సాక్షి, ముంబై: ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన మెట్రో సేవలకు నగరవాసుల నుంచి విశేష స్పందన కనిపిస్తున్నా అప్పుడప్పుడూ నిరాశ పరుస్తూనే ఉన్నాయి. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మార్గంలో ప్రవేశపెట్టిన మెట్రో రైళ్లలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. వారంలో ఏదో ఒక రోజు, ఏదో ఒక స్టేషన్‌లో, ఏదో ఒక రైలు బోగీలో సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. గత నెలలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మెట్రోరైలు ప్రారంభించిన తరువాత మొదటి ట్రిప్పులోనే సాంకేతిక సమస్య తలెత్తి దాదాపు అర గంటసేపు రైలు ఆగిపోయింది.
అప్పటి నుంచి ఈ సమస్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక స్టేషన్‌లో సమస్యలు ఎదురుకావడం పరిపాటిగా మారింది. ప్రారంభించిన తొలిరోజుల్లోనే ఓ పక్షి ఓవర్ హెడ్ వైరులో చిక్కుకోవడంతో సుమారు 25 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో వారం తరువాత ఓ బోగీ డోర్లు తెర్చుకోకపోవడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. రెండు రోజుల కిందట ఓ వ్యక్తి మెట్రో రైలు పట్టాల మీదుగా నడుచుకుంటూ వెళుతుండగా పైలట్ గమనించి కంట్రో ల్ రూమ్‌కు సమాచారం అందించాడు. తరువాత భద్రతా సిబ్బంది వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో 20 నిమిషాల పాటు రైలు నిలిపివేయాల్సి వచ్చింది. తాజాగా బుధవారం మరోల్ స్టేషన్‌లో రైలు ఆగినా రెండు బోగీల డోర్లు తెర్చుకోలేదు. దీంతో అక్కడ దిగాల్సిన ప్రయాణికులు కంగారు పడ్డారు.
అప్పటికే రైలు ముందుకు కదలడంతో తరువాత వచ్చే సాకినాకా స్టేషన్‌లో దిగిపోయారు. ఇక బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మెట్రో రైలు బోగీల్లోకి నీరు వచ్చిచేరింది. ఏసీ గ్రిల్ నుంచి వర్షపు నీరు లోపలికి రావడంతో లోపలున్న ప్రయాణికులు తడిసి ముద్దయ్యారు. మెట్రోరైలు ప్రారంభించిన తరువాత అతి తక్కువ సమయంలోనే ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. శని, ఆది వారాల్లో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు ఉంటోంది. దీంతో మెట్రోకు భారీ ఆదాయమే వస్తోంది. మొత్తం 16 మెట్రో రైళ్లుండగా ప్రతీరోజూ దాదాపు 16 లక్షల మందిని చేరవేసే సామర్థ్యం ఉన్నా ప్రస్తుతం ఐదు లక్షల మంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. మూడోవంతు జనానికి సేవలందించే సమయంలోనే ఇన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటే పూర్తిస్థాయిలో జనం మెట్రో రైళ్లను ఆశ్రయిస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇవేం సేవలు..!
Published Thu, Jul 3 2014 11:14 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM
Advertisement