ఆయకట్టు రైతుకు తీపి కబురు
కర్నూలు రూరల్: తుంగభద్ర జలాశయంలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌లకు సాగునీటి వాటాలను బోర్డు అధికారులు నిర్ణయించారు. బళ్లారిలో నిర్వహించిన బోర్డు అధికారుల సమావేశంలో తుంగభద్ర దిగువ కాలువ, కర్నూలు-కడప కాలువలకు తుంగభద్ర జలాశయంలో 24 టీఎంసీలు, కేసీకి 10 టీఎంసీ నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఈ ఏడాది రుతు పవనాల రాక ఆలస్యం కావడం.. వరుణుడు ముఖం చాటేయడంతో ప్రాజెక్టులోకి వరద నీరు చేరక వారం రోజుల క్రితం నిర్వహించాల్సిన బోర్డు ఎస్‌ఈ స్థాయి అధికారుల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.
ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ నెల చివరి వరకు జలాశయంలోకి 144 టీఎంసీల నీరు చేరవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందులో కర్ణాటక వాటా 94 టీఎంసీలు, ఆంధ్రా ౄటాగా 50 టీఎంసీలు కేటాయించారు. ఆంధ్రా వాటాగా కేటాయించిన నీటిలో తుంగభద్ర దిగువ కాలువకు ఈ ఏడాది 16.3 టీఎంసీలు, కర్నూలు, కడప కాలువకు 6.79 టీఎంసీల ప్రకారం కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 0.86 టీఎంసీ అదనంగా కేటాయించడం విశేషం. వాటా పెరిగినా వాస్తవంగా రావాల్సిన నీటి కంటే తక్కువేనని అధికారులు చెబుతున్నారు. ఊరిస్తున్న నైరుతి రుతు పవనాలు కరుణించకపోవడంతో జిల్లాలోని ఆయకట్టు రైతులు టీబీ డ్యామ్ నీటిపైనే ఆశలు పెట్టుకున్నారు.
నారుమళ్లు పెంచుకునేందుకు జులై మొదటి లేదా రెండో వారంలో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి నీటి విడుదల తేదీలను నిర్ణయించనున్నారు. సుంకేసుల జలాశయంలో ఇటీవల కర్ణాటక, ఆంధ్రా సరిహద్దు, ఆదోని, మంత్రాలయం ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నీటి మట్టం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంది. స్వల్ప మోతాదులో డ్యాంలోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఈ కారణంగా దిగువ కాలువ కంటే ముందుగానే కర్నూలు-కడప కాలువకు సాగునీరు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.