- గడువులోగా గమ్యం
- సాకారం కానున్న కలల ‘మెట్రో’
- జూన్ చివరి లేదా జూలై మొదటి వారంలో ట్రయల్ రన్
- హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ వర్గాల ఆశాభావం
మెట్రో రైల్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నగర వాసి కల త్వరలో సాకారం కానుంది. రాష్ట్ర విభజన ప్రక్రియ... కొలువుదీరనున్న నూతన ప్రభుత్వాలు లాంటి హడావుడిలున్నా గడువులోగానే మెట్రోరైలు పట్టాలెక్కనుంది. 2017 జనవరి ఒకటి నాటికి అనుకున్న లక్ష్యాన్ని సాధించనుంది. గ్రేటర్ పరిధిలో సుమారు 20 లక్షలమంది ప్రయాణికులకు ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి విముక్తి కల్పించనుంది.
సాక్షి,సిటీబ్యూరో : నాగోల్-శిల్పారామం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా కారిడార్ల పరిధిలో 72 కిలోమీటర్ల మార్గంలో ప్రస్తుతం మెట్రో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. విభజనప్రభావం మెట్రో పనులపై పడబోదని హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. టెండర్ల ప్రక్రియ, నిధుల కేటాయింపు, అవసరమైన ఒప్పందాలు తదితర ప్రక్రియలన్నీ 2011 చివరి నాటికే పూర్తయ్యాయని చెబుతున్నారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఎల్‌అండ్‌టీ సంస్థ పలు జాతీయ బ్యాంకుల నుంచి సేకరించనుంది.
ఈ విషయంలోనూ ఎలాంటి అడ్డంకులు ఎదురుకాబోవని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నాగోల్-మెట్టుగూడా,మియాపూర్-ఎస్.ఆర్‌నగర్,ఎల్బీనగర్-మలక్‌పేట్,మెట్టుగూడా-బేగంపేట్ రూట్లలో పిల్లర్లు,వాటిపై వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు,స్టేషన్ల నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం)ప్రాజెక్టుగా పేరొందిన హెచ్‌ఎంఆర్ (హైదరాబాద్ మెట్రో రైల్) పథకాన్ని రూ.16,112 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టుకు ఎల్‌అండ్‌టీ సంస్థ రూ.12,674 కోట్లు, కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు నిధి కింద రూ.1458 కోట్లు కేటాయించనున్నాయి. భూసేకరణ,స్థిరాస్తులకు పరిహారం చెల్లింపు, పునరావాసం, స్కైవాక్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1980 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్టు పనులు మే 2012లో మొదలయ్యాయి.
త్వరలో ట్రయల్ రన్..
నాగోల్-మెట్టుగూడా రూట్లో మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రూట్లో జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో మెట్రో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ రూట్లో ఇప్పటికే మెట్రో పట్టాల్ పరుచుకున్నాయి. సిగ్నలింగ్, విద్యుదీకరణ పనులు త్వరలో పూర్తికానున్నాయి. ఇటీవలే మెట్రో రైలు కొరియా నుంచి ఉప్పల్ మెట్రో డిపో చేరిన విషయం విదితమే. కాగా ఉప్పల్ రింగ్‌రోడ్డు ప్రాంతంలో అత్యాధునిక మెట్రో స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. పక్షి ఆకృతిలో ఉండే ఈ స్టేషన్‌ను తీర్చిదిద్దేందుకు కార్మికులు,నిపుణులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.ఉప్పల్ మెట్రో డిపో పనులు కూడా సుమారు 85 శాతం మేర పూర్తయ్యాయి.
ఇప్పటికి 42 శాతం పనులు పూర్తి
మూడు కారిడార్ల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 2748 పిల్లర్లకు గాను ఇప్పటివరకు 892 పిల్లర్ల ఏర్పాటు, వాటి మధ్య వయాడక్ట్ సెగ్మెంట్ల అమరిక పూర్తి.
నాగోల్-మెట్టుగూడా రూట్లో పిల్లర్లు,సెగ్మెంట్ల అమరిక, పట్టాల ఏర్పాటు.
మొత్తం ప్రాజెక్టు పనుల్లో 42 శాతం పనులు పూర్తయ్యాయి. 72 కిలోమీటర్ల మెట్రో మార్గంలో 30 కిలోమీటర్లలో పనులు త్వరలో పూర్తి.