మెట్రో రైలు రాకతోరవాణాసంస్థలకు ముప్పే
అత్యాధునిక సదుపాయాలకు నెలవైన మెట్రోరైలుతో తక్కువ ధరలో తొందరగా గమ్యస్థానం చేరే అవకాశం ఉంది కాబట్టి బస్సుల్లో ప్రయాణించే వారిలో అత్యధికులు మెట్రోకు మారతారని భావిస్తున్నారు. ఫలితంగా బెస్ట్ వంటి ప్రభుత్వ రవాణా సంస్థలకు మరిన్ని నష్టాలు తప్పకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సాక్షి, ముంబై: వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మెట్రో రైలు సేవలు ప్రారంభం కావడంతో ప్రజారవాణా వ్యవస్థ మరో మైలురాయిని అధిగమించినట్లయింది. ఈ మూడు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల విలువైన సమయం, డబ్బు ఆదా కాయడం ఖాయం. అయితే కొన్ని దశాబ్దాలుగా ముంబైలో సేవలు అందిస్తున్న వివిధ ప్రజారవాణా సంస్థలను మెట్రోరైలు ఆర్థికంగా దెబ్బతీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మెట్రో ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) వంటి రవాణా సంస్థలు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. దీనికితోడు ఆదివారం నుంచి మెట్రోరైలు మొదలుకాగా, మోనోరైలు మార్చి నుంచే సేవలు అందించడం మొదలుపెట్టింది.
కొన్ని దశాబ్దాలుగా నగరంలో తిరుగతున్న బెస్ట్ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు, ముంబైకర్లకు లైఫ్‌లైన్‌గా పేరుగాంచిన లోకల్ రైళ్లపై ఆదాయంపై మెట్రో ప్రభావం పడనుంది. మెట్రో ప్రభావం అన్నింటికంటే బెస్ట్‌పై ఎక్కువగా ఉండవచ్చని సంస్థ అధికారులు ఆందోళన చెందుతున్నారు. బెస్ట్ బస్సుల టికెట్ల చార్జీలు విపరీతంగా పెరగడంతో.. ఇద్దరుంటే చాలు ట్యాక్సీ లేదా ఆటో మాట్లాడుకొని వెళ్తున్నారు. అత్యధికులు ఇదే పద్ధతిని అవలంభిస్తున్నారు.
ఇప్పటికే అనేక రూట్లలో బెస్ట్ ఆదాయం పడిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మెట్రో కారణంగా వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ ప్రాంతాల మధ్య తిరిగే బెస్ట్ బస్సుల్లో కలెక్షన్లు మరింత తగ్గుతాయని అంటున్నారు. బెస్ట్‌కు నష్టాలు ఏటా పెరిగిపోతూనే ఉన్నాయి. దీనికి తోడు మోనో, మెట్రో రైళ్లు అందుబాటులోకి రావడంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోనుంది. దీంతో సంస్థ పరిస్థితి మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా మారింది.
మెట్రో స్టేషన్‌లో ప్రమాదం
ఘాట్కోపర్‌లోని మెట్రోస్టేషన్ ఎస్కలేటర్ ఎక్కిన ముగ్గురు మహిళలు ప్రమాదవశాత్తూ కింద పడడంతో గాయాలయ్యాయి. వీరిని ఘాట్‌కోపర్‌లోని రాజావాడి ఆస్పత్రిలో చేర్పించారు. వీరిని అంధేరిలో నివాసముంటున్న వైశాలి దేశాయ్ (60), సునీతా రాణే (50), ఘాట్కోపర్‌వాసి రిజ్వానా షేక్ (50)గా గుర్తించారు. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితులకు స్వల్పంగా గాయాలయ్యాయని డాక్టర్లు తెలిపారు.
తొలిరోజే విశేష స్పందన
మెట్రోరైలుకు మొదటి రోజే భారీ స్పందన కనిపించింది. ఆదివారం దాదాపు 2.40 లక్షల మంది వరకు ప్రయాణించారని దీని నిర్వాహక సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రా వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్, రిలయన్స్ గ్రూపు సంస్థల అధిపతి అనిల్ అంబానీ, పలువురు ప్రముఖుల సమక్షంలో ఆదివారం మెట్రోరైలు ప్రారంభం కావడం తెలిసిందే. ‘మెట్రోరైలు ప్రారంభోత్సవం మాకు మరపురాని వేడుక.
ఆదివారం సెలవు దినం అయినప్పటికి మధ్యాహ్నం 12 గంటల తరువాత నుంచి 2.40 లక్షల మంది రైలులో ప్రయాణించారు. ఇది ముంబైకర్ల ప్రయాణరీతిని మార్చేసింది’ అని రిలయన్స్ ఇన్‌ఫ్రా సీఈఓ లలిత్ జలాన్ అన్నారు. ముంబై తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించే వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మార్గంలో ప్రతినిత్యం ఏడు లక్షల మందికి సేవలు అందిస్తామని తెలిపారు. ప్రోత్సాహక పథకంలో భాగంగా మొదటి నెల రోజులపాటు వర్సోవా నుంచి ఘాట్కోపర్ వరకు (11.40 కిలోమీటర్లు) కేవలం రూ.10 చార్జీలు వసూలు చేస్తామని అధికారులు ప్రకటించారు.
మెట్రోచార్జీలపై స్టే కోరిన ఎమ్మెమ్మార్డీయే
ముంబై: ప్రభుత్వం సూచించిన వాటికంటే మెట్రో నిర్వాహక సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రా అధిక చార్జీలు వసూలు చేయడంపై ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) హైకోర్టును ఆశ్రయించింది. రిలయన్స్ అధిక చార్జీలు వసూలు చేయకుండా స్ట్టే మంజూరు చేయాలని సోమవారం అభ్యర్థించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వడానికి రిలయన్స్ ఇన్‌ఫ్రా కాస్త సమయం కోరడంతో కేసు తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ఆర్డీ ధనూకా ప్రకటించారు.
విచారణ సందర్భంగా ఎమ్మెమ్మార్డీయే న్యాయవాది ఏపీ భరూచా మాట్లాడుతూ మెట్రోరైలు సేవలు ప్రారంభమయ్యాయి కాబట్టి కేసు విచారణ త్వరగా చేపట్టాలని కోరారు. మెట్రో చార్జీల టారిఫ్‌పై ఎంఎంఓపీఎల్, ప్రభుత్వం మధ్య వివాదం ఉన్న సంగతి తెలిసిందే. మెట్రో చట్టం ప్రకారం చార్జీల విధింపు తన పరిధిలోకి వస్తుందని రిలయన్స్ వాదిస్తోంది. కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.40 మధ్య చార్జీలు ఉండేలా టారిఫ్ తయారు చేసింది. ప్రభుత్వం మాత్రం చార్జీలు రూ.9-13 మధ్య ఉండాలని కోరుకుంటోంది.