అసలు ట్రాఫికే లేకుండా గమ్యాన్ని చేరుకోగలిగితే!
ట్రాఫిక్ చిక్కులకు దూరంగా... సీట్లు దొరకని కిక్కిరిసే ప్రయాణాలకు భిన్నంగా... అలసట అనే మాటే వినపడకుండా... కాలుష్యమనేదే లేకుండా... ఆకాశవీధిలో విహరిస్తూ... ‘కాంక్రీట్ జంగల్’ మధ్యలోంచి నిమిషాల వ్యవధిలో గమ్యం చేరుకోగలిగితే..! కలల అలలపై తేలియాడేలా నిత్యం ఈ అనుభూతి కొనసాగితే? పర్యాటక ప్రాంతాలను గగన వీక్షణం ద్వారా తిలకించగలిగితే!! విదేశాల్లోనో లేదా పర్యాటక ప్రాధాన్యతగల రాష్ట్రాల్లోనో ఉండే ఈ సౌకర్యం మనకూ అందుబాటులోకి వస్తే ఎంతటి ‘భాగ్యం’ అనుకుంటున్నారా? సరిగ్గా ఇదే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతోంది.
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరవాసులు ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేందుకు, నగర ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ట్రాఫిక్ నరకప్రాయంగా మారిన సిటీలో మెట్రో రైలు సౌకర్యం వచ్చాక పరిస్థితి కాస్త మెరుగుపడినా కీలక సమయాల్లో మెట్రో రైళ్లు సైతం కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మరో రవాణా సాధనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే వివిధ దేశాల్లో విజయవంతంగా నడుస్తున్న రోప్‌వే మార్గాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేసే దిశగా యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మూడు మార్గాల్లో రోప్‌వే మార్గాన్ని ప్రవేశపెట్టే దిశగా ప్రణాళిక రూపొందిస్తోంది.
హైదరాబాద్‌లో రెండు కారిడార్లతోపాటు యాదాద్రిలో మరో కారిడార్ ఏర్పాటుపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తోంది. ఈ మూడు మార్గాల్లో దాదాపు 17 కిలోమీటర్ల మేర రోప్‌వే నిర్మించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. అస్సాం, గుజరాత్ గిర్నార్, తూర్పు ముంబైలోని సెవ్రీ నుంచి ఎలిఫెంటా గుహల వరకు ఉన్న రోప్‌వే మార్గాల తరçహాలోనే హైదరాబాద్‌లోనూ రోప్‌వే ఏర్పాటు చేయాలనుకుంటోంది. 50 నుంచి 150 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసే ఈ రవాణా వ్యవస్థలో ఉండే ఒక్కో క్యాబిన్లో 8 మంది ప్రయాణికులు కూర్చొనే డిజైన్‌ను పరిశీలిస్తోంది. అలాగే కేబుల్ రిలే టవర్స్‌లో 30 మంది వరకు కూర్చొనేలా కూడా ఈ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తోంది. సింగపూర్‌లో రహదారులపై ఏర్పాటు చేసిన
రోప్‌వే మార్గం ఎలా ఉందనే దానిపై ఇప్పటికే అధ్యయనం చేసింది.
ఏయే ప్రాంతాల్లో..?
హైదరాబాదీలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు.. అంటే పర్యాటకులు ఎక్కువగా వెళ్లే ప్రాంతాల మధ్య రోప్‌వే రవాణా ఏర్పాటు చేయాలని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మెట్రో లేని మార్గమైన ఎంజీబీఎస్ నుంచి నెహ్రూ జంతు ప్రదర్శనశాల, ఖైరతాబాద్ నుంచి సచివాలయం, ప్యారడైజ్ నుంచి సచివాలయం మార్గంలో దాదాపు 12 కిలోమీటర్ల మేర అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సెక్రటేరియట్‌కు సమీపంలోనే హుస్సేన్‌సాగర్‌తోపాటు లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్కు ఉన్నాయి. అలాగే పర్యాటకులతోపాటు భక్తులు ఎక్కువగా వెళ్లే యాదాద్రి జిల్లాలోని రాయగిరి నుంచి యాదాద్రి గుడి వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర రోప్ వేను అందుబాటులోకి తీసుకొచ్చేలా అధ్యయనం చేస్తున్నారు.