Tungabhadra reservoir
-
తుది దశలో ‘తుంగభద్ర’ గేట్ పనులు
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో హొసపేటె వద్ద తుంగభద్ర జలాశయంలో 19వ క్రస్ట్ గేట్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికి 40 టీఎంసీలకు పైగా నీటిని వదిలేశారు. మూడు రోజుల నుంచి క్రస్ట్ గేట్ ఏర్పాటుకు డ్యాం అధికారులు, నిపుణులు తీవ్రంగా యత్నిస్తున్నారు. గురువారం ఉదయం జిందాల్ కంపెనీ తయారు చేసిన స్టాఫ్‌లాగ్ గేట్‌లోని హెలిమెట్స్ను తుంగభద్ర డ్యామ్ వద్దకు తీసుకొచ్చారు. డ్యామ్‌పైన భారీ క్రేన్ల సహాయంతో 80 మంది కార్మికులతో గేట్‌ను దింపే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రత్యేక నిపుణుడు కన్నయ్యనాయుడు సూచనలతో స్టాఫ్‌లాగ్ గేట్లను ఏడు సిద్ధం చేశారు. ఒక్కో పీసు 15 టన్నుల బరువుతో తయారు చేస్తున్న వాటిని ఒక్కొక్కటిగా డ్యామ్ వద్దకు చేర్చి క్రస్ట్ గేట్ స్థానంలోకి భారీ క్రేన్ల సహాయంతో దింపుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరిగినా తక్షణం అన్ని విధాలా రక్షించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. రేపటిలోపు పనులు పూర్తి చేసే అవకాశాలున్నాయని బోర్టు అధికారులు చెప్పారు. -
తుంగభద్ర జలాలపై కర్ణాటక, ఏపీ ఉన్నతస్థాయి భేటీ
సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాశయంలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 230 టీఎంసీలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంపై చర్చించేందుకు బెంగళూరు వేదికగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక జల వనరుల శాఖల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్సీలు మంగళవారం భేటీ కానున్నారు. తుంగ«భద్ర డ్యామ్‌కు ఎగువన కర్ణాటక సర్కార్ ప్రతిపాదిస్తున్న నవలి రిజర్వాయర్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న హెచ్చెల్సీ సమాంతర కాలువ అంశంపై ప్రాథమికంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తదుపరి చర్యలు తీసుకుంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. తుంగభద్ర డ్యామ్‌ను 133 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 1953లో నిర్మించారు. డ్యామ్ వద్ద 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటకకు 151.49, ఆంధ్రప్రదేశ్‌కు 72, తెలంగాణకు 6.51 టీఎంసీలను కేటాయించింది. పూడిక వల్ల డ్యామ్‌లో నీటి నిల్వ 105.78 టీఎంసీలకు తగ్గింది. దీంతో డ్యామ్‌లో నీటి లభ్యత ఆధారంగా మూడు రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో జలాలను తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది. వాటా జలాలను వాడుకోవడానికే.. డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడం వల్ల మూడు రాష్ట్రాలు ఏటా సగటున 167 నుంచి 175 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతున్నామని కర్ణాటక సర్కార్ చెబుతోంది. పూడిక తీయడానికి రూ.12,500 కోట్లు వ్యయం అవుతుందని లెక్కలు వేస్తోంది. దానికి బదులుగా తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన నది నుంచి వరద కాలువ తవ్వి నవలి వద్ద కొత్తగా 52 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తామని చెబుతోంది. దీంతోపాటు విఠల్‌పుర చెరువు సామర్థ్యాన్ని 4.52 టీఎంసీలకు పెంచి శివపుర చెరువు సామర్థ్యాన్ని 1.56 టీఎంసీలకు పెంచి ఎడమ కాలువ కింద ఆయకట్టును స్థిరీకరిస్తామని.. తుంగభద్ర డ్యామ్‌లో నిల్వ ఉన్న నీటితో మిగతా వాటా జలాలను వాడుకోవచ్చునని కర్ణాటక ప్రతిపాదిస్తోంది. ఈ రిజర్వాయర్ పనులకు రూ.9,500 కోట్ల వ్యయం అవుతుందని.. దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలు భరించాలని తుంగభద్ర బోర్డు సమావేశాల్లో కోరుతూ వస్తోంది. దీన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యతిరేకిస్తున్నాయి. అప్పర్ భద్ర, సింగటలూరు ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే కేటాయించిన నీటి కంటే అధికంగా కర్ణాటక వాడుకుంటోందని.. నవలి వద్ద రిజర్వాయర్ నిర్మిస్తే తమ హక్కులకు విఘాతం కలుగుతుందని స్పష్టం చేస్తున్నాయి. తుంగభద్ర హెచ్చెల్సీ(ఎగువ కాలువ)కు సమాంతరంగా వరద కాలువ తవ్వి.. వరద రోజుల్లో వాటా (32.5 టీఎంసీలు) తరలిస్తామని.. డ్యామ్‌లో నిల్వ నీటిని మూడు రాష్ట్రాలు పంచుకోవడం ద్వారా పూర్తిస్థాయిలో వాటా జలాలను వాడుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. సీఎం జగన్‌ను చర్చలకు ఆహ్వానించిన కర్ణాటక సీఎం నవలి రిజర్వాయర్ నిర్మాణానికి అంగీకరించాలని, వాటా జలాలను మాత్రమే వాడుకుంటామని, దీనివల్ల ఎవరికీ నష్టం ఉండదని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌లకు ఆరు నెలల క్రితం కర్ణాటక సీఎం బొమ్మై లేఖలు రాశారు. ఇదే అంశంపై నాలుగు రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్‌తో కర్ణాటక సీఎం బొమ్మై ఫోన్లో చర్చించారు. తుంగభద్ర జలాల వినియోగంపై చర్చలకు ఆహ్వానించారు. తొలుత రెండు రాష్ట్రాల జల వనరుల శాఖల కార్యదర్శుల స్థాయిలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిద్దామని, ఆ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. ఇద్దరు సీఎంలు తీసుకున్న నిర్ణయం మేరకే మంగళవారం రెండు రాష్ట్రాల జల వనరుల శాఖల ఉన్నతాధికారులు సమావేశమవుతున్నారు. -
ఆగని కర్ణాటక జల దోపిడీ
కర్నూలు సిటీ: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయం. దీని నుంచి జల చౌర్యానికి అలవాటు పడిన కర్ణాటక ఇబ్బడిముబ్బడిగా ఎత్తిపోతల పథకాలు, భారీ మోటార్లతో నీటి దోపిడీకి పాల్పడుతోంది. ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్టుగా ఉన్నటువంటి తుంగభద్ర (టీబీ) డ్యాం నీటిని కేటాయించిన మేరకు అందించేందుకు బోర్డున్నా కూడా జల దోపిడీని అరికట్టలేకపోతోంది. ప్రాజెక్టు తమ భూభాగంలో ఉందనే ధీమాతో డ్యాం ఎగువన, దిగువన, నది పరీవాహక ప్రాంతాల్లో నుంచి ఇష్టానుసారంగా కర్ణాటక నీటిని దోపిడీ చేస్తోంది. ఈ దోపిడీపై గతేడాది అక్టోబర్ 22న టీబీ బోర్డు సమావేశంలో ఉమ్మడిగా తనిఖీలు చేయాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్లు చేసిన సూచన మేరకు జాయింట్ కమిటీ ఏర్పాటుచేశారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2 వరకు జాయింట్ కమిటీ తనిఖీలు నిర్వహించింది. ఈ కమిటీ విచారణలో కన్నడిగుల గుట్టురట్టు అయ్యింది. దీంతో కమిటీ ఇచ్చిన నివేదికను ఈ నెల 29న బెంగళూరులో జరుగనున్న టీబీ బోర్డు సమావేశంలో ప్రధాన అజెండాగా ప్రవేశ పెట్టనున్నారు. సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. నిర్మాణంలో ఉన్న చిలవరబండి లిఫ్ట్ అక్రమంగా లిఫ్ట్‌లు ఏర్పాటు తుంగభద్ర డ్యాం నీటిని దొంగచాటుగా కాజేసేందుకు టీబీ డ్యాం కుడి, ఎడమ వైపున మొత్తం 50 ఎత్తిపోతల పథకాలు ఉన్నట్లు జాయింట్ కమిటీ గుర్తించింది. ఇందులో కుడి వైపు 28, ఎడమ వైపు 22 ఉన్నాయి. -
హక్కులు తుంగ‘భద్రం’
సాక్షి, అమరావతి: నదీ జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. కర్ణాటక జల చౌర్యంపై తుంగభద్ర బోర్డుతో చర్చించి.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, ఆర్డీఎస్ల వద్ద టెలీమీటర్లు ఏర్పాటు చేయించింది. ఫలితంగా జల చౌర్యానికి అడ్డుకట్ట పడి.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్ కోటా కింద 2019–20లో 54.36 టీఎంసీలు రాష్ట్రానికి చేరితే, ఈ ఏడాది ఆదివారం నాటికి రాష్ట్రానికి 38.470 టీఎంసీలు చేరాయి. యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీటిని అందిస్తుండటంతో రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయబసవన చానళ్ల ద్వారా కర్ణాటకకు 138.99.. ఏపీకి 66.50 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు 10).. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 6.51 మొత్తం 212 టీఎంసీలను కేటాయించింది. అయితే వరద రోజులు తగ్గడం, డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ తగ్గడంతో నీటి లభ్యత తగ్గింది. నీటి సంవత్సరం ప్రారంభంలో నీటి లభ్యతపై అంచనా వేస్తున్న బోర్డు.. మూడు రాష్ట్రాలకు వాటా మేరకు దామాషా పద్ధతిలో నీటిని పంపిణీ చేస్తూ, విడుదల చేస్తోంది.. హెచ్చెల్సీ కింద అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 1,90,035.. ఎల్లెల్సీ కింద కర్నూలు జిల్లాలో 1,57,012.. కేసీ కెనాల్ కింద కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 2,65,628 వెరసి 6,12,675 ఎకరాల ఆయకట్టు ఉంది. కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయబసవన చానళ్ల కింద 9,78,824 ఎకరాలు, ఆర్డీఎస్ కింద తెలంగాణలో 87 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. జలచౌర్యం వల్ల చేరని జలాలు.. కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ 104 కి.మీ.లు.. ఎల్లెల్సీ కాలువ 131.50 కి.మీ.లు ఉంటుంది. ఈ రెండు కాలువల నుంచి ఆ రాష్ట్రంలో భారీ ఎత్తున జలచౌర్యం చేయడం వల్ల హెచ్చెల్సీ, ఎల్లెల్సీల నుంచి రాష్ట్ర సరిహద్దుకు అరకొర జలాలు మాత్రమే చేరేవి. దాంతో ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. జలచౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు హెచ్చెల్సీ.. ఎల్లెల్సీలను ఆధునికీకరించాలని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో తుంగభద్ర బోర్డుకు ప్రతిపాదించారు.. ఆ మేరకు కర్ణాటకను కూడా ఒప్పించారు. ఇరు రాష్ట్రాలు నిధులు విడుదల చేయడంతో ఇప్పటికే కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తయింది. ఎల్లెల్సీ ఆధునికీకరణ 102 కి.మీ వరకూ పూర్తయింది.. మిగిలిన పనులను పూర్తి చేయాలని బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. హెచ్చెల్సీ, ఎల్లెల్సీలకు నీటిని విడుదల చేసే రెగ్యులేటర్ల వద్ద.. రాష్ట్ర సరిహద్దులో టెలీమీటర్లు ఏర్పాటు చేయాలని కోరింది. దాంతో గతేడాది ఆయా రెగ్యులేటర్ల వద్ద.. రాష్ట్ర సరిహద్దులో టెలీమీటర్లను బోర్డు ఏర్పాటు చేసింది. పక్కాగా నీటి లెక్క.. బోర్డు పరిధిలోని కాలువలపై పూర్తి స్థాయిలో టెలీమీటర్లను ఏర్పాటు చేయడంతో అవి చుక్క చుక్కనూ పక్కాగా లెక్కిస్తున్నాయి. దాంతో కర్ణాటక జలచౌర్యానికి పూర్తిగా అడ్డుకట్ట పడింది. దీని వల్లే గతేడాది గరిష్ఠంగా 54.36 టీఎంసీలు తుంగభద్ర జలాశయం నుంచి రాష్ట్రానికి చేరాయి. ఈ ఏడాది తుంగభద్ర డ్యామ్‌లో 170.8 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బోర్డు.. హెచ్చెల్సీకి 26.184, ఎల్లెల్సీకి 19.336, కేసీ కెనాల్‌కు 8.057 వెరసి 53.577 టీఎంసీలు కేటాయించింది. ఆదివారంనాటికి హెచ్చెల్సీ ద్వారా 23.578, ఎల్లెల్సీ ద్వారా 11.102, కేసీ కెనాల్‌కు 3.79 వెరసి 38.470 టీఎంసీలు చేరాయి. ఇంకా 15.107 టీఎంసీల కోటా మిగిలి ఉంది. ప్రస్తుతం టీబీ డ్యామ్‌లో 56.54 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా కోటా జలాలు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి చేరుతాయని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
నవలి రిజర్వాయర్‌కు నో!
సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాశయం (టీబీ డ్యామ్) ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరణకు 52 టీఎంసీల సామర్థ్యంతో నవలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ కర్ణాటక సర్కార్ చేసిన ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. తమను సంప్రదించకుండా నవలి బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని టీబీ బోర్డుకు స్పష్టంచేసింది. సింగటలూరు ఎత్తిపోతల, అప్పర్ భద్ర, టీబీ డ్యామ్‌ల నుంచి ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం నీటిని మళ్లిస్తోందని.. నవలి బ్యారేజీకి అనుమతిస్తే తమ హక్కులకు విఘాతం కలుగుతుందని ఏపీ సర్కార్ ఆందోళన వ్యక్తంచేస్తూ టీబీ బోర్డుకు ఇటీవల లేఖ రాసింది. నిజానికి టీబీ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 1953లో 132.47 టీఎంసీలు. జలాశయంలో పూడిక పేరుకుపోవడంవల్ల నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలకు తగ్గింది. అంటే.. 31.615 టీఎంసీలు తగ్గింది. ఇది టీబీ డ్యామ్‌లో నీటి లభ్యతపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో.. టీబీ బోర్డు దామాషా పద్ధతిలో నీటిని కేటాయిస్తోంది. పూడికవల్ల కేటాయించిన మేరకు జలాలను నియోగించుకోలేకపోతున్నామని.. ఫలితంగా ఎడమ కాలువ కింద రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించలేకపోతన్నామనే వాదన కర్ణాటక సర్కార్ తెరపైకి తీసుకొచ్చింది. నదిపైనే రిజర్వాయర్ నిర్మించాలి రిజర్వాయర్ నిర్మిస్తే అది నదిపై నిర్మించాలని.. దానిని బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ సర్కార్ చెబుతోంది. కానీ, అలా కాకుండా 57.81 టీఎంసీల నీటిని మళ్లించడానికే కర్ణాటక సర్కార్ ఈ ప్రతిపాదన చేసిందని ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేసింది. అంతేకాక.. ఎడమ కాలువ ద్వారా కర్ణాటక సర్కార్ అడ్డగోలుగా నీటిని ఇప్పటికే వినియోగించుకుంటున్నా బోర్డు పట్టించుకోవడం లేదని ఆరోపించింది. హెచ్చెల్సీ, ఎల్లెల్సీలకు గండ్లు కొట్టి.. కర్ణాటక రైతులు జలచౌర్యానికి పాల్పడుతున్నా బోర్డు చర్యలు తీసుకోవడంలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో.. బోర్డు పరిధిలో లేని ప్రాంతంలో 57.81 టీఎంసీల నీటిని మళ్లించడానికి కర్ణాటక సర్కార్ చేసిన ప్రతిపాదన తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఏపీ సర్కార్ స్పష్టంచేసింది. అలాగే, రిజర్వాయర్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని టీబీ బోర్డుకు స్పష్టంచేసింది. సింగటలూరు ఎత్తిపోతల, అప్పర్ భద్ర ప్రాజెక్టుల్లో కర్ణాటక సర్కార్ భారీఎత్తున జలాలను మళ్లిస్తోందని.. దీనివల్ల తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత తగ్గుతోందని.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని బోర్డును కోరింది. పూడిక పేరుతో కర్ణాటక జిత్తులు టీబీ డ్యామ్‌లో పూడికను తొలగించి.. ఒక టీఎంసీ నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి రూ.380 కోట్లు ఖర్చవుతుందని.. ఈ లెక్కన 31.615 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా పూడిక తీయడానికి రూ.12వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని కర్ణాటక సర్కార్ లెక్కకట్టింది. అలాగే, పూడిక తీసిన మట్టిని నిల్వ చేయడానికి 65 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని.. ఈ భూమి సేకరణకు అధికంగా ఖర్చుచేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. తుంగభద్ర జలాశయానికి ఎగువన, హీరేబెనగల్ వద్ద నుంచి రోజుకు 22,787 క్యూసెక్కుల (1.96 టీఎంసీలు) ప్రవాహ సామర్థ్యంతో 47 కిమీల పొడవున తవ్వే వరద కాలువ ద్వారా నీటిని తరలించాలని ప్రతిపాదిస్తోంది. నవలి వద్ద 52 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటిని నిల్వచేయడంతోపాటు.. శివపుర చెరువు సామర్థ్యాన్ని 4.25, విఠల్‌పుర చెరువు సామర్థ్యాన్ని 1.56 టీఎంసీలకు పెంచి.. వరద జలాలను ఒడిసిపట్టడం ద్వారా ఎడమ కాలువ ఆయకట్టును స్థిరీకరిస్తామని, దీనివల్ల తుంగభద్ర జలాశయంపై ఒత్తిడి తగ్గుతుందని.. తద్వారా మూడు రాష్ట్రాలు కేటాయించిన మేరకు నీటిని వినియోగించుకోవచ్చని కర్ణాటక చెబుతోంది. అలాగే, నవలి బ్యారేజీకి రూ.9,500 కోట్లు ఖర్చవుతుందని.. ఈ వ్యయాన్ని మూడు రాష్ట్రాలు దామాషా పద్ధతిలో భరించాలని ప్రతిపాదిస్తూ.. అందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఇటీవల టీబీ బోర్డుకు పంపింది. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు తుంగభద్ర బోర్డు ఇటీవల లేఖ రాసింది. -
తుంగభద్రపై కర్ణాటక కొత్త ఎత్తులు!
సాక్షి, హైదరాబాద్: తుంగభద్రనదిపై మరో బ్యారేజీ నిర్మాణానికి కర్ణాటక ఎత్తులు వేస్తోంది. డ్యామ్‌లో పూడిక వల్ల జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకుగాను కొత్త రిజర్వాయర్ నిర్మాణానికి సిద్ధమైంది. 31 టీఎంసీల సామర్థ్యంతో తుంగభద్రకు ఎగువన నవాలి ప్రాంతంలో నిర్మించే కొత్త రిజర్వాయర్‌పై కర్ణాటక తుంగభద్ర బోర్డు అనుమతి కోరింది. దీనిపై అభిప్రాయాలు చెప్పాలని తెలంగాణ, ఏపీలను బోర్డు కోరగా, ఆర్డీఎస్ ఎడమ కాల్వ కింద నీటి అవసరాలకు ఈ నిర్మాణం ఆటంకపరుస్తుందని తెలంగాణ స్పష్టం చేసింది. 52 టీఎంసీల కోసం కర్ణాటక ప్రతిపాదన తుంగభద్ర డ్యామ్‌లో గతంలో ఉన్న నీటినిల్వ సామర్థ్యంతో పోలిస్తే ప్రస్తుతం గణనీయంగా నిల్వ తగ్గింది. 1953లో డ్యామ్ ప్రారంభం సమయంలో 132 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 100 టీఎంసీలకు పడిపోయింది. ఈ నష్టాన్ని పూడ్చేలా దాదాపు 31 టీఎంసీల సామర్థ్యంలో నవాలి వద్ద రిజర్వాయర్ నిర్మించాలని కర్ణాటక నిర్ణయించింది. తుంగభద్ర కింద 212 టీఎంసీల నీటిని వినియోగించేకునేలా గత ట్రిబ్యునళ్లు అనుమతించినా, పూడికతో 172 టీఎంసీల నీటినే వినియోగిస్తున్నామని, కొత్త రిజర్వాయర్‌తో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుందని గత డిసెంబర్లో హైదరాబాద్‌లో జరిగిన బోర్డు సమావేశంలో కర్ణాటక తెలిపింది. భారీవరద ఉన్నప్పుడు తుంగభద్ర నది నుంచి వరద కాల్వ తవ్వి, రోజుకు 17,900 క్యూసెక్కుల నీటిని కొత్త రిజర్వాయర్‌కు తరలిస్తామని, దీనికి అనుబంధంగానే శివపుర, విఠలపుర చెరువుల సామర్థ్యాన్ని పెంచుతామని, ఈ 3 రిజర్వాయర్ల కింద మొత్తంగా 52 టీఎంసీల నీటిని వినియోగిస్తామని ప్రతిపాదించింది. దిగువకు నష్టమే... నిర్మాణం చేపట్టబోయే రిజర్వాయర్ డీపీఆర్‌లు సమర్పిస్తే వాటిని పరిశీలించి అభిప్రాయాలు చెబుతామని తెలుగు రాష్ట్రాలు బోర్డుకు తెలిపాయి. అయినా ఇంతవరకు కర్ణాటక డీపీఆర్‌లు ఇవ్వలేదు. శనివారం బెంగళూరులో జరిగిన సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సమర్థంగా రాష్ట్ర వాదనలను వినిపించినట్లు తెలిసింది. డీపీఆర్‌లతోపాటే ఎగువన తుంగ, భద్ర నదుల్లో కర్ణాటక చేస్తున్న నీటి వినియోగం, మరిన్ని ఎత్తిపోతల ద్వారా తీసుకుంటున్న నీటిలెక్కలను తమ ముం దుంచాలని స్పష్టం చేశారు. ఆర్డీఎస్ ఎడమ కాల్వ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల మేర కేటాయింపులున్నా, 5 టీఎంసీలకు మించి నీరు రావట్లేదని బోర్డు దృష్టికి తెచ్చినట్లు సమాచారం. దీంతోపాటే ట్రిబ్యునల్ కేటాయింపులకు విఘా తం కలుగుతుందని బోర్డు దృష్టికి తెచ్చారు. తుంగభద్రసహా కొత్త బ్యారేజీ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిర్ణీత వాటాలు వచ్చేలా చూస్తామని కచ్చితమైన హామీ ఇస్తేనే బ్యారేజీ నిర్మాణానికి సమ్మతి స్తామన్నారు. డీపీఆర్‌లు ఇచ్చాకే దీనిపై అభిప్రా యం చెబుతామని ఏపీ చెప్పినట్లుతెలిసింది. -
నీటిమూటేనా ?
తుంగభద్ర కాలువల ఆధునికీకరణపై పాలకుల్లో కనిపించని చిత్తశుద్ధి ఏపీ, కర్ణాటక సీఎంల చర్చలు నిష్ఫలం సాక్షి, బళ్లారి : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నీరందించే తుంగభద్ర జలాశయం పరిధిలోని హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువల ఆధునికీకరణ చేస్తామని పాలకులు ఇచ్చిన హామీ నీటి మూటగా మారింది. వరద కాలువ నిర్మాణాలపై పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో రైతులకు శాపంగా మారిం ది. తుంగభద్ర డ్యాంలోకి ఏటా పుష్కలంగా నీరు వస్తున్నప్పటికీ తగినంత నిల్వ ఉంచుకునే సామర్థ్యం లేకపోవడంతో ఏటా 200 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. ఇందులో కనీసం కొంత నీరైనా రైతులకు ఉపయోగించేలా చర్యలు చేపట్టడంలో పాలకు లు విఫలమవుతున్నారు. తుంగభద్ర డ్యాం సామర్థ్యం 134 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం పూడిక చేరి పోవడంతో 101 టీఎంసీలకు పడిపోయింది. దా దాపు 33 టీఎంసీల నీటి నిల్వ మేర పూడిక చేరడం తో పూడిక తీత సాధ్యాసాధ్యాలపై ఆధ్యయనం పూ ర్తిస్థాయిలో చేయలేదు. దీంతో నీటి వాటా దామాషా ప్రకారం పూర్తిగా తగ్గించి వేశారు. అనంతపురం జిల్లాకు 32 టీఎంసీలు నీరు అందాల్సి ఉండగా, ప్రస్తుతం 22 టీఎంసీలు మాత్రమే అందిస్తున్నారు. బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలకు ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో పూడికవల్ల నష్టపోతున్న నీటిని ఎలాగైనా పొందాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆరు నెలల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో బెంగళూరులో భేటీ అయ్యారు. పూడిక వల్ల నష్టపోతున్న నీటిని పొందాలంటే హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువల ఆధునీకరణ చేపడితే కొంత మేలు జరుగుతుందని చర్చించారు. వరద కాల్వ నిర్మాణాలపై చర్చించినప్పటికీ ఆధునీకరణకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే తుంగభద్ర డ్యాం పరిధిలో వరద కాల్వ నిర్మాణాలు చేపడితే బళ్లారి, అనంతపురం జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుందని ఈ ప్రాంత రైతులు అభిప్రాయ పడుతున్నారు. ప్రతి ఏటా కాలువల తాత్కాలిక ఆధునీకరణ పనులకు తూతూమంత్రంగా నిధులు విడుదల చేస్తున్నారు. పనులు ఆలస్యంగా చేపట్టడం, టెండర్లు ఆలస్యంగా పిలవడం వల్ల కాలువల మరమ్మతులు కూడా సక్రమంగా చేయడం లేదు. ఈ నేపథ్యంలో సీఎంలు ఇద్దరు తుంగభద్ర కాలువలపై చర్చలు జరపడంతో రైతుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. అయితే ముఖ్యమంత్రులు చంద్రబాబు, సిద్ధరామయ్య చర్చించిన మేరకు ఆధునీకరణపై ఎలాంటి ముందడుగు లేకపోవడంతో ఈ ఏడాది ఆధునీకరణ అటకెక్కినట్లేని భావిస్తున్నారు. ప్రస్తుతం మేలోకి అడుగు పెట్టబోతున్నాం. మే, జూన్ రెండు లేదా మూడవ వారంలోపు తుంగభద్ర కాలువ ఆధునీకరణ పనులకు చేపట్టాలి. ఆ తర్వాత కాలువలకు నీరు విడుదల చేసినప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా నిలిపి వేస్తారు. ప్రస్తుతం డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) కూడా పిలవకపోవడంతో తుంగభద్ర కాలువల ఆధునీకరణపై ముఖ్యమంత్రికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. -
తుంగభద్రకు పెరిగిన ఇన్ ఫ్లో
హొస్పేట: తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ ఊపందుకోవడంతో డ్యాంకు వస్తున్న ఇన్‌ఫ్లో పెరిగింది. ఆదివారం డ్యాంకు 42 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో 20 క్రస్ట్‌గేట్లు అడుగు మేర పెకైత్తి దిగువకు 46 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాలైన ఆగొంబె, శివమొగ్గ, మొరాళు, తీర్థహళ్లి, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు ఊపందుకోవడంతో డ్యాంకు వస్తున్న ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ప్రస్తుతం మలెనాడులో కురుస్తున్న వర్షాల వల్ల డ్యాంలోకి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశముందని తుంగభద్ర మండలి అధికారులు తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1633 అడుగులు, కెపాసిటీ 100.855 టీఎంసీలు, ఔట్‌ఫ్లో 40,999 క్యూసెక్కులు ఉంది. -
పోటెత్తిన తుంగభద్ర
హొస్పేట: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. సోమవారం డ్యాం 33 క్రస్ట్‌గేట్లను పెకైత్తి 1,93,579 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. 28 క్రస్ట్‌గేట్లను నాలుగున్నర అడుగులు, మిగతా క్రస్ట్‌గేట్లను ఒకటిన్నర అడుగు మేర పెకైత్తినట్లు తుంగభద్ర మండలి అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అక్కడ నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో 1,67,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,93,579 క్యూసెక్కులు ఉందని తెలిపారు.గ -
జల కళ
పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు - జోగ్లో జల ఉధృతి - తొణికిసలాడుతున్న ‘తుంగా’ - తుంగభద్ర జలాశయానికి భారీ వరద - తీరనున్న ‘కరెంట్’ కష్టాలు సాక్షి ప్రతినిధి/బెంగళూరు/శివమొగ్గ : పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 68 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో శివమొగ్గ జిల్లాలోని తుంగా జలాశయం గరిష్ట మట్టం 588.24 అడుగులకు చేరుకుంది. దీంతో జలాశయంలోకి చేరుతున్న 68 వేల క్యూసెక్కుల నీటిని అలాగే హొస్పేటలోని తుంగభద్ర జలాశయానికి వదిలేస్తున్నారు. దరిమిలా శివమొగ్గలో తుంగా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. మరో వైపు కోస్తా జిల్లాలతో పాటు మలెనాడులో సోమవారం కూడా వర్షాలు పడ్డాయి. కావేరి పరీవాహక ప్రాంతాల్లో పడుతున్న వర్షాలతో ఆ నదిపై నిర్మించిన జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో గణనీయంగా పెరిగింది. కేఆర్ఎస్, కబిని జలాశయాల్లో జోరుగా వరద నీరు చేరుతోంది. కేరళ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు పడుతుండడంతో కర్ణాటకలోని నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొడగు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రముఖ పర్యాటక ప్రాంతం భాగ మండలలోకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించడంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. హాసన జిల్లాలో కూడా బాగా వర్షాలు పడుతుండడంతో గోరూరు, హేమావతి జలాశయాల్లో ఇన్‌ఫ్లో పెరిగింది. తీరనున్న కరెంటు కష్టాలు భారీ వర్షాల కారణంగా జలాశయాలు నిండుతుండడంతో విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడే అవకాశం కలిగింది. మరో 15 రోజులు వర్షాలు రాకపోతే విద్యుత్ సంక్షోభం ఖాయమని ఆ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రముఖ జల విద్యుత్కేంద్రమైన లింగమక్కి జలాశయంలోకి రోజు రోజుకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. సోమవారం ఇన్‌ఫ్లో 38,183 క్యూసెక్కులుగా నమోదైంది. ఔట్‌ఫ్లోను 175 క్యూసెక్కులకు పరిమితం చేశారు. గత ఏడాది ఇదే సమయానికి జలాశయంలో నీటి మట్టం 1,789.5 అడుగులు కాగా ప్రస్తుతం 1,754.5 అడుగుల నీటి నిల్వ ఉంది. -
తుంగభద్ర నిండాలి.. రైతు ఆశలు పండాలి..!
ఆదోని: జూలైలో 10 రోజులు గడిచిపోయినా తుంగభద్ర రిజర్వాయర్ నిండకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా ప్రజల సాగు, తాగునీటి ప్రధాన వనరు కావడంతో తుంగభద్రమ్మ పరవళ్లు తొక్కాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. టీబీ డ్యామ్‌లో శుక్రవారం నాటికి 14.5 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. తుంగ, భద్ర నదుల పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పూర్తి స్థాయిలో కురవకపోవడంతో రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో తక్కువగా ఉంది. కేవలం 560 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో డ్యామ్ ఎప్పుడు నిండుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. తుంగభద్ర దిగువ కాలువ(ఎల్ఎల్సీ) కింద ఖరీఫ్‌లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మెట్ట భూముల్లో రైతులు జోరుగా విత్తనం వేస్తున్నారు. అయితే ఆయకట్టు భూముల్లో పంటలు వేయాలా వద్దా అని రైతులు సతమతమవుతున్నారు. ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాలలో దిగువ కాలువ కింద 1.51 లక్షల ఎకరాలు ఆయకట్టును స్థిరీకరించగా ఇందులో సుమారు 49 వేల ఎకరాలు ఖరీఫ్‌లోనే ఉంది. గత ఏడాది జూలై ఒకటో తేదీ నాటికే ప్రాజెక్ట్‌లోకి పూర్తి స్థాయిలో నీరు చేరింది. దాదాపు వంద టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో జూలై 9 నుంచి ఎల్లెల్సీకి నీరు వదిలేందుకు ఐఏబీ సమావేశం తీర్మానించింది. అయితే గండ్లకెరి వద్ద ఎస్కేప్ చానల్ క్రస్ట్ గేట్లు విడిగి పడడంతో నీటి విడుదల మూడు రోజులు ఆలస్యమైంది. 16వ తేదీ నాటికి జిల్లా సరిహద్దుకు నీరు చేరింది. దీంతో వెంటనే రైతులు వరి పంట సాగుకు శ్రీకారం చుట్టారు. దాదాపు 27 వేల ఎకరాలలో రైతులు వరి పంటను సాగు చేశారు. అయితే ఈ ఏడాది ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ అత్యంత అధ్వానంగా ఉంది. జిల్లా అధికారులు కూడా ఇంత వరకు ఐఏబీ సమావేశం ఎప్పుడు ఉంటుందో చెప్పడం లేదు. ప్రాజెక్టులో నీటి చేరిక అంతంత మాత్రంగా ఉండడంతో ఐఏబీ సమావేశం నిర్వహించినా నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా.. ఎల్లెల్సీకి నీరు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని ఇన్చార్జ్ ఈఈ భాస్కరరెడ్డి శుక్రవారం తెలిపారు. నీటి విడుదల ఉంటుందో ఉండదో స్పష్టం చేస్తే ఆయకట్టు భూముల్లో కనీసం మెట్ట పంటలు అయినా సాగు చేసుకుంటామని రైతులు పేర్కొంటున్నారు. -
ఆయకట్టు రైతుకు తీపి కబురు
కర్నూలు రూరల్: తుంగభద్ర జలాశయంలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు సాగునీటి వాటాలను బోర్డు అధికారులు నిర్ణయించారు. బళ్లారిలో నిర్వహించిన బోర్డు అధికారుల సమావేశంలో తుంగభద్ర దిగువ కాలువ, కర్నూలు-కడప కాలువలకు తుంగభద్ర జలాశయంలో 24 టీఎంసీలు, కేసీకి 10 టీఎంసీ నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఈ ఏడాది రుతు పవనాల రాక ఆలస్యం కావడం.. వరుణుడు ముఖం చాటేయడంతో ప్రాజెక్టులోకి వరద నీరు చేరక వారం రోజుల క్రితం నిర్వహించాల్సిన బోర్డు ఎస్ఈ స్థాయి అధికారుల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ నెల చివరి వరకు జలాశయంలోకి 144 టీఎంసీల నీరు చేరవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందులో కర్ణాటక వాటా 94 టీఎంసీలు, ఆంధ్రా ౄటాగా 50 టీఎంసీలు కేటాయించారు. ఆంధ్రా వాటాగా కేటాయించిన నీటిలో తుంగభద్ర దిగువ కాలువకు ఈ ఏడాది 16.3 టీఎంసీలు, కర్నూలు, కడప కాలువకు 6.79 టీఎంసీల ప్రకారం కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 0.86 టీఎంసీ అదనంగా కేటాయించడం విశేషం. వాటా పెరిగినా వాస్తవంగా రావాల్సిన నీటి కంటే తక్కువేనని అధికారులు చెబుతున్నారు. ఊరిస్తున్న నైరుతి రుతు పవనాలు కరుణించకపోవడంతో జిల్లాలోని ఆయకట్టు రైతులు టీబీ డ్యామ్ నీటిపైనే ఆశలు పెట్టుకున్నారు. నారుమళ్లు పెంచుకునేందుకు జులై మొదటి లేదా రెండో వారంలో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి నీటి విడుదల తేదీలను నిర్ణయించనున్నారు. సుంకేసుల జలాశయంలో ఇటీవల కర్ణాటక, ఆంధ్రా సరిహద్దు, ఆదోని, మంత్రాలయం ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నీటి మట్టం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంది. స్వల్ప మోతాదులో డ్యాంలోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఈ కారణంగా దిగువ కాలువ కంటే ముందుగానే కర్నూలు-కడప కాలువకు సాగునీరు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. -
తుంగభద్రపై తెగని పంచాయితీ !
సాక్షి, హైదరాబాద్ : తుంగభద్ర నీటి వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మధ్య వివాదం ఒక కొలిక్కి రావడంలేదు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో నీటి విడుదలపై రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఈ ఏడాది తుంగభద్ర ప్రాజెక్టు నీటిని ఇంకా వాడుకోవడానికి రాష్ట్రానికి కోటా ఉన్నప్పటికీ ఆ నీరు విడుదల చేయకూడదని కర్ణాటక అభ్యంతరం చెబుతోంది. దాంతో కెసి కెనాల్ పరిధిలో పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని రాష్ర్ట ఉన్నతాధికారులు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకపోయింది. మరోవైపు తనకు అదనంగా నీరు కావాలని పట్టుబడుతోంది. సమావేశంలో ముఖ్యాంశాలు... - తుంగభద్ర హైలెవెల్ కెనాల్‌తో పాటు కెసి కెనాల్ ఆయకట్టుకు 6.5 టిఎంసీల నీటిని ఇవ్వాల్సి ఉంది. - ఈ ఏడాది ఇప్పటి వరకు 5.5 టిఎంసీల నీటిని రాష్టం ఉపయోగించుకుంది. ఇంకా ఒక టిఎంసీ ఉపయోగించుకోవాల్సి ఉంది.