ఇక రెండోమార్గం...
ముంబై: మెట్రోరైలు మొదటిమార్గం ఇటీవలే ప్రారంభమైన నేపథ్యంలో ఇక రెండోదశ కారిడార్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీని ఆర్థిక, సాంకేతిక అంశాలపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని రైల్వేశాఖ అధీనంలోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ (రైట్స్)ను కోరింది. రెండోదశలో నిర్మించబోయే దహిసర్-చార్కోప్-బాంద్రా-మాన్‌ఖుర్ద్ మార్గ నిర్మా ణం కోసం అధికారులు ప్రాజెక్టు సవివర నివేదికను కూడా తయారు చేస్తున్నారు.
చార్కోప్‌లోనిర్మించాల్సిన మెట్రోరైళ్ల డిపోను దహిసర్‌కు తరలిస్తున్నందున కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు నిరాకరించే అవకాశాలు లేవని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. ఇదే అంశంపై శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన పైవిషయాలను వెల్లడించారు. వివిధ శాఖల నుంచి అనుమతులు రాకపోవడం వల్లే రెండోదశ ప్రాజెక్టు ఇది వరకే ఆలస్యమయింది.
డిపోల తరలింపు వంటి మార్పుల ఫలితంగా పనుల్లో మరింత జాప్యమయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. రెండోదశ కారిడార్‌ను
పూర్తిగా భూగర్భంలోనే నిర్మించాలనే డిమాండ్లు కూడా ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. దహిసర్-చార్కోప్-బాంద్రా-మాన్‌ఖుర్ద్ మార్గం నిర్మాణం కోసం 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ శంకుస్థాపన చేసినా పనులు మాత్రం ఇప్పటికీ మొదలుకాలేదు.
లింకురోడ్డు, ఎస్వీరోడ్డును స్టేషన్లతో అనుసంధానించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరు ఆలస్యమవుతుండడమేగాక, చాలా ప్రాంతాల్లో ఓవర్‌హెడ్ వైర్లు ఉండడం, జుహూ ఎయిర్‌పోర్టు సమీపాన ఉండడం తదితర అడ్డంకులనూ అధిగమించాల్సి ఉంటుంది.
ముంబై తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించే ఘాట్కోపర్-వెర్సోవా మెట్రోమార్గాన్ని ఆదివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. మెట్రో రెండోదశ మార్గాన్ని కొలాబా నుంచి చార్కోప్ వరకు 40 కిలోమీటర్ల మేర నిర్మించాలని మొదట భావించారు. కొలాబా-మహాలక్ష్మి మార్గాన్ని పూర్తిగా భూగర్భంలోనే నిర్మించాలనే ప్రతిపాదించారు. సొరంగాల తవ్వకానికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది కాబట్టి చార్కోప్ నుంచి మాన్‌ఖుర్ద్ వరకు ఉపరితలంపైనే (35 కిలోమీటర్లు) మెట్రోమార్గాన్ని నిర్మించేలా సవివరణ ప్రణాళికలో మార్పులు చేశారు.
పెరుగుతున్న మెట్రో వినియోగం
ముంబైలో ఆదివారం నుంచి మెట్రోరైలు సేవలు మొదలైనప్పటి నుంచి ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం సాయంత్రం వరకు పది లక్షల మంది ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ కారిడార్ మార్గంలో మెట్రో సేవలు మొదలవడం తెలిసిందే. తొలి 59 గంటల్లో 10 లక్షల మంది ప్రయాణికుల్ని చేరవేసిన ఘనత ముంబై మెట్రోకు దక్కింది.
ఇంత తక్కువ సమయంలో భారీ సంఖ్యలో ప్రయాణికులను చేరవేసిన మొదటి మెట్రోరైలు తమదేనని ఎమ్మెమ్మార్డీయే ప్రకటించింది. బుధవారం ఉదయం 5.30 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు 1.71 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణించారు. ఇది నిత్యం ఏడు లక్షల మందికి సదుపాయాలు కల్పించగలదని నిర్వాహక సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రా తొలిరోజే ప్రకటించింది. ఒక్కో రైలులో దాదాపు 1,500 మంది వరకు ప్రయాణింవచ్చు.
పార్కింగ్ కష్టమే...
బైకులు, కార్లను నిలిపి ఉంచేందుకు మెట్రో స్టేషన్లలో తగినంత స్థలం లేకపోవడంతో వాహన యజమానులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్టేషన్ల సమీపంలో ఎక్కడో ఓ చోట పార్కింగ్ చేసి మెట్రోలో ప్రయాణించవలసివస్తోందని వాళ్లు చెబుతున్నారు. వెర్సోవా, డీఎన్ నగర్, ఆజాద్ నగర్ తదితర స్టేషన్లలో పార్కింగ్ కేంద్రాలు లేవని ప్రయాణికులు చెబుతున్నారు.