యుద్ధ ప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు | YS Jagan Says That Polavaram project should be completed by 2021 | Sakshi
Sakshi News home page

యుద్ధ ప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు

Published Wed, Jan 8 2020 3:42 AM | Last Updated on Wed, Jan 8 2020 3:42 AM

YS Jagan Says That Polavaram project should be completed by 2021 - Sakshi

సాగునీటి ప్రాజెక్టులపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను ఒడిసి పట్టి, దుర్భిక్ష ప్రాంతాలకు తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులు, కాలువల విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. గోదావరి నీటితో పోలవరం–బొల్లాపల్లి–బీసీఆర్‌ (బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌) అనుసంధానం.. కృష్ణా నదికి వరద వచ్చే 50 రోజుల్లో శ్రీశైలం జలాశయంపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా రాయలసీమ ప్రాజెక్టుల కాలువల విస్తరణ పనులు.. వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను సుభిక్షం చేయడానికి చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలను వెంటనే పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు.

తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన  సాగునీటి ప్రాజెక్టుల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్‌ను పోలవరం నుంచి తీసుకొచ్చే గోదావరి వరద జలాలతో నింపి, అక్కడ నుంచి బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు తరలించడం ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన పోలవరం–బొల్లాపల్లి–బీసీఆర్‌ అనుసంధానం పనులకు రూ.65 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి రూ.15,488 కోట్ల వ్యయం అవుతుందని, పల్నాడును సుభిక్షం చేయడానికి చేపట్టిన వరికపుడిశెల ఎత్తిపోతలకు రూ.1273 కోట్ల మేర వ్యయం అవుతుందని చెప్పారు.

సముద్రపు నీళ్లు ఎగదన్నకుండా.. భూగర్భజలాలు ఉప్పుబారకుండా చేయడానికి ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదిపై నాలుగు బ్యారేజీలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా నదికి వరద వచ్చే 50 రోజుల్లో శ్రీశైలం జలాశయంపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా రాయలసీమ ప్రాజెక్టుల కాలువలను వెడల్పు చేసే పనులతోపాటు.. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి గాలేరు–నగరి, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు రోజుకు మూడు టీఎంసీలను తరలించడానికి ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయడానికి రూ.26 వేల కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి రూ.25 వేల కోట్ల మేర అవసరం అవుతాయన్నారు. మొత్తమ్మీద ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలంటే రూ.1.55 లక్షల కోట్ల మేర అవసరం అవుతాయని జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ వివరించారు. 

పోలవరం పనులకు ఇబ్బంది తలెత్తకూడదు
పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రధానమైనదని, ఆ ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయాల్సిందేనని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.5,103 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించాల్సి ఉందన్నారు. పోలవరం పనులకు ఒక్క రోజు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి తలెత్తని విధంగా నిధుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పోలవరం నుంచి విశాఖపట్నంకు నిరంతరం తాగునీటిని సరఫరా చేసే పైపులైన్‌ వేసే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్, సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

ఒకే దశలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు 
కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదికలు)లను తక్షణమే సిద్ధం చేసి.. టెండర్లు పిలిచి, పారదర్శకంగా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. పనులకు నిధుల కొరత లేకుండా చూడటం ద్వారా వాటిని శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులను ఒకే దశలో చేపట్టాలని చెప్పారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై నాలుగు బ్యారేజీలు కాకుండా రెండు బ్యారేజీలను నిర్మించాలని.. ఆ మేరకు ప్రదేశాలను గుర్తించాలని ఆదేశించారు. వరికపుడిశెల ఎత్తిపోతలను, వంశధార, తోటపల్లి, చింతలపూడి, గుండ్లకమ్మ తదితర పెండింగ్‌ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement