ముంబై: ముంబైవాసులకు శుభవార్త. నగరంలో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. కొత్తగా రెండు మెట్రో మార్గాలతోపాటు నాలుగు ఫ్లైఓవర్ల నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి అంచనా వ్యయం రూ. 45 వేల కోట్లు. ఏడు సంవత్సరాల వ్యవధిలోగా 72 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) చైర్మన్ కూడా అయిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలో గురువారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దహిసర్-చార్‌కోప్-బాంద్రా-మాన్‌ఖుర్ద్ మధ్య నిర్మించతలపెట్టిన ఈ మార్గంలో మొత్తం 36 స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 25,605 కోట్లు. దీనిని పూర్తిగా భూగర్భమార్గంలో నిర్మించనున్నారు. ఇక రెండో మెట్రో మార్గం వడాలా-ఘాట్కోపర్-ఠాణే-కసర్‌వాడావలి మధ్య నిర్మించనున్నారు. దీని అంచనా వ్యయం రూ. 19,097 కోట్లు. అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకుని వీటిని నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్టులకయ్యే వ్యయంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వం భరించనుంది. 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఉంటుంది. మిగతా మొత్తాన్ని నగరంలో భారీ ప్రాజెక్టుల బాధ్యతలను నిర్వర్తిసున్న ఎమ్మెమ్మార్డీయే చెల్లిస్తుంది. ఇక బాంద్రా కుర్లా కాంప్లెక్సు- సీలింక్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్-ధారవి మధ్య 4 ఫ్లైఓవర్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే ఈ మార్గాల్లో నగరవాసులకు ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
రవాణా వ్యవస్థ మరింత మెరుగు
Published Thu, Nov 20 2014 10:38 PM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM
Advertisement