ఆత్మకూర్ : ఆత్మకూరు మండలంలోని జూరాల దిగువ జలవిద్యుత్ కేంద్రం నీట మునిగి 205 రోజులు దాటినా ఇంతవరకు దానికి బాధ్యులెవరో తేల్చలేదు. కేంద్రంలోని పంప్‌హౌస్ నిర్మాణ పనులు కూడా సక్రమంగా సాగడం లేదు. దీంతో ఈ వేసవిలో విద్యుత్ కష్టాలు ఎక్కువయ్యే ప్రమాదం ఏర్పడింది. పంప్‌హౌస్ వరద నీటిలో మునగడంతో సుమారు రూ. 690 కోట్లకు పైగా నష్టం జరిగింది. నిపుణల కమిటీ ఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్లినా.. ఆ నివేదిక ఏమైందో ఇప్పటి వరకు అధికారులు తేల్చలేదు. దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి నిర్మాణ కేంద్రంలో 2014 జూలై 30వ తేదీన పవర్‌హౌస్‌ను వరదనీరు ముంచెత్తింది. ఈ సంఘటనపై కారణాలు తెలుసుకునేందుకు తెలంగాణ జెన్‌కో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు 2014 సెప్టెంబర్ 7న నీటి పారుదల శాఖ మెకానికల్ చీఫ్ ఇంజనీర్లు, గేట్, కాంక్రీటు నిపుణులు, ప్రొఫెసర్లతో కూడిన కమిటీ సభ్యులు దిగువ జూరాలను సందర్శించారు.
ఈ బృందం మళ్లీ ప్రాజెక్టును సందర్శించింది. వీయర్‌స, పవర్‌హౌస్, ఎలక్ట్రికల్ తదితర ప్రదేశాలను సందర్శించిన అనంతరం సంఘటనకు కారణమైన నాలుగో యూనిట్‌లోకి దిగి పరిశీలించారు. నాలుగో యూనిట్‌లోని 7వ గేట్ వద్ద కాంక్రీట్ స్లాబ్ కూలడంతోనే ఈ సంఘటన జరిగిందని.. కాంక్రీట్ కూలడానికి కారణాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని కమిటీ సభ్యులు అప్పట్లో చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా చర్చిస్తామన్నారు.
త్వరలోనే కమిటీ సమావేశమై ఘటనపై అన్నికోణాల్లో న్యాయ విచారణ జరిపి ప్రభుత్వానికి, జెన్‌కోకు రెండు వారాల్లోపు నివేదిక ఇస్తామని చెప్పారు. కానీ, ఘటన జరిగి 205 రోజులు దాటినా నేటి వరకు నిపుణుల కమిటీ నివేదిక వివరాలు వెల్లడి కాలేదు. దీంతో ఈ ఘటనపై అసలేం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పనులు పూర్తిస్థాయిలో కాకపోవడంతో ఈ వేసవిలో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదముందని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు.
నష్టం రూ. 690కోట్లపైనే..
కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్షం కారణంగా ఎంతో విలువైన విద్యుత్తును కోల్పోవాల్సి వచ్చింది. విద్యుత్ కేంద్రంలోని 3యూనిట్ల ద్వారా 120మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేది. ఈ విద్యుత్తు ఉత్పత్తి అయి ఉంటే జిల్లా మొత్తానికి విద్యుత్ అందేది. రోజుకు 3లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే వాటిద్వారా రోజుకు రూ.2కోట్ల ఆదాయం వచ్చేది.
అయితే ప్రమాదంతో పనులు నిలిచిపోవడం వల్ల రూ.300 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. దీనికి తోడు ప్రాజెక్టులో మరమ్మత్తుల కోసం మరో రూ.150 కోట్లు ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు వడ్డీ రూపంలో మరో రూ.240కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకంగా పనులు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలంగాణకు చెందిన కొందరు ఇంజనీర్లు గతంలో ఆరోపణలు చేశారు. పది లక్షల క్యూసెక్కుల నీటి సామర్థ్యాన్ని తట్టుకోవాల్సిన గేట్‌వాల్వ్ 60వేల క్యూసెక్కుల నీటి తాకిడికే తెగిపోవడాన్ని దీనికి ఉదాహరణగా వారు పేర్కొంటున్నారు.
నిపుణుల నివేదిక ఏమైంది..?
Published Sun, Feb 22 2015 3:04 AM | Last Updated on Wed, Sep 5 2018 1:47 PM
Advertisement
Advertisement