
ఆరుమంది ప్రాణాలను కాపాడిన ఎస్‌ఐ
సాక్షి, సుండుపల్లె (రాజంపేట) : పింఛా జలాశయం నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఆరుగురు ప్రాణాలను సుండుపల్లె ఎస్‌ఐ భక్తవత్సలం కాపాడారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సుండుపల్లె మండలం ఫించా జలాశయానికి నీటి ఉధృతి పెరిగింది. శుక్రవారం జలాశయ గేట్లు ఎత్తారు. బహుదా నదిలోకి వరదనీరు జోరుగా ప్రవాహించింది. ఈ నదీ పరీసర ప్రాంతాలలో మేకలను, బర్రెలను మేపుకుంటున్న కాపరులను నీరు చుట్టుముట్టింది.
దీంతో బయట రాలేక రక్షించండంటూ ప్రాణభయంతో కేకలు వేశారు. ఒడ్డున ఉన్న వారు గమనించి ఎస్‌ఐకు సమాచారం ఇచ్చారు. దీంతో భక్తవత్సలం తన సిబ్బందితో , చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల సహకారంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి నీటిలో తాడు సహాయంతో దిగారు. మిట్టమీదపల్లెకు చెందిన ఆరుగురిని బయటికు తీసుకొచ్చారు. బయటపడిన వారిలో పెండ్లిమర్రి సరోజమ్మ, రాయవరం సుబ్రదమ్మ, రాయవరం బాబు, రాయవరం చెన్నయ్య, అన్నారపు కిరణ్‌కుమార్, నరసమ్మలు ఉన్నారు. ఎస్‌ఐ, పోలీసుల చొరవను స్థానికులు హర్షించారు.