మెట్రోకు గ్రీన్‌సిగ్నల్
- మూడు నెలల్లో డీపీఆర్ నివేదిక తయారీ
- జనవరిలోపు కేంద్రానికి సమర్పణ
- వీజీటీఎం ఉడా మ్యాప్ ఆధారంగానే సర్వే పనులు
- తొలిదశలో బెజవాడ పరిధిలోనే సర్వే
సాక్షి, విజయవాడ : నగరంలో మెట్రో రైలు పట్టాలు ఎక్కటానికి మార్గం సుగమం అయింది. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్) తయారీ మొదలుకొని అన్ని బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు అప్పగించింది. ఈమేరకు బుధవారం పురపాలక శాఖ ప్రత్యేక జీవో వెలువరించింది.
ఈ నెల 15వ తేదీ తర్వాత ఢిల్లీ మెట్రో బృందం రంగంలోకి దిగి డీపీఆర్ తయారీ పనులు మొదలుపెట్టనుంది. వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి నివేదికను కేంద్రానికి సమర్పించనున్నారు. విజయవాడలో మెట్రో రైలు నిర్మాణం జరగనుంది. తొలిదశ పనుల్లో భాగంగా మొత్తం 25 కిలోమీటర్ల మేర మెట్రో రూట్‌ను నిర్ణయించి ప్రాథమికంగా ఖరారు చేశారు. వీజీటీం ఉడా పరిధిలో మెట్రో నిర్మించాలని తొలుత కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
ఈమేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ఉడా పరిధిలోని విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ఉడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. చివరకు ప్రాథమిక నివేదిక తయారుచేసే బాధ్యతలను ఉడాకు అప్పగించారు. దీంతో ఉడా నివేదిక పంపటం ఆ తర్వాత మెట్రో ప్రాజెక్టు ఖరారు కావటం అన్నీ జరిగిపోయాయి.
రూ.25 కోట్ల నిర్మాణ వ్యయంతో చేపట్టే డీపీఆర్ తయారీ బాధ్యతలను ప్రభుత్వం తొలుత ఉడాకే అప్పగించినప్పటికీ, మెట్రో నిపుణులు శ్రీధరన్ రంగంలోకి రావటంతో మెట్రో ప్రాజెక్టు నుంచి ఉడాను తప్పించారు. ప్రస్తుతం ఉడా పరిధిలో నిర్మించే మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పూర్తి బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు అప్పగించారు.
ఈక్రమంలో గత నెల 20వ తేదీన ఢిల్లీ మెట్రో సలహాదారు శ్రీధరన్ బృందం విజయవాడ, తాడేపల్లి, గన్నవరం ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఉడా అధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత డీపీఆర్ పనులు ప్రారంభించటానికి ప్రభుత్వం నుంచి సాంకేతికంగా అనుమతి రాకపోవటంతో కొద్దిరోజులు వేచి చూశారు. బుధవారం డీపీఆర్ తయారీ బాధ్యతలు ఢిల్లీ మెట్రోకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అందుకు అవసరమైన రూ.25 కోట్ల నిధులు కూడా మంజూరు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో శ్రీధరన్ బృందం పూర్తిస్థాయిలో రంగంలోకి రావటానికి లైన్ క్లియర్ అయింది. ఈనెల 15వ తేదీ నుంచి విజయవాడలో సర్వే పనులు మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే తొలి దశలో మీడియం లెవల్ మెట్రో విజయవాడ నగరానికే పరిమితం చేసి అవసరాన్ని బట్టి రానున్న రోజుల్లో ఇతర ప్రాంతాల్లో నిర్మించడానికి వీలుగా సర్వే పనులు చేయనున్నారు.
ఉడా మ్యాప్ ఆధారంగానే ..
వీజీటీఎం ఉడా మ్యాప్ ఆధారంగానే మెట్రో బృందం సర్వే పనులు మొదలు పెట్టనుంది. ఉడా పరిధిలో రెండు జిల్లాలు ఉన్నాయి. ఈక్రమంలో ఉడాలో ఉన్న విజయవాడ నగర మాస్టర్ ప్లాన్‌ను, నగరపాలకసంస్థ అధికారుల సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. తొలిదశలో బస్టాండ్ నుంచి బందరురోడ్డు మీదుగా కానురూలోని ఇంజినీరింగ్ కళాశాల వరకు 13 కిలోమీటర్లు ఒక మార్గం, రెండో మార్గంలో బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్, ఏలూరు రోడ్డుమీదుగా రామవరప్పాడు రింగ్ వరకు మరో మార్గం నిర్మించి ఐదో నంబర్ జాతీయ రహదారి వద్ద రెండు మార్గాలను అనుసంధానం చేయలాని నిర్ణయించారు. రెండో మార్గం 12 కిలోమీటర్లుగా ఖరారు చేశారు. మొత్తంగా తొలిదశలో 25 కిలోమీటర్ల మేర మెట్రో రైలు రూట్‌ను ఖరారు చేశారు. అయితే ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.7,500 కోట్లు అవుతుందని అంచనా వేశారు. డీపీఆర్ పనులు పూర్తి చేసి జనవరి నాటికి ప్రభుత్వానికి సమర్పిస్తే మరో 10 నెలల్లో పనులు మొదలయ్యే అవకాశం ఉంది.
డీపీఆర్ నివేదికలో...
డీపీఆర్ నివేదికలో అన్ని అంశాలపై వివరాలు సేకరించి నమోదు చేస్తారు. బందరు రోడ్డులో ట్రాఫిక్ పరిస్థితి, నిత్యం రాకపోకలు సాగించే ప్రయూణికులు, వాహనాల సంఖ్య, ఎక్కడెక్కడ సిగ్నల్ పాయింట్లు ఉన్నాయి, మెట్రో మార్గంలో ప్రయాణికులు ఎక్కడానికి వీలుగా స్టేషన్‌లు ఎక్కడెక్కడ నిర్మించాలి, ఇతర ప్రాంతాల నుంచి నగరానికి నిత్యం ఎంత మంది వస్తారు, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయటానికి అనుకూల అంశాలు, ప్రజల జీవనస్థితి.. ఇలా అన్ని అంశాలను మెట్రో బృందం అధ్యయనం చేయనుంది. తొలుత నెల రోజులపాటు ఇప్పటికే ఖరారు అయిన మార్గంలో సర్వే పూర్తి చేసి ఆ తర్వాత ఉడా పరిధిలో విస్తరించటానికి అనువుగా ఉన్న ప్రాంతాల్లోనూ సర్వే నిర్వహించనున్నారు.