మెట్రో చిక్కులు..నగరవాసికి చుక్కలు!
మెట్రో రూట్లలో ట్రా‘ఫికర్’ ఎక్కువైంది. వర్షాలు..రోడ్లపై గుంతలు, మెట్రో రైలు పనుల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు నగరవాసికి చుక్కలు చూపిస్తున్నాయి. పది కిలో మీటర్ల దూరానికి గంటన్నర సమయం పడుతోంది. ఆర్టీసీ బస్సులు సైతం గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు సమయానికి గమ్యం చేరక..ఇటు ఇంధన ఖర్చులు పెరిగి జనం విలవిల్లాడుతున్నారు. బైకులు బైటకు తీయాలంటేనే భయపడుతున్నారు. ఆటోవాలాలు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. మొత్తంగా మెట్రో పనులు నగరవాసికి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు, చర్యలు చేపట్టినప్పటికీ అవి నామమాత్రంగా మారాయి.
ట్రాఫిక్‌తో నానా అవస్థలు పడుతున్న జనం
- పది కిలోమీటర్లు దాటాలంటే గంటన్నరకుపైగా సమయం
- రోడ్లపై గుంతలతో వాహనచోదకులకు గుబులు
- రోడ్ల విస్తరణను పట్టించుకోని మెట్రో అధికారులు
మెట్రో రైలు ఎప్పుడు వస్తుందో దేవుడెరుగు...ఈ ప్రాజెక్టు పనులు మాత్రం నగరవాసులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళ రోడ్డెక్కాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు...ఇలా ప్రతి ఒక్కరూ మెట్రో పనుల వల్ల సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. ఇప్పటికే రోడ్లపై గుంతలు, సూదుల్లా మొనదేలిన రాళ్లు, అడుగు తీసి...అడుగు వేసేందుకు హడలెత్తిపోతున్న రహదారుల్లో నానాయాతన పడుతున్న నగరవాసులకు మెట్రో పనులు మరింత నరకం చూపెడుతున్నాయి.
బండి ఇంధనం కూడా బాగానే కాలుతోంది. ఖర్చు పెరుగుతోంది. అనుకున్న పనులు సమయానికి కావడం లేదు. మెట్రో పనులు జరుగుతున్న కొన్నిప్రాంతాల్లో రక్షణ చర్యలు కూడా తూతూ మంత్రంగానే ఉన్నాయి. ఇక వర్షాకాలం కావడంతో కొద్దిపాటి వర్షానికే రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు వచ్చి చేరడంతో ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. ప్రధానంగా 28.87 కిలోమీటర్ల ఎల్‌బీనగర్-మియాపూర్ (కారిడార్ 1) రూట్లో, 14.78 కిలోమీటర్ల జేబీఎస్-ఫలక్‌నుమా (కారిడార్ 2) రూట్ , 27.51 కిలోమీటర్ల నాగోల్-శిల్పరామం (కారిడార్ 3) రూట్లో జరుగుతున్న మెట్రో రైలు పనులు ప్రమాదాలకు, ట్రాఫికర్‌కు కేరాఫ్‌గా మారుతున్నాయి.
ప్రత్యామ్నాయ రూట్లున్నా ఫలితం సున్నా..
పలు మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు జీహెచ్‌ఎంసీ,హెచ్‌ఎంఆర్ విభాగాలు ప్రత్యామ్నాయ రూట్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. కానీ ప్రధాన మార్గాల్లో మాత్రం ఆస్తుల సేకరణ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగకపోవడం, మెట్రో పనులు జరిగేందుకు రహదారి మధ్యలో బారికేడ్లు వేయడం అనివార్యమవడంతో రహదారులు కుంచించుకుపోయి ట్రాఫిక్ జంఝాటం తప్పడంలేదు.
ట్రాఫిక్ విభాగం అంచనా ప్రకారం అత్యధిక చిక్కులు ఈ ప్రాంతాల్లోనే...
- పంజగుట్ట, నాంపల్లి, ఎంజే మార్కెట్, చాదర్‌ఘాట్ బ్రిడ్జి, లక్డికాపూల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంది. ఒకవైపు మెట్రో పనులు..మరోవైపు వేలాది వాహనాలు ఒకేసారి రహదారులను ముంచెత్తుతుండడంతో సగటు వాహన వేగం గణనీయంగా తగ్గుతోంది.
- నాగోల్, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, ఎన్‌జీఆర్‌ఐ, మెట్టుగూడా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది.
- నాగోల్- మెట్టుగూడ రూట్లో ఆరులేన్ల రహదారి అందుబాటులో ఉండడంతో పనులకు ఎలాంటి ఆటంకం కలగడంలేదు. కొద్దిమేర సమస్య తీవ్రత తగ్గింది. ఇక ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు 97 ఆస్తులను ఇప్పటికే తొలగించారు. కబ్జాలను నిరోధించారు. ఇందుకోసం రూ.29.26 కోట్లు వ్యయం చేసినట్లు హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి.
నిండా మునిగిన గ్రేటర్ ఆర్టీసీ!
సాక్షి, సిటీబ్యూరో : మెట్రో రైలు పనుల వల్ల సిటీలో ప్రతినిత్యం ట్రాఫిక్ జామ్‌లు సాధారణమయ్యాయి. వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. ఇక ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో మునుగుతోంది. ట్రాఫిక్ కారణంగా సిటీ బస్సులన్నీ గంటలకు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ఆలస్యం ఇటు ప్రయాణికులను, అటు ఆర్టీసీని నష్టపరుస్తోంది. సాధారణంగా ఆర్టీసీ బస్సులు లీటర్ డీజిల్ వినియోగానికి 4.41 కిలోమీటర్ల సగటు దూరం పయనించాలి. కానీ ఏ ఒక్క బస్సు 3 కిలోమీటర్లు దాటి ముందుకు వెళ్లడం లేదు. లీటరుకు 4 కిలోమీటర్ల చొప్పున అయితే ప్రతి రోజు ఒక బస్సు 250 కిలోమీటర్ల దూరం తిరగడానికి 63 లీటర్ల డీజిల్ సరిపోతుంది.
కానీ గతుకుల రోడ్లు, ట్రాఫిక్ రద్దీ, మెట్రో గుంతల కారణంగా ఒక బస్సుకు 80 లీటర్లకు పైగా డీజిల్ వినియోగించవలసి వస్తోంది. పడిపోయిన కేఎంపీఎల్ కారణంగా 28 డిపోల పరిధిలో 3850 బస్సులు తిరిగేందుకు ప్రతి రోజు ఇంధన వినియోగం 2.42 లక్షల నుంచి 3.80 లక్షలకు పెరిగింది. మొత్తంగా ఆర్టీసీపైన ఇంధన భారం భారీగానే పెరిగింది. రూ.140 కోట్ల నష్టాలతో నడుస్తున్న గ్రేటర్ ఆర్టీసీకి ఇది మింగుడుపడడం లేదు. ఆటోవాలాలకూ నష్టాలే మిగులుతున్నాయి.
భారీగా ట్రిప్పుల రద్దు
మెట్రో పనుల కారణంగా సిటీలో ఆర్టీసీ బస్సులు అనుకున్న మేర తిరగడం లేదు. ఆలస్యం అవుతున్నందున అధికారులు భారీగా ట్రిప్పులు రద్దు చేస్తున్నారు. సికింద్రాబాద్-కోఠీ (వయా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్), మార్గంలోనూ, సికింద్రాబాద్-మెహదీపట్నం (వయా పంజగుట్ట), సికింద్రాబాద్-బీహెచ్‌ఈఎల్ తదితర అన్ని రూట్లలో ప్రతి రోజు వేల సంఖ్యలో ట్రిప్పులు రద్దవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని 1050 రూట్లలో సిటీ బస్సులు ప్రతి రోజు 42 వేల ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా. కానీ సగటున రోజుకు 5 వేల నుంచి 7 వేల ట్రిప్పులు రకరకాల కారణాల వల్ల రద్దవుతున్నాయి.