట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నదీ జలాలను మళ్లించకుంటే తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. దేశంలో సగటు వర్షపాతం, నదుల్లో ప్రవాహం, ఉపయోగించుకోదగిన జలాలు, ప్రస్తుతం వాడుకుంటున్న నీరు, భవిష్యత్ అవసరాలపై సీడబ్ల్యూసీ సమగ్రంగా అధ్యయనం చేసింది. అందులో ప్రధానాంశాలు ఇవీ.. ► దేశంలో ఏటా సగటున 1,298.6 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. వర్షపాతం రూపంలో 1,37,002.08 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. ► వర్షపాతం వల్ల గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహం రూపంలో 70,591.75 టీఎంసీలు లభిస్తుండగా ప్రస్తుతం జలాశయాల ద్వారా 24,367.43 టీఎంసీలను ఉపయోగించుకుంటున్నాం. అంటే ఏటా 46,224.32 టీఎంసీలు కడలిలో కలుస్తున్నట్లు స్పష్టమవుతోంది. వాడుకుంటున్న నీటి కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా నదీ జలాలు కడలిలో కలుస్తున్నట్లు వెల్లడవుతోంది. ► దేశవ్యాప్తంగా వివిధ నదులపై నిర్మించిన 5,745 డ్యామ్‌ల నీటి నిల్వ సామర్థ్యం 9,103.34 టీఎంసీలు. ఈ డ్యామ్‌లలో నీటిని నిల్వ చేస్తూ సాగు, తాగునీటి అవసరాల కోసం 24,367.43 టీఎంసీలను వాడుకుంటున్నాం. ► ఆంధ్రప్రదేశ్‌లో 166 డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం 983.59 టీఎంసీలు. 1.05 కోట్ల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ► దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జలాశయాలను నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించకుంటే సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవు. ► నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపర్చ కుంటే ఆహార ధాన్యాల దిగుబడి పెరగదు. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగకుంటే ఆహార సంక్షోభానికి దారి తీస్తుంది. ► దేశంలో ప్రజల రోజువారీ అవసరాలు, తాగునీటి కోసం తలసరి నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్ మీటర్లు (వెయ్యి లీటర్లు ఒక క్యూబిక్ మీటర్‌కు సమానం) ఉంది. 2011 నాటికి 1,545 క్యూబిక్ మీటర్లకు, 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోయింది. నదీ జలాలను మళ్లించకుంటే తలసరి నీటి లభ్యత 2031 నాటికి 1367 క్యూబిక్ మీటర్లకు, 2041 నాటికి 1282 క్యూబిక్ మీటర్లకు, 2051 నాటికి 1228 క్యూబిక్ మీటర్లకు తగ్గుపోతుంది. తాగు, రోజువారీ అవసరాల కోసం నీటి కొరత తీవ్రమవుతుంది. -
ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్ నది.. చైనానే కారణం?
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ నది పూర్తిగా బురదమయమైంది. ఉపయోగించుకోలేని స్థితిలో నీరు కలుషితంగా, బురదతో నిండిపోయింది. అయితే, అందుకు ఎగువ ప్రాంతంలో చైనా చేపట్టిన నిర్మాణ కార్యక్రమాలే కారణమని, దీంతో సరిహద్దు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు తూర్పు సింయాగ్ జిల్లాలోని పాసిఘట్‌కు చెందిన అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌కు ప్రాణదాతగా ఉన్న సియాంగ్ నదిలోని నీరు గత మూడు రోజుల్లోనే రంగు మారిపోయి, బురదమయంగా తయారైనట్లు చెప్పారు. ‘కొద్ది రోజులుగా అసలు వర్షాలే లేవు. అయినా, ఈ నదిలోని నీరు బురదమయంగా మారిపోయి ప్రవహిస్తోంది. నీటి వనరుల విభాగం అధికారులతో కలిసి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. చైనాలో ఈ నదిని యార్లుంగ్ సాంగ్పోగా పిలుస్తారు. చైనా చేపట్టిన తవ్వకాల ఫలితంగా నీటిలో బురద ప్రవహిస్తోంది. చైనాలో సియాంగ్ నది ప్రవహిస్తున్న ప్రాంతంలో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు.. ఎగువ భాగంలో కొండచరియలు విరిగిపడటమూ ఒక కారణంగా చెప్పొచ్చు.’ అని తెలిపారు తూర్పు సింయాంగ్ డిప్యూటీ కమిషనర్ త్యాగి టగ్గు. సియాంగ్ నదిలో ఒక్కసారిగా నీరు రంగుమారిపోవటంపై సమీప ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చాలా వరకు మత్స్యకారులు, రైతులు ఈ నదిపైనే ఆధారపడుతున్నారు. బురదమయంగా మారిన నీటితో చేపలు చనిపోతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితి చాలా మందిపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కొన్ని సందర్భాల్లో ఈ నది బురదమయంగా మారింది. 2017, డిసెంబర్లో ఈ నది నల్లగా మారిపోయింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై చైనాతో చర్చలు జరిపి పరిస్థితని చక్కదిద్దింది కేంద్ర ప్రభుత్వం. ఇదీ చదవండి: అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుపై రాళ్ల దాడి? -
పులి దమ్ము అలా ఉంటది.. వరదలో బ్యారేజ్ గేట్ల వద్ద బతుకు పోరాటం
Tiger Survives Strong River Current.. దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వన్య ప్రాణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరీ ప్రాంతంలో ఓ పులి బ్యారేజ్నీటిలో తన ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. అయితే, కర్తానియాఘాట్ టైగర్ రిజర్వ్ దగ్గర వరద ధాటికి ఓ పులి కొట్టుకుపోయింది. గిరిజపురి బ్యారేజీ వద్ద ఘగ్రా నది ప్రవాహం ఉద్ధృతంగా ఉండటం వల్ల పులి వరదలో చిక్కుకుపోయి బ్యారేజ్ గేట్ల వరకు కొట్టుకొచ్చింది. #Tiger caught in heavy currents in Sharda river in Katarniaghat.#UttarPradesh https://t.co/V2dTBPDzVh pic.twitter.com/te9vOxHoSM — Arvind Chauhan अरविंद चौहान (@Arv_Ind_Chauhan) July 22, 2022 ఈ క్రమంలో బ్యారేజ్ గేట్ల వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. మీదకు ఎక్కే ప్రయత్నం చేసిన వరద ధాటికి నీటిలో మునిగిపోయింది. దీంతో, సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు స్థానికుల సాయంతో పులిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. However, tiger being a powerful and great swimmer, could cross the river against the current, and reached in jungles of Katerniaghat, part of Dudhwa Tiger Reserve. pic.twitter.com/cc6ak664dE — Ramesh Pandey (@rameshpandeyifs) July 22, 2022 ఇది కూడా చదవండి: కోతి పగ పట్టిందా.. రక్తం వచ్చేలా తల్లి, చిన్నారిపై దాడి -
ప్రపంచంలోనే అత్యంత భారీ చేప గుర్తింపు!
ప్రపంచంలోనే అతిపె..ద్ద మంచి నీటి చేపను గుర్తించారు పరిశోధకులు. ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన పెద్ద చేపలతో పోల్చుకుని.. దీనిని నిర్ధారించారు. సుమారు 13 అడుగుల పొడవు, దాదాపు 300 కేజీల బరువు ఉంది అది. కంబోడియా మెకాంగ్ నదిలో ఈ భారీ చేపను గుర్తించారు. పదలు సంఖ్యలో జాలర్లు దీనిని ఒడ్డుకు లాక్కొరు. ఖేమర్ భాషలో క్రిస్టెన్డ్ బోరామీ(పూర్తి చంద్రుడు) అని పిలవబడే ఈ చేపకు.. దాని ఆకారం వల్లే ఆ పేరు వచ్చింది. అయితే దొరికిన ఈ భారీ చేపను పరిశీలించిన పరిశోధకులు.. జాలర్లను ఒప్పించి ఎలక్ట్రానిక్ ట్యాగ్‌తో తిరిగి నీళ్లలోకి వదిలేశారు. ఇక నుంచి దాని కదలికలను పరిశీలించనున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్లో ‘మాంస్టర్ ఫిష్’ షో నిర్వాహకుడు జెబ్ హోగన్.. దీనిని అధికారికంగా ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి చేపగా గుర్తించారు. ఇంతకుముందు 2005లో థాయ్‌లాండ్‌లో 293 కేజీల బరువున్న ఓ క్యాష్ పిష్‌ను పరిశోధకులు గుర్తించారు. మెకాంగ్ నది ప్రపంచంలోనే చేపల ఆవాసం ఎక్కువగా ఉండే మూడో నది. మితిమీరి చేపలు పట్టడం, కాలుష్యం, ఉప్పునీటి చొరబాటు, అవక్షేపాల క్షీణత కారణంగా చేపల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. -
నయా ట్యాబ్లెట్: బ్యాక్టీరియా ఖతం.. నీరు ఫిల్టర్
బయటికి వెళ్లినప్పుడు మంచి నీళ్లు కావాలంటే.. వెంటనే ఓ బాటిల్ కొంటారు. మరి బాటిల్స్ అందుబాటులో లేని ప్రాంతాలకు వెళ్తే? కంటి ముందు నీటి ప్రవాహాలున్నా... తాగడానికి అనువుగా లేకపోతే? మనిషికి ఎంత కష్టం కదా! ఇక ఆ బాధ అక్కర్లేదు. మీరు అడవుల్లో ఉన్నా, గుట్టలపై ట్రెక్కింగ్ చేస్తున్నా... ముందు నీటి కాలువ ఉంటే చాలు. ఆ నీటిని ఫిల్టర్‌చేసే ట్యాబ్లెట్ వచ్చేసింది. అదే హైడ్రోజెల్. కలుషితమైన నీటిని గంటలోపే స్వచ్ఛమైన తాగునీరుగా మార్చేస్తుంది. టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన కెమికల్ ఇంజనీర్లు దీనిని కనిపెట్టారు. అక్కడి విద్యార్థి యోహాంగ్ గుయో సూర్యకాంతితో నీటిని శుద్ధి చేసే ప్రయోగం చేస్తుండగా అనుకోకుండా హైడ్రోజెల్ ఆలోచన వచ్చింది. నీటి కొరత తీరొచ్చు... ప్రపంచ జనాభాలో మూడోవంతు ప్రజానీకానికి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు. నీటిని తాగాలంటే మరగబెట్టడమో, శుద్ధీకరణో చేయాల్సిందే. ఆ రెండు పద్ధతులకు విద్యుత్ అవసరం. అంతేకాదు... అధిక సమయం, శ్రమ కూడా. కానీ ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందుకు తగిన వనరులు లేవు. కానీ హైడ్రోజెల్ ఒక్క ట్యాబ్లెట్ ఉంటే... ఇవేవీ అక్కర్లేవు. హైడ్రోజెల్లో ఉన్న హైడ్రోజెన్ పెరాక్సై డ్... నీటిలోని బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఇందుకు విద్యుత్ అవసరం లేదు. ఇందులో ఎలాంటి హానికారకాలు లేవు. సూర్యకాంతితో నీరు ఆవిరయి అందులోని కాలుష్యాన్ని వేరు చేసినట్టుగానే... హైడ్రోజెల్ తనంతట తానే నీటిని శుద్ధి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాగునీటి కొరతను తీర్చడంలో హైడ్రోజెల్ గొప్పగా సహాయపడుతుందని టెక్సాస్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గుహియాయు తెలిపారు. -
హక్కులు తుంగ‘భద్రం’
సాక్షి, అమరావతి: నదీ జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. కర్ణాటక జల చౌర్యంపై తుంగభద్ర బోర్డుతో చర్చించి.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, ఆర్డీఎస్ల వద్ద టెలీమీటర్లు ఏర్పాటు చేయించింది. ఫలితంగా జల చౌర్యానికి అడ్డుకట్ట పడి.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్ కోటా కింద 2019–20లో 54.36 టీఎంసీలు రాష్ట్రానికి చేరితే, ఈ ఏడాది ఆదివారం నాటికి రాష్ట్రానికి 38.470 టీఎంసీలు చేరాయి. యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీటిని అందిస్తుండటంతో రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయబసవన చానళ్ల ద్వారా కర్ణాటకకు 138.99.. ఏపీకి 66.50 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు 10).. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 6.51 మొత్తం 212 టీఎంసీలను కేటాయించింది. అయితే వరద రోజులు తగ్గడం, డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ తగ్గడంతో నీటి లభ్యత తగ్గింది. నీటి సంవత్సరం ప్రారంభంలో నీటి లభ్యతపై అంచనా వేస్తున్న బోర్డు.. మూడు రాష్ట్రాలకు వాటా మేరకు దామాషా పద్ధతిలో నీటిని పంపిణీ చేస్తూ, విడుదల చేస్తోంది.. హెచ్చెల్సీ కింద అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 1,90,035.. ఎల్లెల్సీ కింద కర్నూలు జిల్లాలో 1,57,012.. కేసీ కెనాల్ కింద కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 2,65,628 వెరసి 6,12,675 ఎకరాల ఆయకట్టు ఉంది. కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయబసవన చానళ్ల కింద 9,78,824 ఎకరాలు, ఆర్డీఎస్ కింద తెలంగాణలో 87 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. జలచౌర్యం వల్ల చేరని జలాలు.. కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ 104 కి.మీ.లు.. ఎల్లెల్సీ కాలువ 131.50 కి.మీ.లు ఉంటుంది. ఈ రెండు కాలువల నుంచి ఆ రాష్ట్రంలో భారీ ఎత్తున జలచౌర్యం చేయడం వల్ల హెచ్చెల్సీ, ఎల్లెల్సీల నుంచి రాష్ట్ర సరిహద్దుకు అరకొర జలాలు మాత్రమే చేరేవి. దాంతో ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. జలచౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు హెచ్చెల్సీ.. ఎల్లెల్సీలను ఆధునికీకరించాలని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో తుంగభద్ర బోర్డుకు ప్రతిపాదించారు.. ఆ మేరకు కర్ణాటకను కూడా ఒప్పించారు. ఇరు రాష్ట్రాలు నిధులు విడుదల చేయడంతో ఇప్పటికే కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తయింది. ఎల్లెల్సీ ఆధునికీకరణ 102 కి.మీ వరకూ పూర్తయింది.. మిగిలిన పనులను పూర్తి చేయాలని బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. హెచ్చెల్సీ, ఎల్లెల్సీలకు నీటిని విడుదల చేసే రెగ్యులేటర్ల వద్ద.. రాష్ట్ర సరిహద్దులో టెలీమీటర్లు ఏర్పాటు చేయాలని కోరింది. దాంతో గతేడాది ఆయా రెగ్యులేటర్ల వద్ద.. రాష్ట్ర సరిహద్దులో టెలీమీటర్లను బోర్డు ఏర్పాటు చేసింది. పక్కాగా నీటి లెక్క.. బోర్డు పరిధిలోని కాలువలపై పూర్తి స్థాయిలో టెలీమీటర్లను ఏర్పాటు చేయడంతో అవి చుక్క చుక్కనూ పక్కాగా లెక్కిస్తున్నాయి. దాంతో కర్ణాటక జలచౌర్యానికి పూర్తిగా అడ్డుకట్ట పడింది. దీని వల్లే గతేడాది గరిష్ఠంగా 54.36 టీఎంసీలు తుంగభద్ర జలాశయం నుంచి రాష్ట్రానికి చేరాయి. ఈ ఏడాది తుంగభద్ర డ్యామ్‌లో 170.8 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బోర్డు.. హెచ్చెల్సీకి 26.184, ఎల్లెల్సీకి 19.336, కేసీ కెనాల్‌కు 8.057 వెరసి 53.577 టీఎంసీలు కేటాయించింది. ఆదివారంనాటికి హెచ్చెల్సీ ద్వారా 23.578, ఎల్లెల్సీ ద్వారా 11.102, కేసీ కెనాల్‌కు 3.79 వెరసి 38.470 టీఎంసీలు చేరాయి. ఇంకా 15.107 టీఎంసీల కోటా మిగిలి ఉంది. ప్రస్తుతం టీబీ డ్యామ్‌లో 56.54 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా కోటా జలాలు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి చేరుతాయని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
బీట్ రూట్ రసం కాదు.. నదిలోని నీళ్లు..!
సాధారణంగా నది జలాలు నీలిరంగు లేదా తెలుపు రంగులో కనిపిస్తాయి. కానీ ఎప్పుడైనా నదిలో నీళ్లు బీట్రూట్ రంగులోకి మారడం చూశారా.. అవును తెలియని కాలుష్య కారకాలు ఓ నదిని విషతుల్యం చేశాయి. వీటి కారణంగా నదిలోని నీరు నీలి రంగు నుంచి ముదురు గులాబీ (బీట్రూట్) రంగులోకి మారాయి. అయితే ఇది మన దేశంలో నది కాదండోయ్. రష్యాలోని ఇస్కిటిమ్కా నది పరిస్థితి. ఒక ప్రత్యేకమైన కాలుష్య కారకం నదిలో కలిసిన తర్వాతనే నీరు ఇలా నీలి రంగు నుంచి బీట్రూట్ రంగులోకి మారిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ పరిస్థితికి కారణమైన రసాయనాల గురించి అధికారులు పరిశోధనలు కూడా చేస్తున్నారు. ఈ నదిలో నీళ్లు తమ కిమెరోవో పారిశ్రామిక ప్రాంతం వెళుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీట్ రూట్ రంగులో ఉన్న ఈ ఇస్కిటిమ్కా నది ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: వైరల్ : నేను వెళ్లనంటూ ట్రంప్ మారాం ఈ విషయంపై స్థానికులు మాట్లాడుతూ.. ఇది ప్రస్తుతం నదిలాగా కనిపించడం లేదని, తినే పదార్థం క్రాన్‌బెర్రి జెల్లి మాదిరి కనిపిస్తుందని తెలిపాడు. నది రంగు మారడానికి కారణమైన కాలుష్య కారకం గురించి తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని కెమెరోవో డిప్యూటీ గవర్నర్ ఆండ్రియా పానోవ్ తెలిపారు. నది నీరు ఇలా మారడానికి గల కారకులను తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. త్వరలోనే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ఇస్కిటిమ్కా నదియే కాకుండా, పశ్చిమ రష్యాలోని నారో-ఫోమిన్స్క్ లోని మరో నది కూడా పరిశ్రమల నుంచి రసాయనాలు విడుదల తరువాత ఎర్రగా మారింది. చదవండి: గాల్లోనే పొట్ట చీల్చుకుని బయటకొచ్చింది! Река Искитимка в Кемерове окрасилась в красный цвет. Причины выясняются. Нихуя сколько борща сварили😳 pic.twitter.com/HkuYnlYJZu — #MDK (@mudakoff) November 6, 2020 Река Искитимка в Кемерове окрасилась в красный цвет. Причины выясняются. Нихуя сколько борща сварили😳 pic.twitter.com/HkuYnlYJZu — #MDK (@mudakoff) November 6, 2020 -
ప్రాణభయంతో కేకలు.. ఆరుగుర్ని కాపాడిన ఎస్ఐ
సాక్షి, సుండుపల్లె (రాజంపేట) : పింఛా జలాశయం నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఆరుగురు ప్రాణాలను సుండుపల్లె ఎస్ఐ భక్తవత్సలం కాపాడారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సుండుపల్లె మండలం ఫించా జలాశయానికి నీటి ఉధృతి పెరిగింది. శుక్రవారం జలాశయ గేట్లు ఎత్తారు. బహుదా నదిలోకి వరదనీరు జోరుగా ప్రవాహించింది. ఈ నదీ పరీసర ప్రాంతాలలో మేకలను, బర్రెలను మేపుకుంటున్న కాపరులను నీరు చుట్టుముట్టింది. దీంతో బయట రాలేక రక్షించండంటూ ప్రాణభయంతో కేకలు వేశారు. ఒడ్డున ఉన్న వారు గమనించి ఎస్ఐకు సమాచారం ఇచ్చారు. దీంతో భక్తవత్సలం తన సిబ్బందితో , చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల సహకారంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి నీటిలో తాడు సహాయంతో దిగారు. మిట్టమీదపల్లెకు చెందిన ఆరుగురిని బయటికు తీసుకొచ్చారు. బయటపడిన వారిలో పెండ్లిమర్రి సరోజమ్మ, రాయవరం సుబ్రదమ్మ, రాయవరం బాబు, రాయవరం చెన్నయ్య, అన్నారపు కిరణ్‌కుమార్, నరసమ్మలు ఉన్నారు. ఎస్ఐ, పోలీసుల చొరవను స్థానికులు హర్షించారు. -
అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈనెల 5న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీ తర్వాత నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన భేటీ వాయిదా పడే అవకాశం ఉందని కృష్ణా, గోదావరి బోర్డు వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం సిద్ధమైన ప్రభుత్వం ► షెడ్యూల్ ప్రకారం అపెక్స్ కౌన్సిల్ భేటీలో పాల్గొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం మార్గదర్శకాల మేరకు మంగళవారం కేంద్ర జల్ శక్తి శాఖకు అజెండాను పంపాలని నిర్ణయించింది. ► కృష్ణా, గోదావరి నదులపై రెండు రాష్ట్రాలు చేపట్టిన కొత్త ప్రాజెక్టుల విషమయంలో బోర్డులకు తెలుగు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకున్నాయి. వీటిపై జూన్ 4న కృష్ణా బోర్డు, 5న గోదావరి బోర్డు సమావేశాలు జరిగాయి. సీడబ్ల్యూసీ అనుమతి లేని వాటిని కొత్త ప్రాజెక్టులుగానే పరిగణిస్తామని, వాటి డీపీఆర్‌లు ఇస్తే పరిశీలన, ఆమోదం కోసం అపెక్స్ కౌన్సిల్‌కు పంపుతామని బోర్డులు సూచించాయి. ► ఈనెల 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఆ రోజు ఇరు రాష్ట్రాల సీఎంలు అందుబాటులో ఉంటారో లేదో తెలపాలని సీఎస్‌లకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి గత నెల 28న లేఖ రాసింది. -
యుద్ధ ప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను ఒడిసి పట్టి, దుర్భిక్ష ప్రాంతాలకు తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులు, కాలువల విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. గోదావరి నీటితో పోలవరం–బొల్లాపల్లి–బీసీఆర్ (బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్) అనుసంధానం.. కృష్ణా నదికి వరద వచ్చే 50 రోజుల్లో శ్రీశైలం జలాశయంపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా రాయలసీమ ప్రాజెక్టుల కాలువల విస్తరణ పనులు.. వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను సుభిక్షం చేయడానికి చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలను వెంటనే పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన సాగునీటి ప్రాజెక్టుల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్‌ను పోలవరం నుంచి తీసుకొచ్చే గోదావరి వరద జలాలతో నింపి, అక్కడ నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించడం ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన పోలవరం–బొల్లాపల్లి–బీసీఆర్ అనుసంధానం పనులకు రూ.65 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి రూ.15,488 కోట్ల వ్యయం అవుతుందని, పల్నాడును సుభిక్షం చేయడానికి చేపట్టిన వరికపుడిశెల ఎత్తిపోతలకు రూ.1273 కోట్ల మేర వ్యయం అవుతుందని చెప్పారు. సముద్రపు నీళ్లు ఎగదన్నకుండా.. భూగర్భజలాలు ఉప్పుబారకుండా చేయడానికి ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదిపై నాలుగు బ్యారేజీలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా నదికి వరద వచ్చే 50 రోజుల్లో శ్రీశైలం జలాశయంపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా రాయలసీమ ప్రాజెక్టుల కాలువలను వెడల్పు చేసే పనులతోపాటు.. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి గాలేరు–నగరి, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు రోజుకు మూడు టీఎంసీలను తరలించడానికి ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయడానికి రూ.26 వేల కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి రూ.25 వేల కోట్ల మేర అవసరం అవుతాయన్నారు. మొత్తమ్మీద ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలంటే రూ.1.55 లక్షల కోట్ల మేర అవసరం అవుతాయని జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వివరించారు. పోలవరం పనులకు ఇబ్బంది తలెత్తకూడదు పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రధానమైనదని, ఆ ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.5,103 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించాల్సి ఉందన్నారు. పోలవరం పనులకు ఒక్క రోజు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి తలెత్తని విధంగా నిధుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పోలవరం నుంచి విశాఖపట్నంకు నిరంతరం తాగునీటిని సరఫరా చేసే పైపులైన్ వేసే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకే దశలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదికలు)లను తక్షణమే సిద్ధం చేసి.. టెండర్లు పిలిచి, పారదర్శకంగా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పనులకు నిధుల కొరత లేకుండా చూడటం ద్వారా వాటిని శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులను ఒకే దశలో చేపట్టాలని చెప్పారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై నాలుగు బ్యారేజీలు కాకుండా రెండు బ్యారేజీలను నిర్మించాలని.. ఆ మేరకు ప్రదేశాలను గుర్తించాలని ఆదేశించారు. వరికపుడిశెల ఎత్తిపోతలను, వంశధార, తోటపల్లి, చింతలపూడి, గుండ్లకమ్మ తదితర పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. -
కలుషితం.. నదీజలం
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలను తడిపి సిరులు కురిపించే నదీ జలాలు స్వచ్ఛమైనవి కావా? వీటిల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందా? దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవా? అనే ప్రశ్నలకు అవుననే హెచ్చరిస్తోంది కేంద్ర జల్‌శక్తి శాఖ. గోదావరి, కృష్ణా, పెన్నా, కుందూ, నాగావళి, మానేరు, కిన్నెరసాని తదితర నదుల్లో బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ), డిసాల్వ్డ్ ఆక్సిజన్(డీవో), క్షార స్వభావం (పీహెచ్) ప్రమాదకర స్థాయికి చేరిందని తాజా నివేదిక తేల్చింది. ఈ నదుల్లోని నీటిలో కోలి బ్యాక్టీరియా,కరిగిన ఘన పదార్థాల(టీడీఎస్) శాతం ప్రమాదకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర నదులతో పోల్చితే వంశధారలో కాలుష్య ప్రభావం కాస్త తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా 323 నదుల్లో కాలుష్య ప్రభావంపై కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి(సీపీసీబీ), అన్ని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు(పీసీబీ), కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి. సీపీసీబీ ప్రకారం నీటి స్వచ్ఛత ప్రమాణాలు ఇవీ.. - మనుషులు తాగడానికి వినియోగించే నీటిలో కోలి బ్యాక్టీరియా ఎంపీఎన్ (మోస్ట్ పాపులర్ నంబర్) వంద మిల్లీ లీటర్లకు 50 లోపు ఉండాలి. పీహెచ్ శాతం 6.5 వరకు ఉండవచ్చు. లీటర్ నీటికి డీవో ఆరు మిల్లీ గ్రాములు, బీవోడీ 2 మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. - మనుషులు స్నానానికి వినియోగించే నీటిలో కోలి బ్యాక్టీరియా ఎంపీఎన్ వంద మిల్లీలీటర్లకు 500 వరకు ఉండవచ్చు. పీహెచ్ 6.5 శాతం వరకు ఉండవచ్చు. లీటర్ నీటికి డీవో 5 మిల్లీగ్రాములు, బీవోడీ మూడు మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. - అడవి జంతువులు తాగడానికి, చేపల జీవనం, పెంపకానికి వినియోగించే నీటిలో పీహెచ్ 6.5 శాతం, డీవో లీటర్ నీటికి నాలుగు మిల్లీ గ్రాముల దాకా ఉండవచ్చు. కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం... - గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, నాగావళి, కుందూ, మానేరు, కిన్నెరసానిలో కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరినట్లు తాజా సర్వేలో వెల్లడైంది. - తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించే నదుల్లో కోలి బ్యాక్టీరియా మోతాదు పరిమితి దాటింది. డీవో, బీవోడీ, పీహెచ్ శాతం కూడా అధికంగా ఉంది. శుద్ధి చేయకుండా నదీ జలాలను తాగితే మూత్రపిండాలు, శ్వాసకోస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. - తెలుగు రాష్ట్రాల్లో అన్ని నదులతో పోల్చితే తుంగభద్రలో కాలుష్య తీవ్రత అధికంగా ఉంది. తుంగభద్ర జలాల్లో ఘన వ్యర్థాలు ఒక లీటర్ నీటిలో గరిష్టంగా 347 మిల్లీగ్రాములున్నాయి. ఇష్టారాజ్యంగా గనుల తవ్వకం, పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు చేరడమే దీనికి ప్రధాన కారణం. - కుందూ నదిలో కోలి బ్యాక్టీరియా వంద మిల్లీ లీటర్లకు గరిష్టంగా 900(టి.కోలి 800, ఎఫ్.కోలి 100) ఉండటం గమనార్హం. - వంశధార నదీ జలాల్లో పీహెచ్, డీవో, బీవోడీ, టి.కోలి, ఎఫ్.కోలి, టీడీఎస్ శాతం ఇతర నదులతో పోల్చితే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ శుద్ధి చేయకుండా తాగడం శ్రేయస్కరం కాదు. - నదీ జలాల్లో కాలుష్య తీవ్రత వల్ల వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. మత్స్య సంపద కూడా అంతరిస్తోంది. కాలుష్యానికి ప్రధాన కారణాలు - పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటిని నదుల్లోకి పెద్ద ఎత్తున వదలడం. - విచ్చలవిడిగా గనుల తవ్వకం. ఏం జరుగుతుంది? పరిస్థితులు ఇలాగే కొనసాగితే నదీ జలాలు స్నానానికి కూడా పనికి రావు శుద్ధి చేయని నదీ జలాలను తాగితే ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది -
‘ప్రాణహిత’పై ఆశలు
సాక్షి, ఆసిఫాబాద్: ప్రాణహిత ప్రాజెక్టుపై జిల్లా రైతాంగానికి ఆశలు పోవడం లేదు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టాలనే డిమాండ్ బలపడుతున్న నేపథ్యంలో ఈ ఆశలు మరింత ఎక్కువతున్నాయి. ప్రతిపక్షాలు ఇక్కడ ప్రాజెక్టు కట్టాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ బ్యారేజీ నిర్మాణంపై జిల్లా రైతాంగానికి ఆశలు సజీవంగా ఉంటున్నాయి. ఏటా వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే ప్రాణహిత నది ప్రవాహంలో లక్షల క్యూసెక్కుల నీరు జిల్లా రైతాంగం కళ్లెదుటే గోదావరిలో కలిసిపోతూ దిగువ ప్రాంతానికి తరలిపోతోంది. ఈ నీటి లభ్యతనే వాడుకునేందుకు రూ.38వేల కోట్లతో కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా పరిధిలోని 16.40 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టారు. ఈ మొత్తం ఆయకట్టులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోనే 1.56 లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా ప్రణాళిక వేశారు. అయితే తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రాజెక్టుల రీడిజైన్‌లో భాగంగా బ్యారేజీ నిర్మాణం తుమ్మిడిహెట్టి నుంచి ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద గోదావరిపై నిర్మించాలని యోచించడం, త్వరతిగతిన ప్రాజెక్టు పనులు పూర్తవడం, ప్రస్తుతం ఎత్తిపోతలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే తుమ్మిడిహెట్టి వద్ద మాత్రం ఎటువంటి కదలిక లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. దీనిపై త్వరితగతిన ఏదైనా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎటూ తేల్చని సర్కారు ప్రాణహితపై బ్యారేజీ నిర్మాణం విషయంలో ఇప్పటికీ ఎటువంటి అధికార ప్రకటన చేయకపోవడంతో ప్రతిపక్షాలు తరచూ ఆందోళన చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఇక్కడి రైతులకు సాగు నీరందిస్తామని తరచూ పార్టీ రాష్ట్రస్థాయి అగ్ర నాయకులు హామీ ఇస్తున్నారు. మిగతా విపక్ష పార్టీలు సైతం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి అనుకూలంగా ఉండడంతో ఎప్పటికైనా ప్రాణహితపై బ్యారేజీ నిర్మిస్తారనే ఆశల్లో ఇక్కడి రైతులు ఉన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టుకు సంబంధించి చింతలమానేపల్లి, దహేగాం మండల పరిధిలో తవ్విన కాలువలు నిరుపయోగంగా మారాయి. ఇందుకోసం గతంలోనే రైతుల నుంచి భూమి సేకరించారు. ఇక్కడ నీరు అందుతుందనే ఆశతో అనేక మంది రైతులు భూములు ఇచ్చి ప్రాజెక్టు ప్రారంభంలో ఆశ పడినా చివరకు ఇలా నిలిచిపోవడంతో అంతా నిరాశలో ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రాణహితపై బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపు అధికంగా ఉందని చెబుతు ముంపు తక్కువగా ఉన్న వార్దపై బ్యారేజీ నిర్మించి ఈ కాలువలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై కూడా ఎటువంటి స్పష్టత రాలేదు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు భవితవ్యం ఎటూ తేలకున్నా ఎప్పటికైనా బ్యారేజీ నిర్మితమవుతుందనే రైతుల ఆశలు సజీవంగా ఉంటున్నాయి. ఏళ్లుగా అదే అవస్థలు జిల్లాలో అపరిమితమైన సహజ నీటి వనరులున్నా రైతులకు ఆయకట్టు అందక పత్తి, సోయా, కంది, జొన్న వంటి ఆరుతడి పంటలకే పరిమతమవుతున్నారు. ఇప్పటికీ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు పైగా కేవలం పత్తి పంటనే ప్రధాన పంటగా పండిస్తున్నారు. వరి సాగు అంతంత మాత్రమే. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే వెనుకబడిన జిల్లాలో సాగు నీరందించడంతో వరి సాగు పెరిగి అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. మరోవైపు జిల్లాలో ప్రాణహిత బ్యారేజీతో పాటు కుమురం భీం, వట్టివాగు, జగన్నాథపూర్ ప్రాజెక్టులు సైతం పెండింగ్‌లోనే ఉండి రైతులకు సాగు నీరందించే స్థితిలో లేకపోవడంతో ఏళ్లుగా సాగునీటికి తిప్పలు తప్పడం లేదు. -
కర్ణాటక ప్రతిపాదనను తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి /బళ్లారి: తుంగభద్ర జలాశయానికి ఎగువన నదీ జలాల వినియోగం లెక్కలు చెప్పకుండా, సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) అందజేయకుండా ‘నవలి’ జలాశయం నిర్మాణానికి ఆమోదం తెలపాలంటూ కర్ణాటక సర్కార్ చేసిన ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తోసిపుచ్చాయి. జలాశయంలో పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలకు తగ్గిందంటూ కర్ణాటక చెబుతున్న లెక్కలు తప్పని తుంగభద్ర బోర్డు నిర్వహించిన పరిశోధనలోనే వెల్లడైందని, తుంగభద్ర నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలుగా బోర్డు తేల్చిందని ఏపీ పేర్కొంది. టీబీ ఎల్లెల్సీ (దిగువ కాలువ)లో 30 కి.మీ.ల పైపులైన్ నిర్మిస్తే జలచౌర్యం జరగకుండా కర్నూలు జిల్లాకు సమర్థంగా నీటిని తరలించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించగా పూర్తి వివరాలు అందజేస్తే పరిశీలించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని కర్ణాటక పేర్కొంది. తుంగభద్ర జలాశయం జల విస్తరణ ప్రాంతంలో ఎత్తిపోతల ద్వారా ఐదు టీఎంసీలను వినియోగిస్తున్నారని, దీన్ని కర్ణాటక కోటాలో లెక్కించాలన్న ప్రతిపాదనకు బోర్డు సానుకూలంగా స్పందించింది. ఎత్తిపోతల పథకాల ద్వారా కర్ణాటక వినియోగిస్తున్న జలాలను ఆ రాష్ట్రం ఖాతాలోనే పరిగణిస్తామని స్పష్టం చేసింది. జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో నీటిని పంచుకోవాలని మూడు రాష్ట్రాలు నిర్ణయించాయి. చైర్మన్ డి.రంగారెడ్డి నేతృత్వంలో తుంగభద్ర బోర్డు శనివారం బెంగళూరులోని వికాససౌధలో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈఎన్సీలు ఎం.వెంకటేశ్వరరావు, మురళీధర్, రాకేష్సింగ్లు ఇందులో పాల్గొన్నారు. నీటి లెక్కలతోపాటు డీపీఆర్ అందచేయాలన్న బోర్డు తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు నీటిని వినియోగించుకోలేకపోతున్నామని కర్ణాటక సర్కారు పేర్కొంది. ఈ నేపథ్యంలో తుంగభద్ర జలాశయానికి ఎగువన కొప్పళ జిల్లా ‘నవలి’ వద్ద 31.15 టీఎంసీలతో ఒక జలాశయం, మరో రెండు చెరువులను జలాశయాలుగా మార్చడం ద్వారా మొత్తం 50 టీఎంసీలను నిల్వ చేస్తే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు మూడు రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవచ్చునంటూ కర్ణాటక ప్రతిపాదించింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు వ్యతిరేకించారు. తుంగభద్ర జలాశయానికి ఎగువన నదీ జలాలను కర్ణాటక సర్కార్ భారీగా వినియోగిస్తోందన్నారు. ఆ లెక్కలు చెప్పకుండా, నవలి జలాశయం డీపీఆర్ అందజేయకుండా ఈ ప్రతిపాదనపై చర్చించలేమని తేల్చి చెప్పారు. వచ్చే సమావేశం నాటికి తుంగభద్ర జలాశయానికి ఎగువన వినియోగిస్తున్న నీటి లెక్కలతోపాటు నవలి డీపీఆర్‌ను అందజేయాలని టీబీ బోర్డు కర్ణాటక సర్కార్‌కు సూచించింది. మూడు రాష్ట్రాలు, సీడబ్ల్యూసీ ఆమోదం లేకుండా నవలి జలాశయం నిర్మాణానికి అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదని బోర్డు చైర్మన్ రంగారెడ్డి తేల్చి చెప్పారు. తుంగభద్ర హెచ్చెల్సీ(ఎగువ కాలువ)కి సమాంతరంగా వరద కాలువను తవ్వితే అటు కర్ణాటకలో బళ్లారి.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు తుంగభద్ర వరద జలాలను తరలించవచ్చని, దుర్భిక్ష ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు చేసిన ప్రతిపాదనను కర్ణాటక తోసిపుచ్చింది. బోర్డు లెక్క పరిగణనలోకి.. తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలకు తగ్గిపోయిందని కర్ణాటక వాదిస్తోంది. కానీ ఇటీవల బోర్డు చేసిన పరిశోధనలో నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలని తేలింది. ఆ లెక్కలనే పరిగణనలోకి తీసుకుని నీటి కేటాయింపులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు. దీనిపై కర్ణాటక జలవనరుల అధికారి రాకేష్‌సింగ్ స్పందిస్తూ బోర్డు లెక్కలపై అధ్యయనం చేశాక తమ అభిప్రాయాన్ని తెలియచేస్తామన్నారు. తుంగభద్ర ఎల్లెల్సీ ద్వారా కర్నూలు జిల్లాకు సక్రమంగా నీళ్లు రావడం లేదని, మధ్యలో చౌర్యం జరుగుతోందని, దీన్ని నివారించడానికి 30 కి.మీ.ల మేర పైపులైన్‌కు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ బోర్డును కోరింది. దీనిపై కర్ణాటక జలవనరుల శాఖ అధికారి రాకేష్ సింగ్ స్పందిస్తూ పైపులైన్‌కు ఎంత భూమి అవసరం? దీనివల్ల కేటాయించిన మేరకు నీటిని తరలించడం సాధ్యమవుతుందా? అనే వివరాలను ఆంధ్రప్రదేశ్ అందజేస్తే తమ అభిప్రాయాన్ని తెలియచేస్తామన్నారు. జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు దామాషా పద్ధతిలో నీటిని పంచుకోవాలన్న బోర్డు ప్రతిపాదనకు మూడు రాష్ట్రాలు అంగీకరించాయి. -
బాబు నిర్లక్ష్యం..కర్ణాటకకు వరం
సాక్షి, అమరావతి: నదీ జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడంలో టీడీపీ సర్కారు ఘోర వైఫల్యానికి ఇదో మచ్చుతునక. కర్ణాటక ప్రభుత్వం కేంద్ర జలసంఘం ఆదేశాలను తుంగలో తొక్కుతూ చేపట్టిన మూడు ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి నీళ్లు వదిలేందుకు సిద్ధమైనా గుడ్లప్పగించి చూసిన చంద్రబాబు సర్కారు కనీసం అభ్యంతరం కూడా తెలపకపోవడంపై సాగునీటి రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు జలాల్లో వాటా ఆధారంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో అదనంగా 21 టీఎంసీలను వినియోగించుకునేలా తాము మూడు ప్రాజెక్టులు చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కు కర్ణాటక సర్కార్ ప్రతిపాదనలు పంపింది. వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను పరిశీలించిన సీడబ్ల్యూసీ 2016 నవంబర్ 30న అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా ప్రాజెక్టుల పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది. కానీ సీడబ్ల్యూసీ మార్గదర్శకాలను బేఖాతర్ చేస్తూ ఆ మూడు ప్రాజెక్టులను చేపట్టిన కర్ణాటక సర్కార్ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తోంది. ఈ సీజన్లోనే 2.85 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు కర్ణాటక సిద్ధమైంది. ప్రజాప్రయోజనాలా.. వ్యక్తిగత లబ్ధా? చంద్రబాబు సర్కారు తీరును అలుసుగా చేసుకున్న కర్ణాటక ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ తీర్పును సాకుగా చూపుతూ కృష్ణా జలాల్లో అదనంగా 21 టీఎంసీలను వినియోగించుకునేలా 2016లో షిగ్గాన్, సింగటలూరు, అప్పర్ భద్ర ప్రాజెక్టులను చేపట్టింది. అయితే ఆ మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిశీలించిన సీడబ్ల్యూసీ అందులో లోపాలను గుర్తించి అనుమతి నిరాకరించింది. కానీ కర్ణాటక సర్కార్ దీన్ని తుంగలో తొక్కుతూ మూడు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన చేపట్టి దాదాపుగా పనులను పూర్తి చేసింది. ఈ సీజన్లో 2.85 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా కర్ణాటక సర్కార్ అక్రమంగా ప్రాజెక్టులు చేపడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీసం నోరు మెదపలేదు. 1996లో హెచ్డీ దేవెగౌడ నేతృత్వంలో యూడీఎఫ్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలోనే కృష్ణా నదిపై కర్ణాటక ఆల్మట్టిని పూర్తి చేసింది. దేవెగౌడను తానే ప్రధానిగా చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు అప్పట్లో ఆల్మట్టిని అడ్డుకోలేకపోయారు. తాజాగా ఆల్మట్టిని ఎత్తు పెంచుతున్నది దేవేగౌడ కుమారుడు కుమారస్వామి కావడం గమనార్హం. కుమారస్వామి సర్కార్‌కు చంద్రబాబు మద్దతు పలుకుతుండటం, దేవేగౌడతో కలసి ఎన్నికల ప్రచారం చేయటాన్ని బట్టి ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారన్నది స్పష్టమవుతోంది ఏపీలో కృష్ణా ఆయకట్టు ఎడారే.. షిగ్గాన్, సింగటలూరు, అప్పర్ భద్ర ప్రాజెక్టుల ద్వారా ఈ సీజన్ నుంచే కర్ణాటక ప్రభుత్వం కృష్ణా జలాలను ఆయకట్టుకు మళ్లించనుంది. ఆల్మట్టి ఎత్తు పెంచే పనులు శరవేగంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఎగువ నుంచి కృష్ణా వరద జలాలు రాష్ట్ర సరిహద్దుకు చేరడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోనుంది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంలో నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. ఎగువ నుంచి రాష్ట్రానికి చుక్క కూడా నీరు చేరే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో కృష్ణా పరీవాహక ప్రాంతంలో సాగునీటి మాట దేవుడెరుగు తాగునీటికి కూడా ఇక్కట్లు తప్పవని సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాడూ, నేడూ చంద్రబాబు తీరు వల్లే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలిగిందని, ఈ పరిణామాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఆయకట్టు ఎడారిగా మారడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యానికి పరాకాష్ట.. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ 1980లో అనుమతి ఇచ్చింది. గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తున్న నేపథ్యంలో తమకు కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కర్ణాటక, మహారాష్ట్రలు అప్పట్లో కోరాయి. దీంతో కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్న 80 టీఎంసీల్లో 45 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 21 టీఎంసీలు కర్ణాటక, 14 టీఎంసీలు మహారాష్ట్ర కృష్ణా జలాలను అదనంగా వినియోగించుకునేలా గోదావరి ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించి ఇప్పటికి 39 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు తెలంగా>ణ సర్కార్ కూడా గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లించాయి. కర్ణాటక సర్కార్ కృష్ణా జలాలను కావేరి పరీవాహక ప్రాంతానికి మళ్లించింది. ఈ నేపథ్యంలో పోలవరం జలాలపై 1980లో గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చెల్లదని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఎగువ రాష్ట్రాలు ఒక నది నుంచి మరో నది పరీవాహక ప్రాంతానికి జలాలను మళ్లించిన నేపథ్యంలో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956 ప్రకారం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోపాటు తాజాగా గోదావరి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి జలాలను పునఃపంపిణీ చేయాల్సిందిగా కోరాలని నాలుగేళ్లుగా సాగునీటి నిపుణులు, జలవనరుల శాఖ అధికారులు సూచిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. -
ఎక్కడికక్కడే నీటి నిల్వ
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలోని నదీ జలాలతోపాటు పరీవాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలతో లభించే ప్రతి నీటిచుక్కనూ ఒడిసిపట్టేలా ప్రభుత్వం పక్కా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా గరిష్ట స్థాయిలో కృష్ణా, గోదావరి నీటిని మళ్లిస్తున్న ప్రభుత్వం... వాటి నిర్మాణాలకు సమాంతరంగా రాష్ట్ర పరిధిలో కురిసే ప్రతి నీటి బొట్టునూ ఎక్కడికక్కడ కట్టడి చేసేలా భారీగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని నిర్ణయించింది. మహారాష్ట్ర మాదిరి చెక్‌డ్యామ్‌లు, తూముల నిర్మాణంతో నీటిని చెరువులకు మళ్లించడం ద్వారా నీటి నిల్వలను పెంచి గరిష్ట ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాగులకు అడ్డుకట్ట.. కృష్ణా బేసిన్లో తెలంగాణకు 299 టీఎంసీలు, గోదావరిలో 954 టీఎంసీల నీటి కేటాయింపులుండగా ఇందులో చిన్న నీటివనరుల కింద కృష్ణాలో 89 టీఎంసీలు, గోదావరిలో 165 టీఎంసీల మేర కేటాయింపులున్నాయి. కృష్ణా బేసిన్లో ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండితే కానీ దిగువకు ప్రవాహాలులేని కారణంగా దిగువన తెలంగాణలో వాటా మేర నీటి వినియోగం జరగడం లేదు. దీనికితోడు కృష్ణానీటి కట్టడికి మహారాష్ట్ర ఏకంగా వందల సంఖ్యలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయడంతో దిగువకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఏటా కృష్ణా బేసిన్లో చిన్న నీటివనరుల కింద వినియోగం 40 టీఎంసీలు దాటడం లేదు. గోదావరిలోనూ 165 టీఎంసీల మేర కేటాయింపులున్నా అనుకున్న మేర నీరు చేరడం లేదు. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ధ్వంసం కావడంతో అనుకున్న మేర అవి నిండటం లేదు. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టిన ప్రభుత్వం... ఇప్పుడు వాటిని నీటితో కళకళలాడించే పనిలో పడింది. ఇందులో భాగంగా గోదావరి బేసిన్లో ప్రధాన నదీ ప్రవాహాలైన మంజీరా, మానేరు, తాలిపేరు, లెండి, పెనుగంగ, కిన్నెరసాని వంటి వాగులు, కృష్ణా బేసిన్లో మూసీ, ఊకచెట్టువాగు, పెద్దవాగు, డిండి వాగు, పాలేరు, తుంగపాడు వంటి వాగులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని నిర్ణయించింది. వాటి పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు అవకాశం ఉంటుందన్న దానిపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఇటీవల ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లాలవారీగా నిర్మాణానికి అనువయ్యే చెక్‌డ్యామ్‌ల ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. మొత్తంగా 1,200.. రూ. 4,825 కోట్లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నదులు, ఉపనదులు, వాగులు, వంకలపై కలిపి మొత్తంగా 1,200 చెక్‌డ్యామ్‌లు నిర్మించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో గోదావరి బేసిన్ పరిధిలోనే 840 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయి. కృష్ణా పరిధిలో సుమారు 700 మేర ప్రతిపాదనలురాగా వాటిని 400కు కుదించే అవకాశం ఉంది. ఇక నీటి లభ్యత ఉన్న ప్రాంతాలు, ప్రాజెక్టుల సమీప కాల్వల నుంచి చెరువులకు నీటిని తరలించేలా తూముల నిర్మాణానికి సైతం ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా 400 తూములను నిర్మించే అవకాశం ఉందని ప్రాథమికంగా తేల్చారు. అన్ని నిర్మాణాలకు మొత్తంగా రూ. 4,825 కోట్లు ఖర్చు చేసేలా ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో తూముల నిర్మాణానికి రూ. 410 కోట్లు వెచ్చించనున్నారు. చెక్‌డ్యామ్‌లకు సంబంధించిన వ్యయ అంచనాలు పరిపాలనా అనుమతుల కోసం ఇప్పటికే రాష్ట్ర కార్యాలయానికి చేరుతున్నాయి. ఒక్కో చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ. 3 కోట్ల నుంచి రూ. 8 కోట్ల నుంచి వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పనులకు నిధుల కొరత లేకుండా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రుణాలు తీసుకొనేలా ప్రభుత్వం యోచిస్తోంది. -
పాక్‌కు వెళ్లే భారత్ జలాల మళ్లింపు
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే నదీ జలాలను నిలిపివేయాలని గురువారం నిర్ణయించింది. తూర్పు నదుల నుంచి పాక్‌కు వెళుతున్న జలాలను జమ్మూ కశ్మీర్, పంజాబ్‌లకు మళ్లించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. రావి నదిపై షాపూర్-కంది వద్ద జలాశయం పనులు ప్రారంభయ్యాయని, యూజేహెచ్ ప్రాజెక్టులో నిల్వ చేసే మన జలాలను జమ్మూ కశ్మీర్ కోసం వాడతామని మిగిలిన జలాలను రెండవ రావి-బీఈఏస్ అనుసంధానం ద్వారా ఇతర పరీవాహక రాష్ట్రాలకు సరఫరా చేస్తామని గడ్కరీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ ఇప్పటికే జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించామని వరుస ట్వీట్లలో గడ్కరీ వెల్లడించారు. ఉగ్రవాదుల దుశ్చర్యలకు ఊతమిస్తున్న పాకిస్తాన్‌కు నదీ జలాల్లో మన వాటాను నిలిపివేయడం ద్వారా గట్టి గుణపాఠం చెప్పినట్టవుతుందని భావిస్తున్నారు. -
14 రోజులుగా బొగ్గు గనిలోనే 15 మంది..
న్యూఢిల్లీ: మేఘాలయలోని ఓ బొగ్గు గనిలో గత 14 రోజులుగా చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఇంకా తెలియరావడం లేదు. గనిలో నీటి ఉధృతి కారణంగా సహాయక సిబ్బంది లోపలికి వెళ్లలేకపోతున్నారు. మరోవైపు బొగ్గుగనిలోని నీటిని తోడేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గనిలోని నీటిని బయటకు పంప్ చేయడానికి హైపవర్ సబ్ మెర్సిబుల్ పంపులు కావాలని అధికారులు కోరినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకూ ఓ నిర్ణయం తీసుకోలేదు. దీంతో గనిలోని కార్మికుల ప్రాణాలపై వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మేఘాలయలోని ఈస్ట్ జైంతా హిల్స్ జిల్లా లూమ్‌థారీ ప్రాంతంలోని ఓ అక్రమగనిలో డిసెంబర్ 13న ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గును వెలికితీస్తున్న క్రమంలో పక్కనే ఉన్న లైటైన్ నదీ ప్రవాహం గనిలోకి పోటెత్తింది. ఈ ఘటనలో 15 మంది లోపలే చిక్కుకోగా, ఐదుగురు మాత్రం ప్రవాహానికి ఎదురొడ్డి బయటపడగలిగారు. పంపులపై బదులేది? సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కమాండెంట్ ఎస్కే శాస్త్రి ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ..‘గనిలోని నీటిని తోడేసేందుకు కనీసం వంద హార్స్పవర్ ఉన్న 10 మోటార్ పంపులు కావాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మేం కేంద్రానికి లేఖ రాసినా ఇంతవరకూ జవాబు రాలేదు. మా దగ్గర ప్రస్తుతం 25 హార్స్పవర్ సామర్థ్యం ఉన్న రెండు పంపులు మాత్రమే ఉన్నాయి. దాదాపు 370 అడుగులు ఉన్న ఈ గని మధ్యలో 70 అడుగుల మేర నీరు చేరుకుంది. ఈ నీటిని తొలగిస్తేనే జాతీయ విపత్తు సహాయక బృందం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది లోపలకు పోగలరు. మేం గనిలోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ నీటి ఉధృతి కారణంగా కుదరలేదు’ అని తెలిపారు. గని కార్మికుడొకరు బొగ్గును వెలికితీసే క్రమంలో గోడపై బలంగా కొట్టడంతో గనిలోకి లైటైన్ నది నీరు పోటెత్తి ఉంటుందని శాస్త్రి చెప్పారు. ‘ర్యాట్ హోల్’ తవ్వకం తాజాగా కార్మికులు చిక్కుకున్న బొగ్గు గనిని ర్యాట్ హోల్ పద్ధతిలో తవ్వారు. ఈ విధానంలో తొలుత చిన్న పరిమాణంలో గుంతలను నిట్టనిలువుగా బొగ్గు కనిపించేవరకూ తవ్వుతారు. అనంతరం సన్నటి దారుల ద్వారా బొగ్గును పైకి తీసుకొస్తారు. అయితే ఈ విధానంలో పర్యావరణానికి నష్టం జరుగుతుండటం, కార్మికుల ప్రాణానికి ముప్పు ఉండటంతో మేఘాలయలో 2014లో ఈ ర్యాట్ హోల్ పద్ధతిని నిషేధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈస్ట్ జైంతా హిల్స్‌లో గని ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు ఈ వ్యవహారంపై మేఘాలయ ముఖ్యమంత్రి కన్రడ్.కె.సంగ్మా స్పందిస్తూ..‘కాలం వేగంగా కరిగిపోతోంది. పదిహేను మంది కార్మికులను రక్షించడానికి హైపవర్ సబ్మెర్సిబుల్ పంపులను ఇవ్వాలని కోల్ ఇండియాను కోరాం. వాళ్లు వీలైనంత త్వరగా సాయం చేస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు. ఈ గనిలోకి కార్మికులను పనికి దింపిన ఓ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న యజమాని కోసం గాలింపు జరుపుతున్నారు. ఫొటోలకు పోజులా? గని కార్మికులు చిక్కుకుపోయిన ఘటనపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. 15 మంది కార్మికులు బొగ్గుగనిలో చిక్కుకుంటే ప్రధాని మోదీ మాత్రం అస్సాంలోని బోగీబీల్ వంతెనపై ఫొటోలకు పోజులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ‘ఓవైపు మేఘాలయలో 15 మంది కార్మికులు వరద నీటితో నిండిపోయిన గనిలో చిక్కుకుని శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రధాని మాత్రం బోగీబీల్ వంతెనపై కెమెరాలకు ఫోజులు ఇస్తున్నారు. మోదీ ప్రభుత్వం హై ప్రెజరైజ్డ్ మోటార్ పంపులను అందించేం దుకు నిరాకరిస్తోంది. మోదీజీ.. దయచేసి ఈ కార్మికులను కాపాడండి’ అని ట్వీట్ చేశారు. -
రెండేళ్లలోనే తుది కేటాయింపులు!
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, అవి వెలువరించిన తీర్పులను పక్కాగా అమలు చేసే దిశగా కేంద్రం కీలక ముందడుగు వేస్తోంది. దేశంలో అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలను విచారించడానికి ఏర్పాటైన వివిధ ట్రిబ్యునళ్లను రద్దు చేసి.. దేశవ్యాప్తంగా ఒకే శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు మార్చిలో జరుగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే.. బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని నిర్ణయించింది. అంతర్రాష్ట్ర జల వివాదాలపై రెండేళ్లలోనే తుది తీర్పు వెలువరించేలా గడువు నిర్దేశించాలన్న పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సులను కూడా బిల్లులో పొందుపరిచింది. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన అనంతరం మూడు నెలల వ్యవధిలోనే పాత ట్రిబ్యునళ్లన్నీ రద్దయి.. దేశవ్యాప్తంగా ఒకే ట్రిబ్యునల్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం కృష్ణా జలాల వివాదాన్ని చూస్తున్న బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో తెలంగాణకు న్యాయం జరిగే పరిస్థితులు లేకపోవడంతో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం గట్టిగా సమర్థిస్తోంది. ఆ తీర్పే అంతిమం..: దేశవ్యాప్తంగా కృష్ణా, కావేరీ, వంశధార, మహాదాయి, రావి తదితర నదీ జలాల వివాదాలకు సంబంధించి ఎనిమిది ట్రిబ్యునళ్లు పనిచేస్తున్నాయి. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 ప్రకారం.. నదీ జలాల పంపిణీపై ఏదైనా రాష్ట్రంలో తలెత్తిన అభ్యంతరాలను పరిశీలించి కేంద్రం ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తుంది. అలా ఏర్పాటు చేసిన కృష్ణా ట్రిబ్యునల్ విచారణ పదమూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ వివాదాలకు తగిన పరిష్కారం దొరకలేదు. ప్రస్తుతమున్న అంతర్రాష్ట్ర జల వివాద పరిష్కార చట్టం –1956లోని సెక్షన్ 5(2) ప్రకారం.. వివాదంపై నివేదిక అందించడానికి ట్రిబ్యునల్‌కు ప్రాథమికంగా మూడేళ్ల గడువు ఉంది. ఏదైనా కారణంతో తుది నిర్ణయం వెలువరించలేకపోతే గడువును మరో రెండేళ్లు పొడిగించే అధికారం కేంద్రానికి ఉం ది. ఇక ట్రిబ్యునల్ నిర్ణయంపై వాద, ప్రతివాదుల్లో ఎవరైనా విభేదిస్తూ సెక్షన్ 5 (3) కింద పునఃపరిశీలించాలని కోరితే.. దానిపై తీర్పు చెప్పడానికి మరో ఏడాది సమయం ఉంది. అప్పటికీ తుది నివేదిక ఇవ్వలేకపోతే కేంద్రం గడువు పొడిగించే వీ లుంది. ఇందుకు నిర్దిష్ట కాలపరిమితి లేదు. అంటే గడువును నిరవధికంగా పొడిగించే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం అలాగే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో త్వరగా జల వివాదాలను పరిష్కరించే దిశగా ఒకే ట్రిబ్యునల్ అంశం తెరపైకి వచ్చింది. పటిష్టంగా కొత్త ట్రిబ్యునల్ ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతమున్న చట్టాలను సవరించి కొత్త చట్టాన్ని తేస్తోంది. దీనిపై ఇప్పటికే బిల్లును కూడా రూపొందించింది. దాని ప్రకారం... - ప్రతిపాదిత శాశ్వత ట్రిబ్యునల్‌కు చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు గరిష్టంగా ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరిని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నుంచి నియమిస్తారు. - ఈ నియామకాల కోసం నలుగురు సభ్యులతో ప్రత్యేక ప్యానల్ లేదా కొలీజియం ఏర్పాటు చేయాలి. ఇందులో ప్రధానమంత్రి, లేదా ఆయన నియమించిన ప్రతినిధి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నియమించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సభ్యులుగా ఉండాలి. - సభ్యులను తొలగించే అధికారం కూడా కొలీజియానికి ఉండాలి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చైర్‌పర్సన్‌గా ఉండనున్నారు. - కొత్త ట్రిబ్యునల్ రెండేళ్లలో తన తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. - వివాదాలను పొడిగించడానికి వీలులేకుండా ‘ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పే అంతిమం’అని చెబుతూ బిల్లులో కొత్తగా 6వ సెక్షన్‌ను కూడా చేర్చారు. - ఈ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సమానం కాబట్టి అన్ని రాష్ట్రాలూ కట్టుబడి ఉండాల్సిందే. -
తేలని పంచాయితీ!
►నదీ జలాలు, ప్రాజెక్టులపై పట్టు విడవని రెండు రాష్ట్రాలు ►కృష్ణా బోర్డు పరిధి, అధికారాలపై నోటిఫికేషన్ జారీ చేయాలన్న ఏపీ ►ట్రిబ్యునల్, కోర్టుల్లో వాటాలు తేలేవరకు వద్దన్న తెలంగాణ సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నది జలాలపై ఎడతెగని పంచాయితీ మళ్లీ అసంపూర్తిగానే ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ, ప్రాజెక్టులు, కృష్ణాబోర్డు పరిధి, అధికారాలపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ వద్ద జరిగిన సమావేశం ఓ కొలిక్కి రాకుండానే వాయిదా పడింది. దీనిపై బుధవారం మరోసారి సమావేశం కావాలని కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. ఢిల్లీలోని శ్రమశకి ్త భవన్లో జరిగిన ఈ భేటీలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్సింగ్, కృష్ణా బోర్డు ఇన్చార్జి చైర్మన్ రామ్ శరాణ్, సభ్య కార్యదర్శి ఆర్.కె.గుప్తా, ఏపీ నీటి పారుదల ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, తెలంగాణ నీటి పారుదల ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, ఈఎన్సీ మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఉదయం ఇరు రాష్ట్రాలు తమ అవసరాలపై వాదనలు వినిపించాయి. మధ్యాహ్నం స్టేట్ ప్రాజెక్ట్స్ కమిషనర్ కుష్విందర్ వోరా వద్ద దాదాపు నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి. తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:15 వరకు అమర్జిత్సింగ్ సమక్షంలో చర్చించారు. పరస్పర భిన్న వాదనలు కృష్ణా బోర్డు పరిధి, అధికారాలు, బాధ్యతలను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని ఏపీ పట్టుబట్టింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసి, వాటిపై నిర్వహణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు అప్పగించాలని కోరింది. కానీ కృష్ణా జలాల తుది కేటాయింపులు జరిగే వరకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు సరికాదని... కృష్ణా బోర్డుకు ఆ అధికారమే లేదని తెలంగాణ వాదించింది. ఏపీ నిర్మిస్తున్న పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు వాటా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ రెండు వాదనల్లో ఎవరూ పట్టు సడలించకపోవడంతో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక ప్రాజెక్టులపై తాత్కాలిక యాజమాన్య ఏర్పాట్లపై అవగాహన చేసుకోవాలన్న కేంద్ర సూచనపైనా ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. అయితే తొలి ఏడాదికి సంబంధించి కొన్ని స్వల్ప వివాదాలున్నా మొత్తంగా విజయవంతమైందని ఇరు పక్షాలు అంగీకరించాయి. దానినే కొనసాగిస్తారా, లేదా.. ప్రత్యామ్నాయం ఏమిటన్న దానిపై స్పష్టత రాలేదు. కాగా సమావేశం అనంతరం దీనిపై తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌రావు మాట్లాడారు. గతేడాది కుదుర్చుకున్న తాత్కాలిక అవగాహన బాగానే కొనసాగిందని, దాన్ని ఈసారీ కొనసాగిస్తే ఎలాగుంటుందన్న అంశంపై చర్చించామని చెప్పారు. అయినా చర్చలు ఓ కొలిక్కి రాలేదన్నారు. -
నిపుణుల నివేదిక ఏమైంది..?
ఆత్మకూర్ : ఆత్మకూరు మండలంలోని జూరాల దిగువ జలవిద్యుత్ కేంద్రం నీట మునిగి 205 రోజులు దాటినా ఇంతవరకు దానికి బాధ్యులెవరో తేల్చలేదు. కేంద్రంలోని పంప్‌హౌస్ నిర్మాణ పనులు కూడా సక్రమంగా సాగడం లేదు. దీంతో ఈ వేసవిలో విద్యుత్ కష్టాలు ఎక్కువయ్యే ప్రమాదం ఏర్పడింది. పంప్‌హౌస్ వరద నీటిలో మునగడంతో సుమారు రూ. 690 కోట్లకు పైగా నష్టం జరిగింది. నిపుణల కమిటీ ఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్లినా.. ఆ నివేదిక ఏమైందో ఇప్పటి వరకు అధికారులు తేల్చలేదు. దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి నిర్మాణ కేంద్రంలో 2014 జూలై 30వ తేదీన పవర్‌హౌస్‌ను వరదనీరు ముంచెత్తింది. ఈ సంఘటనపై కారణాలు తెలుసుకునేందుకు తెలంగాణ జెన్కో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు 2014 సెప్టెంబర్ 7న నీటి పారుదల శాఖ మెకానికల్ చీఫ్ ఇంజనీర్లు, గేట్, కాంక్రీటు నిపుణులు, ప్రొఫెసర్లతో కూడిన కమిటీ సభ్యులు దిగువ జూరాలను సందర్శించారు. ఈ బృందం మళ్లీ ప్రాజెక్టును సందర్శించింది. వీయర్స, పవర్‌హౌస్, ఎలక్ట్రికల్ తదితర ప్రదేశాలను సందర్శించిన అనంతరం సంఘటనకు కారణమైన నాలుగో యూనిట్లోకి దిగి పరిశీలించారు. నాలుగో యూనిట్‌లోని 7వ గేట్ వద్ద కాంక్రీట్ స్లాబ్ కూలడంతోనే ఈ సంఘటన జరిగిందని.. కాంక్రీట్ కూలడానికి కారణాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని కమిటీ సభ్యులు అప్పట్లో చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా చర్చిస్తామన్నారు. త్వరలోనే కమిటీ సమావేశమై ఘటనపై అన్నికోణాల్లో న్యాయ విచారణ జరిపి ప్రభుత్వానికి, జెన్కోకు రెండు వారాల్లోపు నివేదిక ఇస్తామని చెప్పారు. కానీ, ఘటన జరిగి 205 రోజులు దాటినా నేటి వరకు నిపుణుల కమిటీ నివేదిక వివరాలు వెల్లడి కాలేదు. దీంతో ఈ ఘటనపై అసలేం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పనులు పూర్తిస్థాయిలో కాకపోవడంతో ఈ వేసవిలో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదముందని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. నష్టం రూ. 