సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సార్వత్రిక రేసులో ‘కారు’ దూసుకెళ్తోంది. రాష్ట్ర విభజన అనంతరం జోరుమీదున్న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్).. అభ్యర్థుల ఖరారులోనూ అదే దూకుడును కొనసాగిస్తోంది. తొలిదశలో ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీఆర్‌ఎస్.. అందులో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు కల్పిం చింది. రెండు కొత్త ముఖాలను సైతం రంగంలోకి దింపింది. అయితే ప్రస్తుత జాబితాలో ఉన్నవారంతా గతంలో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారు కావడం విశేషం. శుక్రవారం ఆ పార్టీ అధినేత కేసీఆర్ శాసనసభ బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించారు.
దీంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి(పరిగి), కేఎస్ రత్నం (చేవెళ్ల), ఇబ్రహీంపట్నం మహేందర్‌రెడ్డి(తాండూరు)కి టికెట్లు కేటాయిస్తున్నట్లు గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. అలాగే మేడ్చల్‌కు మలిపెద్ది సుధీర్‌రెడ్డి, వికారాబాద్‌కు బి.సంజీవరావుల అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. ప్రస్తుతం టికెట్లు పొందిన ముగ్గురు శాసనసభ్యులు గత ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించినవారు కాగా, సంజీవరావు, సుధీర్‌రెడ్డిలు పచ్చపార్టీలో కీలకనేతలుగా మెలిగినవారే.
జాబితాపై మల్లగుల్లాలు
అభ్యర్థుల కూర్పుపై మల్లగుల్లాలు పడిన గులాబీ నాయకత్వం.. తొలి జాబితాలో సీనియర్లు, సిట్టింగ్‌లకే పరిమితమైంది. గ్రామీణ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్.. శివారు సెగ్మెంట్లపై ఇంకా కసరత్తును కొనసాగిస్తోంది. ఈ నియోజకవర్గాల అభ్యర్థులపై కూడా ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినా.. ప్రధాన పార్టీల జాబితాలను పరిశీలించిన తర్వాతే తుది జాబితాను ఖరారు చేయాలని భావిస్తోంది. టీడీపీ- బీజేపీ, సీపీఐ -కాంగ్రెస్ పొత్తు కారణంగా సీట్లు కోల్పోయే ఆశావహులను చేరదీసి బరిలో దించాలని యోచిస్తోంది.
సీనియర్లు గరంగరం!
పుష్కరకాలంగా పార్టీకి సేవచేస్తున్నవారిని కాదని కొత్తవారికి సీట్లు కేటాయించడంపై టీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహించాల్సింది పోయి వలస నేతలకు టికెట్లు ఇవ్వడంపై మండిపడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డిని చేర్చుకోవడంపై టీజేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, చేవె ళ్లలో రత్నం అభ్యర్థిత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్ని స్థానిక నేత దేశమొల్ల ఆంజనేయులు తీవ్రంగా తప్పుబట్టారు.
తెలంగాణ ఉద్యమకారులపై దాడులు చేసిన నేతలకు టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగారు. భారీగా టీఆర్‌ఎస్ శ్రేణులతో తరలివ చ్చిన ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు మేడ్చల్ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, చిలుక రాజు కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వీరివురు సుధీర్‌రెడ్డికి సీటివ్వడంపై కినుక వహించారు. దశాబ్ధకాలంగా పనిచేస్తున్నవారిని కాదని, ఏడాది క్రితం పార్టీలో చేరిన నేతకు బీ ఫారం ఇవ్వడమేమిటని వాపోతున్నారు.
ఇక పక్షం రోజుల క్రితం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న సంజీవరావుకు టికెట్ ఇవ్వడంపై స్థానిక నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదిలావుండగా, అభ్యర్థుల ఎంపిక తీరు టీఆర్‌ఎస్‌లోని ఒక వర్గానికి కూడా మింగుడు పడడంలేదు. అంకితభావంతో పనిచేసినవారిని పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారికి పెద్దపీట వేయడ మేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
టీఆర్‌ఎస్ ఫస్ట్
Published Fri, Apr 4 2014 11:38 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement