సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి | CM YS Jagan Review Meeting With Water Resources Department Officials | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి

Published Sat, Jan 30 2021 3:42 AM | Last Updated on Sat, Jan 30 2021 9:37 AM

CM YS Jagan Review Meeting With Water Resources Department Officials - Sakshi

సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో సకాలంలో పూర్తిచేయడం ద్వారా వాటి ఫలాలను రైతులకు అందించాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో తొలివిడత కింద చేపట్టిన పోలవరం, వెలిగొండ, నెల్లూరు, సంగం బ్యారేజీలు, అవుకు సొరంగం (టన్నెల్‌), వంశధార ప్రాజెక్టు స్టేజ్‌–2 రెండో దశ, వంశధార–నాగావళి అనుసంధానం పనులను గడువులోగా పూర్తిచేయాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. గోదావరికి వరద వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తిచేయాలని.. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని కాఫర్‌ డ్యామ్‌వల్ల నిర్వాసితులు ఎవరూ ముంపు బారిన పడకుండా వారికి పునరావాసం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ల అనుమతుల కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని సూచించారు. రెండో విడత ప్రాధాన్యత కింద చేపట్టాల్సిన ప్రాజెక్టులు, ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఆ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులతో సీఎం వైఎస్‌ జగన్‌ సుదీర్ఘంగా సమీక్షించారు. 
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షిస్తున్న సీఎం జగన్‌  

గడువులోగా పోలవరం పూర్తిచేయాల్సిందే..
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్చూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందని.. అందువల్ల దీనిని నిర్దేశించుకున్న గడవులోగా ప్రాజెక్టును పూర్తిచేయాల్సిందేనని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ.. ఫిబ్రవరి 10 నాటికి స్పిల్‌ వే బ్రిడ్జి పూర్తిచేస్తామని.. స్పిల్‌ ఛానల్‌లో పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఏప్రిల్‌ నాటికి స్పిల్‌ వేకు 48 రేడియల్‌ గేట్లను అమర్చుతామని.. అప్రోచ్‌ ఛానల్‌ను మే నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. అలాగే, ఎగువ కాఫర్‌ డ్యాంలో రీచ్‌–1ను మార్చి నెలాఖరుకు, రీచ్‌–2ను ఏప్రిల్‌ నెలాఖరుకు, రీచ్‌–3ను మే నెలాఖరుకు, రీచ్‌–4ను మార్చికల్లా పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా కాఫర్‌ డ్యాం పనులు పూర్తవుతాయని.. స్పిల్‌ వే మీదుగా గోదావరి వరదను మళ్లించి.. కాఫర్‌ డ్యామ్‌ల మధ్యన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌)ను నిర్విఘ్నంగా చేపట్టడం ద్వారా గడవులోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు.

ప్రత్యేకాధికారిని నియమించండి
కాగా, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్ల అనుమతులు ఆలస్యం కాకుండా చూసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. డిజైన్‌ల అనుమతుల కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని సూచించారు. రేడియల్‌ గేట్లకు అమర్చే హైడ్రాలిక్‌ సిలిండర్లలో మిగిలిన వాటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకోవడంలో ఆలస్యం కాకుండా చూసుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాఫర్‌ డ్యాం కారణంగా నిర్వాసితులు ఎవరూ ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని.. గోదావరికి వరద వచ్చేలోగా ప్రాధాన్యత క్రమంలో నిర్దేశించకున్న ప్రణాళిక ప్రకారం సహాయ, పునరావాస కార్యక్రమాలను పూర్తిచేయాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. 

శరవేగంగా పెన్నాపై జంట బ్యారేజీలు
పెన్నా నదిపై నిర్మిస్తున్న నెల్లూరు, సంగం బ్యారేజీల పనులను కూడా గడువులోగా పూర్తిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నెల్లూరు బ్యారేజీలో సివిల్‌ పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మార్చి 31లోగా గేట్లను బిగించే పనులు పూర్తవుతాయని.. ఏప్రిల్‌లో బ్యారేజీ ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అలాగే, సంగం బ్యారేజీలో రెండు వారాల్లో గేట్లను బిగించే పనులను ప్రారంభిస్తామని.. మార్చి ఆఖరుకు పూర్తిచేసి దీనిని కూడా ఏప్రిల్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తామని అధికారులు వివరించారు.

