ఉడా.. ఛాన్స్‌బడా | Uda .. chansbada | Sakshi
Sakshi News home page

ఉడా.. ఛాన్స్‌బడా

Published Thu, Sep 4 2014 2:08 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

ఉడా.. ఛాన్స్‌బడా - Sakshi

ఉడా.. ఛాన్స్‌బడా

  • రెండు ప్రాజెక్టుల పర్యవేక్షణకు కమిటీల నియామకం
  •   ‘మెట్రో’ కమిటీలో ఎనిమిది మంది అధికారులు
  •   విజయసాగర్ రివర్ ఫ్రంట్ కమిటీలో ఆరుగురు
  • సాక్షి, విజయవాడ : విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీజీటీఎం ఉడా) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు కసరత్తు మొదలైంది. మెట్రో రైలు ప్రాజెక్టుతోపాటు భవానీపురం సమీపంలో నిర్మించ తలపెట్టిన కృష్ణా విజయసాగర్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను త్వరలో ప్రారంభించి, వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

    ఈ మేరకు ఆయా ప్రాజెక్టులను పరిశీలించేందుకు ప్రభుత్వ అధికారులతో ఉడా వీసీ రెండు కమిటీలను నియమించారు. విజయసిరి ప్రాజెక్టుకు ప్రణాళిక దాదాపు మూడేళ్ల క్రితమే సిద్ధమైనప్పటికీ భూసేకరణ, నిధుల సమస్య వల్ల మరుగున పడింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు నిధుల మంజూరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి హామీ లభించడంతో మళ్లీ తెరపైకి వచ్చింది.
     
    ‘మెట్రో’ కమిటీ ఇదే..

    మెట్రో రైలు ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ‘మెట్రో’ నిపుణుడు శ్రీధరన్‌ను సలహాదారుగా నియమించింది. ఆయన రెండు వారాల తర్వాత ఉడా అధికారులతో సమావేశం కానున్నారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో ఉడా అధికారులు సీరియస్‌గా పనిచేస్తున్నారు.

    డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీ కోసం ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి గత నెల 17 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు టెండర్లు స్వీకరించారు. ముంబయి, నాగపూర్, గుర్గావ్ తదితర ప్రాంతాల నుంచి 16 కంపెనీలు తమ ప్రొఫైల్స్‌ను పంపాయి. వాటిని పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆరు నెలల వ్యవధిలో డీపీఆర్ సిద్ధం చేసేందుకు వారంలోపు టెండర్లను పిలవనున్నారు.

    ఈ పనులను పర్యవేక్షించేందుకు సాంకేతిక నైపుణ్యం గల అధికారులతో ఉడా వీసీ పి.ఉషాకుమారి బుధవారం ఒక కమిటీని నియమించారు. ఉషాకుమారి అధ్యక్షురాలిగా ఉన్న ఈ కమిటీలో ఉడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ప్లానింగ్ విభాగంలోని ముగ్గురు అధికారులు, విశాఖపట్నం ఉడాలోని డివిజనల్ ఇంజినీర్ సభ్యులుగా ఉంటారు. మెట్రో ప్రాజెక్టు ప్రారంభమయ్యే వరకు దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఈ కమిటీ పర్యవేక్షించాల్సి ఉంటుంది.
     
    కృష్ణా విజయసాగర్  కోసం మరో కమిటీ

     
    కృష్ణా విజయసాగర్ పేరుతో రివర్ ఫ్రంట్‌ను ఉడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆమోదం లభించకుండానే రెండేళ్ల క్రితం అప్పటి ఉడా వీసీ విజయకుమార్ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కింద ప్రధానంగా ఏడు అంతస్తుల భవనం, రిక్రియేషన్ పార్కు, పిల్లల కోసం ప్రత్యేకంగా మరో పార్కు, ఫుడ్‌కోర్టుతోపాటు ఆధునిక హంగులతో 6.17 ఎకరాల్లో భవనాలు నిర్మించాలని నిర్ణయించారు.

    ఇందుకోసం రైతుల నుంచి 60:40 నిష్పత్తిలో పీవోపీ ప్రాతిపదికన నిర్మించాలని ప్రతిపాదించారు. కొంత భూమిని సేకరించారు. రూ.40కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు రూ.22 కోట్లు కేంద్ర పర్యాటక శాఖ, రూ.15 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, రూ.3కోట్లు ఉడా వెచ్చించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అన్ని అనుమతులు లేకపోవడంతో ప్రాజెక్టు మరుగున పడింది. ఈ క్రమంలో మళ్లీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఉడా అధికారులు డీపీఆర్ తయారీకి ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి టెండర్ల రూపంలో దరఖాస్తులను ఆహ్వానించారు.

    ఈ నెల 25వ తేదీ వరకు టెండర్ల ప్రక్రియ కొనసాగించి, ఆ తర్వాత ఆరు నెలల కాల వ్యవధిలో డీపీఆర్ తయారు చేయించాలని నిర్ణయించారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు ఉడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, నగరపాలక సంస్థ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, నీటిపారుదల శాఖ డివిజనల్ ఇంజినీర్, ఆర్కిటెక్చర్ కళాశాల నుంచి ఒక నిపుణుడు కలిపి ఆరుగురితో కమిటీని ఏర్పాటు చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement