సాక్షి, ముంబై : మెట్రో రైళ్లలో మహిళలకు భద్రత కరువైంది. కొందరు ఆకతాయిలు ఒక బోగీ నుండి మరో బోగిల్లోకి తిరుగుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన మెట్రో రైల్లో ఓ యువతితో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వివషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు స్పందించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇలా ఫిర్యాదులకు నోచని సంఘటనలెన్నో ఉన్నాయి. ఈనేపథ్యంలో మెట్రో రైళ్లలో మహిళల కోసం ప్రత్యేక బోగీని కేటాయించాలన్న డిమాండ్ మరింత ఊపందుకొంది.
ప్రత్యేక బోగీలు లేవు
ఘాట్కోపర్-డీఎన్‌నగర్‌ల మధ్య నడిచే మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ తీవ్రమైంది. ముఖ్యంగా మహిళ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగా ప్రత్యేక బోగీలు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మెట్రో రైళ్లలో నాలుగు బోగీలుంటాయి. ఒక బోగీ నుండి మరో బోగీలోకి వెళ్లేందుకు ఆస్కారం ఉంది. ఈక్రమంలో ఆకతాయిలు ఒకబోగీ నుంచి మరోబోగీలోకి వెళ్తూ మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
మెట్రో రైలుకు ఉండే నాలుగు బోగీలల్లో ఒక బోగీని మహిళల కోసం కేటాయించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై రైల్వే అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. ‘అన్ని ప్రాంతాల్లో సీసీటీవి కెమెరాలున్నాయని, మహిళల భద్రతకు ఎలాంటి ఢోకాలేదని ముంబే మెట్రోవన్ ప్రెవైట్‌లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) ప్రకటించింది’. కానీ, జూలై 4వ తేదీ జరిగిన సంఘటన అనంతరం మహిళ ప్రయాణికుల భద్రతపై తక్షణమే స్పందించాలని మహిళలు పట్టుబడుతున్నారు. రైళ్లలో మహిళల భద్రతపై ఘాట్కోపర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళలకు ప్రత్యేక బోగీ కేటాయించాలి : ఎన్‌సీడబ్ల్యూ
మెట్రో రైళ్లో మహిళలకు ప్రత్యేక బోగీ కేటాయించాలని ‘నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా’ (ఎన్‌సీడబ్ల్యూ) మహారాష్ట్ర శాఖ డిమాండ్ చే స్తోంది. ఈ విషయంపై ఎన్‌సీడబ్ల్యూ మహారాష్ట్ర శాఖ అధ్యక్షురాలు శుశిబేన్ షా మీడియాతో మాట్లాడుతూ... ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కనీసం ఉదయం, సాయంత్రం రద్దీ సమయంలోనైనా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక బోగీ కేటాయించాలని అన్నారు. మెట్రో రైళ్లలో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
ముంబై మెట్రో రైళ్లలో భద్రత డొల్ల
Published Sat, Aug 9 2014 10:55 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement