- రూ.5వేల కోట్ల ప్రాజెక్ట్
- ఎన్నికల కోడ్‌తో అడ్డంకి
- కోడ్ తర్వాతే డీపీఆర్‌పై టెండర్లు
సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీలో మెట్రో రైలు ప్రాజెక్టుపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీ ప్రక్రియ జాప్యం కానుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే డీపీఆర్ తయారీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపినా అమలుకు నోచుకోలేదు. తీరా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. దీంతో డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచేందుకు ఆటంకాలేర్పడ్డాయి. కానీ ఎన్నికల సంఘం అనుమతితో డీపీఆర్ టెండర్లను పిలిచేందుకు జీవీఎంసీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల సంఘానికి నివేదించారు.
టెండర్ ఖరారైతే నెలలోగా డీపీఆర్
ఇప్పటికే జీవీఎంసీలో ఏయే ప్రాంతాలు మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నాయో ప్రాథమిక నివేదికను రూపొందించారు. దాన్ని ప్రభుత్వానికి అందించారు. దీని ఆధారంగానే ప్రభుత్వం విశాఖలో మెట్రో ప్రాజెక్టుకు అనుమతించింది. సుమారు రూ.5వేల కోట్లతో దీన్ని చేపట్టేందుకు ప్రతిపాదించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏకంగా 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే అందించేందుకు ముందుకొచ్చింది. దీంతో యుద్ధప్రాతిపదికన జీవీఎంసీ ఏర్పాట్లు చేసింది. ఈలోగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
కానీ పురపాలన పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏయూడీ) నుంచి మాత్రం దీనిపై చర్యలు వేగవంతం చేయాలన్న ఆదేశాలతో ఎన్నికల సంఘానికి విషయాన్ని నివేదించారు. ఎన్నికల సంఘం అనుమతిస్తే టెండర్లు పిలవనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఢిల్లీ మెట్రోరైలు బోర్డు ఉత్సాహం చూపుతోంది. అయితే గ్లోబల్ టెండర్లు పిలవాలన్న ఉన్నతాధికారుల సూచనతో ఎన్నికల సంఘం ఆమోదం మేరకు ఆ దిశగా జీవీఎంసీ చర్యలు తీసుకోనుంది. టెండర్ల ప్రక్రియ పూర్తయితే.. నెల రోజుల్లో డీపీఆర్ సిద్ధమవుతుందని జీవీఎంసీ యంత్రాంగం చెప్తోంది. డీపీఆర్ సిద్ధమయితే ఏయే ప్రాంతాల మీదుగా మెట్రో ప్రాజెక్టు ఏర్పాటయ్యేదీ తేలనుంది.