పరవళ్లు.. పరుగులు | CM YS Jagan Says That Accelerate work of priority projects | Sakshi
Sakshi News home page

పరవళ్లు.. పరుగులు

Published Wed, Mar 30 2022 3:04 AM | Last Updated on Wed, Mar 30 2022 7:02 AM

CM YS Jagan Says That Accelerate work of priority projects - Sakshi

గడువులోగా పోలవరం.. 
పోలవరం దిగువ కాఫర్‌ డ్యామ్‌కు సంబంధించిన అన్ని డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించిందని, జూలై 31 నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ప్రధాన డ్యామ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఎలా పూడ్చాలనే విధానంపై ఏప్రిల్‌ 1న ఢిల్లీలో జరిగే సమావేశంలో కొలిక్కి వస్తుందని, మిగతా డిజైన్లు కూడా వీలైనంత త్వరగా ఖరారవుతాయన్నారు. సీడబ్ల్యూసీ అధికారుల వెంటపడి మరీ డిజైన్లకు అనుమతులు సాధించి గడువులోగా పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేసి రైతులకు ఫలాలు అందించాలని జలవనరుల శాఖకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అధికారుల వెంటబడి మరీ ఆమోదించుకోవడం ద్వారా నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోలవరంతో సహా ప్రాధాన్యత ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటివరకూ పూర్తైన పనులను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులు వివరించారు. గడువులోగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం పలు సూచనలు చేశారు. 

నగదు బదిలీ రూపంలో పరిహారం
పోలవరం నిర్వాసితులకు పునరావాసంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమావేశంలో అధికారులు తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో పునరావాసం కల్పిస్తున్నామన్నారు. మొదటి ప్రాధాన్యత కింద ముంపు గ్రామాల నుంచి తరలించే నిర్వాసితులకు ఆగస్టు నాటికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ఇందులో 20,946 కుటుంబాలకుగానూ ఇప్పటికే 7,962 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించామన్నారు. 3,228 నిర్వాసిత కుటుంబాలు ఓటీఎస్‌(వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌)కు దరఖాస్తు చేసుకున్నాయని, మిగతా 9,756 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని చెప్పారు. నగదు బదిలీ (డీబీటీ) విధానంలో నిర్వాసితులకు వేగంగా పరిహారం చెల్లించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

ఆగస్టుకు అవుకు టన్నెల్‌–2 సిద్ధం
నెల్లూరు బ్యారేజీ పనులను పూర్తి చేసి మే 15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. సంగం బ్యారేజీ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని చెప్పారు. దీనిపై సీఎం జగన్‌ సంతృప్తి వ్యక్తం చేస్తూ మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అవుకు టన్నెల్‌–2లో మిగిలిపోయిన 77.5 మీటర్ల పనులను 120 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి లైనింగ్‌తో సహా టన్నెల్‌ను పూర్తి చేసి ప్రస్తుత సామర్థ్యం మేరకు గాలేరు–నగరి కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు తరలించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

ఉదయగిరి, బద్వేలుకు వెలిగొండ జలాలు..
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌–2 పనులపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. నెలకు 400 మీటర్ల మేర టన్నెల్‌ తవ్వకం పనులు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీన్ని మరింత పెంచి నెలకు 500 మీటర్ల వరకూ టన్నెల్‌ తవ్వకం పనులు చేపడతామని తెలిపారు. వెలిగొండ టన్నెల్‌–1 ద్వారా సెప్టెంబర్‌లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను తరలించి తొలిదశ ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 2023 నాటికి టన్నెల్‌ –2 సహా అన్ని రకాల పనులను పూర్తిచేసి రెండు టన్నెళ్ల ద్వారా శ్రీశైలం నుంచి నల్లమలసాగర్‌కు నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో దశ కింద ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు నీటిని అందించే పనులకు టెండర్లు పిలవాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

నేరడి బ్యారేజీతో రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం
వంశధార – నాగావళి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. అక్టోబరుకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ 
సూచించారు. వంశధారపై గొట్టా బ్యారేజి ఎగువ నుంచి హిర మండలం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని దాదాపుగా ఆంధ్రప్రదేశే భరిస్తోందని.. బ్యారేజీని నిర్మిస్తే ఒడిశా కూడా సగం నీటిని వాడుకునే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు.ఇరు రాష్ట్రాలకూ నేరడి బ్యారేజీ ప్రయోజనకరమన్నారు. వీలైనంత త్వరగా నేరడి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

వడివడిగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు
► తోటపల్లి ప్రాజెక్టు కింద అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్‌ పనులనూ వేగవంతం చేయాలన్నారు. ఆర్ధికశాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని సూచించారు.
► తారకరామ తీర్థసాగరంలో రిజర్వాయర్‌ పనులు పూర్తి కావచ్చినట్లు అధికారులు 
పేర్కొనగా మిగిలిన పనులకు వెంటనే టెండర్లు పిలిచి పూర్తి చేయాలని సీఎం సూచించారు. సారిపల్లిని ముంపు గ్రామంగా గుర్తించి పునరావాసం కల్పించాలని ఆదేశించారు.
► మహేంద్ర తనయ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్‌ 
స్పష్టం చేశారు. మిగిలిన పనులకు ఆర్ధికశాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని సూచించారు.
► ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువను శ్రీకాకుళం వరకూ తీసుకెళ్లాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రధాన కాలువ తవ్వడానికి అవసరమైన భూమిని వేగంగా సేకరించి పనులు వేగవంతం చేయాలన్నారు.
► సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement