గుంటూరుకూ మెట్రో!
నిధుల్లేకపోయినా స్కెచ్ గీయిస్తున్న సర్కారు
విజయవాడ టు గుంటూరు వయా రాజధాని
సర్వే పూర్తి చేసిన డీఎంఆర్‌సీ
సాక్షి, అమరావతి: డబ్బులు లేక విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పటి వరకు మొదలు పెట్టని ప్రభుత్వం ఆ విషయాన్ని మరచిపోయి ఏకంగా దాన్ని రాజధాని మీదుగా గుంటూరు వరకూ విస్తరించే పనిలోపడింది. విజయవాడ బస్టాండ్ నుంచి సీడ్ రాజధాని వరకూ ఒక కారిడార్‌ను, అక్కడి నుంచి గుంటూరు నగరానికి మరో కారిడార్‌ను నిర్మించే అవకాశాలను పరిశీలిస్తోంది. శ్రీధరన్ నేతృత్వంలోని డీఎంఆర్‌సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్) ఇప్పటికే దీనిపై సర్వే పూర్తి చేసింది.
రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో మెట్రో రైలు ప్రతిపాదనలున్నా దాన్ని గుంటూరుకు అనుసంధానం చేసే ప్రణాళికపై స్పష్టత లేదు. పైగా విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సవివర నివేదిక రూపకల్పన చేసే సమయంలో గుంటూరుకు మెట్రో సరికాదని శ్రీధరన్ తేల్చి చెప్పారు. తెనాలి, మంగళగిరి, గుంటూరు నగరాలను సబర్బన్ రైలు నెట్‌వర్క్‌తో మాత్రం అనుసంధానించవచ్చని సూచించారు. గుంటూరుకు మెట్రో భారీ వ్యయంతో కూడుకున్నది కావడంతో పాటు ప్రయాణీకుల సంఖ్య పరంగా చూసినా సాధ్యం కాదని తేల్చారు. అప్పట్లో దీనిపై మాట్లాడని ప్రభుత్వం రాజధానిని మెట్రో రైలు ద్వారా గుంటూరుకు లింకు కలపాలని కొద్దిరోజుల క్రితం డీఎంఆర్‌సీపై ఒత్తిడి తెచ్చింది. దీనిపై ఇటీవలే సర్వే పూర్తి చేసిన డీఎంఆర్‌సీ త్వరలో దాన్ని సీఎంకు సమర్పించనుంది. ముఖ్యమంత్రి ఆమోదం పొందితే సవివర నివేదిక తయారు చేసే అవకాశం ఉంది.
విజయవాడ నుంచి సీడ్ రాజధాని సమీపంలోని పిచ్చుకలవారిపాలెం వరకూ 24 కిలోమీటర్ల మేర ఒక కారిడార్, సీడ్ రాజధాని నుంచి తుళ్లూరు మీదుగా గుంటూరు వరకూ 34 కిలోమీటర్ల మేర మరో కారిడార్ నిర్మించాల్సి ఉంటుందని సర్వేలో తేల్చారు. వీటి నిర్మాణాన్ని మూడు దశల్లో చేపట్టేలా వ్యూహ రచన చేస్తున్నారు. ఇంత ఖర్చు చేసినా ఐదారేళ్ల తర్వాతైనా ఈ కారిడార్ల ద్వారా లాభం వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. వీటి నిర్మాణానికి డబ్బు సమకూరడం చాలా కష్టమని అధికార వర్గాలే పెదవి విరుస్తున్నాయి. డబ్బులేక విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును ఏడాది నుంచి మొదలు పెట్టలేకపోయిన ప్రభుత్వం పట్టుబట్టి మరీ ఈ విస్తరణకు ప్రణాళిక తయారు చేయించింది. అయితే ఇది ఎన్నేళ్లకు పట్టాలెక్కుతుందనేది ప్రశ్నార్థకమే.