వేగంగా అవుకు టన్నెల్‌ పనులు..
గాలేరు–నగరి సుజల స్రవంతిలో ఇప్పటికే రెండు టన్నెల్స్‌ నుంచి దాదాపు 14వేల క్యూసెక్కుల వరకూ నీటిని సరఫరా చేయగలుగుతున్నామని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. వర్షాలు, లూజ్‌ సాయిల్‌వల్ల అవుకు రెండో టన్నెల్‌లో 134 మీటర్ల తవ్వకం పనులు సంక్లిష్టంగా మారాయని.. సొరంగంలో విరిగిపడ్డ మట్టిని తొలగించే పనులు, పటిష్టం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశామని అధికారులు వివరించారు. జూలై నాటికి రెండో టన్నెల్‌ పనులు పూర్తిచేస్తామని.. ప్రస్తుత డిజైన్‌ మేరకు 20 వేల క్యూసెక్కులను సరఫరా చేస్తామని చెప్పారు. 

సకాలంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి..
ఇక వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌–1 తవ్వకం పనులపై అధికారులు మాట్లాడుతూ.. అవి పూర్తయ్యాయని.. లైనింగ్‌ పనులు చేస్తున్నామని సీఎంకు వివరించారు. టన్నెల్‌–1 హెడ్‌ రెగ్యులేటర్‌ పనులూ పూర్తిచేశామన్నారు. టన్నెల్‌–2 హెడ్‌ రెగ్యులేటర్‌ పనులను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించి.. మూడున్నర నెలల్లో పూర్తిచేస్తామన్నారు. వీటిని ఆగస్టుకల్లా పూర్తిచేసేందుకు ప్రయస్తున్నామని చెప్పారు. ఈ రెండు టన్నెళ్ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేస్తామన్నారు. నల్లమలసాగర్‌ నిర్వాసితులకు అక్టోబర్‌ నాటికి పునరావాసం కల్పించే పనులను పూర్తిచేయాలని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఆయకట్టుకు నీళ్లందించే కాలువల తవ్వకం పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు.

వేగంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులు..
ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టుల అంశం చర్చకు రాగా.. వంశధార ప్రాజెక్టు స్టేజ్‌–2 రెండో దశలోని మూడు ప్యాకేజీల్లో మిగిలిన పనులను జూలై నాటికి పూర్తిచేసి.. ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. వంశధార–నాగావళి అనుసంధానం పనులను జూన్‌కల్లా పూర్తిచేస్తామన్నారు. 
– అలాగే, తోటపల్లి బ్యారేజీలో మిగిలిపోయిన పనులపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ బ్యారేజీలో మిగిలిన పనులను 2022, జూన్‌ నాటికి పూర్తిచేస్తామని అధికారులు వివరించారు. గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్‌ కింద 15 వేల ఎకరాలకు 2022, జూన్‌ నాటికి నీళ్లందించేలా పనులను పూర్తిచేస్తామని చెప్పారు. తారాకరామ తీర్థసాగరం పనుల్లో న్యాయపరమైన వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకుని.. డిసెంబర్, 2022 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని వారు వివరించారు. మహేంద్రతనయ ప్రాజెక్టును జూన్, 2022 నాటికి పూర్తిచేసే దిశగా పనులను వేగవంతం చేశామన్నారు. 
– ఇదిలా ఉంటే.. రెండో దశ ప్రాధాన్యత కింద చేపట్టే ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. వాటితోపాటు  విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి ప్రాజెక్టులను పూర్తిచేయడానికి కూడా కార్యాచరణను రూపొందించాలని సూచించారు. 

ఐదు ఎస్పీవీలపై ప్రత్యేక దృష్టి
మరోవైపు.. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులు, పల్నాడు ప్రాంత కరువు నివారణ ప్రాజెక్టులు, కృష్ణా–కొల్లేరు సెలైనటీ మిటిగేషన్‌ ప్రాజెక్టులు, ఏపీ స్టేట్‌ వాటర్‌ సెక్యూరిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టుల పనులు చేపట్టడానికి సంబంధించి ఏర్పాటుచేసిన ఎస్పీవీ (స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌)లపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలపైనా సీఎం జగన్‌  సమీక్షించారు. వీటికి నిధుల సమీకరణపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. రాయలసీమ, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టులకు రుణం ఇచ్చేందుకు వివిధ ఆర్థిక సంస్థలు సూత్రప్రాయంగా అంగీకరించాయని చెప్పారు. మిగిలిన ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై దృష్టి పెట్టామన్నారు. వరికిపూడిశెల ఎత్తిపోతల పనులు వేగంగా చేస్తున్నామని అధికారులు వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement