తెలంగాణ ప్రక్రియ జరగడం నూరుశాతం అబద్ధం: కేసీఆర్
తెలంగాణ ప్రక్రియ జరుగుతోందన్నది నూరుశాతం అబద్ధమని, పత్రికలలో వస్తున్న రాతలకు, జరుగుతున్న కథలకు ఏమాత్రం సంబంధం లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. ఉద్యోగసంఘాలతో గురువారం మధ్యాహ్నం జరిగిన భేటీలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ఆయనింకా ఏమన్నారంటే..
''ఆలిండియా సర్వీసులకు సంబంధించి.. అధికారుల పంపిణీ జరగాలి. ఆ ఫైలును ఇక్కడినుంచి పంపారు. కేంద్ర సర్వీసుల అధికారుల బదిలీలను డీవోపీటీ వాళ్లే చేయాలని, అధికారులు ఎక్కడికైనా వెళ్లాల్సిందేనని అన్నారు. కానీ, అక్కడ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ ఫైలు మీద సంతకం చేయలేదు. కొత్తగా ప్రధాని కాబోయే నరేంద్రమోడీయే సంతకం చేయాలి. ఆయన 26న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాతే ఫైలు చూసి, ఆ ప్రతిపాదనలకు ఒప్పుకొంటే సంతకం చేస్తే, అప్పుడు బదిలీలు అవుతాయి. రెండోతేదీ తర్వాత 10-15 మంది ఐఏఎస్, ఐపీఎస్లను తాత్కాలికంగా రెండు ప్రభుత్వాలకు కేటాయిస్తారని, తర్వాత రెండు ప్రభుత్వాలు కూర్చుని నిర్ణయించుకోవాలని మహంతి స్వయంగా చెప్పారు. కచ్చితంగా తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో, ఆంధ్ర వాళ్లు ఆంధ్రాలోనే ఉండాలి. మనం చెప్పింది ధర్మం. మేం మా పరిపాలనలో ఉంటాం.. మీరు మీ పరిపాలనలో ఉండాలి.
తెలంగాణ సచివాలయంలో కల్తీ ఉండటానికి వీలే లేదు. రెచ్చగొట్టడానికి ప్రయత్నించేవాళ్లు అధికారులైనా, నాయకులైనా, ఉద్యోగసంఘాల నాయకులైనా.. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. లక్షల ఉద్యోగాలు పోతున్నా ఊరుకున్నారు. సహనంతో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా మా స్వేచ్ఛ మాకు ఉండనీయమంటే ఎవ్వరూ సహించరు, భరించరు. రాష్ట్రాలు వేరైనా దేశం ఒకటే, మీరూ బాగుండండి, మేమూ బాగుంటాం. ఎవరి సెక్రటేరియట్లో వాళ్లే ఉందాం. అనవసరంగా కొట్లాడుకుంటామంటే ఇద్దరికీ టైం వేస్టు. అందులో రాజీపడేది లేదు'' అని కేసీఆర్ అన్నారు.