6,000 కోట్లు..34 లక్షల ఎకరాలు | 34 lakh acres.. 6,000 crores | Sakshi
Sakshi News home page

6,000 కోట్లు..34 లక్షల ఎకరాలు

Published Sat, May 24 2014 1:15 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

6,000 కోట్లు..34 లక్షల ఎకరాలు - Sakshi

6,000 కోట్లు..34 లక్షల ఎకరాలు

తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు కావాల్సింది ప్రభుత్వ సంకల్పమే.. ఏడాదిలోనే 34 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం
ఇప్పటికే 90% పూర్తయిన పలు ప్రాజెక్టులు
కొత్త సర్కారు వీటిపై దృష్టి సారిస్తే రైతన్న మోములో చిరునవ్వు.. ఎన్నికల హామీల్లో
జలయజ్ఞంపై ఎటూ చెప్పని టీఆర్‌ఎస్
 
 సాక్షి, హైదరాబాద్: ఆరు వేల కోట్లు వెచ్చిస్తే చాలు.. 34 లక్షల ఎకరాలకు సాగునీరు.. అదీ ఏడాదిలోపే! తెలంగాణ భూముల్లో సిరులు కురిపించేందుకు ఇదొక సువర్ణ అవకాశం. అయితే ఈ కల సాకారానికి కావాల్సింది ప్రభుత్వంలో దృఢ సంకల్పం, నాయకుల్లో పట్టుదల. జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో చాలా వరకు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు కాస్త చొరవ చూపిస్తే ఆరు మాసాల నుంచి ఏడాది లోపు పూర్తి చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో నెగ్గిన టీఆర్‌ఎస్ జలయజ్ఞం ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రచారంలో కానీ.. ఎన్నికల మేనిఫెస్టోలో కానీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ప్రస్తావన చేయలేదు. ప్రతిపక్షంలో కూర్చోనున్న కాంగ్రెస్ కూడా సాగునీటి ప్రాజెక్టులపై తన మేనిఫెస్టోలో ఎలాంటి హామీ ఇవ్వలేదు. చిన్ననీటి వనరులను అభివృద్ది పరుస్తామని మాత్రం ప్రకటించింది. దీంతో ఇప్పటికే వేల కోట్లు ఖర్చుచేసిన ఈ ప్రాజెక్టుల భవిష్యత్తు ఏమిటనే విషయంలో అధికారులు సైతం ఎటూ చెప్పలేని పరిస్థితి నెలకొంది.
 
 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులు..
 
 జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇప్పటికే కొన్నింటిని పూర్తి చేశారు. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. చాలా ప్రాజెక్టులు తుది దశలో ఉన్నాయి. ఆర్నెల్ల నుంచి ఏడాదిలోపు వీటిని పూర్తి చేయొచ్చు. ఇందులో ముఖ్యంగా మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్ బీమా, కోయిల్‌సాగర్, నల్లగొండలోని ఏఎమ్మార్పీ, వరంగల్‌లోని దేవాదుల, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండలకు సాగునీరు ఇచ్చే ఎస్సారెస్పీ-2, ఫ్లడ్‌ఫ్లో కెనాల్ (ఎఫ్‌ఎఫ్‌సీ), కరీంనగర్‌లోని ఎల్లంపల్లి, ఖమ్మం జిల్లాకు చెందిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు దాదాపు 90 శాతం ఇప్పటికే పూర్తయ్యాయి. ఏఎమ్మార్పీ, దేవాదుల వంటి ప్రాజెక్టుల నుంచి ఇప్పటికే పాక్షికంగా నీటిని కూడా విడుదల చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల నుంచి ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో నీరివ్వడానికి అవకాశం ఉంది.
 
 ప్రభుత్వం దృష్టి సారిస్తే...
 
 ప్రస్తుతం ప్రాజెక్టుల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. పనులకు సంబంధించిన ధరలు పెంచాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు గత ప్రభుత్వం కూడా అంగీకరించింది. అందులో భాగంగా ప్రత్యేక ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కానీ ఈ నిర్ణయంపై రాజకీయంగా వివాదం చెలరేగడంతో జీవోను అమలు చేయడం లేదు. మరోవైపు ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తేనే.. పనులు చేస్తామని కాంట్రాక్టర్లు చెప్పారు. ఆ లోపు ఎన్నికలు రావడంతో ప్రాజెక్టుల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనిపై కొత్త ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. పైన పేర్కొన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సుమారు రూ.6 వేల కోట్లు అవసరం ఉంటుందని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ జిల్లాల్లో సుమారు 34 లక్షల ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆయక ట్టుకు నీటిని అందించడానికి వీలవుతుంది. ఇవేకాకుండా మరికొన్ని మధ్య తరహా ప్రాజెక్టులు కూడా చివరి దశలో ఉన్నాయి. ప్రభుత్వం తలుచుకుంటే వాటిని కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంది.
 
 ఈ ప్రాజెక్టులు కష్టమేనా ?
 
 తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. మరికొన్ని మొదలు పెట్టాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా ప్రాణహిత-చేవెళ్లతో పాటు కంతనపల్లి, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్, పాలమూరు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. సుమారు రూ.40 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల పనులు ఇప్పటికే మొదలయ్యాయి. సుమారు రూ.6 వేల కోట్లు ఖర్చు చేశారు. అలాగే కంతనపల్లి బ్యారేజీ పనులు ప్రారంభించారు. దుమ్ముగూడెం పనులు మాత్రం మొదలు కాలేదు. ఈ ప్రాజెక్టును తెలంగాణవాదులు వ్యతిరేకించడంతో పక్కన పెట్టారు. ఇక పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలన దశలో ఉంది. ఈ ప్రాజెక్టుల భవితవ్యంపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement