ఇదీ మన ‘మెట్రో’ | this our indian metro rail projects | Sakshi
Sakshi News home page

ఇదీ మన ‘మెట్రో’

Published Sun, Aug 23 2015 1:42 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

ఇదీ మన ‘మెట్రో’ - Sakshi

ఇదీ మన ‘మెట్రో’

ప్రజా రవాణా వ్యవస్థల్లో అంతర్భాగమవుతున్న మెట్రో రైళ్లు   మహా నగరాల అవసరాలకు దీటుగా మెట్రో రూపకల్పన  లక్షలాది మంది ప్రజలకు ఏసీ బోగీల్లో సౌకర్యవంత ప్రయాణం  ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నైల్లో ఇప్పటికే పరుగులు హైదరాబాద్‌లో వచ్చే ఏడాది అందుబాటులోకి  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న మెట్రో  ప్రస్తుతం దేశంలో ‘మెట్రో’ శకం నడుస్తోంది. మెట్రో రైలు.. మహానగరాల్లోని సాధారణ ప్రజల జీవితాల్లో ఓ అంతర్భాగమైపోయింది. మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రతిరోజూ లక్షలాది మంది ఆమ్‌ఆద్మీలను గమ్యస్థానం చేరుస్తున్న మెట్రో ఇప్పుడు ప్రజా రవాణా వ్యవస్థలకు కొత్త దారి చూపింది. మహానగరాల అవసరాలకు దీటుగా రూపుదిద్దుకున్న మెట్రో రైలు.. సాధారణ ప్రజలకు ఏసీ బోగీల్లో సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తోంది. ట్రాఫిక్ అనే పద్మవ్యూహంలో చిక్కుకుంటున్న నగరవాసులను సులువుగా గమ్యస్థానాలకు చేర్చి విలువైన పనిగంటలను మిగులుస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థను సరికొత్తగా ఆవిష్కరిస్తూ మరే రవాణా సాధనం తనకు సాటి రాదని, రాలేదని మెట్రో రైలు రుజువు చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు బెంగళూరు, ముంబై, చెన్నై మహానగరాల్లో ఇప్పుటికే మెట్రో రైళ్లు పరుగెడుతున్నాయి.

మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి రానుంది. దేశంలోని ఇతర మహా నగరాలకు దీటుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లోని మెట్రో రైళ్లకంటే ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది మన మెట్రో రైలు. ఒకే పిల్లర్‌పై మెట్రో రైలు ట్రాక్, స్టేషన్ల నిర్మాణం, డ్రైవర్ లేని సాంకేతికత, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ, ప్రీకాస్ట్ విధానం, పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు ఇలా చెప్పుకుంటూపోతే హైదరాబాద్ మెట్రోకు అన్నీ ప్రత్యేకతలే. ప్రస్తుతం వేగంగా హైదరాబాద్ మెట్రో నిర్మాణం జరుగుతున్న తరుణంలో పలు మహానగరాల్లో అందుబాటులో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టులతోపాటు మన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విశేషాలపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్..    - సాక్షి, హైదరాబాద్
 
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు

 
2012 జూన్‌లో హైదరాబాద్ మెట్రో పనులు ప్రారంభమయ్యాయి.
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.14,132 కోట్లు. కేంద్ర ప్రభుత్వం 10 శాతం, మరో 90 శాతం నిర్మాణ వ్యయాన్ని ఎల్‌అండ్‌టీ సంస్థ భరించనున్నాయి. మరో రూ.1,980 కోట్లను తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ, రహదారుల విస్తరణకు ఖర్చు చేస్తోంది.
ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా, నాగోల్-శిల్పారామం రూట్లలో మొత్తం 72 కి.మీ. మార్గంలో పనులు చేపట్టారు.
2017 జూన్ నాటికి మొత్తం 72 కి.మీ. మార్గంలో మెట్రో పనులు పూర్తికానున్నాయి.
ప్రారంభంలో సుమారు 18 లక్షలు, 2020 నాటికి 24 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించనున్నారు.
కనీస చార్జీ రూ.10, గరిష్ట చార్జీ రూ.25 ఉండే అవకాశం.
తొలిదశ కింద మియాపూర్-పంజాగుట్ట మార్గంలో వచ్చే ఏడాది ప్రారంభంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
ప్రతి రైలుకు మూడు బోగీలు ఉంటాయి. వెయ్యి మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.
మొత్తం మూడు కారిడార్లలో 57 మెట్రో రైళ్లు 72 కి.మీ. మార్గంలో రాకపోకలు సాగిస్తాయి.
మియాపూర్, ఉప్పల్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో మూడు మెట్రో రైలు డిపోలు ఏర్పాటు చేయనున్నారు
3 కారిడార్లలో రాకపోకలు సాగించే మెట్రో రైళ్లను ఉప్పల్ మెట్రో డిపోలోని ఆపరేషన్ కంట్రోల్ కేంద్రం నుంచి నియంత్రిస్తారు.
 
‘మెట్రో’ ఇంజనీరింగ్ అద్భుతం

 హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి
 
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ప్రపంచంలోనే తొలిసారిగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన అతిపెద్ద మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టు. ఒంటిస్తంభం పిల్లర్లపై పక్షి రెక్కల ఆకృతిలో ఏర్పాటు చేసిన మెట్రో రైలు స్టేషన్లు ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తితో హైదరాబాద్ విశ్వనగరం కావడం తథ్యం.
 హా నిర్మాణ రంగంలో ఆధునిక విప్లవానికి ఈ ప్రాజెక్టు నాంది. ప్రాజెక్టులో 85 శాతం నిర్మాణాలు కుత్బుల్లాపూర్, ఉప్పల్ కాస్టింగ్ యార్డుల్లో ప్రీకాస్ట్ విధానంలో రూపొందించినవే కావడం విశేషం. ప్రీకాస్ట్ విధానం వినియోగించడం.. రద్దీ రహదారులపై పనులు చేపట్టకపోవడంతో ట్రాఫిక్ ఇక్కట్లు బాగా తగ్గాయి.
డ్రైవర్ లేని సాంకేతికత, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థలు దేశంలోని ఇతర మెట్రో ప్రాజెక్టుల్లో అందుబాటులో లేవు. హైదరాబాద్ నగరంలోనే తొలిసారిగా ఈ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాం.
ప్రాజెక్టు పనులతో మతపరమైన, చారిత్రక కట్టడాలు దెబ్బ తినకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సుమారు పది సంస్థలు మెట్రో పనుల్లో భాగం పంచుకుంటున్నాయి.
ఒక్కో మెట్రో రైలు ట్రాక్ ఏడు బస్సు లైన్లు, 24 కార్ లైన్లతో సమానం. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో తక్కువ విస్తీర్ణంలోనే పనులు చేపడుతున్నాం. పిల్లర్ల మందం 2 మీటర్ల విస్తీర్ణానికంటే లోపుగానే ఉంది.
మెట్రో రైలుకు బ్రేక్ వేసినప్పుడు ఉత్పన్నమయ్యే శక్తి నుంచే విద్యుత్ ఉత్పత్తి చేసి మెట్రో అవసరాలను 35 శాతం వరకు తీర్చుకునే అవకాశం ఉంది.
మెట్రో ప్రయాణ అవసరాలను తీర్చే ప్రాజెక్టు మాత్రమే కాదు ఇది నగర పునర్నిర్మాణ ప్రాజెక్టు. ప్రజలకు ఉపయుక్తమైనది, పర్యావరణానికి హాని తలపెట్టని హరిత ప్రాజెక్టు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఇలా అన్ని వర్గాలకు అవసరమైన సకల సౌకర్యాలు మెట్రోలో అంతర్భాగమై ఉన్నాయి.
ప్రధాన రైల్వే స్టేషన్లు, ఎంఎంటీఎస్, బస్‌స్టేషన్లను మెట్రో రైలు స్టేషన్లతో అనుసంధానించి ట్రాఫిక్ రద్దీలో నగరవాసులు చిక్కుకుపోకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. మెట్రో స్టేషన్లకు సమీప కాలనీలకు చేరుకునేందుకు వీలుగా నిరంతరం మెర్రీ గో అరౌండ్ బస్సులు అందుబాటులో ఉంటాయి.
మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉన్న ప్రముఖ పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, కార్యాలయాలకు ఫుట్‌ఓవర్ బ్రిడ్జీ(ఆకాశ వంతెనలు)లతో అనుసంధానం.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణ దశలోనే గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్-2013(న్యూయార్క్), రాయల్ సొసైటీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ గోల్డ్ అవార్డు వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకోవడం విశేషం.
 
ముంబైలో..

ముంబైలో ప్రజా రవాణాకు రైళ్లే కీలకం. అక్కడ మెట్రో రైళ్లలో రోజువారీగా 2.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.
{పస్తుతం 11.4 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.
తొలిదశ మెట్రో పనుల పూర్తికి ఎనిమిదేళ్ల సమయం పట్టింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్మాణ పనులు మొదలయ్యాయి.
 
 ఢిల్లీ మెట్రో

1998 అక్టోబర్‌లో ఢిల్లీ మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయి.
2002 డిసెంబర్‌లో 25 కి.మీ. మార్గంలో తొలిదశ అందుబాటులోకి వచ్చింది.
{పస్తుతం 194 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.
నిత్యం 6 మార్గాల్లో 24 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
డీఎంఆర్‌సీ సంస్థ ఈ పనులను చేపట్టింది.
 
బెంగళూరులో..

2015 మే నెలలో మెట్రో రైలు ప్రారంభమైంది.
బయ్యనహళ్లి నుంచి ఎంజీ రోడ్ వరకు మెట్రో పరుగులు తీస్తోంది.
{పస్తుతానికి 8.5 కి.మీ. మార్గంలో పనులు పూర్తిచేసేందుకు నాలుగేళ్ల సమయం పట్టింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాయి.
 
చెన్నైలో..

చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు పనులు 2009 జూన్‌లో ప్రారంభమయ్యాయి.
ఈ ఏడాది జూన్ 29 నాటికి తొలిదశ పూర్తయ్యింది.
తొలిదశలో కోయంబేడు-ఆలందూర్ మధ్య 10 కి.మీ. మార్గంలో 27 మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.
నిత్యం సుమారు 3 లక్షల మంది ఈ రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు.
మొత్తం 45 కి.మీ. మార్గంలో మెట్రో పనులు చేపడుతున్నారు. ఇందులో 21 కి.మీ. మేర ఎలివేటెడ్ (ఆకాశమార్గం), మరో 24 కి.మీ. భూగర్భ మార్గం.
{పాజెక్టు అంచనా వ్యయం రూ.14,750 కోట్లు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 41 శాతం, 59 శాతం జైకా బ్యాంకు రుణంతో పనులు చేపట్టారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement