సాక్షి, అమరావతి: నదీ జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. కర్ణాటక జల చౌర్యంపై తుంగభద్ర బోర్డుతో చర్చించి.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, ఆర్డీఎస్‌ల వద్ద టెలీమీటర్లు ఏర్పాటు చేయించింది. ఫలితంగా జల చౌర్యానికి అడ్డుకట్ట పడి.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్ కోటా కింద 2019–20లో 54.36 టీఎంసీలు రాష్ట్రానికి చేరితే, ఈ ఏడాది ఆదివారం నాటికి రాష్ట్రానికి 38.470 టీఎంసీలు చేరాయి. యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీటిని అందిస్తుండటంతో రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయబసవన చానళ్ల ద్వారా కర్ణాటకకు 138.99.. ఏపీకి 66.50 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు 10).. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 6.51 మొత్తం 212 టీఎంసీలను కేటాయించింది. అయితే వరద రోజులు తగ్గడం, డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ తగ్గడంతో నీటి లభ్యత తగ్గింది. నీటి సంవత్సరం ప్రారంభంలో నీటి లభ్యతపై అంచనా వేస్తున్న బోర్డు.. మూడు రాష్ట్రాలకు వాటా మేరకు దామాషా పద్ధతిలో నీటిని పంపిణీ చేస్తూ, విడుదల చేస్తోంది.. హెచ్చెల్సీ కింద అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 1,90,035.. ఎల్లెల్సీ కింద కర్నూలు జిల్లాలో 1,57,012.. కేసీ కెనాల్ కింద కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 2,65,628 వెరసి 6,12,675 ఎకరాల ఆయకట్టు ఉంది. కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయబసవన చానళ్ల కింద 9,78,824 ఎకరాలు, ఆర్డీఎస్ కింద తెలంగాణలో 87 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
జలచౌర్యం వల్ల చేరని జలాలు..
కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ 104 కి.మీ.లు.. ఎల్లెల్సీ కాలువ 131.50 కి.మీ.లు ఉంటుంది. ఈ రెండు కాలువల నుంచి ఆ రాష్ట్రంలో భారీ ఎత్తున జలచౌర్యం చేయడం వల్ల హెచ్చెల్సీ, ఎల్లెల్సీల నుంచి రాష్ట్ర సరిహద్దుకు అరకొర జలాలు మాత్రమే చేరేవి. దాంతో ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. జలచౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు హెచ్చెల్సీ.. ఎల్లెల్సీలను ఆధునికీకరించాలని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో తుంగభద్ర బోర్డుకు ప్రతిపాదించారు.. ఆ మేరకు కర్ణాటకను కూడా ఒప్పించారు. ఇరు రాష్ట్రాలు నిధులు విడుదల చేయడంతో ఇప్పటికే కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తయింది. ఎల్లెల్సీ ఆధునికీకరణ 102 కి.మీ వరకూ పూర్తయింది.. మిగిలిన పనులను పూర్తి చేయాలని బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. హెచ్చెల్సీ, ఎల్లెల్సీలకు నీటిని విడుదల చేసే రెగ్యులేటర్ల వద్ద.. రాష్ట్ర సరిహద్దులో టెలీమీటర్లు ఏర్పాటు చేయాలని కోరింది. దాంతో గతేడాది ఆయా రెగ్యులేటర్ల వద్ద.. రాష్ట్ర సరిహద్దులో టెలీమీటర్లను బోర్డు ఏర్పాటు చేసింది.
పక్కాగా నీటి లెక్క..
బోర్డు పరిధిలోని కాలువలపై పూర్తి స్థాయిలో టెలీమీటర్లను ఏర్పాటు చేయడంతో అవి చుక్క చుక్కనూ పక్కాగా లెక్కిస్తున్నాయి. దాంతో కర్ణాటక జలచౌర్యానికి పూర్తిగా అడ్డుకట్ట పడింది. దీని వల్లే గతేడాది గరిష్ఠంగా 54.36 టీఎంసీలు తుంగభద్ర జలాశయం నుంచి రాష్ట్రానికి చేరాయి. ఈ ఏడాది తుంగభద్ర డ్యామ్‌లో 170.8 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బోర్డు.. హెచ్చెల్సీకి 26.184, ఎల్లెల్సీకి 19.336, కేసీ కెనాల్‌కు 8.057 వెరసి 53.577 టీఎంసీలు కేటాయించింది. ఆదివారంనాటికి హెచ్చెల్సీ ద్వారా 23.578, ఎల్లెల్సీ ద్వారా 11.102, కేసీ కెనాల్‌కు 3.79 వెరసి 38.470 టీఎంసీలు చేరాయి. ఇంకా 15.107 టీఎంసీల కోటా మిగిలి ఉంది. ప్రస్తుతం టీబీ డ్యామ్‌లో 56.54 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా కోటా జలాలు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి చేరుతాయని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
హక్కులు తుంగ‘భద్రం’
Published Tue, Jan 19 2021 3:22 AM | Last Updated on Tue, Jan 19 2021 3:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment