కేసీఆర్ మౌనం వెనుక మర్మమేమి?
తెలంగాణ ఉద్యమ నేత, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి మూగనోము పట్టారు. రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో కేసీఆర్ మౌనం ఎందుకు దాల్చారన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది. తెలంగాణపై హట్‌హట్‌గా చర్చలు జరుగుతున్న సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారన్న ఆసక్తి నెలకొంది. గులాబీ నేత తర్వాత అడుగు ఏమిటదనే దానిపై చర్చ జరుగుతోంది. ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా, కేసీఆర్ తర్వాతి ఎత్తుగడ ఎలా ఉండబోతోందన్న ప్రశ్నలు తెలంగాణ వాదుల్లో తలెత్తున్నాయి.
తెలంగాణ చుట్టే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్న సమయంలో కేసీఆర్ మౌనం పాటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణమాలపై ఎప్పటికప్పుడు చర్చలు జరిపే కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట మండలం జగదేవ్‌పూర్ ఫాంహౌజ్‌లో కుటుంబంతో ఉన్నారు. తెలంగాణ అంశంపై రోజుకో విషయం తెరపైకి వస్తున్నా ఆయన స్పందించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న కీలక దశలో కేసీఆర్ మౌనం పార్టీ నేతలను కూడా గందరగోళంలో పడేసింది.
ఒకవైపు దగ్గర పడుతున్న కేంద్రం గడువు, మరోవైపు సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర నేతల యత్నాలు రోజుకో మలుపు తిరుగుతున్న తెలంగాణ అంశంపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడటంలేదు. హైదరాబాద్పై ఆంక్షలు పెట్టే అవకాశం వుందని, అదే సమయంలో రాయల తెలంగాణపై కూడా చర్చ జరుగుతుందని వార్తలు వస్తున్నా కేసీఆర్ స్పందించలేదు. జీవోఎం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ ఆ తరువాత నుంచి ఫాం హౌస్‌కు పరిమితమయ్యరు. పార్టీలో ముఖ్యనేతలకు కూడా ఆయన అందుబాటులో లేరని తెలుస్తోంది.
కేసీఆర్ మౌనం వ్యూహత్మకమన్న వాదన ఉంది. తెలంగాణతోపాటు పార్టీ విలీనంపై కూడా స్పందించాల్సి ఉంటుంది కనుక ప్రస్తుతానికి మౌనం మంచిదనే రీతిలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌తో విలీనంకు పార్టీలో వ్యతిరేకత, అదే సమయంలో కాంగ్రెస్ పెద్దల నుంచి చర్చలు లేకపోవడంకూడా ఇందుక్కారణమనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో బీజేపీపై వ్యతిరేకంగా మాట్లడవద్దనే భావనలో కేసీఆర్ ఉన్నారు. భవిష్యత్తులో ఇటు యూపీఏకైనా, అటు ఎన్డీఏకైనా మద్దతిచ్చే విధంగా ఉండాలనేది కేసీఆర్ భావిస్తున్నారు. అయితే కేసీఆర్ మౌనంగా వుంటే తప్పేంటని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజల వాదనను జీవోఎం ముందు కేసీఆర్ బలంగా వినిపించారని వారు అంటున్నారు. కేసీఆర్ మౌనంపై మీడియా అతి చేస్తోందని వారు మండిపడుతున్నారు.