తగ్గిస్తేనే వస్తా! | reduce metro charges | Sakshi
Sakshi News home page

తగ్గిస్తేనే వస్తా!

Published Sat, Jun 7 2014 10:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

తగ్గిస్తేనే వస్తా! - Sakshi

తగ్గిస్తేనే వస్తా!

ముంబై: రిలయన్స్ ఇన్‌ఫ్రా నిర్ణయించిన మెట్రో చార్జీలు ఆమోదయోగ్యంగా లేవని, నిర్హేతుకమైన చార్జీల పెంపుదల విషయంలో వెనక్కు తగ్గకపోతే ప్రారంభోత్సవానికి తాను వచ్చేదిలేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంకేతాలిచ్చారు. వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మార్గంలో నిర్మాణ పనులను పూర్తి చేసుకొని పరుగు తీయడానికి సిద్ధమైన మెట్రోరైలు ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ఆదివారం ముహూర్తం ఖరారైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చవాన్ ఇచ్చిన ఈ సంకేతాలు ఇప్పుడు నగరంలో పెద్ద దుమారమే రేపుతున్నాయి.
 
11.40 కిలోమీటర్ల మేర రూ. 3,400 కోట్లతో నిర్మించిన ఈ మార్గంలో కనీస చార్జీ రూ. 9 గరిష్ట చార్జీ రూ. 13గా వసూలు చేయాలని మొదట నిర్ణయించారు. అయితే మెట్రో నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న రిలయన్స్ ఇన్‌ఫ్రా మాత్రం కనీస చార్జీ రూ. 10, గరిష్ట చార్జీ రూ. 40 వసూలు చేయాలని నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి చవాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చార్జీల పెంపుదల నిర్హేతుకమైనదని, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందానికి రిలయన్స్ ఇన్‌ఫ్రా కట్టుబడి ఉండాలని, లేదంటే తాను ప్రారంభోత్సవానికి రాననే సంకేతాలనిచ్చారు.
 
బీజేపీ ఎంపీలు కిరీట్ సోమయ్య, గోపాల్‌శెట్టి అండదండలు, ప్రోత్సాహంతోనే రిలయన్స్ ఇన్‌ఫ్రా చార్జీలను పెంచే సాహసం చేస్తోందని చవాన్ ఆరోపించారు. చార్జీల పెంపుదలపై బీజేపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని చవాన్ డిమాండ్ చేశారు. నిపుణుల కమిటీ అభిప్రాయం తీసుకున్న తర్వాతే పెంపుదల విషయమై ఏదైనా నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే టికెట్ల రేట్లు ఉండాలన్నారు.
 
ఇదిలాఉండగా ముంబై మెట్రోవన్ ప్రైవేట్ లిమిటెడ్, మెట్రో రైల్వేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి అభయ్ మిశ్రా మాట్లాడుతూ.... ‘ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముంబై నగరంలో మెట్రో సేవలను జూన్ 8, మధ్యాహ్నం 12 నుంచి ప్రారంభిస్తున్నాం. ప్రపంచస్థాయి ఆధునిక సౌకర్యాలను లక్షలాదిమంది నగరవాసులకు అందజేసేందుకు శాయశక్తులా కృషి చేస్తాం.
 
మెట్రో ప్రయాణంపై చేసే ప్రచారంలో భాగంగా మొదటి నెల రోజులు కేవలం రూ. 10 మాత్రమే చార్జీగా వసూలు చేస్తాం. ఈ చార్జీతో వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీలోని ఏ స్టేషన్ వరకైనా ప్రయాణించవచ్చు. అయితే ఇది కేవలం ప్రచారం కోసం నిర్ణయించిన చార్జీ మాత్రమే. ఆ తర్వాత మెట్రో చార్జీలు ఎలా ఉంటాయనేది నిర్ణయిస్తామ’న్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement