సాక్షి, ముంబై: శివారు ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో రైలు సేవలు త్వరగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆరాటపడుతోంది. మే లేదా జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. దీంతో ఎప్పుడైనా ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల మోనో రైలు సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో సాధ్యమైనంత త్వరగా మెట్రో ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఆ లోపే ప్రారంభించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆరాటపడుతున్నారు.
తుది మెరుగులు
ఇప్పటికి అనేక స్టేషన్లలో ప్లాట్‌ఫారం పనులు పూర్తికాలేదు. ప్రయాణికులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. దాదాపు అన్ని స్టేషన్లలో 5-10 శాతం పనులు పూర్తికావాల్సి ఉంది. ఈ పనులు పూర్తికావడానికి దాదాపు రెండు నెలల సమయం పడుతుంది. అయినా సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేసి ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఎనిమిది సార్లు వాయిదా
2006 జూన్ 29వ తేదీన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కానీ పనులు మాత్రం 2008 జనవరి 29న ప్రారంభమయ్యాయి. ఇదివరకు ఎనిమిది సార్లు ప్రకటించిన డెడ్‌లైన్‌లు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు తుది మెరుగులు దిద్దే పనులు మాత్రమే మిగిలిపోయాయి. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో ప్రాజెక్టు మొత్తం పొడవు 11.40 కిలో మీటర్లు ఉంది. అందుకు అప్పట్లో రూ.2,356 కోట్లు ఖర్చవుతాయని అంచనావేశారు. కానీ ఈ ప్రాజెక్టు అనేక పర్యాయాలు వాయిదా పడటంతో అది కాస్తా తడిసి మోపెడై రూ.4,800 కోట్లకు చేరుకుంది. 2013 డిసెంబర్ ఆఖరు వరకు మొత్తం 12 స్టేషన్లలో ఏ స్టేషన్ పనులు కూడా 100 శాతం పూర్తికాలేదు.
ముఖ్యంగా రైలు ప్రారంభమయ్యేఘాట్కోపర్ స్టేషన్‌లోనే పనులు 90 శాతం పూర్తయ్యాయి. వర్సోవా స్టేషన్‌లో 99 శాతం పనులు పూర్తికాగా అసల్ఫా స్టేషన్‌లో 85 శాతం పనులు పూర్తయ్యాయి. సరాసరిగా మొత్తం 94.66 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. కొన్నిచోట్ల తుది మెరుగులు దిద్దే పనులు మాత్రమే మిగిలిపోయాయి. ఏదేమైనా ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే మెట్రో సేవలను ప్రజలకు అంకితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
‘కోడ్’కూయకముందే..
Published Fri, Feb 7 2014 10:54 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM
Advertisement
Advertisement