690కోట్లపైనే.. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్షం కారణంగా ఎంతో విలువైన విద్యుత్తును కోల్పోవాల్సి వచ్చింది. విద్యుత్ కేంద్రంలోని 3యూనిట్ల ద్వారా 120మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేది. ఈ విద్యుత్తు ఉత్పత్తి అయి ఉంటే జిల్లా మొత్తానికి విద్యుత్ అందేది. రోజుకు 3లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే వాటిద్వారా రోజుకు రూ.2కోట్ల ఆదాయం వచ్చేది. అయితే ప్రమాదంతో పనులు నిలిచిపోవడం వల్ల రూ.300 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. దీనికి తోడు ప్రాజెక్టులో మరమ్మత్తుల కోసం మరో రూ.150 కోట్లు ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు వడ్డీ రూపంలో మరో రూ.240కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకంగా పనులు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలంగాణకు చెందిన కొందరు ఇంజనీర్లు గతంలో ఆరోపణలు చేశారు. పది లక్షల క్యూసెక్కుల నీటి సామర్థ్యాన్ని తట్టుకోవాల్సిన గేట్‌వాల్వ్ 60వేల క్యూసెక్కుల నీటి తాకిడికే తెగిపోవడాన్ని దీనికి ఉదాహరణగా వారు పేర్కొంటున్నారు. -
ఖమ్మం కళకళలాడాలి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కళకళలాడాలని, ఇందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. అపార సహజ సంపదను సద్వినియోగం చేసుకుని తెలంగాణకే తలమానికమయ్యేలా జిల్లాను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. జిల్లాకు చెందిన మాజీమంత్రి, సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు వేలాది మంది అనుచరులు, ముఖ్య నాయకులతో కలిసి కేసీఆర్ సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై తనకున్న విజన్‌ను వివరించారు. జిల్లాలో ఉన్న అటవీ, సహజ సంపదలను సద్వినియోగం చేసుకోవాలని, గోదావరి జలాలు, బొగ్గును వినియోగించుకుని పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయేలా, ఔరా అనేలా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాలో లభించే ముడి ఇనుము నాణ్యత లేనిదని గతంలో ప్రచారం చేశారని, ఇటీవల సెయిల్ ఎండీ కలిసినప్పుడు బయ్యారంలో ఉన్న ఇనుము నెం.1 అని చెప్పారని, రూ. 30 వేల కోట్ల వ్యయంతో అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారని చెప్పారు. కొత్తగూడెం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన రోజే ఆయన తెలంగాణలో జిల్లాల పునర్నిర్మాణంపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో చర్చించడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కేంద్రంగా త్వరలో జిల్లా ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో త్వరలోనే మెడికల్ కళాశాల, కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. త్వరలోనే తాను ఖమ్మం వస్తానని చెప్పారు. సీఎం అయ్యాక ఆయన పలు జిల్లాల్లో పర్యటించినా, ఖమ్మం మాత్రం రాలేదు. ఖ మ్మంపై అసలు ఆయన ఎలాంటి చర్చ కూడా జరిపినట్టు కనిపించలేదు. కానీ, శుక్రవారం మాత్రం నవ్వుతూ తాను త్వరలోనే ఖమ్మం వస్తానని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక పార్టీలో చేరిన తుమ్మలను రాజకీయ దురంధరుడన్న కేసీఆర్.. ఆయన నాయకత్వం లో జిల్లా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని చెప్పా రు. గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఇప్పుడు పార్టీలోకి వస్తున్న వారందరూ సమన్వయంతో తుమ్మల నాయకత్వంలో పనిచేయాలని సూచించారు. దీంతో జిల్లాలో పూర్తిస్థాయి పార్టీ బాధ్యతలను కేసీఆర్ తుమ్మ ల చేతిలో పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తుమ్మల నాకు మంచి మిత్రుడు... తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు తనకు మంచి మిత్రుడని కేసీఆర్ అన్నారు. ‘తుమ్మల నాకు ఆప్తమిత్రుడు, చాలా సన్నిహితుడు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉన్నాం. ఇద్దరం 82లో పోటీ చేసి ఓడిపోయాం. కష్టాలు సుఖాలు చాలా పంచుకున్నాం. ఒత్తిళ్లకు లోనయ్యాం.’ అని వ్యాఖ్యానించారు. పార్టీలు వేరయినా తమ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు మాత్రం కొనసాగాయని చెప్పారు. పార్టీలోకి రావాలని ఎన్నికలకు ముందే ఆయనతో మాట్లాడానని, ప్రజలు నిన్నే ఆదరిస్తారు... అప్పుడు జాయిన్ అవుదాంలే అని తుమ్మల చెప్పారని, ఆయన మాట నిజమైంది కాబట్టి మళ్లీ పార్టీలోకి తానే ఆహ్వానించానని కేసీఆర్ చెప్పారు. దశాబ్దాలుగా రాజకీ యాల్లో ఉన్నా... మచ్చలేని నాయకుడిగా, వేలెత్తి చూపించలేని, నిప్పులాంటి వ్యక్తి నాగేశ్వరరావు అని ప్రశంసించారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో అట్టహాసంగా జరిగిన తుమ్మల టీఆర్ఎస్లో చేరిక కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేత, ఎంపీ కె. కేశవరావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, కొత్తగూడెం, వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, మదన్‌లాల్, కోరం కనకయ్య, పార్టీ నేతలు ఆర్జేసీ కృష్ణ, బాణోతు చంద్రావతి, బమ్మెర రామ్మూర్తి, పిడమర్తి రవి, తుమ్మలతో పాటు టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు మువ్వా విజయ్‌బాబు, ఎగ్గిడి అంజయ్య, తెలుగు రైతు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, తెలుగు విద్యార్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతనిప్పు కృష్ణచైతన్య, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ షేక్ మదార్‌సాహెబ్, బోడేపూడి రమేశ్‌బాబు, పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. -
అయ్యయ్యో!
సాక్షి, నెల్లూరు: పెన్నానది మురుగు కూపంగా మారుతోంది. నగరంలోని చెత్తా, చెదారం, డ్రైనేజీ నీరు, ఫ్యాక్టరీల వ్యర్థాలకు పవిత్ర పెన్నానది నిలయంగా మారి నది నీళ్లు విషపూరితమౌతున్నాయి. దీంతో నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్న పెన్నాతాగునీరు విషమయం అవుతున్నాయి. ఈ నీటితో పండే పంటలు సైతం విషపూరితంగా మారుతున్నాయి. మరోవైపు మితిమీరిన ఆక్రమణలతో నది రోజురోజుకూ కుంచించుకు పోతోంది. సింహపురి నగరానికి సమీపంలో ఉన్న పవిత్ర పెన్నానది నెల్లూరు కార్పొరేషన్ వారికి చెత్తా చెదారం నింపుకునే డంపింగ్ యార్డుగా మారిపోయింది. ప్రతిరోజూ నగరంలోని టన్నుల కొద్దీ చెత్తను వారు బోడిగాడితోట ప్రాంతానికి ఆనుకొని ఉన్న నదిలోకి వదులుతున్నారు. మురిగిన చెత్త నదినీటిని విషపూరితం చేస్తోంది. దీంతో పాటు రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లు, చిన్నచిన్న పరిశ్రమల మురుగు, వ్యర్థాలు నేరుగా నదిలోకి వస్తుండటంతో నీరు విపరీతమైన కాలుష్యానికి గురవుతోంది. ఇక నగరానికి తాగునీటిని అందించే పాత పెద్దాస్పత్రి ప్రాంతంలోని నదిలో ఉన్న వాటర్ పంపింగ్ సిస్టమ్‌లు ఉన్న ప్రాంతంలో సైతం చెత్త, వ్యర్థాలతో పాటు మురుగు నీరు వదులుతున్నారు. దీంతో ఆ ప్రాంతం కలుషితమౌతోంది. తాగునీరు సైతం కలుషితం అవుతుండటంతో నగరవాసులు రోగాల బారిన పడుతున్నారు. ఈ విషయమై ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, ఆందోళనలు నిర్వహించినా వారు ఏమాత్రం స్పందించిన పాపానపోలేదు. ఇక కలుషితమైన నది నీరు పంటపొలాలను నిర్వీర్యం చేయడమే కాక పంటలను విషపూరితం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఇదివరకే నిపుణులు నిర్ధారించారు. గతంలో ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం పెన్నా నీటిని పరీక్షించింది. నీటిలో అధిక మోతాదులో ప్రమాదకర స్థాయిలో కలుషిత పదార్థాలు ఉన్నాయని నిర్ధారించింది. నదినీరు కలుషితం కాకుండా బయటే శుద్ధి చేసేందుకు రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించిం ది. దీంతో పాటు వర్షపు, మురుగు నీరు సైతం నే రుగా నదిలో కలవకుండా ప్రత్యేక కాలువను నిర్మించడమే కాక పెన్నాలో పేరుకు పోయిన పూడికతీత పనులను చేపట్టాలని నాడు కమిటీ సూచిందింది. ఇందులో భాగంగా పెన్నా కలుషిత నివారణకు కేం ద్రం నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదనలు, నిధుల కేటాయింపులు అటకెక్కాయి. ప్రజల పుణ్యమాని పదవులు అనుభవిస్తున్న ఇక్కడి ప్రజాప్రతినిధులు, మంత్రి వారి బాగోగులు పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. ఆక్రమణలతో రోజురోజుకూ పెన్నా కుంచించుకుపోతోంది. అధికార పార్టీ నేతల అండతో నేతలు నగర పరిధిలోని వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డి కాలనీ, రంగనాయకులపేట రైల్వేగేటు, జాఫర్ సాహెబ్ కాలువకట్ట, బోడిగాడితోట నుంచి మైపాడుగేటు వరకూ పెద్ద ఎత్తున నదిని ఆక్రమించి ఏకంగా పక్కా గృహాలనే నిర్మించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించడంతోపాటు పూడికతీత, నదీజలాల శుభ్రతపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.