ముంబై: కుండపోత వర్షాలతో దేశవాణిజ్య రాజధాని ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లో మంగళవారం జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలతో ముంబై రవాణా వ్యవస్థలో కీలకమైన సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రహదారులపైకి మోకాలి లోతు నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని బస్సు సర్వీసులను దారి మళ్లించారు.
వచ్చే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మంగళవారం ఉదయం 8 గంటల సమయానికి 24 గంటల వ్యవధిలో దక్షిణ, పశ్చిమ, తూర్పు ముంబై ప్రాంతాల్లో వరుసగా 96 మిల్లీమీటర్ల, 115 మి.మీ.,117 మి.మీ. వర్షపాతం నమోదైందని తెలిపింది. రానున్న నాలుగు రోజుల్లో ఉత్తర, దక్షిణ మహారాష్ట్ర కొంకణ్, మరాఠ్వాడా, గోవా ప్రాంతాలకు వాతావరణ శాఖ(ఐఎండీ) ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్)ను అధికారులు అప్రమత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment