తెలంగాణ బిల్లు తుది రూపం తీసుకున్న తర్వాత.. అందులో ఏఏ అంశాలు ఉంటాయి? తెలంగాణ ఏర్పాటు, నదీజలాలు, విద్యుత్ పంపిణీ వంటి అంశాలతో పాటు.. ఈ బిల్లులో ప్రాధమికంగా ఉండే అంశాలేమిటి? రాష్ట్రంలోని రెండు ప్రాంతాల ప్రజలు వ్యక్తంచేసిన ఆందోళనల నేపధ్యంలో ఈ ప్రశ్నలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రత్యేకించి టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు సంబంధించిన నియమ, నిబంధనలు, చారిత్రక వాస్తవాల’పై తాజాగా చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఈ అంశాలకు మరింత ప్రాధాన్యం కానున్నాయి.
ఆందోళనలపై స్పష్టత ఏదీ?
తెలంగాణపై రూపొందించబోయే బిల్లులో.. సీమాంధ్ర ప్రాంత ఆందోళనలను తెలంగాణ ప్రాంతానికి ఆమోదయోగ్యమైన రీతిలో ఉండేలా పొందుపరుస్తారా లేదా అన్న దానిపై చిదంబరం ప్రకటనలో ఎలాంటి స్పష్టత లేదు. హైదరాబాద్‌లో ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్న వారితో సహా తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ఇతర ప్రాంతాల ప్రజలకు సంబంధించి కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్ నగరం పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పటికీ.. తెలంగాణేతర ఉద్యోగులందరినీ ఎలాంటి ఆప్షన్లూ లేకుండా వారి ప్రాంతం ఆధారంగా తిప్పిపంపించేస్తారన్న భయాందోళనలను కేసీఆర్ రేకెత్తించారు. రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చిన ఈ ఆప్షన్ అంశంపై కేంద్ర ప్రభుత్వం బిల్లులో ఎలా వ్యవహరిస్తుందనేది ఇప్పుడు కీలక అంశంగా మారింది.
‘అందరినీ సంతృప్తి పరచటం’ క్లిష్టం!
ఈ పరిస్థితుల్లో వివాదాస్పద అంశాలకు సంబంధించినంతవరకూ ‘ఇచ్చి పుచ్చుకోవటం’పై కాంగ్రెస్ అధిష్టానం మనోభీష్టం మేరకు కేంద్ర హోంశాఖ తెలంగాణ బిల్లును రూపొందించే పనిలో నిమగ్నం కానుంది. రాష్ట్రాన్ని విభజించే క్రమంలో ‘అందరినీ సంతృప్తి పరచటం’ అనేది కాంగ్రెస్ హైకమాండ్ ఆడుతున్న ఆట కావటంతో హోంశాఖ పని క్లిష్టంగా మారనుందని పరిశీలకులు భావిస్తున్నారు.
పైచేయి సాధిస్తాం.. కాంగ్రెస్ ధీమా
రాష్ట్ర విభజనకు కారణం వై.ఎస్.రాజశేఖరరెడ్డి అంటూ నేరుగా ఆరోపించటం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకునేలా రాజకీయ స్క్రిప్టును అందిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం ప్రస్తుతానికి తన సొంత ఎంపీలు, మంత్రులను నియంత్రిస్తోంది. ‘‘తెలంగాణ ఏర్పాటుకు నిజంగా కట్టుబడివుంది, ఆ డిమాండ్‌ను అంగీకరించింది మా పార్టీయేనని చూపించటంలో మేం సఫలమయ్యాం. సీమాంధ్రలో కూడా మా ప్రణాళికల ద్వారా ఇతర పార్టీలను బలహీనపరచగలమనటంలో మాకు సందేహం లేదు. అక్కడ కూడా పైచేయి సాధిస్తామన్న విశ్వాసం మాకుంది’’ అని పార్టీ సీనియర్ నాయకుడొకరు పేర్కొన్నారు.
తెలంగాణ బిల్లులో ప్రాధమిక అంశాలేమిటి?
Published Tue, Aug 6 2013 3:02 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement