CM YS Jagan Mohan Reddy Mandate Water Resources Department - Sakshi
Sakshi News home page

AP CM YS Jagan: వరుసగా.. వడివడిగా 

Published Fri, Jul 15 2022 3:23 AM | Last Updated on Fri, Jul 15 2022 4:19 PM

CM YS Jaganmohan Reddy Mandate water resources department - Sakshi

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ప్రాధాన్యతగా చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతన్నలకు ప్రయోజనం చేకూర్చాలని జలవనరుల శాఖకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష  నిర్వహించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మహేంద్ర తనయ, తారకరామ తీర్థసాగర్, గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్, రాయలసీమలోని జోలదరాశి, రాజోలి జలాశయాలు, కుందూ ఎత్తిపోతల, వేదవతి ఎత్తిపోతల, రాజోలిబండ డైవర్షన్‌ స్కీం కుడి కాలువ, మడకశిర బైపాస్‌ కెనాల్, భైరవానితిప్ప– కుందుర్పి ఎత్తిపోతలతోపాటు వరికపుడిశెల ఎత్తిపోతల, చింతలపూడి ఎత్తిపోతల, వైఎస్సార్‌ పల్నాడు ఎత్తిపోతల పథకంతో సహా 27 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించారు.

వచ్చే నెల నెల్లూరు, సంగం బ్యారేజీలు
ఆగస్టు మూడో వారంలో నెల్లూరు బ్యారేజీ, మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. సంగం బ్యారేజీపై నెలకొల్పనున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విగ్రహం కోసం నిరీక్షిస్తున్నామని, త్వరలోనే రానుందని చెప్పారు.

దసరాకి అవుకు రెండో టన్నెల్‌..
గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను దసరా నాటికి సిద్ధం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాలకు వరదాయిని లాంటి వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. వెలిగొండ టన్నెల్‌–2లో ఏప్రిల్‌లో 387.3 మీటర్లు, మేలో 278.5 మీటర్లు, జూన్‌లో 346.6 మీటర్లు, జూలైలో ఇప్పటివరకూ 137.5 మీటర్ల మేర పనులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు సిద్ధం చేయాలని సీఎం జగన్‌ గడువు విధించారు. 

వంశధార పనులు ముమ్మరం..
వంశధార ప్రాజెక్టు స్టేజ్‌–2 ఫేజ్‌–2 పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని, అక్టోబర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలోనే గొట్టా బ్యారేజీ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు నీటిని తరలించే ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ ఎత్తిపోతలకు రూ.189 కోట్లు వ్యయం కానుంది.

పశ్చిమ కర్నూలుపై ప్రత్యేక దృష్టి
దశాబ్దాలుగా బాగా వెనకబాటుకు గురైన కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సమావేశంలో సీఎం జగన్‌ పేర్కొన్నారు. నీటి వసతి, సౌకర్యాల పరంగా అత్యంత వెనకబడ్డ ప్రాంతంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న వలసల నివారణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు నిర్దేశించారు. భూమిలేని వారికి కనీసం ఒక ఎకరా భూమినైనా ఇవ్వాలన్నారు. ఆ ప్రాంతంలో సాగు, తాగునీటి పథకాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయాలని ఆదేశించారు.

సాగునీరు అందించడం వల్ల ఉపాధి కల్పించి వలసలను నివారించవచ్చన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ కాలేజీలు తదితరాలను నెలకొల్పి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. అక్కడప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఆర్థ్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్‌సింగ్‌ రావత్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, ప్రాజెక్టుల సీఈలు తదితరులు పాల్గొన్నారు. 

పోలవరంపై సమగ్ర సమీక్ష..
► పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు, గోదావరికి ముందస్తు వరదలతో తలెత్తిన పరిణామాలపై సీఎం జగన్‌ సమగ్రంగా సమీక్షించారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో గతంలో వరద ఉధృతికి కోతకు గురై గ్యాప్‌–1, గ్యాప్‌–2ల్లో ఏర్పడిన అగాధాల పూడ్చివేత పనులపై విస్తృతంగా చర్చించారు. ఇందుకు సమగ్ర విధానాన్ని నిర్ధారించేందుకు తొమ్మిది రకాల పరీక్షలు, ఫలితాల నివేదికలు అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు పూర్తి కాగా మరికొన్ని నిర్వహించాల్సి ఉందని వివరించారు.

► కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సూచించిన విధానం ప్రకారం దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటంతోపాటు 30.5 మీటర్ల ఎత్తున నిర్మించే పనులను షెడ్యూల్‌ ప్రకారమే చేపట్టామని.. కానీ గోదావరికి ముందస్తు వరదల వల్ల దిగువ కాఫర్‌ డ్యామ్‌ కోతకు గురైన ప్రాంతం మీదుగా ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలోకి వరద జలాలు చేరాయని సమావేశంలో అధికారులు తెలిపారు.

► ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలోకి వరద జలాలు చేరడం వల్ల అగాధాలు పూడ్చేందుకు చేపట్టాల్సిన పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని అధికారులు పేర్కొన్నారు. ముందస్తు వరదల వల్ల దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులకు అంతరాయం కలిగిందని చెప్పారు. 

► గోదావరిలో వరద కనీసం 2 లక్షల క్యూసెక్కులకు తగ్గితేగానీ దిగువ కాఫర్‌ డ్యాం ప్రాంతంలో పనులు చేయడానికి అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. వరద తగ్గుముఖం పట్టగానే పోలవరం పనులను ముమ్మరంగా చేపట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సీఎం సూచించారు.

► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.2,900 కోట్లను రీయింబర్స్‌ చేయాల్సి ఉందని సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను ఖర్చు చేసిందన్నారు. ఆ నిధులను రీయింబర్స్‌ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పోలవరం పనులను వేగవంతం చేసేందుకు అడ్‌హాక్‌ (ముందస్తు)గా రూ.6 వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంపొనెంట్‌ (విభాగాలు) వారీగా రీయింబర్స్‌ చేసే విధానంలో కాకుండా అడ్‌హాక్‌గా నిధులు తెప్పించుకుంటే కీలక పనులను త్వరితగతిన పూర్తి చేయవచ్చన్నారు. వరద తగ్గగానే శరవేగంతో పనులు చేసేందుకు ఆ నిధులు ఉపయోగపడతాయన్నారు. ఈ మేరకు అడ్‌హాక్‌గా నిధులు సమకూర్చేలా కేంద్రానికి లేఖలు రాయాలని అధికారులకు నిర్దేశించారు. పోలవరం కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే కనెక్టివిటీలు, హెడ్‌ రెగ్యులేటర్‌ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement