ముంబై మెట్రోకు 300 కోట్లు నష్టం!
ముంబై ః దేశ ఆర్థికనగరంలో మెట్రో రైలు కష్టాలను ఎదుర్కొంటోంది. ప్రయాణీకుల వృద్ధి పదిశాతం పెరిగినప్పటికీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. వందల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయినట్లు తాజా నివేదికలో పేర్కొంది.
ముంబైలో ప్రవేశ పెట్టిన మెట్రో రైలు కు సుమారు రెండేళ్ళలో రూ. 300 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. ప్రారంభంలో కేవలం రూ. 10 లతో ప్రయాణీకులు ఎక్కడికి కావాలంటే అక్కడకు వెళ్ళేలా మెట్రో అనుమతి కల్పించింది. రైలును ప్రారంభించిన మొదటి రెండు మూడు నెలల్లో ప్రయాణీకుల శాతం భారీగా పెరగడంతో పాటు శని, ఆదివారాల్లో ఆ సంఖ్య రెట్టింపు అవుతుండటంతో రద్దీకి అనుగుణంగా స్మార్ట్ కార్డులు, సీజన్ పాస్ లు వంటి ప్రత్యేక సౌకర్యాలను కల్పించింది. అయితే అనంతరం నిర్వహణ భారం, సిబ్బంది ఖర్చుల భారంతో పాటు.. భవన వ్యయం కూడ తీవ్రంగా పెరగడంతో మెట్రో భారీ నష్టాన్ని చవి చూడాల్సి వస్తోంది.
ముఖ్యంగా ప్రారంభంలో రూ.2,847 కోట్లుగా ఉన్న భవన వ్యయం.. రూ. 4,026 కు పెరిగిపోవడంతో మెట్రో రూ. 300 కోట్ల రూపాయల నష్టాన్ని చూడాల్సి వచ్చిందని తాజా నివేదికలో వెల్లడించింది. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన మెట్రో నిర్మాణ ఖర్చు రాయితీ తీవ్ర జాప్యం కావడంతోనే భారీగా వ్యయం పెరగడంతోపాటు తీవ్ర నష్టాలకు చేరుకున్నట్లు నివేదిక ఆధారంగా తెలుస్తోంది.